అమెరికా: విడిపోయిన వలస కుటుంబాలను కలిపేందుకు డీఎన్‌ఏ పరీక్షలు

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో కుటుంబాల నుంచి విడిపోయిన పిల్లలను కలిపేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
దాదాపు 3 వేల మంది చిన్నారులకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు అమెరికా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
మెక్సికో నుంచి అక్రమంగా అమెరికాకు వస్తున్న వలసదారులను అదుపు చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 'జీరో టాలరెన్స్' పేరుతో కఠిన చట్టాన్ని తీసుకొచ్చింది.
ఇందులో భాగంగా అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకొని వారి నుంచి పిల్లలను వేరు చేసి సంరక్షణా కేంద్రాలకు తరలిస్తారు. అయితే, ఈ చట్టంపై తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి.
విడిపోయిన వలస కుటుంబాలను కలిపేందుకు పిల్లలపై నిర్వహించాల్సిన డీఎన్ఏ పరీక్షలను సంబంధిత సంస్థ నెమ్మదిగా నిర్వహిస్తోందని, కోర్టు విధించిన గడువులోపు వీటిని పూర్తిచేయాల్సిన అవసరం ఉందని అమెరికా ఆరోగ్య కార్యదర్శి అలెక్స్ అజర్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
దేశంలోని విదేశీ వలస నిర్బంధ కేంద్రాలను ఈ సంస్థే పర్యవేక్షిస్తోందని, ఈ కేంద్రాల్లో ఐదేళ్ల లోపు చిన్నారులు 100 మంది ఉన్నారని అజర్ పేర్కొన్నారు.
పిల్లల నుంచి సేకరించే డీఎన్‌ఏ వివరాలను ప్రభుత్వం వేరే పనికి ఉపయోగించుకుంటుందేమోనని ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, చిన్నారులపై డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించడం సరికాదని విమర్శకులు అంటున్నారు.
జులై 10 లోపు నాలుగేళ్ల లోపు పిల్లలను, జులై 26 లోపు ఐదు నుంచి 17 ఏళ్ల లోపున్న వారిని తల్లిద్రండ్రులకు అప్పగించాలని ఆ సంస్థకు కోర్టు గడువు విధించింది.
అయితే, బర్త్ సర్టిఫికేట్, ఇతరత్రా రికార్డులను ఉపయోగిస్తూ సంప్రదాయ పద్ధతుల్లో ఆ సంస్థ పరీక్షలు నిర్వహిస్తుండటంతో చాలా ఆలస్యం అవుతోందని అజర్ వెల్లడించారు.
హెల్త్ డిపార్ట్‌మెంట్ పర్యవేక్షణలో 11,800 మంది చిన్నారులు ఉన్నారని, ఇందులో 3 వేల మంది చిన్నారులు మాత్రమే కుటుంబాల నుంచి వేరు చేసిన వారని అజర్ పేర్కొన్నారు.
ఇందులో కొందరిని.. వలసదారుల కుటుంబాలు సరిహద్దులు దాటడానికి ముందు, లేక తర్వాత వేరు చేసినట్లు ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
అంతర్జాతీయ వలసదారుల న్యాయవాద విభాగం 'రైసెస్'కు చెందిన జెన్నిఫర్ ఫాల్కన్ ఈ అంశంపై ట్వీట్ చేస్తూ,
''అమెరికా పరిపాలన విభాగానికి వేరు చేసిన కుటుంబాలను తిరిగి ఎలా కలపాలో తెలియడం లేదని చెప్పడానికి ఈ నిర్ణయం ఒక సాక్ష్యం'' అని పేర్కొన్నారు
సమాఖ్య పాలసీ విధానంలోని లొసుగుల వల్ల అమెరికాలోని రెండు ప్రాంతాల్లో ఉన్న 'పిల్లల వలస నిర్బంధ కేంద్రాల' పర్యవేక్షణ బాధ్యతలు ఎవరూ పట్టించుకోవడం లేదని సీబీఎస్ న్యూస్ గురువారం పేర్కొంది.

ఫొటో సోర్స్, John Moore for Getty Images
టెక్సాస్‌లోని టెంట్ సిటీ, ఫ్లొరిడాలోని హోమ్స్టెడ్‌లో వలస నిర్బంధ కేంద్రాలున్నాయి. అయితే, ఇక్కడ సమాఖ్య విధానం అమలులో ఉండటంతో స్థానిక ప్రభుత్వాలు వాటిని పర్యవేక్షించడం లేదని సీబీఎస్ న్యూస్ వెల్లడించింది.
అక్రమ వలసదారుల కుటుంబాలను వేరు చేసే ట్రంప్ నిర్ణయాన్ని నిరసిస్తూ గత వారం రోజులుగా ఆందోళకారులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.
న్యూయార్క్‌లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన కాంగో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడ్ని అక్రమ వలసదారుడిగా గుర్తిస్తూ అనేక అభియోగాలు మోపారు.
ఇవి కూడా చదవండి:
- సోషల్ మీడియా: మీరు లైక్ చేస్తే వాళ్లు లాక్ చేస్తారు.. యూజర్లను వ్యసనపరుల్ని చేస్తున్న కంపెనీలు
- అప్పట్లో ఫుట్‌బాల్ అంటే హైదరాబాద్.. హైదరాబాద్ అంటే ఫుట్‌బాల్
- పాకిస్తాన్ అణుకేంద్రం గుట్టు ‘రా’ ఎలా కనిపెట్టింది?
- పాత ఫొటో స్టూడియోలు ఏమవుతున్నాయి?
- డిజిటల్ యుగంలో సాంప్రదాయ గడియారాలతో ‘ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు’
- మొబైల్ గేమ్స్: ఇది వ్యసనమే కాదు.. ఓ వ్యాధి
- 'చనిపోయాకా చాటింగ్ చేయొచ్చు'
- ఇంటర్నెట్ ఓటింగ్.. తెలుసుకోవాల్సిన విషయాలు
- స్మార్ట్‌ఫోన్‌తో ఆడుకునే మీ పిల్లలు పెన్సిల్‌ను సరిగ్గా పట్టుకోగలరా?
- చరిత్ర: యుద్ధ విమానం అనుకుని సాధారణ పౌరులు ప్రయాణిస్తున్న విమానం కూల్చేసిన అమెరికా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








