రొమ్ము క్యాన్సర్‌: ‘ప్రాథమిక పరీక్షలు చేయించుకుంటే కీమోథెరపీ అవసరం ఉండదు’

బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న మహిళ స్కానింగ్

ఫొటో సోర్స్, Science Photo Library

    • రచయిత, జేమ్స్ గల్లఘర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సాధారణ రొమ్ము క్యాన్సర్‌ మొదటి దశలో ఉన్న మహిళల్లో 70 శాతం మందికి కీమోథెరపీ అవసరం ఉండదని పరిశోధకులు చెబుతున్నారు.

సర్జరీ చేసేప్పుడు తొలగించిన ఒక క్యాన్సర్‌ కణితిపై జన్యుపరీక్ష అనంతరం ఈ నిర్ధారణకు వచ్చారు.

ఈ పరీక్షలో 21 జన్యువుల కార్యకలాపాల స్థాయిని పరిశీలించారు. వాటి స్థాయిని బట్టే క్యాన్సర్‌ ఎంత ప్రమాదకరస్థితిలో ఉందో గుర్తిస్తారు.

ఈ పరీక్షా ఫలితాలతో బ్రిటన్‌లో మహిళలకు కేవలం సర్జరీ, హార్మోన్ థెరపీలతో చికిత్స చేయవచ్చని పరిశోధకులు తెలిపారు.

ఈ పరీక్షలో బ్రిటన్‌కు చెందిన 10,273 మంది క్యాన్సర్‌ ఉన్న మహిళలకు జన్యు పరీక్ష నిర్వహించారు.

ఇప్పటివరకు ఆ పరీక్షలో తక్కువ స్కోర్ వచ్చిన వారికి కీమోథెరపీ అవసరం లేదని, ఎక్కువ స్కోర్ ఉన్నవారికి మాత్రమే థెరపీ అవసరం అని చెబుతున్నారు.

అయితే ఫలితాలు మధ్యస్థంగా వచ్చినవాళ్లు ఎటూ నిర్ణయించుకోలేకపోతున్నారు.

రొమ్ము కేన్సర్, పరిశోధన, కీమోథెరపీ

ఫొటో సోర్స్, Science Photo Library

చికాగోలో జరిగిన క్యాన్సర్‌ డాక్టర్లు, సైంటిస్టుల సదస్సులో సమర్పించిన డేటా ప్రకారం - కీమో చేయించుకున్న, చేయించుకోని వారికి బతికే అవకాశం ఎంత ఉంటుందో, మధ్యస్థంగా ఫలితాలు వచ్చిన వారు బతికే అవకాశం కూడా అంతే ఉంటుంది.

తొమ్మిదేళ్ల పాటు వారు జీవించే అవకాశాలను పరిశీలించగా, కీమోథెరపీ లేకుండా జీవించే అవకాశం 93.9శాతం, కీమెథెరపీ చేయించుకుంటే బతికే అవకాశం 93.8 శాతం ఉన్నట్లు తేలింది.

లండన్‌లోని రాయల్ మార్స్‌డన్ ఆసుపత్రిలో పని చేసే డాక్టర్ అలియస్టర్ రింగ్, ఆంకాలజిస్టులు ఈ ఫలితాల కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇది క్యాన్సర్‌ రోగులకు చికిత్స అందించే విధానంపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.

ఈ పరిశోధన ఫలితాల కారణంగా బ్రిటన్‌లో ఇకపై ఏటా 3 వేల మంది మహిళలు కీమోథెరపీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు.

ఈ పరిశోధన కేవలం ప్రాథమిక దశలో ఉన్న రొమ్ము క్యాన్సర్‌కు మాత్రమే, మరీ ప్రత్యేకంగా హార్మోన్ థెరపీతో చికిత్స చేయదగ్గ క్యాన్సర్‌కు మాత్రమే పరిమితమైంది.

రొమ్ము కేన్సర్, పరిశోధన, కీమోథెరపీ

ఫొటో సోర్స్, Science Photo Library

సాధారణంగా రొమ్ము క్యాన్సర్‌ సర్జరీ అనంతరం అది మళ్లీ తిరగబెట్టే అవకాశం లేకుండా చేసేందుకు కీమోథెరపీని ఉపయోగిస్తున్నారు.

కీమోథెరపీ ప్రాణాలను నిలిపినా, దానిలో వాడే ఔషధాల వల్ల వాంతి రావడం, నిస్సత్తువగా మారిపోవడం, వంధ్యత్వం, శాశ్వతమైన నరాల నొప్పులు మొదలైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి.

కొన్ని అరుదైన సందర్భాలలో అది గుండె ఆగిపోవడానికి, లుకేమియాకు కూడా దారి తీయవచ్చు.

బ్రెస్ట్ క్యాన్సర్‌ కేర్ అనే ఛారిటీ సంస్థ ప్రతినిధి రాచెల్ రాసన్ మాట్లాడుతూ.. ఈ పరిశోధన ఫలితాలు వేల మంది మహిళలను కీమోథెరపీ బాధ నుంచి తప్పిస్తాయని అన్నారు.

ఈ ఫలితాలను అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ వార్షిక సదస్సులో సమర్పించారు. అదే సమయంలో న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లోనూ ప్రచురించారు.

వీడియో క్యాప్షన్, వీడియో: రొమ్ము క్యాన్సర్‌ను సూచించే 12 లక్షణాలు

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)