బీబీసీ ఎక్స్‌క్లూజివ్: జల సంక్షోభం గురించి జనంలో అవగాహన పెంచాలనుకుంటున్నాం - నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్
- రచయిత, కింజాల్ పాండ్యా-వాగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతదేశంలో జల సంక్షోభం గురించి నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ఇటీవల జాతీయ, అంతర్జాతీయ పతాక శీర్షకలకు ఎక్కింది. మరో రెండేళ్లలో.. అంటే 2020 నాటికి దేశంలోని 21 నగరాల్లో భూగర్భజలాలు అడుగంటుతాయని ఆ నివేదిక చెప్పింది. ఈ అంశం మీద కేంద్ర ప్రభుత్వ మేధో బృందం నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో విస్తృతంగా మాట్లాడారు.
సంక్షోభం తీవ్రత గురించి చెబుతూ.. ‘‘మనం ప్రతి ఏటా నీటి కొరత ఎదుర్కొంటున్నాం. కానీ ఒక సమాజంగా మనకు ఎదురుకాబోతున్న నీటి సంక్షోభం గురించి అవగాహన లేదు. మనకు ఎదురుకాబోతున్న సవాలు ఎంత పెద్దదో భారత ప్రజలకు వివరించటం ఈ నివేదిక ప్రధాన ఉద్దేశం’’ అని ఆయన చెప్పారు.
ఈ నివేదిక.. నీటి పర్యవేక్షణ వ్యవస్థల పనితీరు ఆధారంగా భారతీయ రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా తీసుకున్న 24 రాష్ట్రాల్లో గుజరాత్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మధ్య భారతదేశంలోని మధ్యప్రదేశ్, దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి.
ఇతరులు చేయని ఏ పని గుజరాత్ చేస్తోందని ప్రశ్నించగా.. ‘‘గుజరాత్‌లో వారు చేసిందేమిటంటే నీటి సంరక్షణ, చెక్ డ్యాములు, జలాశయాల ద్వారా భూగర్భ జల వనరులను గణనీయంగా పెంచటం. రైతులు వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్న నీటికి వారు బిల్లు కట్టేలా కూడా చేశారు. ఇలా ఒకసారి వేరు చేసిన తర్వాత.. 24/7 విద్యుత్ సరఫరా ప్రారంభించిన తర్వాత.. బిల్లు కట్టాలని రైతులను కోరారు. వారు సానుకూలంగా స్వీకరించారు. రైతులు బిల్లు కట్టాలి కనుక నీటిని పొదుపు చేయటం మొదలుపెట్టారు’’ అని రాజీవ్‌కుమార్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఒక్కో చుక్కకు మరింత పంట’’ నినాదంతో బిందు సేద్యాన్ని ప్రోత్సహించటానికి పథకాలను కూడా ప్రారంభించి అమలుచేసంది గుజరాత్. పట్టణ ప్రాంతాల్లో ఆదాయం లేని నీటిని నిలిపివేశారు. అన్ని లీకేజీలను ఆపేశారు. దీనంతటి ఫలితంగా గుజరాత్‌లో భూగర్భ జలాల స్థాయిలు పెరిగాయి. గుజరాత్ ఈ ఏడాది తీవ్ర నీటి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంటే ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండటం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. దీనికి సమాధానంగా.. ఇది రాష్ట్రంలో లోటు వర్షపాతం వల్ల తలెత్తిన ఒక పరిస్థితి, జల వనరుల పర్యవేక్షణ కోసం గుజరాత్ చేసిన దానిని కొట్టివేయటానికి దీనిని ఉపయోగించుకోరాదు’’ అని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.
