ప్రపంచ కప్ 2019: కోహ్లీ సేనపై అభిమానం వీరిని 17 దేశాలు దాటించింది

మూడు తరాల క్రికెట్ ఫ్యాన్స్

ఫొటో సోర్స్, Anupam mathur

    • రచయిత, ఆడం విలియమ్స్
    • హోదా, బీబీసీ స్పోర్ట్

ఇంగ్లండ్‌లో 46 రోజులపాటు జరిగే ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ ఇప్పుడు సెమీస్ దశకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.

ఈ క్రికెట్‌ పండుగ మూడు తరాల అభిమానులున్న ఒక కుటుంబాన్ని ప్రపంచ కప్ చివరి మ్యాచ్‌లను ఆస్వాదించేందుకు 48 రోజుల పాటు రోడ్డుపై సుదీర్ఘ ప్రయాణం చేసేలా ముందుకు నడిపించింది.

సింగపూర్‌లో ఉంటున్న ఒక భారత కుటుంబం అక్కడి నుంచి ఇంగ్లండ్ చేరుకునేందుకు రెండు ఖండాల్లోని 17 దేశాలు దాటింది. మొత్తం 22500 కిలోమీటర్లు ప్రయాణించి చివరకు లండన్ చేరుకున్నారు.

మూడు తరాల క్రికెట్ ఫ్యాన్స్

14న లార్డ్స్ మైదానంలో జరిగే ఫైనల్ పోరులో టీమిండియా ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్ విజేతగా ఆవిర్భవిస్తే ఈ సుదీర్ఘ ప్రయాణం తమ జీవితంలో మరచిపోలేని అద్భుతం అవుతుందని ఈ కుటుంబం ఆశగా ఎదురుచూస్తోంది.

మాథుర్ కుటుంబంలో మూడేళ్ల మనవరాలు అవ్య నుంచి 67 ఏళ్ల తాతయ్య అఖిలేష్ వరకూ అందరూ క్రికెట్ అభిమానులే. వీరంతా తమ సెవెన్ సీటర్ వాహనంలో మే 20న సింగపూర్ నుంచి బయల్దేరారు. 48 రోజుల ప్రయాణం తర్వాత గురువారం రాత్రి లండన్ చేరుకున్నారు.

శనివారం హెడింగ్లేలో శ్రీలంకపై భారత్ విజయాన్ని కూడా ఆస్వాదించిన ఈ కుటుంబానికి ఈ ప్రయాణంలో ఇప్పుడు ఎదురైన అతిపెద్ద సవాలు... మంగళవారం జరిగే ఇండియా, న్యూజీలాండ్ మ్యాచ్‌కు టికెట్లు సంపాదించడం.

మూడు తరాల క్రికెట్ ఫ్యాన్స్

ఫొటో సోర్స్, Anupam mathur

ప్రపంచ పటానికి ఎరుపు రంగు వేయాలి

అయితే ఈ కుటుంబం ఏడు వారాలు కార్లోనే ఎందుకు ప్రయాణించింది?

టీమిండియా ఆడుతున్న నగరంలో నేరుగా విమానంలో వాలిపోకుండా మంచుదిబ్బల్లో, వడగళ్ల వర్షంలో, ఎడారి తుపానుల్లో ఈ అభిమానులు ఎందుకు ప్రయాణించారు?

దీనికి ఈ ప్రయాణం ప్లాన్ చేసిన ఇద్దరు పిల్లల తండ్రి అనుపమ్ సమాధానం ఏంటంటే... "ప్రపంచకప్ గురించి తెలీగానే, టీమిండియాకు సపోర్ట్ చేసేందుకు కచ్చితంగా ఇంగ్లండ్ వెళ్లాలని నిర్ణయించుకున్నాం" అని.

"విమానంలో అక్కడికి చేరుకోవడం చాలా సులభం. కానీ మన దేశం కోసం మనం ప్రత్యేకంగా ఏదైనా చేయాలని అనుకున్నాం. కుటుంబం అంతా కలిసి ఇంగ్లండ్ వెళ్లాలనుకున్నాం".

ఈ కుటుంబంలోని అందరూ అంటే అనుపమ్ తల్లిదండ్రులు అఖిలేష్, అంజన, అతడి ఆరేళ్ల కొడుకు అవీవ్, భార్య అదితి, కూతురు అవ్య కూడా ఈ సుదీర్ఘ ప్రయాణంలో భాగం అయ్యారు.

అనుపమ్ ఇలా సుదీర్ఘ ప్రయాణాలు చేయడం ఇదే మొదటిసారి కాదు.

మూడు తరాల క్రికెట్ ఫ్యాన్స్

ఫొటో సోర్స్, Anupam mathur

17 దేశాలు దాటారు.. ఇంకా 4 ఉన్నాయి

వాళ్ల ఫామిలీ బ్లాగ్‌లో చెక్ చేస్తే, ఈ కుటుంబం ఇంతకు ముందు 36 దేశాల్లో 96,500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించినట్లు కనిపించింది.

