IND Vs NZ: రోహిత్ శర్మ అద్భుతంగా ఆడితే.. మేం గెలిచినట్లే: విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
- రచయిత, ఆదేశ్ కుమార్ గుప్తా
- హోదా, బీబీసీ కోసం
ఇంగ్లండ్‌లో జరుగుతున్న 12వ ప్రపంచ కప్ టోర్నీలో ఈరోజు కీలక మ్యాచ్ జరగబోతోంది.
మంగళవారం జరగబోయే మొదటి సెమీఫైనల్లో గత ప్రపంచ కప్ రన్నరప్ న్యూజీలాండ్, భారత్ తలపడుతున్నాయి.
గురువారం డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, ఆతిథ్య ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ జరుగుతుంది.
1983, 2011 చాంపియన్ భారత్, మంగళవారం మాంచెస్టర్‌లో న్యూజీలాండ్‌ను ఢీకొనేందుకు బరిలోకి దిగుతోంది. ఇలాంటి సమయంలో అసలు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ గురించి ఏమనుకుంటున్నాడు అనే ప్రశ్న చాలా మంది క్రికెట్ అభిమానులను తొలిచేస్తుంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
అద్భుతాలు జరిగేనా..
"కష్ట సమయంలో మ్యాచ్ గెలిపించేలా జట్టు ఏదైనా అద్భుత ప్రదర్శన చేయాలనుకుంటాను" అని విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ముందే మీడియా సమావేశంలో స్పష్టం చేశాడు.
"లీగ్ మ్యాచ్ అయినా, సెమీఫైనల్, ఫైనల్ అయినా ఆటగాళ్లపై దాని ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఇక భారత్‌కు ఆడుతున్నాం అంటే ఆ ఒత్తిడి ఎటూ ఉంటుంది? అదే సమయంలో నేను ఈ మ్యాచ్ గెలిచి వెళ్తాను, అని మనసులో ఒక నమ్మకం ఉండడం కూడా చాలా అవసరం" అని కోహ్లీ చెప్పాడు.
ఇక టీమిండియా బ్యాట్స్‌మెన్ విషయానికి వస్తే ఐదు సెంచరీలు కొట్టి రోహిత్ శర్మ ఇప్పటికే ఈ ప్రపంచ కప్‌లో తన సత్తా చూపాడు. అతడితోపాటు కేఎల్ రాహుల్ కూడా ఫాంలోకి వచ్చాడు.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
శ్రీలంకపై రాహుల్ సెంచరీ కూడా కొట్టాడు. శిఖర్ ధవన్ లాంటి అటాకింగ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గాయపడడంతో టీమిండియా హఠాత్తుగా కష్టాల్లో పడింది.
కేఎల్ రాహుల్ ఆ ఒత్తిడిని దూరం చేయడమే కాదు, రోహిత్ శర్మతో కలిసి మొదటి వికెట్‌కు సుదీర్ఘ భాగస్వామ్యం కూడా అందించాడు.
అతడిని ప్రశంసించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా "కేఎల్ రాహుల్ ఏ స్థాయి ఆటగాడంటే, ఐపీఎల్‌లో ఆడినట్టు అతడు న్యూజీలాండ్‌తో చెలరేగితే, ఇక చెప్పాల్సిందేముంది. ఈ యువ ఆటగాడికి ఇది తొలి ప్రపంచ కప్. ఇంత పెద్ద టోర్నీలో గాడిన పడడానికి కొంత సమయం పడుతుంది" అన్నాడు.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
రోహిత్‌పై అపార నమ్మకం
రోహిత్ శర్మ ఫాం గురించి మాట్లాడిన విరాట్ కోహ్లీ "నా దృష్టిలో రోహిత్ శర్మ ప్రపంచంలోనే నంబర్ వన్ క్రికెటర్. అతడు సెమీఫైనల్లో కూడా అద్భుతంగా ఆడితే భారత్ సులభంగా విజయం సాధిస్తుంది" అన్నాడు.
స్వయంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ టోర్నీలో అద్భుతంగా ఆడుతున్నాడు. వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. కానీ సెంచరీ మాత్రం చేయలేకపోయాడు. ఈ ప్రశ్న గురించి నేరుగా జవాబిచ్చిన కోహ్లీ "నేను ప్రత్యేక రికార్డులు దృష్టిలో పెట్టుకుని ఆడడం లేదు. నాకు అన్నిటికంటే జట్టు విజయం ముఖ్యం" అన్నాడు.
