హైదరాబాద్ ఏసీ బస్‌స్టాప్‌లలో పాలిచ్చేందుకు ప్రత్యేక గదులు

ఫొటో సోర్స్, ShyamMohan
- రచయిత, శ్యాంమోహన్
- హోదా, బీబీసీ కోసం
విరిగిపోయిన బెంచీ, ఎగిరిపోయిన పైకప్పు, కాచుక్కూచున్న కుక్కల గుంపు, ముసుగుతన్ని పడుకున్న ముసలి యాచకురాలు.. బస్‌స్టాప్ అనగానే ఎవరికైనా కళ్ల ముందు కనిపించే దృశ్యమిది.
కానీ, హైదరాబాద్ నగరం ఇప్పుడు బస్‌స్టాప్‌లకు కొత్త రూపమిస్తోంది.
మెరుగైన వసతులతో ఏసీ బస్‌స్టాప్‌లు ఇక్కడ ఏర్పాటవుతున్నాయి. తొలి దశలో ప్రయోగాత్మకంగా పలు ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన వీటిని జనం ఆదరిస్తున్నారు.
పసిబిడ్డలున్న తల్లులు వారికి పాలిచ్చేందుకు వీలుగా వీటిలో ఫీడింగ్ రూములు ఏర్పాటు చేస్తున్నారు.. అక్కడ పిల్లలకు పాలివ్వచ్చు, వారి డైపర్లు మార్చొచ్చు.

ఫొటో సోర్స్, ShyamMohan
మొత్తం 30 ఏసీ షెల్టర్లు
హైదరాబాద్ లో ప్రతిరోజు 3,800 బస్సులు ప్రజలను గమ్యస్థానానికి చేరుస్తుంటాయి. మొత్తం 2,300 బస్టాపుల్లో 1,300 బస్‌స్టాపులు నిత్యం రద్దీగా ఉంటాయి. ఇలాంటి నగరంలోని ఎంపిక చేసిన బస్‌స్టాపుల్లో కొన్నిట్లో ఏసీ సహా ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు.
జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో(పీపీపీ) డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్(డీబీఎఫ్‌ఓటీ) విధానంలో వీటిని నిర్మిస్తున్నారు. ఇందుకోసం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సహకారంతో నాలుగు రకాల షెల్టర్ల డిజైన్ రూపొందించారు.
నగరవ్యాప్తంగా 826 బస్ షెల్టర్ల నిర్మాణానికి డిజైన్లు రూపొందించారు. వాటిలో 30 ఏసీవి.
''ఆధునిక బస్టాపుల ఏర్పాటుకు ముందు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(అస్కీ) నగరంలో ఒక సర్వే నిర్వహించింది. నిత్యం బస్సుల్లో ప్రయాణించే వారు ఎలాంటి సమస్యలు ఎదొర్కుంటున్నారు? ఏ సౌకర్యాలు కోరుకుంటున్నారో, తెలుసుకొని వారి ఆలోచనలకు అనువుగానే ఈ బస్టాప్‌లను డిజైన్ చేశాం.'' అని ఆస్కీ ప్రొఫెసర్ శ్రీనివాసచారి చెప్పారు. ఏసీ బస్‌స్టాప్‌ల ప్రాజెక్టుకు ఆయన సలహాదారుగా పనిచేశారు.
ఏసీ బస్సులు ఎక్కువగా తిరిగే మార్గాల్లో వీటిని తొలుత అందుబాటులోకి తెస్తున్నారు.

