బ్లాగ్: ఇరాన్ మీడియా‌లో మహిళలను 'ఫ్యామిలీ' అంటారు. ఎందుకంటే...

మహిళలు

ఫొటో సోర్స్, EPA

    • రచయిత, దివ్య ఆర్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆఫ్రికా ఖండం మొత్తానికి మీడియా సంస్థలకు కేంద్ర స్థానం నైజీరియా కాగా, మీడియాపై ప్రభుత్వ నియంత్రణ అత్యధిక స్థాయిలో ఉండే మధ్యప్రాచ్య దేశం ఇరాన్‌. ఈ రెండు దేశాల్లో మహిళల గురించి మీడియా కవరేజీ తీరుతెన్నులపై అందిస్తున్న కథనం ఇది.

నైజీరియా, ఇరాన్‌లలో మహిళల అంశాలపై వార్తలు అందించే జర్నలిస్టులు అబిగాలి ఓనీ వవోహువాచో(నైజీరియా), ఫెరానక్ అమడి(ఇరాన్)లను ఇటీవల లండన్‌లోని బీబీసీ ప్రధాన కార్యాలయంలో నేను కలిశాను.

ఈ రెండు దేశాల్లో మహిళల వార్తలను మీడియా ఎలా అందిస్తుందో వారిని ఆరా తీశాను.

మహిళలు

నైజీరియాలో మహిళా నాయకుల రూపురేఖలు, మాటతీరుపై వ్యాఖ్యలు

నైజీరియాలో వందల కొద్దీ రేడియో స్టేషన్లు, టీవీ ఛానళ్లు, శాటిలైట్ ఛానళ్లు ఉన్నాయి. సైన్యం, బోకోహరాం గ్రూపు మధ్య పోరాటం నేపథ్యంలో నైజీరియాలో జర్నలిస్టులకు నిత్యం ముప్పు పొంచి ఉంటుంది.

నైజీరియాలో తొలిసారిగా 2015లో అధ్యక్ష ఎన్నికల్లో ఒక మహిళ పోటీపడ్డారు. ఆమె పేరు రెమీ సొనాయియా.

ఎన్నికల సమయంలో రెమీ సొనాయియాను మీడియా ఆమె ఏం చేస్తారు.. ఏ వృత్తిలో ఉన్నారనేది అడగలేదు. కుటుంబ జీవితం, రాజకీయాల మధ్య సమతూకం ఎలా పాటిస్తారని అడిగింది.

నైజీరియా మీడియా రాజకీయల్లోకి వచ్చే మహిళలను మొదట 'కుటుంబ సభ్యులు'గానే చూస్తుందని, ఆ తర్వాతే వారిని రాజకీయ నాయకులుగా పరిగణిస్తుందని అబిగాలి చెప్పారు.

మహిళా నాయకుల రూపురేఖలపై, మాటతీరుపై మీడియా వ్యాఖ్యలు చేస్తుందని తెలిపారు.

మహిళ

ఫొటో సోర్స్, Getty Images

అసలు మీరు ఎందుకు పోటీచేశారని అడిగిన మీడియా

పశ్చిమాఫ్రికాలోనే కాదు మొత్తం ఆఫ్రికాలోనే అత్యధిక జనాభాగల దేశం నైజీరియా. దేశ జనాభా 18 కోట్ల పైనే.

ఆ ఎన్నికల్లో రెమీ సొనాయియాకు కేవలం 13 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆమె 12వ స్థానానికి పరిమితమయ్యారు.

ఓటమి తర్వాత ఆమెను మీడియా- ''అసలు మీరు ఎందుకు పోటీచేశారు'' అని అడిగింది. మహిళలు సమాజంలో తాము అంతవరకూ పోషిస్తున్న పాత్రలకే పరిమితం కాకుండా, రాజకీయాల్లో రాణించాలని ప్రయత్నిస్తే ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయని ఆమెనుద్దేశించి మీడియాలో వ్యాఖ్యలు వచ్చాయి.

