వీనస్ విలియమ్స్‌ను ఓడించిన ఈ 15 ఏళ్ల అమ్మాయి ఎవరు?

ఫొటో సోర్స్, Getty Images
వింబుల్డన్‌లో అమెరికన్ టెన్నిస్ దిగ్గజం వీనస్ విలియమ్స్‌పై విజయం సాధించిన టెన్నిస్ యువ సంచలనం కోరి కోకో గాఫ్‌కు కెరియర్‌లో ఉన్నత స్థానాలకు వెళ్లడానికి కావలసిన అన్ని నైపుణ్యాలు ఉన్నాయని గ్రాండ్ స్లామ్ మాజీ చాంపియన్లు ఇద్దరు అభిప్రాయపడ్డారు.
1968లో ఓపెన్ శకం ప్రారంభమైన తర్వాత వింబుల్డన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించిన అతి చిన్న వయస్కురాలిగా 15 ఏళ్ల 122 రోజుల వయసున్న గాఫ్ రికార్డులకెక్కింది.
ఐదుసార్లు వింబుల్డన్ గెలిచిన వీనస్ విలియమ్స్‌ను కిక్కిరిసిన ప్రేక్షకులు, తల్లిదండ్రుల ముందు 6-4, 6-4తో ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది గాఫ్.
కొన్నేళ్లుగా టెన్నిస్ అభిమానుల నోళ్లలో గాఫ్ పేరు నానుతూనే ఉందని యూఎస్ ఓపెన్ రెండుసార్లు నెగ్గిన ట్రేసీ ఆస్టిన్... వింబుల్డన్ వద్ద బీబీసీతో అన్నారు.
"ఇప్పుడు ఆమెకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఆమె ఓ గొప్ప క్రీడాకారిణి. కానీ, తాను ఆరాధించే వీనస్‌తో పోరాటానికి సిద్ధమై ఆమె కోర్టులోకి నడిచి వస్తున్నప్పుడు ఆమె కొద్దిగా ఇబ్బంది పడే ఉంటారు. కానీ ఆమె ఎదుగుదలకు ఇది ప్రారంభం మాత్రమే" అని ట్రేసీ అన్నారు.
"గాఫ్ శారీరకంగానే కాదు, మానసికంగా కూడా చాలా ధృఢంగా ఉంది" అని మూడుసార్లు వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ గెలిచిన జాన్ మెకన్రో అభిప్రాయపడ్డారు.
"ఆమె ఆడుతున్నతీరును చూశా. 20 ఏళ్లు వచ్చేసరికి ఆమె నంబర్ 1 కాకపోతే అది నిజంగా షాకే" అన్నారు.

ఫొటో సోర్స్, PA Media
ఏడేళ్ల వయసులో టెన్నిస్ ఆడటాన్ని మొదలెట్టిన గాఫ్ కుటుంబ నేపథ్యం కూడా క్రీడలతో పెనవేసుకున్నదే. అమెరికాలోని జార్జియా స్టేట్ యూనివర్సిటీలో ఒకప్పుడు బాస్కెట్ బాల్ ఆడిన తండ్రి కోరే.. గాఫ్‌కు శిక్షణనిచ్చారు. తల్లి కాండీ కూడా ట్రాక్ అండ్ ఫీల్డ్ లోకి మారక ముందు ఓ జిమ్నాస్టిక్స్ క్రీడాకారిణి.
రెండేళ్ల క్రితమే వీరి కుమార్తె గాఫ్ ప్రధాన వేదికలపై ప్రతిభను చాటుకోవడం మొదలైంది. 13 ఏళ్లకే యూఎస్ ఓపెన్ గర్ల్స్ సింగిల్స్ ఫైనల్‌కు చేరి అందరి దృష్టినీ ఆకర్షించింది. గతేడాది, 14 ఏళ్ల 2 నెలల వయసులో ఫ్రెంచ్ ఓపెన్‌తో సమానమైన టైటిల్ గెలిచింది.
ఈ సంవత్సరం ఎలాగైనా వింబుల్డన్‌కు అర్హత సాధించాలనేది గాఫ్ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఆమె 301వ ర్యాంకులో ఉండటంతో అది సాధ్యం కాలేదు. కానీ తనకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించిందని ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తుండగా గాఫ్‌కు తెలిసింది.
అర్హత పోటీ తుది రౌండ్‌లో గాఫ్ 6-1, 6-1తో బెల్జియంకు చెందిన 129వ ర్యాంకు క్రీడాకారిణి గ్రీట్ మినెన్‌పై నెగ్గింది. సైన్స్ పరీక్ష రాయడం కోసం ముందు రోజు రాత్రి 11 వరకూ చదువుతూనే ఉన్న గాఫ్, ఈ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా సాధన చేయలేదు కూడా.
