రోహిత్ శర్మ: సెంచరీల 'హిట్‌మ్యాన్' ఏ లక్ష్యం దిశగా దూసుకుపోతున్నాడు?..

ఫొటో సోర్స్, AFP/Getty Images
'రోహిత్ శర్మా... నేను పాకిస్తాన్ విలేఖరిని. అద్భుతమైన సెంచరీ చేసినందుకు మీకు శుభాకాంక్షలు. మీరు మ్యాచ్‌ను మీవెంట లాక్కెళ్ళిపోయారు. పాకిస్తాన్ జట్టు చాలా కాలంగా సమస్యల్లో చిక్కుకుంది. పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మీ సలహా ఏమిటి'
వరల్డ్ కప్ పోటీలలో భాగంగా జూన్ 16న జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ మీద భారత్ విజయం సాధించిన తరువాత ఒక పాకిస్తాన్ పాత్రికేయుడు శతకవీరుడు రోహిత్ శర్మను అడిగిన ప్రశ్న అది.
బ్యాటింగ్‌లో మెరుపులు కురిపించే రోహిత్ శర్మ, ఆరోజు పాత్రికేయుల సమావేశంలో కూడా చమక్కులు రువ్వాడు.
"నన్ను పాకిస్తాన్ కోచ్‌గా తీసుకుంటే తప్పకుండా చెబుతాను. ఇప్పుడేం చెప్పగలను" అని రోహిత్ బదులిచ్చాడు.
ఆ మాటతో అక్కడున్నవారంతా గలగలా నవ్వారు.

ఫొటో సోర్స్, Reuters
రోహిత్ తడాఖా
భారత జట్టు పాకిస్తాన్‌తో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసింది. రోహిత్ 140 పరుగులు, విరాట్ కోహ్లీ 77 పరుగులు చేయడంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 336 పరుగులు చేసింది.
ఆ మ్యాచ్ తరువాత ప్రత్యర్థి జట్టు దేశానికి చెందిన విలేఖరి నుంచి ప్రశంసలు రావడం కన్నా మించిన ప్రశంస ఏ ఆటగాడికైనా మరేముంటుంది?

ఫొటో సోర్స్, AFP/Getty Images
రోహిత్ 'మిషన్ వరల్డ్ కప్'
రోహిత్ శర్మ ఈ ప్రపంచ కప్ పోటీల్లో బ్యాట్ ఝళిపిస్తున్న తీరు క్రికెట్ ప్రపంచంలోనే చర్చనీయాంశంగా మారింది. 'హిట్‌మ్యాన్'గా పేరు పొందిన రోహిత్ శర్మ అసలు లక్ష్యం ఏమిటి? అతడు ఏ 'మిషన్' మీద ఉన్నాడు?
ఈ ప్రశ్నకు కూడా ఆయన బ్యాటే సమాధానం చెబుతుంది. పాకిస్తాన్ మీద రోహిత్ శర్మ 140 పరుగులు చేశాడు. ఆ తరువాత శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 103 పరుగులు చేశాడు. ఇది ప్రపంచ కప్ టోర్నీలో ఆయన చేసిన అయిదో సెంచరీ.
అంతకుముందు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 104, ఇంగ్లండ్ మీద 102, దక్షిణాఫ్రికా మీద 122 పరుగులు సాధించాడు రోహిత్.

ఫొటో సోర్స్, AFP/Getty Images
టీమిండియా ఆపద్బాంధవుడు
రోహిత్ శర్మ చేసిన ఈ సెంచరీలు ప్రత్యర్థి జట్లను కుదేలు చేశాయి. రోహిత్ శర్మలో ఎంతో ప్రతిభ ఉంది కానీ, ఆయన తన స్థాయికి తగినట్లు ఆడలేకపోతున్నాడంటూ నిన్న మొన్నటి దాకా వినిపించిన విమర్శలు కూడా ఇప్పుడు గాలికి కొట్టుకుపోయాయి.
ఈ వరల్డ్ కప్ పోటీల్లో సెంచరీ మీద సెంచరీ కొడుతూ భారత జట్టు బ్యాటింగ్ సామర్థ్యం గురించిన సందేహాలను కూడా ఆయన పటాపంచలు చేశాడు.

