థాయ్‌లాండ్: గుహలో బాలలకు ఆక్సిజన్ ఇవ్వటానికి వెళ్లి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన గజ ఈతగాడు

ఫొటో సోర్స్, O2Max Triathlon Team
థాయ్‌లాండ్ గుహలో ఫుట్‌బాల్ కోచ్‌తోపాటు చిక్కుకుపోయిన 12 మంది పిల్లలను కాపాడే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ, వారికి ఆక్సిజన్ అందించడానికి వెళ్లిన ఒక డైవర్ మృతిచెందారు.
థాయ్ నౌకాదళానికి చెందిన మాజీ డైవర్ సమన్ గునన్, గుహలో చిక్కుకుపోయిన వారికి ఎయిర్ టాంక్స్ అందించడానికి వెళ్లారు. కానీ అక్కడి నుంచి తిరిగి వస్తున్నప్పుడు స్పృహతప్పారు.
"మాజీ సైనికుడు అయిన సమన్, సహాయ బృందాలకు సాయం చేయాలని తనకు తానుగా వచ్చాడు, రాత్రి 2 గంటల సమయంలో మృతి చెందాడు" అని చాంగ్ రాయ్ డిప్యూటీ గవర్నర్ చెప్పారు.
"సమన్ లోపల ఉన్న వారికి ఆక్సిజన్ అందించే పనిలో ఉన్నాడు. కానీ తిరిగి వస్తున్నప్పుడు అతడికే తగినంత ఆక్సిజన్ అందలేదు. దాంతో స్పృహతప్పాడు."
"గుహ లోపలి నుంచి వస్తున్న సమన్‌కు తనతో ఉన్న మరో డైవర్ ప్రథమ చికిత్స అందించి, బయటకి తీసుకొచ్చాడు. మేం అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాం, కానీ ప్రాణాలు కాపాడలేకపోయాం" అని అధికారులు చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ఉత్తర థాయ్‌లాండ్‌లోని గుహలో పిల్లలు, తమ కోచ్‌తోపాటు గత 12 రోజులుగా చిక్కుకుపోయి ఉన్నారు. వీరిని సురక్షితంగా బయటకు తీయడానికి సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
రెస్క్యూ మిషన్‌లో వెయ్యి మందికి పైగా పాల్గొంటున్నారు. వీరిలో నౌకాదళ గజఈతగాళ్లు, సైనికులు, పౌరులు కూడా ఉన్నారు.
గునన్ మృతితో ఈ మిషన్ ఎంత ప్రమాదరమైనదో అధికారులకు అర్థమైంది. కానీ "ఎట్టి పరిస్థితుల్లో మా ప్రయత్నాలు ఆపేది లేదు, లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకొస్తాం" అని సీల్ కమాండర్ ఆర్పాకార్న్ యూకోంగ్‌క్యే విశ్వాసం వ్యక్తం చేశారు.
ఎంతో అనుభవం ఉన్న డైవర్ అక్కడి నుంచి బయటపడలేకపోయినప్పుడు, ఈత రాని పిల్లలను ఎలా బయటికి తీసుకురాగలరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గుహలో చిక్కుకుపోయిన పిల్లలను వారి తల్లిదండ్రులతో మాట్లాడించడానికి అధికారులు అక్కడికి ఫోన్ లైన్లు వేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP
గుహలో సరిపోని ఆక్సిజన్
జూన్ 23 సాయంత్రం ఫుట్‌బాల్ ప్రాక్టీస్ తర్వాత పిల్లలందరూ ఉత్తర థాయ్‌లాండ్‌లో ఉన్న గుహను చూడాలని వెళ్లారు. కానీ వరద ప్రవాహం ముంచెత్తడంతో అందరూ లోపలే చిక్కుకుపోయారు.
సహాయ బృందాలు 9 రోజుల తర్వాత వీరిని గుర్తించాయి. అప్పటి నుంచి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. గుహ లోపల ఉన్న వారికి మందులు, ఆహారం అందిస్తూ వస్తున్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్టు తెలుస్తోంది.
పిల్లలు, కోచ్ చిక్కుకుపోయిన చోట ఆక్సిజన్ చాలా తక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. సహాయ కార్యక్రమాల కోసం ఎక్కువ మంది గుహలోకి వెళ్తుండడంతో అక్కడ ఆక్సిజన్ స్థాయి మరింత తగ్గిపోతోందని అంటున్నారు.
గుహ లోపల ఉన్న వారికి తగినంత ఆక్సిజన్ అందించడానికి ఐదు కిలోమీటర్ల పొడవున్న కేబుల్ వేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
సమయం మించిపోతోంది
థాయ్ సైన్యం మాత్రం పిల్లలను బయటికి తీసుకురావడానికి నాలుగు నెలలు పడుతుందని చెబుతోంది.
లోపల ఉన్న నీటిని తోడేయడానికి చాలా రోజులు పడుతుందని అధికారులు భావిస్తున్నారు.
అప్పటికీ నీటి స్థాయి తగ్గకపోతే డైవింగ్ పరికరాలు ఎలా ఉపయోగించాలో పిల్లలకు నేర్పించాలని, లేదంటే వర్షాకాలం ముగిసేవరకూ కొన్ని నెలలపాటు వేచిచూడాలని అనుకుంటున్నారు.
కొండ పై ఉన కాలువల నుంచి గుహలోకి నీళ్లు వస్తూనే ఉన్నాయి. వీటిని బయిటికి తోడడం ఆగితే, గుహ లోపల పిల్లలు చిక్కుకుపోయిన చోట పూర్తిగా నీళ్లు నిండిపోయే ప్రమాదం ఉంది.
"మొదట పిల్లలు ఎక్కువ రోజులు ఉండగలిగేలా చేయాలని అనుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. మాకు ఎక్కువ సమయం లేదు" అని అర్పాకోర్న్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికా: విడిపోయిన వలస కుటుంబాలను కలిపేందుకు డీఎన్ఏ పరీక్షలు
- ఇరాన్ మీడియా భాషలో 'ఫ్యామిలీ' అంటే..
- చైనాలో రోడ్డు ఎలా కుంగిపోయిందో చూడండి
- నైజీరియా: ఉద్రిక్తతలు పెంచుతున్న ఫేక్ న్యూస్
- అప్పుడే పుట్టిన చిన్నారికి పాలిచ్చిన తండ్రి
- వృద్ధాశ్రమానికి పంపిస్తానన్న కొడుకును చంపిన 92 ఏళ్ల తల్లి
- భారత్‌లో 'వాట్సప్ హత్యలను' ఎవరు ఆపగలరు?
- అప్పట్లో ఫుట్‌బాల్ అంటే హైదరాబాద్.. హైదరాబాద్ అంటే ఫుట్‌బాల్
- ఇస్రో: అంతరిక్ష యాత్రికుల్ని సురక్షితంగా భూమ్మీదకు తీసుకొచ్చే శక్తి ఇప్పుడు భారత్ సొంతం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









