వరల్డ్ కప్ 2019: సెమీఫైనల్లో భారత్ ప్రత్యర్థి ఎవరు... ఇంగ్లండా, న్యూజీలాండా?

ఫొటో సోర్స్, Getty Images
క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీకి భారత్ రెండు అడుగుల దూరంలో ఉంది. భారత్ దాటాల్సిన మొదటి అడుగు సెమీఫైనల్. మరి సెమీఫైనల్లో విరాట్ కోహ్లీ సేన ప్రత్యర్థి ఎవరు?
పాయింట్ల పట్టికలో భారత్ ఒకటో స్థానానికి చేరుకుంటుందా, లేదా ఇప్పుడున్న రెండో స్థానానికే పరిమితమవుతుందా అనేదాన్ని బట్టి సెమీస్ ప్రత్యర్థి ఎవరనేది తేలుతుంది. ఇది రెండు మ్యాచ్‌లపై ఆధారపడి ఉంది. అవి- భారత్ వర్సెస్ శ్రీలంక, ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా.
ఈ రెండు మ్యాచ్‌లు ఒకే రోజు జులై 6 శనివారం జరుగనున్నాయి.
పట్టికలో మొదటి స్థానం సాధించిన జట్టు నాలుగో స్థానంలోని జట్టుతో, రెండో స్థానంలో నిలిచిన జట్టు మూడో స్థానంలోని జట్టుతో సెమీఫైనల్స్ ఆడతాయి.

ఫొటో సోర్స్, Getty Images
జులై 3 బుధవారం నాటి న్యూజీలాండ్, ఇంగ్లండ్ మ్యాచ్ విజయంతో పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్(12 పాయింట్లు) మూడో స్థానానికి చేరుకుని సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. ఆస్ట్రేలియా(14 పాయింట్లు), భారత్(13 పాయింట్లు) ఇంతకుముందే సెమీస్ చేరాయి.
జూలై 5న జరిగిన పాకిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలిచినప్పటికీ దానికి సెమీస్‌కు దారులు పూర్తిగా మూసుకుపోయాయి. ఫలితంగా 11 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న న్యూజీలాండ్ సెమీస్ బెర్త్ కూడా కన్ఫర్మ్ అయింది.

ఫొటో సోర్స్, Getty Images
టోర్నీలో మొత్తం పది జట్లు ఉండగా, ప్రతి జట్టు గరిష్ఠంగా తొమ్మిది మ్యాచ్‌లు ఆడుతుంది. సెమీస్ చేరిన జట్లలో ఆస్ట్రేలియా, భారత్ ఇంకా చెరో మ్యాచ్ ఆడాల్సి ఉంది.
ఈ రెండు మ్యాచుల్లో ఫలితాలను బట్టి పాయింట్ల పట్టికలో మొదటి స్థానం, రెండో స్థానం మారొచ్చు, మారకపోవచ్చు.
ఆస్ట్రేలియా చివరి లీగ్ మ్యాచ్‌ను మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో దక్షిణాఫ్రికాతో ఆడనుంది.
భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఆరు గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నెగ్గితే 16 పాయింట్లతో పట్టికలో మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంటుంది.

