ధోనీ లేని భారత జట్టును ఊహించగలరా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మార్క్ హిగ్గిసన్
- హోదా, బీబీసీ స్పోర్ట్స్
ఎంఎస్ ధోనీ లేకుండా భారత్ వన్డే మ్యాచ్ ఆడడాన్ని చూడగలమా? వికెట్ల వెనుక నుంచుని బ్యాట్స్‌మన్ కంటే సునిశితంగా బంతిని గమనిస్తూ చటుక్కున పట్టుకోవడం, స్టంపింగుల్లోనో.. లేదంట బౌలర్లు, ఫీల్డర్లకు సలహాలు సూచనలు చేయడంలోనో.. కాదంటే వికెట్ల మధ్య పరుగులు తీస్తూ, బౌండరీల లైనుకు బంతిని బాదుతూనో ఆయన్ను చూస్తుంటాం.
పదిహేనేళ్లుగా భారత జట్టు, అభిమానులతో విడదీయరాని సంబంధం ఏర్పరుచుకున్న దోనీ లేని క్రికెట్ టీంను ఊహించలేం.
2004లో ధోనీ తొలిసారి భారత జట్టులోకి వచ్చాడు. అప్పటికి ఐఫోన్ ఇంకా రాలేదు.
తన ధాటైన బ్యాటింగ్, చురుకైన కీపింగ్, విజయవంతమైన నాయకత్వంతో జట్టుకు ఎన్నో విజయాలు అందించిన ధోనీ ఆటతీరుపై ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
జోరు తగ్గిందా?
ప్రపంచ క్రికెట్‌లో గొప్ప మ్యాచ్ ఫినిషర్లలో ఒకడిగా పేరున్న ధోనీ ఈ ప్రపంచకప్‌లో మెల్లగా ఆడుతున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారత్ ఓటమి సందర్భంగా ఈ తరహా విమర్శలు మొదలయ్యాయి.
అయితే... ఎంత గొప్ప ఆటగాడి కెరీర్ అయినా ఏదో ఒక సమయంలో ముగియక తప్పదని ఇంగ్లండ్ మాజీ సహాయ కోచ్ పాల్ ఫార్బ్రేస్ అభిప్రాయపడ్డారు. కెరీర్‌కు ముగింపు పలకడానికి ప్రపంచ కప్ ఒక మంచి వేదికని చెప్పారు.
అలా అయితే.. ఇప్పుడు ధోనీ వంతు వచ్చిందా..? 348 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడిన ధోనీ ఇక రిటైర్ కావాలా? ధోనీ రిటైరైతే భారత జట్టు పరిస్థితేమిటన్నవి అందరి ముందూ ఉన్న ప్రశ్నలు.
2011లో భారత ఉపఖండంలో జరిగిన టోర్నీలో ప్రపంచకప్‌ను భారత్‌కు అందించిన ఘనత ధోనీది. ప్రపంచ కప్ గెలుచుకున్న జట్టుకు ధోనీయే కెప్టెన్.
ఆ ప్రపంచకప్ ఫైనల్ హీరో సచిన్ టెండూల్కరో.. విరాట్ కోహ్లీయో, వీరేంద్ర సెహ్వాగో కాదు.. ధోనీయే ఆ ప్రపంచ కప్ హీరో. ఫైనల్ మ్యాచ్‌లో 79 బంతుల్లో 91 పరుగులు చేసి జట్టును గెలిపించి దేశానికి టైటిల్ అందించాడు.
అలాంటి ధాటైన ఇన్నింగ్స్ ధోనీ నుంచి ఇప్పుడు కనిపించడం లేదు. 2019లో ఆయన బ్యాటింగ్ యావరేజ్ 61.11గా ఉంది.
2005లో ధోనీ స్ట్రయిక్ రేట్ 103.1 కాగా 2019లో అది 83.97కి పడిపోయింది.

ఫొటో సోర్స్, AFP
టీమిండియాకు సీపీయూ ధోనీ
ధోనీ బ్యాటింగ్‌లో ఒకప్పటి వేగం లేదని భారత కామెంటేటర్ ప్రకాశ్ వాకాంకర్ అన్నారు. ధోనీ బ్యాటింగ్ చేస్తుంటే డాట్ బాల్స్ ఎక్కువగా ఉంటున్నాయని.. మునుపటి వేగం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
''2015 ప్రపంచ కప్‌లో సగటున 100 బంతులకు 106 పరుగులు చేసేవాడు ధోనీ. ఇప్పుడు సగటున 100 బంతుల్లో 93 పరుగులే రాబడుతున్నాడు'' అంటారాయన.
''ధోనీ 2007 నుంచి 2017 వరకు పదేళ్ల పాటు టీమిండియాకు కెప్టెన్‌గా పనిచేశాడు. ఆ సమయంలో వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్ అందించాడు. ధోనీ బ్యాటింగ్‌తో పాటు ఆయన నాయకత్వ పటిమ కూడా భారత జట్టుకు పనికొచ్చిందని అభిమానులే కాదు ప్రస్తుత కెప్టెన్ కోహ్లీ కూడా అంటాడు. ధోనీ రిటైర్ అయితే జట్టుకు విలువైన సలహాలు లోపించడం ఖాయం' అంటారు ప్రకాశ్ వాకాంకర్.
అంతేకాదు.. టీమిండియాకు ధోనీ సీపీయూ(సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్) లాంటివాడు అన్నది ఆయన అభిప్రాయం.
టీమిండియా ఆడుతున్నప్పుడు ధోనీ కెప్టెన్ కాకపోయినా కూడా ఆటంతా ఆయన చుట్టూ తిరుగుతుంది.. బౌలర్ ఏ లైన్లో వేయాలి.. ఏ ఫీల్డర్ ఎక్కడుండాలనే విషయాల్లో కెప్టెన్‌తో పాటు ధోనీ కూడా నిర్ణయిస్తుంటాడు'
''జట్టుని నడిపించడంతో ధోనీ ఇన్వాల్వ్‌మెంట్‌ను కోహ్లీ ఎంతగానో కోరుకుంటాడు. దానివల్ల కోహ్లీకి కూడా సౌలభ్యమే. ధోనీ క్రికెట్ నుంచి వైదొలగితే ఆయన విలువేంటో అందరికీ మరింతగా తెలుస్తుంది'' అంటారు ప్రకాశ్ వాకాంకర్.
ఇవి కూడా చూడండి:
- 1983 వరల్డ్ కప్ సెమీఫైనల్: స్టంప్ తీసి ప్రేక్షకులను బెదిరించిన అంపైర్
- భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో సందడి చేసిన బామ్మ
- ఇంగ్లండ్‌లో పుట్టి పెరిగిన భారత సంతతివారు కూడా ఆ జట్టుకు మద్దతు ఇవ్వట్లేదు
- వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో భారత్ ప్రత్యర్థి ఎవరు...
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- విమానం ఎగిరేముందు చక్రాల చాటున దాక్కున్నాడు, పైనుంచి కిందపడి మరణించాడు
- బీబీసీ పరిశోధన: కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








