నైజీరియా: ఉద్రిక్తతలు పెంచుతున్న ఫేక్ న్యూస్

ఫొటో సోర్స్, AFP
ఆఫ్రికా పశ్చిమ భాగంలోని నైజీరియాలో ఫేక్‌న్యూస్ వివిధ వర్గాల మధ్య ఘర్షణలను పెంచుతున్నాయి.
నైజీరియాలో ఇప్పటికే రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. మతపరమైన హింస జరిగిందనే అసత్య సమాచారంతో బూటకపు ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ, ఈ ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.
నైజీరియా మధ్యప్రాంతంలో కొన్ని రోజుల క్రితం జరిగిన హింసలో 200 మందికి పైగా చనిపోయారు. ఇప్పుడు ఈ ఫేక్ న్యూస్ వ్యాప్తి చెందుతున్నాయి.

ఫొటో సోర్స్, AFP
ఆ చిత్రాల్లో ఏముంది?
ఒక ఫొటోలో భుజానికి పెద్ద గాయంతో రక్తపు మడుగులో ఒక మహిళ బోర్లా పడి ఉన్నారు. ఇది ఇటీవల మధ్య నైజీరియాలో జరిగిన దాడుల్లో చనిపోయిన మహిళ ఫొటో అని ప్రచారం జరుగుతోంది. ఈ ఫొటోను కొన్ని వందలసార్లు యూజర్లు ట్వీట్ చేశారు. వాస్తవానికి ఈ ఫొటో ఇటీవలి దాడులది కానే కాదు. అది 2011 నాటిది. నైజీరియాలో గృహహింసకు సంబంధించిన ఓ కథనంలో ఈ ఫొటో తొలిసారిగా అప్పట్లో ట్విటర్‌లో కనిపించింది.
ఇటీవలి దాడుల్లో చనిపోయిన ఆరుగురు వీరేనని చెప్పే మరో ఫొటో కూడా బూటకపు ఫొటోయేనని తేలింది. అసలు ఈ ఫొటో నైజీరియాలో తీసిందే కాదు. దాడులది అసలే కాదు. 2015లో డొమినికన్ రిపబ్లిక్‌లో జరిగిన ఒక ట్రాఫిక్ ప్రమాదానికి సంబంధించిన ఫొటో ఇది.
(ఈ రెండు ఫొటోలు కలచివేసేలా ఉండడం వల్ల వాటిని మేం పబ్లిష్ చేయడం లేదు)
ఫేక్ న్యూస్ ఈ రెండు ఫొటోలకే పరిమితం కాలేదు. ఇటీవల నైజీరియాలోని ప్రధాన మీడియా సంస్థలు వెలువరించిన ఒక కథనంలో ప్రాథమిక అంశాలు కూడా అవాస్తవాలే. ప్లాట్యూ రాష్ట్రంలో 300 గోవులను తాము కోల్పోయామని, వాటికి ప్రతీకారమే ఇటీవలి దాడులని 'మియెట్టి అల్లా పశుపోషకుల సంఘం' నాయకుడు దన్లాడి సిర్కోమా అన్నారని ఈ కథనంలో మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
ఆయన చేశారన్న వ్యాఖ్యలపై నైజీరియాలో ఆగ్రహం పెల్లుబికింది. వీటిని అందరూ ఖండించారు. దీనిపై ఆయన స్పందిస్తూ తాను అసలు అలాంటి వ్యాఖ్యలేవీ చేయలేదని చెప్పారు.
నైజీరియాలో ఫేక్ న్యూస్ కొత్త కాదు. కొన్ని సందర్భాల్లో, అధికారిక సమాచారం ఏదీ లేకపోవడం కూడా వదంతులకు తావిస్తోంది. అంతిమంగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
పెరుగుతున్న సోషల్ మీడియా యూజర్లు
నైజీరియాలో ప్రస్తుతం 2.6 కోట్ల మంది ఫేస్‌బుక్ వాడుతున్నారు. దేశంలో స్మార్ట్‌ఫోన్ వాడకందార్లు, సోషల్ మీడియా యూజర్లు పెరుగుతున్నారు. సోషల్ మీడియాలో వదంతులు శరవేగంగా, తేలిగ్గా వ్యాప్తి చెందుతున్నాయి.
దేశంలో బూటకపు వార్తల వ్యాప్తిపై సమాచార శాఖ మంత్రి లా మొహమ్మద్ గత ఏడాది తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఈ వార్తలు నైజీరియాను నాశనం చేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
నైజీరియా మధ్య ప్రాంతంలో ఒకటిన్నర దశాబ్దాలుగా రైతులు, పశుపోషకుల మధ్య వివాదం ఉంది.
కొద్దికాలంగా ఈ పోరాటం హింసారూపం దాల్చి తరచూ మరణాలకు కారణమవుతోంది. వ్యవసాయ హక్కులు, అందులో పశువులను మేపుకొనే హక్కులకు సంబంధించి రైతులు, పశుపోషకుల మధ్య నిత్యం ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. సంప్రదాయ ఫులానీ పశుపోషకులు ముస్లింలు కాగా రైతుల్లో అత్యధికులు క్రైస్తవులు. దీంతో ఇది రెండు మతాల మధ్య ఘర్షణగానూ పరిణమించిన సందర్భాలున్నాయి.
ఇవి కూడా చదవండి:
- తాగునీరు అందని గ్రామాలు.. ఆంధ్రాలో మూడోవంతు, తెలంగాణలో సగం
- ‘జల సంక్షోభం గురించి జనంలో అవగాహన పెంచాలనే..’
- 'తల్లి కాబోయే లక్షల మంది మహిళలకు ఇదో శుభవార్త'
- దేశ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్న భారత్
- థాయ్‌లాండ్ గుహలో బాలలు.. రక్షించే మార్గాలపై కసరత్తు
- ఎమర్జెన్సీ: ‘అక్రమ నిర్బంధానికి బలైన’ స్నేహలతారెడ్డి జైలు డైరీ
- హైదరాబాద్ ఏసీ బస్‌స్టాప్‌లలో పాలిచ్చేందుకు ప్రత్యేక గదులు
- దళితుడి హోటల్లో టీ తాగిన శివాజీ వారసుడు సాహూ మహరాజ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