ఫొటో సోర్స్, AFP/Getty Images
జోడీ కుదిరింది
రోహిత్ శర్మకు ఓపెనింగ్‌లో తోడుగా ఉండే శిఖర్ ధవన్ ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ కప్ రెండో మ్యాచ్‌లో 117 పరుగులు చేసి వేలికి గాయమవడంతో టోర్నమెంటు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
దాంతో, శిఖర్ స్థానంలో కేఎల్ రాహుల్ జట్టులోకి వచ్చారు. రోహిత్ శర్మకు ఓపెనింగ్‌లో సరిజోడీ లేకుండా పోయిందనే అభిప్రాయాలను రాహుల్ తుడిచేయడమే కాకుండా కెప్టెన్ విరాట్ కోహ్లీ మనసులోని భారాన్ని పూర్తిగా దించేశాడు.
ఇప్పటివరకు, ఈ ప్రపంచ కప్ పోటీలలో రోహిత్ తరువాత స్థిరంగా ఆడింది విరాట్ కోహ్లీనే. మిడిల్ ఆర్డర్ బలహీనంగా ఉన్న భారత జట్టును సెమీస్ దాకా తీసుకువెళ్ళడంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు.

ఫొటో సోర్స్, ALLSPORT/Getty Images
బౌలింగ్ రిథమ్
జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీలతో పాటు హార్దిక్ పాండ్యా, యజువేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్‌లతో భారతజట్టులో ఫాస్ట్, స్పిన్ బౌలింగ్‌ల సమ్మిశ్రమం కనిపించింది. ఈ బౌలింగ్ సేన ఎంత పటిష్టంగా కనిపించిందంటే, భారత్ తక్కువ స్కోర్ చేసినప్పుడు కూడా అది గెలుపును సాధ్యం చేసి చూపించింది.
మహేంద్ర సింగ్ ధోనీ ఈ టోర్నమెంటులో నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తుండడంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కానీ, చివరి నలుగురు బ్యాట్స్‌మన్‌లు సరైన భాగస్వామ్యం ఇవ్వడంలో విఫలమైతే అతడు మాత్రం ఏం చేయగలడు?
రోహిత్ శర్మ అయిదు సెంచరీలతో పాటు ఈ ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీ అయిదు అర్థ శతకాలను నమోదు చేశాడు.
విరాట్ ఆస్ట్రేలియా మీద 82, పాకిస్తాన్ మీద 77, అఫ్గానిస్తాన్ మీద 67, వెస్టిండీస్ మీద 72, ఇంగ్లండ్ మీద 66 పరుగులు సాధించాడు. శ్రీలంకతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో 34 పరుగులు చేశాడు.
కేఎల్ రాహుల్ రాణించడం కూడా ఈ పోటీల్లో భారతజట్టుకు బాగా కలిసి వచ్చింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ 111 పరుగులు చేశాడు. అలాగే, బంగ్లాదేశ్ మీద 77, పాకిస్తాన్ మీద 57, వెస్టిండీస్ మీద 48, అఫ్గానిస్తాన్ మీద 30 పరుగులు చేసిన రాహుల్ అచ్చంగా శిఖర్ ధవన్ లేని లోటును పూడ్చారని చెప్పవచ్చు.

