వరల్డ్ కప్ 2019: సెమీ ఫైనల్స్‌లో భారత జట్టు ఓటమిపై రవిశాస్త్రి ఈ ప్రశ్నలకు బదులివ్వగలరా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నితిన్ శ్రీవాస్తవ
- హోదా, బీబీసీ ప్రతినిధి
''ఈ ఘనత అంతా గ్యారీది, మా కోచింగ్ బృందానికే చెందాలి. ఎందుకంటే వాళ్లు ఈ టోర్నీ కోసం మమ్మల్ని ఏడాది ముందు నుంచే సిద్ధం చేయటం ప్రారంభించారు. జట్టులో చాలా మార్పు తీసుకొచ్చారు'' - 2011 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత సచిన్ టెండూల్కర్ చెప్పిన మాటలివి.
బిడియస్తుడు, దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ గారీ కిర్‌స్టెన్ కోచ్‌గా ఉన్నపుడు 2008 ఆసియా కప్ ఫైనల్స్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయింది. దీంతో భారత జట్టును విజేతగా మలిచే బృహత్కార్యం మీద గారీ దృష్టిపెట్టాడు.
ఆసియా కప్ ఫైనల్ ఓటమి తర్వాత, ప్రచారం మీద అమితాసక్తి ఉన్న, సంపన్న భారత క్రికెటర్లను ఒక జట్టుగా క్రమశిక్షణతో ఆడేలా, జట్టు మేనేజ్‌మెంట్‌తో సమన్వయంతో నడుచుకునేలా రూపుదిద్దాడు. దీంతో భారత జట్టు దేశానికి అనేక విజయాలు సాధించిపెట్టింది.
అక్కడి నుంచి 2015 మార్చి 26వ తేదీకి వస్తే.. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రపంచ కప్ సెమీ-ఫైనల్స్‌లో భారత జట్టును ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా మట్టికరిపించింది.
అప్పుడు విరాట్ కోహ్లీ పెవిలియన్ బాల్కనీలో కూర్చుని నిర్లిప్తంగా చూస్తుండగా... గెలిచిన ఆస్ట్రేలియా జట్టును అభినందించటానికి కెప్టెన్ ఎంఎస్ ధోనీ గ్రౌండ్‌లోకి వెళ్లగా, రవిశాస్త్రి భారత ఆటగాళ్లందరి దగ్గరకు వెళ్లి వారి భుజం తడుతూ ధైర్యం చెప్పాడు.

ఫొటో సోర్స్, Getty Images
యాబై మూడేళ్ల వయసున్న రవిశాస్త్రి 2014 నుంచి భారత క్రికెట్ జట్టుకు టీమ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే 2016లో టీమ్ ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యే వరకూ రవిశాస్త్రి ఆ పాత్రలో కొనసాగారు.
అనిల్ కుంబ్లే దాదాపు ఒక సంవత్సరం పాటు.. 2017 జూన్ వరకూ భారత జట్టు కోచ్‌గా ఉన్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీకి, కుంబ్లేకు మధ్య విభేదాలు తలెత్తాయంటూ అప్పుడు మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇంగ్లండ్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ చేతిలో భారత జట్టు ఓడిపోయిన తర్వాత, వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టుతో కుంబ్లే వెళ్లలేదు.
అయితే, హెడ్ కోచ్‌గా ఉన్న ఏడాది కాలంలో కుంబ్లే తన వంతు విజయం సాధించాడు. భారత జట్టు ఆడిన 17 టెస్టు మ్యాచుల్లో 12 విజయాలు నమోదు చేసింది. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానాన్ని అందుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
కుంబ్లే నిష్క్రమించిన వెంటనే రవిశాస్త్రి మళ్లీ భారత జట్టు ప్రధాన కోచ్‌గా తిరిగివచ్చాడు. అందుకు జట్టు కెప్టెన్ కోహ్లీ, జట్టులోని కొంతమంది సీనియర్ ఆటగాళ్ల మద్దతు ఉందని చాలామంది నమ్ముతారు.
అంతకుముందు టీమ్ డైరెక్టర్‌గా ప్రపంచ కప్ టోర్నీ సెమీఫైనల్స్ వరకూ భారత జట్టును నడిపించిన రవిశాస్త్రి 2019 ప్రపంచ కప్ టోర్నీ కోసం జట్టును పునర్నిర్మిస్తారని కూడా ఆశించారు.
నిజమే, రవిశాస్త్రి ఆ పని దాదాపు చేశారు.
బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌ను కొనసాగించటమే కాదు, టీమ్‌కు అసిస్టెంట్ కోచ్‌గా స్థాయిని కూడా పెంచారు.

ఫొటో సోర్స్, Getty Images
జట్టు బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్‌ను తీసుకువచ్చారు. అయితే, అనిల్ కుంబ్లే చీఫ్ కోచ్‌గా ఉన్నపుడు మాజీ పేస్ బౌలర్ జహీర్ ఖాన్‌ను బౌలింగ్ కోచ్‌గా తీసుకోవాలని మొగ్గుచూపిన నేపథ్యంలో భరత్ అరుణ్‌ను తీసుకురావాలన్న నిర్ణయం మీద వాడివేడిగా చర్చ జరిగింది.
అలాగే, యువ ఆటగాళ్లు విభిన్న మైదాన పరిస్థితులకు అలవాటు పడటం కోసం భారత జట్టు విదేశాల్లో ఆడుతూనే ఉండాలని రవిశాస్త్రి పట్టుపట్టారు.
భారత ఆటగాళ్లు తమ సహజ శైలిలో ఆడటానికి, తమ తమ బ్యాటింగ్ లేదా బౌలింగ్ నైపుణ్యాలకు పదును పెట్టుకోవటానికి రవిశాస్త్రి స్వేచ్ఛ ఇచ్చాడని కూడా చెప్తారు.
కానీ, ప్రపంచ కప్ 2019 టోర్నీకి ముందు, టోర్నీ కొనసాగుతుండగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆయనను భవిష్యత్తులోనూ వెంటాడతాయి.

ఫొటో సోర్స్, Getty Images
'ఓటమికి టీమ్ కోచ్‌కు కూడా సమాన బాధ్యత ఉంటుందా?'
భారత జట్టు మాజీ క్రీడాకారుడు ఫరూక్ ఇంజనీర్ బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రవిశాస్త్రికి, జట్టు కెప్టెన్ కోహ్లీకి మొట్టమొదటి కీలక ప్రశ్న లేవనెత్తాడు.
''జట్టులో రిషభ్ పంత్ మొదటి నుంచీ ఎందుకు లేడు? ప్రపంచ కప్ జట్టును ప్రకటించేటపుడు పేలవమైన సెలక్షన్లు ఎందుకు జరిగాయి?'' అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
'ఓటమికి టీమ్ కోచ్‌కు కూడా సమాన బాధ్యత ఉంటుందా?' అని అడిగినపుడు, ''దీనికి రవి ఒక్కడినే తప్పుపట్టలేం. మొత్తం జట్టు ఓటమి పాలైంది. ఆ రోజు నిజంగా బాగోలేదు. కానీ, జట్టు ఎంపిక ఒక సమస్య అన్నది వాస్తవం. దీనిని పరిష్కరించాల్సిన అవసరముంది'' అని ఫరూక్ బదులిచ్చారు.
జట్టు ఎంపిక ప్రక్రియలో గత రెండేళ్లుగా రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ మాటకు మంచి విలువే ఉంది. దీని మీదే రెండో ప్రశ్న తలెత్తుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
బంతి గాలిలో చాలా పాత్ర పోషించే ఇంగ్లండ్ వాతావరణ పరిస్థితుల్లో ఈ ప్రపంచ కప్ టోర్నీ ఆడాల్సి ఉంటుందని ప్రపంచం మొత్తానికీ తెలిసినపుడు, చటేశ్వర్ పుజారా, అజింక్య రహానే వంటి ఆటగాళ్లను జట్టులోకి ఎందుకు తీసుకోలేదు?
పుజారా కౌంటీ క్రికెట్ అనుభవం గురించి, ప్రత్యేకించి ఇంగ్లండ్ వాతావరణ పరిస్థితుల్లో పైకి లేచే, కదిలిపోయే బంతిని ఆడటంలో అతడు తడబాటును అధిగమించటం గురించి కోహ్లీతో పాటు జట్టు చీఫ్ కోచ్‌గా రవిశాస్త్రికి కూడా బాగా తెలుసు.
రహానే కూడా అంతే. ప్రతికూల పరిస్థితుల్లో బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఓపికగా ఉండటంతో పాటు.. స్ట్రయిట్ బ్యాట్‌తో తొణకకుండా ఆడే టెక్నిక్‌ను పదే పదే ప్రదర్శించాడతడు.
గత ఐపీఎల్‌లో వేగంగా పరుగులు చేయటం, భారీ షాట్లు కొట్టటం ద్వారా తన విమర్శకుల అంచనాలు తప్పని కూడా అతడు నిరూపించాడు.