ఫొటో సోర్స్, twitter/cricketworldcup
ఆస్ట్రేలియా ఓడిపోయి, భారత్ నెగ్గితే?
భారత్ చివరి లీగ్ మ్యాచ్‌ను శ్రీలంకతో లీడ్స్‌లో హెడింగ్లే వేదికగా ఆడనుంది.
భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే, పాయింట్లు 15కు పెరుగుతాయి.
అటు ఆస్ట్రేలియా, ఇటు భారత్ నెగ్గితే రెండు జట్లు వరుసగా 16, 15 పాయింట్లతో ఇప్పుడున్నట్లే తొలి రెండు స్థానాల్లో నిలుస్తాయి.
ఆస్ట్రేలియా, భారత్ రెండూ ప్రత్యర్థుల చేతిలో ఓడిపోయినా ఇప్పుడున్న స్థానాల్లోనే ఉంటాయి.
దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోయి, శ్రీలంకతో మ్యాచ్‌లో భారత్ గెలిస్తే, భారత్ రెండో స్థానం నుంచి మొదటి స్థానానికి చేరుకుంటుంది.
దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచి, శ్రీలంకతో మ్యాచ్‌లో భారత్ ఓడిపోతే భారత్ రెండో స్థానంలోనే ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
వర్షం వల్ల రద్దయితే?
వర్షం లాంటి కారణాల వల్ల భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌లు రద్దయినా పట్టికలో రెండు జట్లు ఇప్పుడున్న స్థానాల్లోనే ఉంటాయి.
ఒకవేళ ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దయి, శ్రీలంకతో మ్యాచ్‌లో భారత్ గెలిస్తే రెండు జట్ల పాయింట్లు సమానమవుతాయి. అప్పుడు నెట్ రన్ రేట్ కీలకమవుతుంది.
ప్రస్తుతానికి ఆస్ట్రేలియా నెట్‌రన్ రేట్ భారత్ కన్నా కాస్త మెరుగ్గా ఉంది.
రెండో స్థానమైతే ప్రత్యర్థి ఇంగ్లండ్
మొత్తమ్మీద భారత్ మొదటి స్థానానికి చేరుకుంటే సెమీ ఫైనల్లో న్యూజీలాండ్ ప్రత్యర్థి అవుతుంది.
భారత్ రెండో స్థానంలోనే ఉండిపోతే ఇంగ్లండ్ ప్రత్యర్థి అవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ జట్లతో భారత్‌కు ఎదురైన ఫలితం?
టోర్నీలో లీగ్ దశలో న్యూజీలాండ్‌తో భారత్ ఆడాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది.
ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ వేదికల్లో భారత్‌కు ఎదురైన ఫలితం?
భారత్ మొదటి స్థానానికి చేరుకుంటే- న్యూజీలాండ్ ప్రత్యర్థిగా జులై 9 మంగళవారం మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా సెమీఫైనల్ ఆడుతుంది.
ఈ ప్రపంచ కప్‌లో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ భారత్ ఘన విజయాలు సాధించింది. పాకిస్తాన్‌పై 89 పరుగుల తేడాతో, వెస్టిండీస్‌పై 125 పరుగుల తేడాతో గెలుపొందింది.
భారత్ రెండో స్థానానికి పరిమితమైతే- జులై 11 గురువారం బర్మింగ్‌హాంలోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను ఢీకొంటుంది.
ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి.
టోర్నీలో ఇప్పటివరకు భారత్‌కు ఎదురైన ఏకైక పరాజయం ఇక్కడే నమోదైంది. ఇంగ్లండ్ చేతిలో 31 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది.
ఎడ్జ్‌బాస్టన్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భారత్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి:
- జల సంక్షోభం: చెన్నై నగరం ఎందుకు ఎండిపోయింది?
- ధరల క్యాలికులేటర్: మన్మోహన్ ప్రభుత్వం నుంచి మోదీ ప్రభుత్వం వరకూ ధరలు ఎలా మారాయి?
- క్రికెట్ వరల్డ్‌కప్ కోసం ఐసీసీ ఇంగ్లాండ్‌నే ఎందుకు ఎంచుకుంది...
- అనంతపురం కాలేజీ వైరల్ వీడియో వెనుక అసలు కథ
- కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా
- వివేకానందుడు చికాగో ప్రసంగంలో ఏం చెప్పారు?
- ఉదారవాదానికి (లిబరలిజం) కాలం చెల్లిందా? పుతిన్ మాట నిజమేనా?
- బాల్ ట్యాంపరింగ్: పాకిస్తాన్ ఆటగాళ్లపైనే ఆరోపణలెక్కువ!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