ఫొటో సోర్స్, Reuters
రోహిత్ శర్మ బ్యాటింగ్ ధాటి ఫలితంగా ఈ వరల్డ్ కప్‌లో భారత జట్టు ఒక్క ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మినహా ఏ పోటీలోనూ కష్టాల్లో పడినట్లు కనిపించలేదు.
ఓపెనర్లు రోహిత్, రాహుల్‌లతో పాటు ఆ తరువాత కోహ్లీ, ధోనీలు స్థిరంగా కొనసాగడంతో భారత జట్టు సెమీ ఫైనల్స్‌కు చేరుకోగలిగింది.
దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, వెస్టిండీస్, శ్రీలంక జట్లు ఈ టోర్నమెంటులో సరిగ్గా అడలేదనే విమర్శలు ఎదుర్కోవడానికి ప్రధాన కారణం ఆ జట్ల ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ వైఫల్యమే.
వారిలో దక్షిణాఫ్రికాకు చెందిన హషీం ఆమ్లా, వెస్టిండీస్‌కు చెందిన క్రిస్ గేల్ వంటి దిగ్గజాలు కూడా ఉన్నారు.
రోహిత్ శర్మ 2015లో ఆస్ట్రేలియా-న్యూజీలాండ్ దేశాలు సంయుక్తం నిర్వహించిన ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్స్‌లో బంగ్లాదేశ్ మీద 137 పరుగులు చేశాడు. అంటే, ప్రపంచ కప్‌లో రోహిత్ మొత్తం ఆరు సెంచరీలు చేశాడు.

ఫొటో సోర్స్, AFP/Getty Images
ప్రథముడు
ఇంతకీ, రోహిత్ శర్మ కురిపిస్తున్న ఈ శతకాల వర్షం అసలు లక్ష్యం ఏమిటి? అతడి మిషన్ ఏమిటి?
రోహిత్ శర్మ 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన టి-20 ప్రపంచ కప్‌లో, 2013లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని గెల్చుకున్న జట్టులో ఉన్నాడు.
ఇప్పుడు, అత్యున్నతమైన ఐసీసీ వరల్డ్ కప్‌ను భారత్ కైవసం చేసుకోవడం చూడాలని రోహిత్ తపిస్తున్నాడని భావించవచ్చు. అందుకే, అతడు ప్రతి మ్యాచ్‌లో తన సత్తా చాటుతున్నాడు. కట్, పుల్, హుక్, కవర్ డ్రైవ్ వంటి షాట్లన్నీ రోహిత్ వద్ద ఉన్నాయి. అందుకే, ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్, పాకిస్తాన్ ఆటగాడు మహమ్మద్ ఆమిర్ మొదలుకొని అత్యంత అనుభవజ్ఞుడైన శ్రీలంక పేసర్ లసిత్ మాలింగ వరకు ఎవరూ అతడి దూకుడును ఆపలేకపోయారు.
ఈ టోర్నమెంటులో రోహిత్ శర్మ 92.42 సగటుతో మొత్తం 647 పరుగులు చేసి బ్యాట్స్‌మెన్లలో ప్రథముడిగా నిలిచాడు.
ఇప్పుడు భారత జట్టు ప్రపంచ చాంపియన్ కావడానికి కేవలం రెండు అడుగుల దూరంలో ఉంది. ప్రపంచ కప్ అందుకోవాలంటే ఈ రెండు మ్యాచ్‌లలో కూడా రోహిత్ బ్యాటింగ్ ధాటి కొనసాగడం అవసరం. అప్పుడే, ఈ 'హిట్‌మ్యాన్' మిషన్ పరిపూర్ణమవుతుంది.
ఇవి కూడా చదవండి:
- ధోనీ లేని భారత జట్టును ఊహించగలరా...
- వీనస్ విలియమ్స్‌ను ఓడించిన ఈ 15 ఏళ్ల అమ్మాయి ఎవరు...
- కేంద్ర బడ్జెట్ 2019: 13 ముఖ్యాంశాలు
- హైటెక్ వ్యవసాయం... వందేళ్లలో ఎంత మారింది?
- జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే ఏమిటి? కేంద్ర ఆర్ధికమంత్రి ఏపీని ఎందుకు ప్రస్తావించారు...
- రిహార్సల్స్ చేయిస్తున్న ట్రైయినర్‌ను చంపేసిన సర్కస్ పులులు
- ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ముగ్గురూ చీఫ్ సెక్రటరీలు అయ్యారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








