అప్పుడే పుట్టిన చిన్నారికి పాలిచ్చిన తండ్రి

ఫొటో సోర్స్, Maxamillian Kendall Neubauer
- రచయిత, రోజీనా సిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
విస్కాన్సిన్‌కు చెందిన ఏప్రిల్ న్యూబేర్ అనే గర్భిణి కాన్పు కోసం హాస్పిటల్‌కు వెళ్లినపుడు అక్కడ ఆమె భర్తకు ఊహించని అనుభవం ఎదురైంది.
న్యూబేర్‌కు కాన్పు చాలా కష్టమైంది.. ప్రసూతివాతం, అధిక రక్తపోటుతో ఆమె ఇబ్బందిపడడంతో పాటు మూర్ఛ కూడా రావడంతో జూన్ 26న అత్యవసరంగా శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటికి తీయాల్సివచ్చింది.
పాప రోసాలీ జన్మించాక న్యూబేర్‌కు మరోసారి మూర్ఛ వచ్చింది. ఆమెకు చికిత్స చేస్తున్నప్పుడు వైద్యులు పాపను ఆమెకు దూరంగా ఉంచారు. న్యూబేర్ భర్త మాక్స్ మిలన్‌కు పాపను అప్పగించారు.
ఆ తరువాత ఆయన తల్లి పాత్ర పోషించాల్సివచ్చింది.

ఫొటో సోర్స్, Maxamillian Kendall Neubauer
అస్సలు ఊహించలేదు
"పాపను నా చేతికి అందించిన నర్సు.. మనం ఒక చిన్న చిట్కా చేద్దామని చెప్పింది. పాపకు పాలుతాగడం అలవాటయ్యేలా ఫింగర్ ఫీడింగ్ లాంటిది చేద్దామని చెప్పింది.
తర్వాత ఒక ప్లాస్టిక్ నిపిల్‌ను నా ఛాతీకి అతికించి.. దానికి పాలు నింపిన సిరంజిని ఒక సన్నని గొట్టంతో కలిపింది.
ఆ ప్లాస్టిక్ నిపిల్‌ను పాప నోటికందించి పాలిచ్చినట్లు చేయగలనేమో ప్రయత్నించమని నర్సు కోరింది. అందుకు నేను సరేనన్నా..
నేనలా చేయగానే పాప చక్కగా పాలు తాగేసింది. నా బిడ్డకు పాలిస్తానని ఎప్పుడూ అనుకోలేదు’’ అని మాక్స్ మిలన్ తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు.

ఫొటో సోర్స్, Maxamillian Kendall Neubauer
నర్సుకు అభినందనలు
మాక్స్ మిలన్ తన చిన్నారికి పాలిచ్చిన అనుభవాన్ని.. ఆ చిత్రాలను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
"నా దగ్గర పాలు తాగుతున్న పాపను చూడగానే ఒక నిమిషం పాటు ఏదో ప్రత్యేక బంధం ఏర్పడినట్టు అనిపించింది. నేను తనను అలాగే ఛాతీకి అదుముకున్నా" అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేయగా నెటిజన్ల నుంచి సానుకూల స్పందనలు వచ్చాయి.
ఒక ఫేస్‌బుక్ యూజర్ "మామ్ అనే టాటూకు దిగువన, జరగాల్సిందే జరిగింది" అని కామెంట్ చేశాడు. మాక్స్ మిలన్ షేర్ చేసిన చిత్రంలో ఆయన ఛాతీపై మామ్ అని టాటూ ఉండడంతో ఆ యూజర్ అలా రాశారు.
చాలామంది ఈ ఆలోచన చెప్పిన నర్సును అభినందించారు.
కొందరు మాత్రం మాక్స్ మిలన్ చేసిన పనిని పెద్దగా ఇష్టపడలేదు. "ఇలా ఎందుకు చేశావో తెలీడం లేదు". "సారీ.. తేడాగా కనిపిస్తోంది". "తల్లి పాలివ్వలేనపుడు బాటిల్‌తో పాలు పట్టచ్చుగా" అంటూ కామెంట్లు పెట్టారు.
మరోవైపు సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్టును 30 వేల మంది షేర్ చేశారు. వందలాది స్పందనలు వచ్చాయి.
నెటిజన్లకు సమాధానమిస్తూ మాక్స్ మిలన్ ఏ తండ్రయినా చేయగలిగిందే తను చేశానని చెప్పారు. "అయితే, ఆ తల్లులను మాత్రం మర్చిపోకండి. నేను దీన్ని వారి కోసం కూడా చేశా" అంటూ స్పందించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








