'మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అసంతృప్తి' - ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, facebook/Harish Rao Thanneeru
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారంటూ 'ఆంధ్రజ్యోతి' పత్రిక కథనం ప్రచురించింది.
సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో శుక్రవారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, మాజీ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు, వైద్యాధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమిష్టి కృషితో పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని సూచించారు.
గత ఏడాదికి ఈ ఏడాదికి నార్మల్ డెలివరీ సంఖ్య తగ్గిందని.. ప్రధానంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆపరేషన్‌లు ఎక్కువవుతున్నాయని హరీష్ రావు చెప్పుకొచ్చారు.
వైద్యుల్లో నియంత్రణ లోపం ఉందని హరీష్ అన్నారు. నార్మల్ డెలివరీలు జరగక పోవడంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందన్నారు.
ఈ పరిస్థితి తిరిగి తలెత్తకుండా వైద్యాధికారులకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. ఇన్ని వసతులు ఉన్నప్పటికీ ప్రైవేట్, హైదరాబాద్‌లోని ఆస్పత్రులకు వైద్యులు రెఫర్ చేయడం పట్ల హరీశ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, facebook/Kalvakuntla Taraka Rama Rao - KTR
మొన్న రైతు బంధు, నేడు మిషన్ భగీరథ... తెలంగాణ ఆదర్శంగా కేంద్ర పథకాలు: కేటీఆర్ ట్వీట్
మొన్న రైతు బంధు, నేడు మిషన్ భగీరథ.. తెలంగాణ ఆదర్శంగా కేంద్ర పథకాలను ప్రవేశపెడుతున్నారని.. దేశానికే కేసీఆర్ దిక్సూచి అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారంటూ 'నమస్తే తెలంగాణ' పత్రిక ఓ కథనం ప్రచురించింది.
''ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అందులో.. హర్ ఘర్ జల్ యోజన అనే పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. అంటే.. ప్రతి ఇంటికి మంచినీరు ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.
అయితే, అది తెలంగాణలో అమలవుతున్న మిషన్ భగీరథ పథకాన్ని ఆదర్శంగా తీసుకున్నదే. ఇప్పటికే తెలంగాణలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగు నీరు అందిస్తున్నారు. ఇదివరకు తెలంగాణ రైతు బంధును కేంద్ర ప్రభుత్వం పీఎమ్ కిసాన్ పేరుతో ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పథకాలను అమలు చేస్తుండటంతో, సీఎం కేసీఆర్ దేశానికే దిక్సూచిగా మారారని కేటీఆర్ ట్వీట్ చేశారు.
మరో ట్వీట్‌లో బడ్జెట్‌కు ముందు జరిగిన కేంద్ర ఆర్థిక సర్వేలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను మెచ్చుకున్నట్లు కేటీఆర్ తెలిపార'ని ఆ కథనంలో ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, AFP
ఏపీకి మళ్లీ మొండిచెయ్యి
కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి మొండిచెయ్యి చూపిందని ఈనాడు పత్రిక విశ్లేషించింది.
''రొటీన్‌గా మిగతా రాష్ట్రాలకు ఇచ్చినట్టే ఆంధ్రప్రదేశ్‌కూ కేటాయింపులు జరిపిందే తప్ప.... ప్రత్యేకంగా ఇచ్చిందంటూ ఏమీ లేదు. ప్రత్యేక హోదా సహా రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీల్ని, విభజన చట్టంలోని అంశాల్ని అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇటీవల దిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరడంతో పాటు, అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది. కానీ వాటి గురించి బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావనా లేదు. దుగరాజపట్నం పోర్టు, విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులు, కడప ఉక్కు కర్మాగారం వంటి అంశాల్ని ప్రస్తావించలేదు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇంత వరకు రూ.1500 కోట్లు మాత్రం ఇచ్చింది. మరో రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా బడ్జెట్‌లో రాజధానికి ఒక్క రూపాయి కేటాయించలేదు'' అని ఈనాడు కథనం పేర్కొంది.
బడ్జెట్‌లో 'కాళేశ్వరం' జాతీయ హోదా ఊసెత్తని కేంద్రం
తెలంగాణ కోణం నుంచి కేంద్ర బడ్జెట్‌ను పరికిస్తే ఈసారి కూడా పెదవి విరుపులే మిగిలాయని 'ఈనాడు' తన కథనంలో విశ్లేషించింది.
''రాష్ట్రం నుంచి నాలుగు ఎంపీ స్థానాలు భాజపాకు దక్కడంతో మారిన ఈ రాజకీయ పరిస్థితులతో తెలంగాణకు బడ్జెట్ మద్దతు లభిస్తుందనే అభిప్రాయాలు బలంగా వ్యక్తమయినా వాస్తవ చిత్రం నిరుత్సాహాన్ని నింపింది. నీతి ఆయోగ్ సిఫార్సులు కూడా బుట్ట దాఖలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం నివేదనలకు ఆవేదనే బదులైంది. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి.. రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ ప్రభుత్వం వివిధ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా ఒక్క దానికి కూడా మోదీ ప్రభుత్వం అండగా నిలవలేదు. వేరే ప్రాజెక్టుల మాటా లేదు. విభజన చట్టంలో రాష్ట్రానికి కేంద్ర ఇచ్చిన హామీల ముచ్చట అంతకన్నా లేదు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నామమాత్రంగా రూ.4 కోట్లను కేటాయించి కేంద్రం చేతులు దులిపేసుకుంది.
