ఈ గాయని నోటికి టేప్ అతికించుకుని నిద్రపోతారు.. కారణమేంటో తెలుసా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అషిత నాగేశ్
- హోదా, బీబీసీ న్యూస్
''మనం చాలా పనులు నేర్చుకుంటాం.. కానీ, ఆ పనులు ఎప్పుడూ చేయం. కొన్ని పనులు అస్సలు నేర్చుకోం.. కానీ, జీవితాంతం చేస్తూనే ఉంటాం''
ఇండోనేసియాకు చెందిన ప్రముఖ గాయని ఆండీన్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో శ్వాస గురించి రాసుకున్న వాక్యాలివి.
ఈ పోస్టింగ్‌లో ఆమె తన భర్త, రెండేళ్ల కుమారుడు సహా తాను నోటికి టేప్ అతికించుకున్న ఫొటోలను జత చేశారు. తన కుటుంబం మొత్తం మూడు నెలలుగా 'బుటీకో' అనే పద్ధతిని పాటిస్తున్నామని ప్రకటించుకున్నారు.
బుటీకో అంటే కేవలం ముక్కు ద్వారానే ఉచ్ఛ్వాసనిశ్వాసలు జరిగేలా చేయడం. నిద్రపోతున్నప్పుడు నోటితో గాలి పీల్చుకోకుండా ఇలా టేప్ వేసుకుని పడుకుంటున్నామని ఆమె తెలిపారు.
ఈ పద్ధతి పాటించడం మొదలుపెట్టాక మంచి నిద్ర పడుతోందని.. రాత్రుళ్లు గొంతెండిపోవడం వంటి సమస్యలూ ఇప్పుడు లేవని ఆండీన్ తెలిపారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
అసలేంటీ బుటీకో?
బుటీకో పద్ధతిని 1950లో మొట్టమొదట సోవియట్ డాక్టర్ కాన్‌స్టాంటిన్ పావ్లోవిచ్ బుటీకో ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన పేరుతోనే దీన్ని బుటీకో అని పిలవడం మొదలైంది.
శ్వాస తీసుకునే విధానానికి, శ్వాసకోశ వ్యాధులకు సంబంధం ఉంటుందన్నది ఆయన సిద్ధాంతం. ముఖ్యంగా ఆస్తమా వంటి జబ్బులతో బాధపడే రోగులు పూర్తిగా ముక్కు ద్వారానే శ్వాస పీల్చడం, వదలడం చేస్తే వారి జబ్బులు నయమవుతాయని ఆయన నమ్మేవారు.
ఆయన ఈ విధానాన్ని పరిచయం చేసిన ఏడు దశాబ్దాలకు ఇప్పుడది ఆదరణ పొందుతోంది.
ప్రపంచవ్యాప్తంగా బుటీకో విధానాన్ని పాటించేవారంతా తమకు శ్వాస సంబంధిత వ్యాధులు నయమవుతున్నాయంటున్నారు.
డయాబెటిస్, తీవ్రమైన అలసట సమస్యలు, కుంగుబాటు, అటెన్షన్ డెఫిసిట్ హైపర్‌యాక్టివ్ డిజార్డర్ వంటి సమస్యలతో బాధపడేవారు బుటికో పాటిస్తే ఆరోగ్యం నయమవుతోందని చెబుతున్నారు. కానీ, ఇది ఎక్కువగా శ్వాసమార్గాలు మూసుకుపోవడం వల్ల నిద్రలేమికి గురయ్యే పరిస్థితుల (అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నోయియా-ఓఎస్‌ఏ) నుంచి ఉపశమనం కలిగిస్తుందంటారు.
శ్వాసమార్గాలు మూసుకుపోతుంటే శ్వాస సరిగా అందక నిద్ర సరిగా పట్టదు. నిద్ర తక్కువైతే అలసట, కుంగుబాటు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ సమస్యతో బాధపడేవారు గురకపెడుతుంటారు కూడా.
