ఇది బెజవాడ అమ్మాయిల ‘రంగస్థలం’

నాటకరంగం

ఫొటో సోర్స్, siddhartha womens degree college

    • రచయిత, సంగీతం ప్రభాకర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నేటి డిజిటల్ యుగంలో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, డబ్ స్మాష్ అంటూ తిరిగే ఈ తరానికి నాటకం రంగం అంటే తెలుసా? కనీసం వీళ్లు నాటకాలైనా చూశారా? అని చాలా మంది అడగొచ్చు.

కానీ, బెజవాడకు ఈ చెందిన కొంత మంది విద్యార్థినులు భారీ డైలాగులతో రంగస్థలంపై అదరగొడుతుంటే ఆ అభిప్రాయాన్ని మార్చుకోక తప్పదు.

షార్ట్ ఫిలిమ్స్ ట్రెండ్ నడుస్తున్న వేళ నాట‌కాలు వేస్తూ బెజ‌వాడ అమ్మాయిలు ఒక కొత్త దారిలో నడుస్తున్నారు.

ఏదో స‌ర‌దాగా నాట‌కాలు వేయడం కాదు, ఏకంగా బంగారు నందులు గెలుచుకునే స్థాయికి చేరారు ఆంధ్రప్రదేశ్‌లోని విజ‌య‌వాడకు చెందిన సిద్ధార్థ మ‌హిళా క‌ళాశాల విద్యార్థినులు.

ఇప్పడు నాటకాలు వేసేవారే తక్కువ. ఇక యువత గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇలాంటి స్థితిలో ఈ బెజవాడ విద్యార్థినులు మాత్రం చారిత్రక నాటకాలలో వివిధ పాత్రలను అవలీలగా పోషిస్తున్నారు.

నాటకరంగం

ఫొటో సోర్స్, siddhartha womens degree college

మొదటిసారే బంగారు నంది

ఇటీవల 3వ శ‌తాబ్దానికి చెందిన ఒక నాట‌కాన్ని ఈ విద్యార్థినుల బృందం ప్ర‌ద‌ర్శించింది. అందరిచేతా చప్పట్లు కొట్టించుకోవడమే కాకుండా అవార్డులూ అందుకుంది.

''16 మంది అమ్మాయిలు దాదాపు నెల రోజులు శ్రమించి నాట‌కం వేశారు. మొదటి ప్రయత్నంలోనే వారికి బంగారు నంది రావ‌డం గర్వంగా ఉంది'' అని సిద్ధార్థ కాలేజీ ప్రిన్సిప‌ల్ డా.టి. విజ‌య‌ల‌క్ష్మి బీబీసీతో అన్నారు.

తెలుగు నాట‌కంపై అవ‌గాహ‌న‌, ఆసక్తి పెంచ‌డానికి ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నంది నాట‌కోత్స‌వంలో భాగంగా కాలేజీ, యూనివ‌ర్సిటీల విభాగంలో కూడా నాటిక‌ల పోటీ నిర్వ‌హిస్తోంది.

ఇందులో భాగంగా 3వ శ‌తాబ్దంలో భాస‌ మ‌హాక‌వి రాసిన 'ఉరుభంగం' అనే నాటకాన్ని సిద్ధార్థ క‌ళాశాల అమ్మాయిలు ప్ర‌ద‌ర్శించారు.

2017 వ సంవ‌త్స‌రానికి గానూ 30 కాలేజీలు, యూనివ‌ర్సిటీలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి.

ఇందులో ఈ విద్యార్థినుల బృందాన్ని బంగారు నంది వరించింది.

నాటకరంగం

ఫొటో సోర్స్, siddhartha womens degree college

'ఇంగ్లిష్ మీడియమైనా కష్టమనిపించలేదు'

ఉరుభంగం నాటకంలో కృష్ణుడు, దుర్యోధనుల పాత్ర‌లు పోషించిన విద్యార్థినులు భావన, రమ్యశ్రీలు బీబీసీతో మాట్లాడుతూ.. '‘మేం ఇంగ్లిష్ మీడియంలో చదివాం. కఠినమైన తెలుగు పదాలు, పెద్ద డైలాగులు గుర్తుపెట్టుకుని చెప్పడానికి భయమేసింది. అందరి సహకారంతో సాధన చేశాం. ఈ నాటకం తర్వాత ధైర్యం పెరిగింది. అంతే కాదు నాటకం రంగం పట్ల గౌరవమూ పెరిగింది'' అని చెప్పారు.

నాట‌కాల వ‌ల్ల టీం వ‌ర్క్ కూడా మెరుగుపడుతుందని వీరు తెలిపారు.

'విద్యార్థుల నుంచి ఊహించని స్పందన'

నాటకం రంగం మరుగున పడలేదని, దాన్ని సజీవంగా ఉంచడానికి చాలా మంది ఉన్నార‌ని డా. విజ‌య‌ల‌క్ష్మి బీబీసీతో చెప్పారు.

''మా కాలేజీలో ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి కానీ, ఐదేళ్లుగా నాటకాలు వేయడం లేదు. మేము ఈ నాట‌కపోటీల ప్రతిపాదన తీసుకరాగానే విద్యార్థుల నుంచి ఊహించనంత స్పందన వచ్చింది'' అని ఆమె తెలిపారు.

నాటకరంగం

ఫొటో సోర్స్, siddhartha womens degree college

స్థిరత్వం ఉండటం లేదు

విద్యార్థులు నాటక రంగం వైపు విద్యార్థులు వస్తున్నా, వారు స్థిరంగా ఈ రంగాన్నే అంటిపెట్టుకుని ఉండటం లేదని రంగీన్ సప్నే ప్రొడక్షన్స్ వ్య‌వ‌స్థాపకులు సురేందర్ సాహిల్ వర్మ బీబీసీతో అన్నారు.

ఈయన నాటకం రంగంలోకి వచ్చేవారికి 9 ఏళ్లుగా శిక్షణ ఇస్తున్నారు.

''నేను చూసినంత వరకు తెలుగు నాట‌కాల‌ను ఆదరించే వాళ్ల సంఖ్య చాలా తక్కువ. ఐటీ రంగంలోని వాళ్లు మానసికంగా ధృడంగా ఉండటానికే నాటక రంగాన్ని ఎంచుకుంటున్నారు'' అని సాహిల్ వర్మ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)