అట్లాంటాలో పుట్టిన గాఫ్‌కు చిన్నప్పటి నుంచీ విలియమ్స్ సిస్టర్స్ అంటే ఎంతో అభిమానం. మొదటి రౌండ్‌లో వీనస్‌తో డ్రా అని తెలియగానే గాఫ్ తన కెరియర్ ఎదుగుదలపై దృష్టి నిలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
మేటి క్రీడాకారిణుల్లో ఒకరైన వీనస్ విలియమ్స్‌తో 15 ఏళ్ల గాఫ్ ఎలా ఆడుతుంది?
ఈ మ్యాచ్‌లో గాఫ్ త్వరగానే కుదురుకుంది. తొలిసెట్‌ను బ్రేక్ చేసి 3-2తో ఆధిక్యంలోకి వెళ్లడం, రెండో సెట్లో 5-4తో ఆధిక్యంలో సెట్‌ను బ్రేక్ చేసి తర్వాత సర్వీస్‌లోనే విజయం సాధించింది. దీంతో గాఫ్ పుట్టక ముందే నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన వీనస్‌పై అపురూప విజయం సాధించింది.
తను విజయం సాధించాననే విషయాన్ని నమ్మలేని గాఫ్ కాసేపు షాక్‌లో ఉండిపోయింది.
"ఈ మ్యాచ్ నా కల. నేను దీనిలో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది" అని మ్యాచ్ అనంతరం గాఫ్ వ్యాఖ్యానించింది.
"గాఫ్ చాలా అద్భుతంగా ఆడింది. నేను ఇంతకు ముందు కూడా కొన్నిసార్లు గాఫ్‌ను కలిశాను" అని వీనస్ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
గాఫ్ గురించి మరికొంత
- 1991 తర్వాత వింబుల్డన్‌లో మ్యాచ్ నెగ్గిన యువ క్రీడాకారిణి గాఫ్. 1991లో అమెరికాకు చెందిన జెన్నిఫర్ కాప్రియాతి 9సార్లు విజేత అయిన మార్టినా నవ్రతిలోవాను ఓడించింది.
- అట్లాంటాలో పుట్టి పెరిగిన గాఫ్ టెన్నిస్ నేర్చుకోవడానికి ఫ్లోరిడాకు వెళ్లింది.
- గాఫ్ ప్రస్తుతం జీన్-క్రిస్టోఫె ఫారెల్ దగ్గర శిక్షణ పొందుతోంది.
- గాఫ్‌కు ఇద్దరు సోదరులున్నారు.
- 2018లో తొలిసారిగా మూడు ప్రముఖ కంపెనీలతో స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
టెన్నిస్‌లో ఏం సాధించాలనుకుంటున్నావు అని గాఫ్‌ను అడిగితే అందరికన్నా ఉన్నత స్థానానికి చేరాలని తనకు తానే ఓ లక్ష్యాన్ని పెట్టుకున్నానని చెబుతుంది.
"నేను దీన్ని సాధించగలనని మా నాన్న ఎనిమిదేళ్ల వయసులోనే చెప్పారు. మీరు నమ్మలేరు. నేనిప్పటికీ పూర్తి విశ్వాసంతో లేను. కానీ కొన్ని విషయాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో చెప్పలేం" అంటుంది గాఫ్.
ప్రపంచ మాజీ నంబర్ 6 చందా రూబిన్ కూడా గాఫ్ కెరియర్‌ను దగ్గరగా పరిశీలించింది. ఓ అద్భుతాన్ని మనం చూస్తున్నాం అని ఆమె బీబీసీతో వ్యాఖ్యానించింది.
"కేవలం 15 ఏళ్ల వయసులో, తొలి గ్రాండ్ స్లామ్ డ్రాలోనే, తొలి వింబుల్డన్ మ్యాచ్‌లో వీనస్ విలియమ్స్‌పై విజయం సాధించింది. బహుశా మరో చాంపియన్ తయారు కావడాన్ని మనం చూస్తున్నాం" అని రూబిన్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి.
- బ్రిటిష్ పాలకులు మొదటి భారత క్రికెట్ జట్టును ఎలా తయారు చేశారు...
- 'నా పాపను బయోవేస్ట్ అన్నారు. ఆ మాటకు నా గుండె పగిలింది‘
- నిండుచూలాలిని పొడిచి చంపేశారు.. చనిపోయే క్షణంలో ప్రసవం
- "సినీ రంగం నాకు మనశ్శాంతి లేకుండా చేసింది"
- అరబ్ దేశాల్లో మతాన్ని వదిలేసేవారు పెరుగుతున్నారు :బీబీసీ సమగ్ర సర్వే
- అనంతపురం కాలేజీ వైరల్ వీడియో వెనుక అసలు కథ
- శ్రీలంక: యుద్ధంలో బద్ధ శత్రువులు ప్రేమలో పడ్డారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