మీడియా స్వేచ్ఛ ఉన్న నైజీరియాలోనే మహిళల పట్ల మీడియాలో ఇంత సంకుచిత ఆలోచనలు ఉంటే, ఇక ఇరాన్‌లాంటి దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు.

మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్‌లో పరిస్థితి ఎలా ఉంటుందంటే...

ఇరాన్ భూభాగంపై నుంచి ప్రభుత్వానికి చెందిన రేడియో స్టేషన్లు, టీవీ ఛానళ్లు మాత్రమే ప్రసారాలు అందించగలవు. కొన్ని స్వతంత్ర, ఉదారవాద మీడియా సంస్థలు, రచయితలు డిజిటల్ మీడియాను ఉపయోగించుకొంటుంటారు. కానీ చాలా సందర్భాల్లో వారిని ప్రభుత్వ యంత్రాంగం జైళ్లలో పెట్టి, నోరు నొక్కేస్తుంటుంది.

ఇరాన్‌లో మీడియాపై ప్రభుత్వ నియంత్రణ పూర్తిస్థాయిలో ఉంది. వార్తలపై ఆంక్షలు పెద్దయెత్తున ఉన్నాయి. మహిళల వార్తలపైనైతే ఈ ఆంక్షలు పదింతలు ఉంటాయని ఫెరానక్ తెలిపారు.

విధేయులైన భార్యలుగా, తల్లులుగా, కుమార్తెలుగా వ్యవహరించడం వరకే మహిళల పాత్ర పరిమితమని పితృస్వామ్య వ్యవస్థ, రాజ్య వ్యవస్థ నిర్దేశిస్తాయి. ఈ నిర్దేశానికి అనుగుణంగానే మీడియాలో వార్తలు ఉంటాయి.

చాలా సందర్భాల్లో మహిళలను 'మహిళలు' అని కాకుండా, 'ఫ్యామిలీ(కుటుంబ సభ్యులు)' అని మీడియా వ్యవహరిస్తుంది. ఉదాహరణకు మహిళలు ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే, 'కార్యక్రమంలో ఫామిలీ కూడా పాల్గొన్నారు' అని ప్రస్తావిస్తారు.

సీరియళ్లలోనూ అదే తీరు

మహిళలకు సంబంధించిన అంశాల్లో మాత్రమే వారి అభిప్రాయాలను మీడియా పరిగణనలోకి తీసుకొంటుంది. ఇతర అంశాలపై స్పందించేంత అవగాహనా శక్తి మహిళలకు ఉండదన్నట్లుగా వ్యవహరిస్తుంది.

శాటిలైట్ టీవీ ఛానళ్లు వచ్చిన తర్వాత టర్కీ, లాటిన్ అమెరికా దేశాల్లో తీసిన సీరియళ్లు ఇరాన్‌లో బాగా ప్రజాదరణ పొందుతున్నాయి. అయితే ఈ సీరియళ్లు కూడా మహిళలను కుటుంబంలో వారికి ఇక్కడి వ్యవస్థ 'నిర్దేశించిన' పాత్రలకే పరిమితం చేసి చూపిస్తున్నాయి.

అత్తాకోడళ్ల మధ్య విభేదాలు, ఒక మగాడి కోసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మహిళలు పోటీపడటం లాంటి అంశాలే ఈ సీరియళ్ల ప్రధానాంశాలు.

మహిళల కలలు, ఆకాంక్షలు, వారి పని, వ్యక్తిగత గుర్తింపును ఒక్క కథా ప్రతిబింబించదు.

మహిళ

ఫొటో సోర్స్, iStock

నైజీరియా సినిమాల్లో మహిళలు పరాధీనులు

పంపిణీ(డిస్ట్రిబ్యూషన్) పరంగా చూస్తే బాలీవుడ్ తర్వాత అతిపెద్ద పరిశ్రమ నైజీరియా చిత్రపరిశ్రమ 'నాలీవుడ్'.

మహిళలను నాలీవుడ్ ఎప్పుడూ పరాధీన పాత్రల్లోనే చూపిస్తుంటుంది.