ఫొటో సోర్స్, Getty Images
చివరకు, ఇంకా ఎక్కువ అనుభవశాలి అయిన అంబటి రాయుడును కూడా జట్టు ఎంపికలో పరిగణించలేదు. దానివల్ల అతడు ప్రపంచ కప్ టోర్నమెంట్ మధ్యలోనే, తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు.
కానీ, ఏవో అంచనాలు వేసి అనుభవం లేని విజయ్ శంకర్, మయాంక్ అగర్వాల్ వంటి ఆటగాళ్లను, కొంత అనుభవమున్న రిషభ్ పంత్‌ను ఎంపిక చేయటం ద్వారా భారత జట్టు రిస్క్ చేసి నిర్ణయం తీసుకున్నపుడు... వారు రాణించకపోతే బాధ్యత ఎవరు తీసుకుంటారు?
సెలెక్టర్లా? కెప్టెనా? లేక అందరిలోకీ వయసులోనే కాదు క్రికెట్ అనుభవంలోనూ అత్యంత సీనియర్ అయిన కోచా?
ఇక మరో ప్రశ్న మూడు రోజుల నుంచీ బలంగానే వినిపిస్తోంది.
టాప్ ఆర్డర్‌లో ముగ్గురు ఆటగాళ్లు - రోహిత్, విరాట్, రాహుల్ ఒక్కొక్క రన్‌కే ఔటైపోయిన తర్వాత.. ఓల్డ్ ట్రాఫోర్డ్ దగ్గర జట్టు మేధోబృందం.. ఆ పతనాన్ని ఆపటం కోసం అనుభవశాలి అయిన ఎంఎస్ ధోనీని ఎందుకు పంపించలేదు?
పంత్, పాండ్యా, దినేష్ కార్తీక్‌ల తర్వాత ధోనీని ఏడో స్థానంలో పంపించటం ఆ రోజు చేసిన అతిపెద్ద తప్పిదం కావచ్చు.
భారత బ్యాటింగ్ ఆర్డర్‌కు బలం చేకూర్చటానికి అనుభవజ్ఞుడైన ఆటగాడు అవసరమైన సమయంలో వాళ్లు ధోనీని ఏడో నంబర్‌లో బ్యాటింగ్‌కు పంపించారు.
పించ్-హిట్లర్లైన హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్‌లు ధోనీ కన్నా ముందు బ్యాటింగ్‌కు వచ్చారు.
విచారకరం ఏమిటంటే, భారత జట్టుకు ఇన్నింగ్స్ చివర్లో పించ్ హిట్లర్లు అవసరమైనపుడు వాళ్లందరూ డ్రెసింగ్ రూమ్‌లో కూర్చుని ఆటను విస్మయంగా వీక్షిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ధోనీని ఆలస్యంగా బ్యాటింగ్‌కు పంపించాలన్న నిర్ణయాన్ని భారత జట్టు మాజీ క్రీడాకారులు సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లు వ్యతిరేకించారు.
''ధోనీని చివర్లో పంపించటం వ్యూహాత్మకంగా ఘోర తప్పిదం. రిషభ్ పంత్‌తో కలిసి ధోనీ భాగస్వామ్యం నిర్మించటానికి వీలు కల్పించినట్లయితే.. దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యాల వికెట్లు కాపాడుకుని ఉండేవాళ్లు'' అని లక్ష్మణ్ తన వ్యాఖ్యానంలో విశ్లేషించాడు.
ఈ విషయంలో లక్ష్మణ్‌తో సౌరభ్ గంగూలీ కూడా ఏకీభవించినట్లు కనిపించాడు.
''ధోనీ ముందుగా బ్యాటింగ్‌కు వచ్చి ఇన్నింగ్స్ మొత్తం బ్యాటింగ్ కొనసాగించేందుకు అవకాశముంది. ఆ తర్వాత జడేజా, పాండ్యా, కార్తీక్‌లు ఉంటారు. వీళ్లు గతంలో చివరి నాలుగైదు ఓవర్లలో చేసిన పరుగులు చాలా విలువైనవి'' అని ఆయన వ్యాఖ్యానించాడు.

ఫొటో సోర్స్, Getty Images
ఇక చిట్టచివరి పెద్ద ప్రశ్న ఏమిటంటే, జట్టు యాజమాన్యం పిచ్‌ను సరిగా అధ్యయనం చేసిందా?
ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్‌ను ఒక రోజు ముందు నెట్ ప్రాక్టీస్ సందర్భంగా స్వయంగా జట్టు కోచ్, అతడి బృందంలోని సీనియర్ సభ్యులు, ఆటగాళ్లు చాలా దగ్గరగా పరిశీలించారు.
వికెట్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉన్నట్లు కనిపించినట్లయితే, స్పిన్ బౌలర్ అయిన యజువేంద్ర చాహల్‌కు విశ్రాంతినిచ్చి.. పేస్ దాడిని బలోపేతం చేయటం కోసం మొహమ్మద్ షమీని తుది జట్టులోకి తీసుకుని ఉండొచ్చు.
సెమీ-ఫైనల్స్‌లో జడేజా స్పిన్నర్‌గా తన పాత్ర పోషించాడు. అతడు తన కోటా 10 ఓవర్లు పూర్తిచేసి కేవలం 34 రన్స్ మాత్రమే ఇవ్వటమే కాక.. ప్రమాదకరంగా కనిపించిన న్యూజీలాండ్ ఓపెనర్ హెన్రీ నికోల్స్ వికెట్ కూడా తీశాడు.
అయితే, యజువేంద్ర చాహల్ తన 10 ఓవర్లలో కేవలం ఒక వికెట్ తీసి.. 63 పరుగులు ఇచ్చుకున్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
ఆశ్చర్యకరంగా, ఈ టోర్నమెంట్‌లో కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం లభించిన మొహమ్మద్ షమీ నాలుగింట్లో కలిపి 14 వికెట్లు తీశాడు. అతడికి ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఆడిన తుది 11 మంది జట్టులో చోటు లభించలేదు.
క్రికెట్ అనేది జట్టు సమష్టిగా ఆడాల్సిన ఆట అనేదాంట్లో సందేహం లేదు. ఒక ఓటమికి లేదా ఒక పొరపాటు నిర్ణయానికి ఒక వ్యక్తిని తప్పుపట్టలేం.
కానీ, ప్రతి నిర్ణయానికీ, ప్రతి పరుగుకూ, ప్రతి బంతికీ.. పట్టిన లేదా జారవిడిచిన ప్రతి క్యాచ్‌కూ.. కెప్టెన్‌ను, ఆటగాళ్లను నిశితంగా శోధిస్తున్నపుడు, ఈ మొత్తం ఓడకు కెప్టెన్‌గా పరిగణించే కోచ్‌కు కూడా కఠిన ప్రశ్నలు వేయాల్సి ఉంటుంది.
ఫరూక్ ఇంజనీర్ అన్నట్లు, ''ఒక ఓటమిని విప్పి చూడటం చాలా కష్టం. కానీ ఓటమితో అనేక సమస్యల పేటిక తెరుచుకుంటుంది. ఇక్కడ, ధోనీ రెండో రన్ కోసం వెళ్లినపుడు... ఫీల్డర్ తన ఎండ్‌లో బంతి విసురుతున్నట్లు తెలిసి కూడా ఎందుకు డైవ్ చేయలేదు? బహుశా తన జీవితంలోనే అత్యంత మంచి ఫామ్‌లో ఉన్న రవీంద్ర జడేజాను ఇన్ని మ్యాచ్‌లకు దూరంగా ఎందుకు ఉంచారు? ఇవన్నీ బుర్రను తొలిచేసే ప్రశ్నలు.''
ఇవి కూడా చదవండి.
- భారత జట్టు భవిష్యత్ ఏంటి... ప్రపంచ కప్ మిగిల్చిన జ్ఞాపకాలేంటి...
- సరిగ్గా 36 ఏళ్ల క్రితం భారత్ ప్రపంచ కప్ గెలిచిన రోజున దిల్లీలో ఏం జరిగింది..
- బ్రిటిష్ పాలకులు మొదటి భారత క్రికెట్ జట్టును ఎలా తయారు చేశారు...
- క్రికెట్ బంతిని ఎలా తయారు చేస్తారో చూశారా
- క్రికెట్ ప్రపంచ కప్ 2019: ఆ ఒక్క బాల్‌తో క్రికెట్ రూల్స్ మారిపోయాయి
- అందం కోసం వాడే క్రీములతో అనర్థాలెన్నో
- ‘కన్నతండ్రి వదిలేశాడు.. ఓ హిజ్రా పెంచి పెద్ద చేసింది’
- "ఇక్కడున్న ప్రతి మగవాడు మీతో సెక్స్ కోరుకుంటాడు"
- అనంతపురం కాలేజీ వైరల్ వీడియో వెనుక అసలు కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








