మహిళల శరీరంపై వెంట్రుకలు కనిపించే ఆ ప్రకటనపై అంత చర్చ ఎందుకు?

ఫొటో సోర్స్, BILLIE ON UNSPLASH
'వెంట్రుకలు అందరి శరీరాలపైనా ఉంటాయి'.
ఇది చాలా మామూలు విషయం. కానీ అమెరికాలో ప్రస్తుతం ఇదే విషయం మీద చర్చ నడుస్తోంది. నిజానికి ఒక రేజర్ తన ప్రకటనలో మహిళలు తమ శరీరంపై ఉన్న వెంట్రుకలు షేవ్ చేసుకుంటున్నట్టు చూపించింది.
షేవ్ చేసుకుంటున్న మహిళలను చూపించడం అనేది అంత అభ్యంతరకరమేమీ కాదు. కానీ సాధారణంగా మహిళల శరీర భాగాలను ప్రకటనల్లో మొదట్నుంచీ షేవ్ చేసినట్టు చూపిస్తుంటే, ఈ ప్రకటనలో మాత్రం వారి శరీరంపై ఉన్న వెంట్రుకలను కూడా చూపించారు.
ఈ ప్రకటన రూపొందించిన రేజర్ బ్రాండ్ బిల్లీ గత 100 సంవత్సరాలలో ఏదైనా ఒక ప్రకటనలో మహిళల శరీరంపై వెంట్రుకలు చూపించడం ఇదే మొదటిసారి అని చెప్పింది. ఫలితంగా ఈ ప్రకటన ఇప్పుడు వైరల్ అయిపోయింది.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
'చాలా అందంగా ఉంది'
సోషల్ మీడియాలో చాలా మంది మహిళలు ఈ ప్రకటనకు తమ మద్దతు తెలిపారు. తమ కాళ్లు, చేతులు, వేళ్లపై ఉన్న వెంట్రుకలు, దట్టమైన కనుబొమ్మలు, పొట్టపై కనిపించే వెంట్రుకల ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు.
ఇన్‌స్టాగ్రాం యూజర్ @bigparadethroughtown "ఇది చాలా అందంగా ఉంది" అని రాశారు. @hanguk0 అనే మరో యూజర్, తాను రేజర్ ఉపయోగించనని, కానీ ఈ ప్రకటన చాలా అద్భుతంగా ఉందని, దానితో ఏకీభవిస్తున్నానని చెప్పారు.
"బ్రాండ్స్ అన్నీ మొదట్నుంచీ మహిళల శరీరంపై వెంట్రుకలు లేకుండా చూపిస్తూ వస్తున్నాయి, ఇది ఒక రకంగా బాడీ షేమింగ్ లాంటిదే" అని బిల్లీ సహ స్థాపకులు గార్జినా గులీ గ్లామర్ మేగజీన్‌తో అన్నారు.
"మన శరీరంపై వెంట్రుకలు ఉన్నందుకు మనం సిగ్గుపడుతున్నట్టు అవి చూపిస్తున్నాయి" అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, BILLIE ON UNSPLASH
ఈ ప్రకటనతోపాటూ ఈ కంపెనీ ఒక ఆన్‌లైన్ ప్రచారం కూడా ప్రారంభించింది. "ఏ మహిళైనా తన సహజ సౌందర్యాన్ని అంగీకరించాలనేదే మా ఉద్దేశం" అని చెబుతోంది.
అయితే, దీనికి మద్దతు పలకడంతోపాటూ కొంతమంది ఈ రేజర్ బ్రాండ్‌కు ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. ఒక రేజర్ కంపెనీ శరీర వెంట్రుకలపై ఉన్న నిషేధాన్ని తగ్గించే ప్రయత్నం ఎందుకు చేస్తోందని అడిగారు.
"శరీరంపై వెంట్రుకలు ఉండటం సైద్ధాంతికంగా ఎందుకు సరికాదో 11 ఏళ్ల వయస్సులో అర్థం చేసుకోకపోయి ఉంటే నేను కూడా షేవింగ్ మొదలుపెట్టేదాన్ని కాదు. మిగతా మహిళల్లాగే వెంట్రుకల్లేని కాళ్ల మృదుత్వాన్ని నేను కూడా ఆస్వాదిస్తాను, ఇప్పటికీ" అని రచయిత రేచల్ హాంప్టన్ అమెరికా వెబ్‌సైట్ స్లేట్‌కు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.
రేజర్లు అమ్మే ఒక కంపెనీ శరీరంపై వెంట్రుకలు ఉండడంలో ఎలాంటి తప్పూ లేదని చెప్పగలదా? ఆ వెంట్రుకలు తొలగించటంలో దాని పాత్ర లేదా?
ఈ వివాదానికి పరిష్కారంగా బిల్లీ కంపెనీ చెబుతోంది ఏమంటే.. "మీరు ఎప్పుడు షేవ్ చేసుకోవాలని అనిపించినా, మీకోసం మేం సిద్ధంగా ఉన్నాం" అని.

ఫొటో సోర్స్, BILLIE ON UNSPLASH
అంతే కాదు, మహిళలందరూ తమ శరీరాన్ని పూర్తిగా షేవ్ చేసుకోవడం అనేది తప్పనిసరి కాదని ఆ కంపెనీ తమ ప్రకటన చివర్లో చూపించింది.
"షేవ్ చేసుకోవడం అనేది వారి వారి వ్యక్తిగత నిర్ణయం. మహిళలు తమ శరీరంపై ఉండే వెంట్రుకలను ఏం చేయాలి అనేది చెప్పే హక్కు ఎవరికీ లేదు" అని బిల్లీ కంపెనీ సహ వ్యవస్థాపకులు గులీ అన్నారు.
"మనలో కొందరు ఈ వెంట్రుకలను తొలగించాలని అనుకుంటే, కొందరు వాటిని తమతో సగర్వంగా ఉంచుకోవాలని అనుకుంటారు. ఎవరు ఎలా చేయాలనుకున్నా, తమ ఇష్టాల గురించి వారు పశ్చాత్తాపానికి గురికావడమో, లేదా క్షమాపణ కోరాల్సిన అవసరం లేదు" అన్నారు.
ఇవి కూడా చదవండి:
- గ్రౌండ్ రిపోర్ట్: మంద్సౌర్ అత్యాచారం నిందితుడ్ని పట్టించిన బూటు
- 'ఒకేసారి అంతమంది చనిపోయి కనిపించడంతో వణికిపోయా'
- జైలు నుంచి హెలికాప్టర్లో పారిపోయిన దోపిడీ దొంగ
- పాస్‌పోర్ట్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- 'తల్లి కాబోయే లక్షల మంది మహిళలకు ఇదో శుభవార్త'
- జపాన్‌లో కూలీలకు బిజినెస్ సూట్లు - ఎందుకంటే..
- ఏసీలు చల్లబరుస్తున్నాయా.. లేక వేడెక్కిస్తున్నాయా?
- #CWG2018: ఈ అమ్మాయిలు డాక్టర్లు అవుదామనుకొని షూటర్లయ్యారు!
- ఇది బెజవాడ అమ్మాయిల ‘రంగస్థలం’
- అమ్మాయిలు స్మార్ట్ ఫోన్లు వాడితే ప్రేమలో పడతారా?
- రివెంజ్ పోర్న్: అసభ్యకర చిత్రాలకు చెక్ పెట్టనున్న ఫేస్‌బుక్
- వీళ్లకు స్పీడ్ డేటింగ్ పట్ల ఎందుకింత ఆసక్తి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