ఈ నివేదిక తయారీకి ఉపయోగించిన సమాచారం విశ్వసనీయతను, ఈ నిర్ధరణలు చేయటం మీద వచ్చిన ప్రశ్నలకు.. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ సమాచారాన్ని ఉపయోగించటం జరిగిందని, దానిని రెండు స్వతంత్ర సంస్థలు పరిశీలించి ఆమోదించాయని రాజీవ్ కుమార్ తెలిపారు. అయితే.. అవాస్తవమైన సమాచారం ఉండటానికి చాలా అవకాశాలున్నాయని కూడా అంగీకరించారు. కానీ ఎక్కడో ఒక చోట సమాచార సేకరణ ప్రారంభించటం ముఖ్యమని.. ఈ నివేదికలో అదే పని చేశారని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
నీతి ఆయోగ్ విడుదల చేసిన ‘సమీకృత జల నిర్వహణ సూచీ’ నివేదికలో కీలక అంశాలు:
- రక్షిత తాగునీరు అందుబాటులో లేకపోవటం వల్ల దేశంలో ప్రతి ఏటా దాదాపు రెండు లక్షల మంది చనిపోతున్నారు
- భారతదేశంలోని భూగర్భ జల బావుల్లో 54 శాతం తగ్గిపోతున్నాయి
- ప్రస్తుతం భారతదేశంలో 60 కోట్ల మంది తీవ్రమైన నుంచి అతితీవ్రమైన ఒత్తిడిని దేశంలో ఎదుర్కొంటున్నారు
- దేశంలో 70 శాతం నీరు కలుషితమయింది
- నీటి నాణ్యత సూచీలో 122 దేశాల్లో భారతదేశం 120వ స్థానంలో ఉంది
- 2020 నాటికి కోట్లాది మందికి తీవ్ర నీటి కొరత ఫలితంగా దేశ జీడీపీలో 6 శాతం నష్టపోతాం

ఫొటో సోర్స్, Getty Images
కార్యాచరణ మేధో బృందం
ఇటీవల బ్రిటన్‌లో యూకే-ఇండియా నాయకత్వ సదస్సులో రాజీవ్‌కుమార్ ప్రసంగిస్తూ.. నీతి ఆయోగ్ అనేది ‘కార్యాచరణ మేధో బృందం’ అని అభివర్ణించారు. జల సంక్షోభం నివేదికను విడుదల చేసిన తర్వాత నీతి ఆయోగ్ ప్రజలకు సాయం చేసే ఏ కార్యాచరణ చేపడుతుందని ప్రశ్నించగా.. ఉత్తమ పనితీరు చూపుతున్న రాష్ట్రాలు వాటి జల వినియోగాన్ని నిర్వహించేందుకు ఉపయోగించిన పరిష్కారాలను క్రోడీకరించి అన్ని రాష్ట్రాలకూ ఒక నియమావళి పంపిస్తుందని ఆయన చెప్పారు.
ప్రణాళికాసంఘాన్ని రద్దు చేసి ఆ స్థానంలో 2015 జనవరిలో నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేశారు.
ప్రణాళిక సంఘానికి, నీతి ఆయోగ్‌కి మధ్య కీలకమైన తేడా గురించి మాట్లాడుతూ.. నేరుగా అమలు చేయగల విధానాలను నీతి ఆయోగ్ తయారు చేస్తుందని.. ప్రణాళికాసంఘం పంచవర్ష ప్రణాళికలు మేధోపరమైనవి, అధ్యయన పరమైనవి అని.. వాటిని అమలు చేయటం కష్టమని ఆయన చెప్పారు. జల సంక్షోభం నివేదిక ఉదాహరణను ఇస్తూ.. ‘‘రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందుబాటులో ఉన్నసమాచారంతో మేం పరిశోధన చేశాం. ఇప్పటికే అమలు చేస్తున్న ఉత్తమ పద్ధతులను గుర్తించాం. వాటినిప్పుడు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫారసు చేస్తాం’’ అని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
మరింత బలమైన ప్రజాస్వామ్యం కోసం ఒకేసారి ఎన్నికలు?
రాష్ట్రాలకు, కేంద్రానికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని నీతి ఆయోగ్ గత ఏడాది సిఫారసు చేసింది. దీనిపై విస్తృత చర్చ కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం గట్టిగా ముందుకు తెస్తున్నారు.
ఈ ఏడాది డిసెంబర్‌లో కేంద్రానికి, రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాలపై స్పష్టత గురించి ప్రశ్నించినపుడు.. ఈ ఏడాది డిసెంబర్‌లో ఉమ్మడి ఎన్నికలు జరుగుతాయా అనేది నిర్ధరించటానికి ఆయన తిరస్కరించారు. ఇది సున్నితమైన రాజకీయ అంశమన్నారు.
అయితే.. తన వ్యక్తిగత అభిప్రాయంలో.. వివిధ రాష్ట్ర, మునిసిపల్, ఉప ఎన్నికలు, కేంద్ర ఎన్నికల్లో పాల్గొనే ఓటర్ల సంఖ్య ప్రభావితమవుతుంది కాబట్టి.. అటువంటి (ఉమ్మడి) ఎన్నికలు ఉత్తమమని.. ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొనటం ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రజలు పాలుపంచుకోవటాన్ని వీలైనంత పెంచవచ్చునని స్పష్టంగా చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- పీవీ నరసింహారావు: ‘నిశ్శబ్దంగా దేశానికి మేలు చేసిన ప్రధానమంత్రి’
- నిజంగానే భారత్ మహిళలకు అత్యంత ప్రమాదకర దేశమా? రాయిటర్స్ నివేదికలో వాస్తవమెంత?
- గ్రౌండ్ రిపోర్ట్: ఈ 24 దళిత కుటుంబాలు ఎందుకు ఊరొదిలేయాల్సి వచ్చింది?
- దక్షిణాది రాష్ట్రాల సీఎంలను మోదీ చిన్నచూపు చూస్తున్నారా
- పాస్‌పోర్ట్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- వైరల్: పాకిస్తాన్లో భద్రతపై తీసిన ఈ వీడియో భారత్‌లో హత్యకు కారణమైంది. ఇలా..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