ఫొటో సోర్స్, ShyamMohan
చిన్నారులకు ఉచిత డైపర్లు
వీటిని నాలుగు గ్రేడ్‌లుగా విభజించారు. గ్రేడ్-1 బస్టాపులో సెల్‌ఫోన్ ఛార్జింగ్, ఏసీ, వైఫై సౌకర్యం.. కాఫీ షాప్, సీసీ టీవీలు, స్నాక్స్, కాఫీ వెండింగ్ మిషన్‌లు, డస్ట్‌బిన్, స్త్రీపురుషులకు వేర్వేరుగా టాయిలెట్లు ఉంటాయి. గ్రేడ్-2 లో ఏసీ తప్ప మిగతావి ఉంటాయి.
3, 4వ రకపు బస్‌స్టాపులు కాలనీల సమీపంలో ఉండి, మొబైల్ ఛార్జింగ్, డస్ట్‌బిన్, టాయిలెట్ సౌకర్యాలు ఉంటాయి.
మొదటి రకం 200 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు.. రెండో రకం 25 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు.. మూడు, నాలుగు రకాలవి 20 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పుతో ఉంటాయని జీహెచ్ ఎంసీ అధికారులు చెప్తున్నారు.
మాదాపూర్, అబిడ్స్‌లో నిర్మించిన మొదటి రకం బస్‌షెల్టర్లలో ఒక గదిని పిల్లలు ఇష్టపడేలా రంగుల్లో తీర్చిదిద్దారు.
ఈ రెండు చోట్లా తల్లులు తమ పిల్లలకు పాలిచ్చేందుకు వీలుగా ప్రత్యేకంగా ఫీడింగ్ రూం ఏర్పాటు చేయడమే కాకుండా చిన్నారులకు ఉచితంగా డైపర్లు కూడా ఇస్తున్నారు.

ఫొటో సోర్స్, ShyamMohan
టాయిలెట్లు ప్రధానం
''నగరంలో పబ్లిక్ టాయిలెట్లు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్య. ఏసీ సౌకర్యం లేక పోయినా పర్వాలేదు కానీ, ప్రతి బస్‌షెల్టర్‌లో టాయిలెట్, తాగునీటి సదుపాయం కల్పిస్తే చాలు అంటున్నారు'' మాదాపూర్ బస్‌స్టాప్‌కు వచ్చిన ఆకారపు సాయిప్రీతి.
''మండే ఎండలో, వాహనాల కాలుష్యం మధ్య గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్దితి మారి ఏసీలో ఉంటూ బస్ వచ్చినప్పుడే ఎక్కే అవకాశం కలిగింది'' అని టెక్‌మహీంద్రాలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న సంజన అంటున్నారు.
ఏసీ బస్టాపుల్లో సకల సౌకర్యాలున్నప్పటికీ కొన్ని చోట్ల ప్రయాణీకులు ఏసీ గదుల బయట ఎప్పటిలాగే ఎండలో బస్‌ల కోసం ఎదురు చూస్తున్నారు.
''మేం ఏసీరూంలో ఉన్నప్పటికీ ఏ క్షణంలో బస్సు వస్తుందో అని ఎదురుచూడాలి. రూం నుండి బయటకొచ్చేవరకు బస్‌లు ఆగడం లేదు'' అంటున్నారు మరికొందరు.
‘దేశంలోనే తొలి ప్రయత్నం’
' ఇది జాతీయ ప్రాజెక్టు. బస్ షెల్టర్ల నిర్మాణం కోసం ఏజెన్సీల ఎంపిక పూర్తి అయి, పనులు మొదలయ్యాయి. జీహెచ్‌ఎంసీపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండానే వీటిని నిర్మిస్తున్నాం. ఇలాంటి అత్యాధునిక బస్టాప్‌లు దేశంలో ఎక్కడా లేవు. హైదరాబాద్‌లోనే తొలిసారి మొదలయ్యాయి' అన్నారు, జీహెచ్‌ఎంసీ అడిషినల్ కమిషనర్ అద్వైత్ కుమార్ సింగ్ .
ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 6,11,10,729 రూపాయలు. 10 నుంచి 15 ఏళ్లకు ప్రైవేటు ఏజెన్సీలకే వీటి బాధ్యత అప్పగించారు.
ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో వాటిని నిర్వహిస్తారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








