జైలు నుంచి హెలికాప్టర్‌లో పారిపోయిన దోపిడీ దొంగ

రెడైన్ ఫెయిడ్‌

ఫొటో సోర్స్, IBO/SIPA/REX/SHUTTERSTOCK

పారిస్‌లోని ఓ జైలు నుంచి ఓ నేరస్తుడు హెలికాప్టర్‌లో పారిపోయాడని ఫ్రెంచ్ అధికారులు తెలిపారు.

గ్యాంగ్‌స్టర్ రెడైన్ ఫెయిడ్‌ను తప్పించేందుకు కొంతమంది పెద్ద పథకాన్నే రచించారు. పోలీసుల దృష్టిని మరల్చేందుకు కొంతమంది ఆయుధాలు ధరించి జైలు ప్రవేశ ద్వారం వద్ద గలాట సృష్టించారు. అదే సమయంలో జైలు లోపల మరో చోట హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేలా వ్యూహరచన చేశారు.

పారిపోయిన ఫెయిడ్ సమీపంలోని గునెస్ ప్రాంతానికి వెళ్లాడు.

ఫెయిడ్‌ను తప్పించడానికి ప్రయత్నించిన సాయుధులు... ఓ విద్యార్థి కోసం ఎదురుచూస్తున్న హెలికాప్టర్ పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. జైలువైపు వెళ్లాలని అతడిని ఆదేశించారు. ఫెయిడ్‌ను తప్పించి, అతడ్ని గునెస్ ప్రాంతంలో విడిచిపెట్టగానే పైలట్‌ను కూడా వారు వదిలేశారు.

రెడైన్ ఫెయిడ్‌ తప్పించుకున్న హెలికాప్టర్

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

హెలికాఫ్టర్ నుంచి దిగిన ఫెయిడ్ ఓ నల్లటి రేనాల్ట్ కారులో వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే అతడు మరో వాహనంలోకి మారాడని ఓ టీవీ ఛానల్‌తో పోలీసులు తెలిపారు. అతడిని పట్టుకోవడానికి తీవ్రంగా గాలిస్తున్నామని అంతర్గత భద్రతాధికారులు వెల్లడించారు.

గతంలో ఓ దోపిడీ కేసులో పోలీసు అధికారిని చంపడంతో ఫెయిడ్‌ (46)కు 25 ఏళ్లు జైలు శిక్ష పడింది.

జైలు నుంచి తప్పించుకోవడం ఫెయిడ్‌కు ఇది రెండోసారి. 2013లో నలుగురు జైలు సిబ్బందిని మానవ రక్షణ కవచంగా ఏర్పాటు చేసుకొని తప్పించుకున్నాడు.

పారిస్ శివార్లలో మొదలైన తన నేర చరిత్ర గురించి 2009లో ఫెయిడ్ పుస్తకం రాశాడు. ఇకపై నేరాలు చేయనని అందులో చెప్పుకొచ్చాడు. కానీ, ఆ మరుసటి ఏడాదే దోపిడీ చేయబోయి జైలు పాలయ్యాడు.

ఫెయిడ్ తప్పించుకున్న జైలుకి ఫెన్సింగ్ లేదని, గాయాలవకుండానే సహచరులతో పాటు అతను తప్పించుకున్నాడని ఫ్రెంచ్ న్యూస్ వెబ్‌సైట్ యూరప్1 పేర్కొంది.

ఫెయిడ్ తప్పించుకున్న పారిస్‌లోని జైలు

ఫొటో సోర్స్, AFP

దోపిడీ దొంగ

  • 1972లో పుట్టిన ఫెయిడ్ పారిస్ శివార్లలో నేర చరిత్రను మొదలుపెట్టాడు.
  • 1990లో సొంతంగా ముఠాను ఏర్పాటు చేసుకొని పారిస్‌లో దోపీడీలు మొదలుపెట్టాడు.
  • 2001లో దోపీడీ కేసులో పట్టుబడటంతో అతనికి జైలు శిక్ష పడింది.
  • 2010లో జరిగిన ఒక దోపిడీ వెనుక ఫెయిడ్ సూత్రధారని పోలీసులు నమ్ముతున్నారు. ఆ దోపిడీలో ఒక పోలీసు అధికారి కూడా చనిపోయారు.
  • పెరోల్‌పై బయటకు వచ్చిన ఫెయిడ్ ఎక్కువ కాలం బయట ఉండలేదు. పెరోల్ నిబంధనలను ఉల్లంఘించడంతో 2011లో మళ్లీ జైలు పాలయ్యాడు.
  • 2013లో మొదటిసారి సెక్యూడిన్ జైలు నుంచి పారిపోయాడు. కానీ, ఆరు వారాల్లోనే పోలీసులు అతన్ని పట్టుకోగలిగారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)