ఇంటర్నేషనల్ బుటీకో క్లినిక్ వ్యవస్థాపకుడు పాట్రిక్ మెక్‌కీవన్ 'బీబీసీ'తో మాట్లాడుతూ, నోటితో శ్వాస పీల్చుకుంటే ఇలాంటి సమస్యలు వస్తాయని చెప్పారు. నిద్రలో నోటితో గాలి పీల్చడం వల్ల తెలియకుండానే నాలుక వెనక్కు వెళ్లి శ్వాస మార్గాలకు ఆటంకమవుతుందని.. ఇది నిద్రలేమికి కారణమవుతుందని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
డాక్టర్లు ఏమంటున్నారు
ఈ వాదనలతో వైద్యులు ఏకీభవించడం లేదు. నిద్రలో అందరూ నోటితో గాలి పీల్చుకోరని.. ముక్కులో ఏవైనా ఆటంకాలు ఏర్పడినవారు మాత్రమే నోటితో గాలి పీలుస్తారని డెట్రాయిట్‌కు చెందిన ఈఎన్టీ వైద్యుడు కత్లీన్ యరామ్చుక్ 'బీబీసీ'తో అన్నారు.
బ్రిటిష్ మెడికల్ ఆర్గనైజేషన్ ఈఎన్టీ యూకే అధ్యక్షుడు, ఓటోలరింగాలజిస్ట్ (చెవి, ముక్కు, గొంతు వైద్య ప్రత్యేక నిపుణుడు) నిర్మల్ కుమార్ 'బీబీసీ'తో మాట్లాడుతూ.. వైద్య పుస్తకాల్లో ఎక్కడా కూడా ఈ బుటీకో విధానం సరైనదని చెప్పడానికి తగిన ఆధారాలేమీ లేవన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రమాదకరమా?
ముక్కుతో శ్వాస పీల్చుకోవడం వల్ల లాభాల మాట పక్కన పెడితే నోటికి టేప్ అతికించుకోవడం ప్రమాదకరమంటున్నారు వైద్యులు. చిన్నపిల్లల నోటిని టేప్‌తో మూసేయడం మరీ ప్రమాదకరమని వీరు హెచ్చరిస్తున్నారు.
అయిదేళ్ల లోపు చిన్నారులకు ఇలా నోటిని మూసేయడం సరికాదని.. ఒకవేళ వారు ముక్కుతో శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడి నోటితో పీల్చుకోవాలనుకున్నా టేప్ కారణంగా పీల్చుకోలేరని.. అది ప్రాణాలకే ప్రమాదమని చెబుతున్నారు.
గురక కానీ ఇంకేదైనా సమస్య కానీ ఉంటే వైద్యులను సంప్రదించాలే కానీ ఇలాంటి విధానాలు అనుసరించడం సరికాదని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- విక్టోరియా మోడెస్టా: కృత్రిమ కాలుతో.. పారిస్ కేబరేను షేక్ చేస్తున్న బయోనిక్ షోగర్ల్
- అపోలో మిషన్: చంద్రుని మీద మానవుడి తొలి అడుగుకు స్వర్ణోత్సవం
- ఇక్కడ ఉండేవారు మృత్యువు కోసం ఎదురు చూస్తుంటారు
- రెండు వందల రూపాయల అప్పు తీర్చడానికి 30 ఏళ్ళ తరువాత ఇండియాకు వచ్చిన కెన్యా ఎంపీ
- సెమీ ఫైనల్స్‌లో భారత జట్టు ఓటమిపై రవిశాస్త్రి ఈ ప్రశ్నలకు బదులివ్వగలరా...
- సూపర్ ఓవర్ నిబంధనలేంటి? బౌండరీలు కూడా టై అయితే గెలిచే జట్టు ఏది?
- తాగు నీటి సమస్యను సింగపూర్ ఎలా అధిగమిస్తోంది?
- ఆ పొలం నిండా కుళ్లిపోతున్న మృతదేహాలు.. వాటి మీద శాస్త్రవేత్తల పరిశోధనలు
- గ్యాంగ్‌లో గుర్తింపు రావాలంటే మనుషుల్ని చంపుతూనే ఉండాలి
- శోభనం రాత్రి బెడ్షీట్లు ఏం నిరూపిస్తాయి? పురాతన వివాహ సంప్రదాయాలు నేటితరం మహిళల్ని ఎలా వెంటాడుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








