అమెరికా: తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని వేరు చేస్తున్న ట్రంప్

అమెరికా-మెక్సికో సరిహద్దు వద్ద ఒక మహిళను అదుపులోకి తీసుకున్న అమెరికా సరిహద్దు భద్రత ఏజెంట్లు

ఫొటో సోర్స్, Getty Images

వలసదారుల పిల్లల్ని వారి తల్లిదండ్రుల నుంచి వేరు చేస్తున్న అంశంపై అమెరికాలో ఇప్పుడు తీవ్రంగా చర్చ జరుగుతోంది.

మెక్సికో నుంచి అమెరికాలోకి అక్రమంగా వస్తున్న ప్రజలను అదుపుచేసేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో ఇది కూడా భాగం.

గత ఆరు వారాల్లో దాదాపు రెండు వేల మంది పిల్లలను వారి కుటుంబాల నుంచి వేరు చేశారు.

వలసదారుల నుంచి వారి పిల్లల్ని వేరు చేయటాన్ని వ్యతిరేకిస్తూ న్యూయార్క్‌లో నిరసన ర్యాలీలో తన బిడ్డతో కలసి పాల్గొన్న ఒక మహిళ

ఫొటో సోర్స్, Getty Images

ఇదంతా ఎందుకు?

సరిహద్దులు దాటి అమెరికాలోకి అక్రమంగా వస్తున్న వలసదారుల్ని నిరోధిస్తానని డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. ఆయనకు ఓట్లేసిన చాలామంది ప్రజలు ఇది కచ్చితంగా జరగాలని కోరుకుంటున్నారు.

వయోజనులు అక్రమంగా సరిహద్దును దాటుతూ పట్టుబడినప్పుడు వారితో పాటు పిల్లలు ఉంటే కనుక.. పెద్దల్ని అరెస్ట్ చేసి, వారి పిల్లల సంరక్షణ బాధ్యతలను అధికారులు చేపడతారు.

పిల్లల్ని ప్రభుత్వ సంరక్షణా కేంద్రాలకు లేదా అనాథ బాలల కేంద్రాలకు తరలిస్తారు. కానీ, వాటి నుంచి ఈ పిల్లలు తప్పించుకుని పారిపోతున్నారని కొన్ని కేంద్రాలు చెబుతున్నాయి.

టెక్సాస్‌లో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేశామని, టెంట్లు వేసి ఈ వలసదారుల పిల్లల్ని వాటిలో ఉంచుతామని ప్రభుత్వం ప్రకటించింది.

సరిహద్దు వద్ద మహిళల్ని, పిల్లల్ని తనిఖీ చేస్తున్న అమెరికా సరిహద్దు భద్రత ఏజెంట్లు

ఫొటో సోర్స్, Getty Images

ప్రజలేమంటున్నారు?

పిల్లల్ని తల్లిదండ్రుల నుంచి వేరు చేసే ప్రక్రియను తక్షణం ఆపాలని అమెరికాకు ఐక్యరాజ్య సమితి సూచించింది.

తమతో పాటు పిల్లల్ని తీసుకువచ్చినంత మాత్రాన అక్రమ వలసదారులు శిక్షను తప్పించుకోలేరని అమెరికా అటార్నీ జనరల్ (దేశ అత్యున్నత న్యాయవాది) చెప్పారు.

అరుదైన ఒక ప్రకటనలో అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఈ అంశంపై స్పందించారు. ‘‘పిల్లలను వారి కుటుంబాల నుంచి వేరు చేయటాన్ని చూడలేకపోతున్నాను. (వేరుపడ్డ) వారంతా కలుస్తారని ఆశిస్తున్నాను. అన్ని చట్టాలనూ పాటించే దేశం మనది కావాలి, అలాగే మనసుతో పాలించే దేశం కూడా’’ అని ఆమె పేర్కొన్నారు.

మాజీ ప్రథమ మహిళ బార్బరా బుష్ సైతం ఒక వార్తా పత్రిక కథనంలో ఈ అంశంపై విమర్శలు చేశారు. ‘‘ఈ ‘ఏమాత్రం ఉపేక్షించని’ విధానం క్రూరమైనది. ఇది నా హృదయాన్ని బద్దలు చేస్తోంది. పిల్లల్ని గోదాముల్లోను, ఎడారి నగరాల్లోని టెంట్లలోను పెట్టే పనిలో మన ప్రభుత్వం ఉండకూడదు’’ అని తెలిపారు.

అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక కేంద్రంలో వలసదారుల పిల్లలు

ఫొటో సోర్స్, US Government

ఫొటో క్యాప్షన్, అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక కేంద్రంలో వలసదారుల పిల్లలు

ఇకపై ఏం జరుగుతుంది?

వాస్తవం ఏంటంటే.. తర్వాత ఏం జరుగుతుందనేది స్పష్టంగా తెలియదు.

డొనాల్డ్ ట్రంప్ పార్టీలోని చాలామంది రాజకీయ నాయకులు ప్రభుత్వ చర్యను సమర్థిస్తున్నారు. అయితే, పార్టీలోని మిగతా నాయకులు, ఇతర పార్టీల నాయకులు మాత్రం.. సరిహద్దుల వద్ద తల్లిదండ్రులను, పిల్లలను వేరు చేసే చర్యల్ని నిలిపివేసేందుకు ఒక కొత్త చట్టాన్ని తయారు చేస్తున్నారు.

కొత్త ప్రణాళిక ప్రకారం కుటుంబాలను కలిపే ఉంచుతారు.

అయితే, ఈ ప్రణాళికలను తాను సమర్థించనని డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నారు. అదే సమయంలో.. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలంటూ రాజకీయ నాయకులందరికీ ఆయన సోషల్ మీడియా ద్వారా సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)