ప్రపంచ కప్ క్రికెట్‌లో భారత్‌కు మద్దతిచ్చేందుకు చేసిన తాజా ప్రయాణంతో ఇప్పుడు దానికి మరో 22,000 కిలోమీటర్లు కలపవచ్చు.

  • సింగపూర్
  • మలేసియా
  • థాయ్‌లాండ్
  • లావోస్
  • చైనా
  • కిర్గిస్తాన్
  • ఉజ్బెకిస్తాన్
  • కజకిస్తాన్
  • రష్యా
  • ఫిన్లాండ్
  • స్వీడన్
  • డెన్మార్క్
  • జర్మనీ
  • నెదర్లాండ్స్
  • బెల్జియం
  • ఫ్రాన్స్
  • ఇంగ్లాండ్ (ఇంకా స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ వెళ్లాల్సుంది)
మూడు తరాల క్రికెట్ ఫ్యాన్స్

ఫొటో సోర్స్, Anupam mathur

చిన్నతనం నుంచీ సుదూర ప్రాంతాలు తిరగాలని నేను కలలుగనేవాడ్ని, కారులో ప్రపంచాన్నంతా చుట్టేయాలనేది నా లక్ష్యం అని అనుపమ్ చెప్పారు.

"నేను ఒక బ్లూ వరల్డ్ మ్యాప్‌లో నా రోడ్ ట్రిప్స్ అన్నీ మార్క్ చేస్తుంటాను. దాన్లో సరిహద్దులేవీ ఉండవు. ప్రతి ట్రిప్‌కూ ఒక రెడ్ లైన్ ఉంటుంది. అలా చివరకు ఆ ప్రపంచ పటాన్నంతా ఎర్రగా మార్చాలనేదే నా లక్ష్యం" అన్నారు.

మూడు తరాల క్రికెట్ ఫ్యాన్స్

ఫొటో సోర్స్, Anupam mathur

ఫొటో క్యాప్షన్, ఉజ్బెకిస్తాన్‌లోని సమర్కండ్‌లో మాథుర్ కుటుంబం

హెడింగ్లేకు వచ్చే దారిలో వడగళ్ల వర్షం

మాథుర్ కుటుంబం లండన్ చేరిన ఉదయం, నేను వారిని కలిశాను. ఏడు వారాల ప్రయాణం తర్వాత వాళ్లు అప్పుడే ప్రపంచకప్ మ్యాచ్‌ జరిగే వేదిక దగ్గరకు చేరుకుంటున్నారు.

లండన్ చేరుకోగానే వాళ్లు తర్వాత రోజు భారత్, శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్‌కు సమయానికి చేరుకోవాలనే టెన్షన్‌లో కనిపించారు.

ఎక్కడికైనా వాళ్లు తమ సెవెన్ సీటర్ వాహనంలోనే వెళ్తుంటారు. ఆ నల్లటి వాహనంపై తాము ఏయే దేశాలు చుట్టి వచ్చామో చూపిస్తూ ఎర్ర రంగుతో మార్క్ కూడా చేశారు.

"మేం మమ్మల్ని 'ఏఎంఎక్స్ పెయింట్ ఇట్ రెడ్' అని చెప్పుకుంటాం. ఏఎం అంటే మా పేర్ల ముందు వచ్చే అక్షరాలు. ఎక్స్ అంటే మా ట్రిప్‌లో ప్రయాణించే వారి మొత్తం సంఖ్య" అన్నారు అనుపమ్.

బ్యాంకింగ్ రంగంలో పనిచేసే అనుపమ్, అతడి కుటుంబ సభ్యులు చెన్నైకి చెందినవారు. ఆయన 14 ఏళ్లుగా సింగపూర్‌లోనే పనిచేస్తుండడంతో వారు అక్కడే స్థిరపడ్డారు.

మూడు తరాల క్రికెట్ ఫ్యాన్స్

ఫొటో సోర్స్, Anupam mathur

ఫొటో క్యాప్షన్, మాస్కో క్రెమ్లిన్ దగ్గర కుటుంబంతో

విమానంలో ఎందుకు వెళ్లలేదు

కానీ క్రికెట్ కోసం రోడ్డుపై ప్రయాణించాలని ఆయన ఎలా అనుకున్నారు?

"లండన్ చేరేందుకు మేం రోడ్డుపై ఎలా వెళ్లాలో, ఏయే దేశాల్లో వెళ్లాల్సుంటుందో మేం చూడాలనుకున్నాం. మేం వెళ్లే అన్ని దేశాలూ కనెక్ట్ అయ్యున్నాయని నాకు తర్వాత తెలిసింది" అని అనుపమ్ చెప్పారు.

"తర్వాత నేను ప్రయాణాన్ని వివరంగా ప్లాన్ చేసుకున్నాను. చాలా వీసాలకు అప్లై చేశాను. అవన్నీ ఒకేసారి వచ్చాయి".

వారికి ఈ ప్రయాణంలో అదృష్టం కూడా కలిసొచ్చింది. సేఫ్టీ కోసం అక్కడక్కడా మార్గం మార్చుకోవడం, ఆలస్యం కావడం వల్ల హోటల్ రిజర్వేషన్లు రద్దవడం తప్ప వారికి ఎక్కడా పెద్ద సమస్యలు రాలేదు.

"ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్ లాంటి దేశాల్లో కొన్ని ప్రాంతాలు చాలా అందంగా ఉన్నాయి. కానీ ఈ ట్రిప్ కన్నా ముందు వాటిని నేనెప్పుడూ చూళ్లేదు. కనీసం వాటి గురించి వినలేదు" అని అనుపమ్ చెప్పారు.

"అదృష్టవశాత్తూ మాకు కొన్ని దేశాల్లో కొందరు అనుభవజ్ఞులైన గైడ్స్ దొరికారు. వాళ్లు మాకు చాలా ఉపయోగపడ్డారు. చైనాలో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు చూడ్డానికి మేం కాస్త దారి మళ్లాల్సొచ్చింది".

"ఆర్కిటిక్ సర్కిల్లో కూడా మేం అలాగే చేశాం. మేం దాన్ని దాటి వెళ్లాం. అలా స్వీడన్ వెళ్లడం వల్ల ఇంకో దేశాన్ని చూసినట్టుంటుందని అనుకున్నాం. ఐస్ హోటల్ కూడా చూశాం. అది నిజంగా అద్భుతం".

"డ్రైవింగ్ అంటే ఉన్న అభిరుచితోనే ఇంత దూరం ప్రయాణించగలిగాం. మన దేశం కోసం, క్రికెట్ కోసమే మేం ఈ సాహసం చేశాం".

మూడు తరాల క్రికెట్ ఫ్యాన్స్

ఫొటో సోర్స్, Anupam mathur

ఫొటో క్యాప్షన్, ఆర్కిటిక్ సర్కిల్ దాటి స్వీడన్ చేరిన మాథుర్ కుటుంబం

ఇలాంటి సుదీర్ఘ ప్రయాణాలను ఉత్సాహంగా పూర్తి చేయాలంటే కుటుంబం, స్నేహితుల అండ చాలా అవసరం.

అవీవ్‌తో కలిసి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అనుపమ్‌కు మార్గనిర్దేశం చేసిన తల్లిదండ్రులు అఖిలేష్, అంజన.. ప్రయాణం మధ్యలో ఆగినప్పుడల్లా రోడ్డు పక్కన వంట బాధ్యతలు కూడా చూసుకున్నారు.

చైనా మారుమూల ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ దొరికే ఆహారం తినడం వారికి చాలా కష్టంగా అనిపించడంతో వారి చేతి వంట మొత్తం కుటుంబంలో ఉత్సాహం నింపింది.

"మేం వెళ్లాలని మొదట అనుకోగానే నేను నా ఆరోగ్యం గురించి ఆలోచించలేదు. తర్వాత పూర్తి ఉత్సాహంతో ఈ జర్నీ పూర్తి చేయాలనుకున్నాం. కొత్త ప్రాంతాలు చూడాలనుకున్నాం. ఈ ప్రయాణంలో మేం చూసిన ప్రాంతాలు నిజంగా అద్భుతం" అని అఖిలేష్ అన్నారు.

మూడు తరాల క్రికెట్ ఫ్యాన్స్

ఫొటో సోర్స్, Anupam mathur

భారత్ గెలిస్తే పర్యటన పరిపూర్ణం

ఈ మెమరబుల్ జర్నీ గురించి మాట్లాడిన అంజన "ఈ ప్రయాణంలో ఉత్కంఠగా అనిపించిందేంటంటే.. అన్ని చోట్లా ప్రజలు దాదాపు ఒకేలా ఉన్నారు" అన్నారు.

"వాళ్లు చాలా ఆప్యాయత చూపించారు. నేను కూడా నా దేశం పట్ల నా ప్రేమను, శాంతిని వ్యాప్తి చేయాలనుకున్నా. ఉత్సాహంగా టీమిండియాకు మద్దతివ్వాలనుకున్నా. అందుకే ఇప్పుడు ఇక్కడున్నాం. ఇక్కడ మన జట్టు ఆడుతుంటే చూడటం ఉద్వేగంగా ఉంది" అని చెప్పారు.

"ఇలాంటి ట్రిప్ జీవితంలో ఒక్కసారే వస్తుంది. ఇది మరిచిపోలేనిది. మన జీవితాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఈ ట్రిప్‌లో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాం" అని అనుపమ్ అన్నారు.

"మేం దీన్ని పూర్తి చేసినందుకు సంతోషంగా ఉంది. సింగపూర్‌లో మేం బయల్దేరినప్పుడు 17 బ్యాగ్స్ ఉన్నాయి. జెండా ఊపి మా జర్నీ ప్రారంభించిన సింగపూర్‌లోని భారత హై కమిషనర్ మనం ప్రపంచకప్ తీసుకురావడానికి 18వ బ్యాగ్‌కు కూడా స్థలం ఇవ్వండని అని మాతో అన్నారు".

ఇప్పుడు ఈ కుటుంబం ఎలాగైనా సెమీఫైనల్‌కు టికెట్లు సంపాదించి, భారత్ విజయం సాధిస్తే చూడాలనుకుంటోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)