ఇంజినీరింగ్ అద్భుతం, తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయనిగా మారనున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలన్న డిమాండును ప్రస్తావించనేలేదు. విభజన హామీలైన బయారంలో ఉక్కు పరిశ్రమ, వరంగల్‌లో రైల్వే వ్యాగన్ల ఫ్యాక్టరీ ఏర్పాటు ఊసే లేదని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, AFP
గుజరాత్ మాజీ హోంమంత్రి హత్య కేసులో అస్గర్ అలీ జీవిత ఖైదు
గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్య హత్య కేసులో నల్గొండకు చెందిన మహ్మద్ అస్గర్ అలీ హంతకుడని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పిందని 'సాక్షి' పత్రిక కథనం వెల్లడించింది.
''ఈ కేసుకు సంబంధించి 2011లో గుజరాత్ హైకోర్టు కొట్టివేసిన శిక్షల్ని అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. 2003 మార్చి 26న జరిగిన ఈ హత్యకేసులో అస్ఘర్ అలీతోపాటు మరో 11 మందికి అహ్మదాబాద్ పోటా కోర్టు విధించిన జీవితఖైదు శిక్షను సమర్థించింది. దీంతో పీడీ యాక్ట్ కింద నల్లగొండ జైల్లో ఉన్న అస్ఘర్‌అలీ గుజరాత్ జైలుకు వెళ్లడం తప్పనిసరైంది. హరేన్‌పాండ్యపై తుపాకీ ఎక్కుపెట్టి, కాల్చి చంపింది అస్ఘర్ అలీనే అని అప్పట్లో సీబీఐ నిగ్గు తేల్చిన విషయం తెలిసిందే. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులోనూ అస్ఘర్ నిందితుడిగా ఉన్నాడు. నల్లగొండకు చెందిన మహ్మద్ అస్ఘర్ అలీకి జునైద్, అద్నాన్, ఛోటు అనే పేర్లు కూడా ఉన్నాయి. 1992 డిసెంబర్‌లో జరిగిన బాబ్రీమసీదు విధ్వంసం తర్వాత ఉగ్రవాద చర్యలపట్ల ఆకర్షితుడయ్యాడు. కశ్మీర్‌కు చెందిన ముస్లిం ముజాహిదీన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. పాకిస్తాన్‌కు వెళ్లి అక్కడి ఉగ్రవాద శిక్షణాశిబిరాల్లో తుపాకులు కాల్చడం, ఆర్డీఎక్స్ బాంబులను పేల్చడంపై శిక్షణ తీసుకున్నాడు. తిరిగి వచ్చి నల్లగొండకు చెందిన మహ్మద్ అబ్దుల్ బారిసహా మరికొందరితో కలసి ముఠా ఏర్పాటు చేశాడు.
1997 ఫిబ్రవరిలో అస్ఘర్, బారి సహా పదిమంది నిందితుల్ని సిటీ పోలీసులు నాంపల్లి వద్ద పట్టుకున్నారు. హరేన్‌పాండ్యను హత్య చేయడానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు 2003లో కుట్ర పన్నాయి.
ఈ బాధ్యతల్ని గుజరాత్‌కు చెందిన లిక్కర్ డాన్, ఉగ్రవాది రసూల్‌ఖాన్ పాఠి ద్వారా అస్ఘర్‌కు అప్పగించాయి. 2003 మార్చి 26న హరేన్ తన ఇంటి సమీపంలో వాకింగ్ చేస్తుండగా కారులో వెళ్లిన అస్ఘర్ ఐదురౌండ్లు కాల్చడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సీబీఐ దర్యాప్తు చేపట్టి అదే ఏడాది ఏప్రిల్ 17న మేడ్చల్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో అస్ఘర్ తదితరులను పట్టుకుంద''ని ఆ కథనంలో కేసు వివరాలు తెలిపారు.
ఇవి కూడా చూడండి:
- కేంద్ర బడ్జెట్ 2019: ఒక్క రెక్కతో పక్షి ఎగరలేదు.. మహిళల భాగస్వామ్యం లేకుండా సమాజం అభివృద్ధి చెందదు - నిర్మలా సీతారామన్
- నిర్మలా సీతారామన్: "మళ్లీ మూలాలకు వెళ్దాం.. జీరో బడ్జెట్ వ్యవసాయం చేద్దాం"
- "పొరుగింటి కోడి కూత భరించలేకున్నాం" - కోర్టుకెక్కిన జంట
- భారత దేశ మొదటి బడ్జెట్ ఎంతో తెలుసా?
- బడ్జెట్ అర్థం కావాలంటే ఈ 10 విషయాలు తెలియాల్సిందే
- విమానం ఎగిరేముందు చక్రాల చాటున దాక్కున్నాడు, పైనుంచి కిందపడి మరణించాడు
- ఆర్థిక సర్వే: ఆదాయపన్ను చెల్లిస్తున్నారా... అయితే రోడ్లకు, రైళ్లకు మీ పేరు పెట్టొచ్చు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