మహిళను మగాడు మోసం చేయడం, తర్వాత అతడు క్షమాపణ చెప్పడం, మహిళ అతడిని క్షమించేయడం, మహిళను రెండో భార్యగానో, మూడో భార్యగానో చూపించడం నాలీవుడ్ చిత్రాల్లో సర్వసాధారణం.

మహిళ ఏ పాత్ర పోషిస్తున్నా, అవగాహనతో నిర్ణయం తీసుకోగల వ్యక్తిగా ఆమెను చూపించనే చూపించరు.

మహిళ

ఫొటో సోర్స్, Getty Images

మహిళల ఆరోగ్యం గురించి పట్టించుకోరు

మహిళల ఆరోగ్యం గురించి ఇరాన్‌లో చర్చే ఉండదని ఫెరానక్ చెప్పారు. పాఠశాలల్లో లైంగిక విద్యను బోధించరు. కళాశాలల్లో దీని గురించి నామమాత్రంగానే చెబుతారు.

మహిళల ఆరోగ్యం గురించి నైజీరియా మీడియా కూడా పెద్దగా వార్తలు అందించదని అబిగాలి తెలిపారు. మహిళల శరీరం, వారి ఆరోగ్యం అంశాలపై మీడియాలో బిడియం ఉందని, అవి చర్చించకూడని అంశాలని భావిస్తుందని వివరించారు.

మహిళలకు తమ శరీరం గురించి, లైంగికత, లైంగిక సంబంధాల గురించి, పిల్లలను కనడంపై నిర్ణయించుకొనే హక్కు, ఇతర అంశాలపై ఆసక్తి ఉన్నా, మీడియా పట్టించుకోదు.

విద్య, ఆరోగ్యం, ఉపాధి, డబ్బు ఖర్చు చేయడం, డబ్బు పొదుపు చేసుకోవడం లాంటి అంశాల గురించి కూడా తెలుసుకోవాలనే ఆసక్తి నైజీరియా మహిళలకు ఉంది. వీటినీ అక్కడి మీడియా విస్మరిస్తోంది.

మహిళలు

ఫొటో సోర్స్, Reuters

సోషల్ మీడియాలో మహిళల అంశాలపై కథనాలు

నైజీరియాలో సాధారణ మీడియా పట్టించుకోని మహిళల అంశాలను సోషల్ మీడియా పట్టించుకుంటోంది. ఇక్కడ ఈ అంశాలపై రాస్తున్నారు. ఈ విధంగా సోషల్ మీడియా ఈ విషయంలో మహిళల అవసరాలను ఎంతో కొంత తీరుస్తోంది.

నైజీరియాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు ఆదరణ చాలా ఎక్కువ. ఇరాన్‌లోనూ మహిళలకు వారి గొంతు వినిపించేందుకు ఈ ఆన్‌లైన్ వేదికలు తోడ్పడుతున్నాయి.

ఇదే సందర్భంలో, ఫెరానక్ మరో ముఖ్యమైన విషయం చెప్పారు. నిజ జీవితంలో మహిళలు చాలా విషయాల్లో మౌనంగానే ఉండాల్సి వస్తోంది కాబట్టి, సోషల్ మీడియాలోనూ వారు ఇంచుమించు అలాగే వ్యవహరించక తప్పడం లేదని వ్యాఖ్యానించారు.

ఎవరైనా మహిళలు తమ చుట్టూ ఉన్న అడ్డుగోడలను మించి సోషల్ మీడియాలో వ్యవహరించినట్లు ఇతర యూజర్లకు అనిపిస్తే వారిపై ట్రోలింగ్ ఉంటుందని, ఇదో పెద్ద సవాలుగా ఉందని ఫెరానక్ చెప్పారు.

మీడియా సంస్థల్లో మరింత మంది మహిళలు ఉంటేనే మహిళలపై మీడియా వైఖరిలో మార్పు వస్తుందని అబిగాలి అభిప్రాయపడ్డారు. మహిళల అంశాలపై మహిళా జర్నలిస్టులు మెరుగ్గా వార్తలు అందించడమే కాదు, ఆయా సంస్థల జర్నలిజానికే మహిళల కోణంలో వారు ఒక దృక్పథాన్ని అందించగలరు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)