"జట్టులో నా రోల్ ఒక్కో సమయంలో ఒక్కోలా ఉంటుంది" అని కూడా విరాట్ కోహ్లీ చెప్పాడు. అది నిజమే. ఎందుకంటే ఒకవేళ ప్రారంభంలోనే రెండు వికెట్లు పడిపోతే, అప్పుడు విరాట్ కోహ్లీ క్రీజులో నిలిచి బ్యాటింగ్ చేయాల్సుంటుంది. తొలి వికెట్‌కు భారీ భాగస్వామ్యం లభిస్తే, అప్పుడు వేగంగా ఆడాల్సుంటుంది.

ఫొటో సోర్స్, ALLSPORT/GETTY IMAGES
ప్రత్యర్థి టీమ్ న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గురించి మాట్లాడిన కోహ్లీ అతడి గురించి తనకు అండర్-19 ప్రపంచ కప్ ముందే తెలుసన్నాడు.
నిజానికి, విరాట్ కోహ్లీ 2008లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ టోర్నీ ఆడకముందే అండర్-19 టెస్ట్ టీమ్ ఆటగాడిగా న్యూజీలాండ్ వెళ్లాడు.
దాన్ని గుర్తు చేసుకున్న కోహ్లీ "అప్పుడు స్లిప్ దగ్గర ఫీల్డింగ్ చేస్తూ, అతడి బ్యాటింగ్‌ను పరిశీలించేవాడిని. విలియమ్సన్ ఆ సమయంలో భారత్ ఫాస్ట్ బౌలర్లను బ్యాక్‌పుట్ వచ్చి చాలా బాగా ఆడేవాడు" అని చెప్పాడు. విలియమ్సన్‌తో పాటు రాస్ టేలర్ న్యూజీలాండ్‌కు కీలకమైన ఆటగాడని కోహ్లీ భావిస్తున్నాడు.
తొలి సెమీస్ జరిగే మాంచెస్టర్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకునే జట్టుకు లాభిస్తుందని చెబుతున్నారు. దీని గురించి మాట్లాడిన విరాట్ కోహ్లీ "టాస్ గెలవడం అనేది ఎవరి చేతుల్లోనూ ఉండదు" అన్నాడు.

ఫొటో సోర్స్, AFP
ధోనీ అంటే గౌరవం
విరాట్ కోహ్లీ సమాధానాలు ఇస్తున్నప్పుడు ధోనీ గురించి ప్రశ్నలు లేకుండా ఉంటాయా.. సమస్యే లేదు. ధోనీ గురించి మాట్లాడిన కోహ్లీ "ఒక ఆటగాడిగా నేను ధోనీని చాలా గౌరవిస్తాను, అది నా మనసుకు సంబంధించిన విషయం. దానిని ఎవరూ మార్చలేరు" అని స్పష్టం చేశాడు.
"ధోనీలో ఉన్న అత్యంత ప్రత్యేకమైన విషయం ఏంటంటే, అతడు మనకు మనమే ఒక నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఇస్తాడు. ధోనీ భారత్ గౌరవాన్ని మరింత పెంచాడు" అని కోహ్లీ చెప్పాడు.
ధోనీ రిటైర్మెంట్ నిర్ణయం గురించి ఏదైనా చెప్పమని అడిగినపుడు, కోహ్లీ నిరాకరించాడు.
ఎప్పుడూ బ్యాట్స్‌మెన్ కృషితోనే గెలిచే టీమిండియా ఈసారి బౌలర్ల సత్తాతో సైతం మ్యాచ్ గెలిచే సామర్థ్యం ఉన్న జట్టుగా కనిపిస్తోంది. మరి భారత్, న్యూజీలాండ్‌లలో... ఇప్పుడు ఏ టీమ్ సెమీస్‌లో గెలిచి మొదట ఫైనల్లో అడుగు పెడుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
- సెమీఫైనల్స్ ఆడే ముందు భారత్ ఏం చేయాలి...
- బ్రిటిష్ పాలకులు మొదటి భారత క్రికెట్ జట్టును ఎలా తయారు చేశారు...
- క్రికెట్ బంతిని ఎలా తయారు చేస్తారో చూశారా
- సరిగ్గా 36 ఏళ్ల క్రితం భారత్ ప్రపంచ కప్ గెలిచిన రోజున దిల్లీలో ఏం జరిగింది..
- విరాట్ కోహ్లీ: "ఇదేం మైదానం, బౌండరీ అంత దగ్గరా..."
- క్రికెట్ ప్రపంచ కప్ 2019: ఆ ఒక్క బాల్‌తో క్రికెట్ బ్రిటిష్ పాలకులు మొదటి భారత క్రికెట్ జట్టును ఎలా తయారు చేశారు... రూల్స్ మారిపోయాయి
- క్రికెట్ ప్రపంచకప్ 2019: మీరు తెలుసుకోవాల్సిన 12 విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








