జిమ్మీ నీషామ్: మ్యాచ్‌లు ఆడుతూనే... డిగ్రీ పరీక్షలు రాస్తున్న న్యూజీలాండ్ ఆల్‌రౌండర్ - ప్రపంచకప్ 2019

జిమ్మీ నీషామ్

ఫొటో సోర్స్, Getty Images

న్యూజీలాండ్ క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ జిమ్మీ నీషామ్... ఏడాదిన్నర క్రితం ఐప్యాడ్‌లను కొనాలంటూ రైతులను ఒప్పించే ప్రయత్నం చేస్తూ కనిపించాడు.

అతడే ఇప్పుడు... క్రికెట్ ప్రపంచకప్‌ సెమీఫైనల్లో భారత్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు.

క్రికెట్ మాత్రమే కాదు, అంతర్జాతీయ రాజకీయాల నుంచి, పర్యావరణ మార్పుల వరకు... అనేక విషయాలపై ట్విటర్‌ వేదికగా ఇతడు చాలా సరదాగా, సాదాసీదాగా తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంటాడు.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే... ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడుతూనే మధ్యలో డిగ్రీ పరీక్షలకు కూడా హాజరవుతున్నాడు జిమ్మీ నీషామ్.

"క్రికెట్‌ను నా జీవితంలో ఒక భాగంగా ఎంజాయ్ చేస్తున్నాను. అయితే, అదే నా జీవితం కాదు. ఇప్పుడు కూడా నా సమయమంతా ప్రపంచకప్‌ కోసం మాత్రమే వెచ్చించడంలేదు. గదిలో కూర్చుని చదువుకునేందుకు కూడా కొంత సమయం కేటాయిస్తున్నాను" అని చెప్పాడు నీషామ్.

జిమ్మీ నీషామ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జిమ్మీ నీషామ్

ప్రస్తుతం ఇతడు కమ్యూనికేషన్ విభాగంలో డిగ్రీ కోర్సు చదువుతున్నాడు.

"ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం సిద్ధమవుతూనే, డిగ్రీ పరీక్షల కోసం కూడా సన్నద్ధం అవుతున్నాను. రెండు పనులూ గతంలో ఎలా చేశానో, ఇప్పుడూ అలాగే కొనసాగిస్తున్నాను. మేము ప్రపంచకప్‌ గెలిస్తే అది అద్భుతం. ఓడిపోతే, నిరుత్సాహపడతాం. కానీ, జీవితం మాత్రం ముందుకు సాగుతూనే ఉంటుంది. ఇక ప్రపంచకప్‌తో పాటు, పరీక్షల్లోనూ పాసైతే.. నా ఆనందం రెట్టింపవుతుంది" అని అంటున్నాడీ ఆల్‌రౌండర్.

జిమ్మీ నీషామ్... తను ఆడిన మొదటి రెండు టెస్టుల్లో శతకాలు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌లో అత్యధికంగా 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు, ఐదు వికెట్లు పడగొట్టాడు. ప్రపంచకప్‌లో ఆడిన మొత్తం ఎనిమిది మ్యాచ్‌లలో 11 వికెట్లు తీశాడు.

వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌‌లో న్యూజీలాండ్ జట్టు ఓటమికి చేరువవుతుండగా, నీషామ్ నరాలు బిగపట్టి... వెస్టిండీస్ చివరి వికెట్‌ (కార్లోస్ బ్రాత్‌వైట్)ను పడగొట్టాడు. దాంతో, 5 పరుగుల తేడాతో న్యూజీలాండ్ గెలవగలిగింది.

జిమ్మీ నీషామ్

ఫొటో సోర్స్, Getty Images

అయితే, 2018 డిసెంబర్‌లో న్యూజీలాండ్ జట్టుతో పాటు, దేశీయ ఒటాగో జట్టులోనూ ఇతనికి చోటు దక్కలేదు. ఆ పరిణామాల తర్వాత "క్రికెట్‌తో విసుగు చెందాను, మంచి ఉద్యోగం కోసం చూస్తున్నాను" అని నీషామ్ అన్నాడు. దాంతో, అతడు క్రికెట్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పేస్తాడేమో అని అందరూ భావించారు.

"క్రికెట్ ఆడే అవకాశం లేనప్పుడు, ఏదైనా ఉద్యోగం వెతుక్కోవడమే నా ముందున్న ఏకైక మార్గం. ఎందుకంటే, నా ఇంటి కోసం తీసుకున్న అప్పులు తీర్చాలి కదా" అని నీషామ్ చెప్పాడు.

ఆ తర్వాత హాల్టర్‌ అనే ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థలో కమ్యూనికేషన్ అసిస్టెంట్‌గా పార్ట్‌టైమ్ ఉద్యోగం చేశాడు. ఆవుల కదలికలను దూరం నుంచి పర్యవేక్షించేందుకు వినియోగించే ఎలక్ట్రానిక్ పట్టీలను ఆ సంస్థ తయారు చేస్తుంది.

అనంతరం "ఏడాది కిందటితో పోల్చితే ఇప్పుడు ఆవుల గురించి 500 రెట్లు ఎక్కువ విషయాలు తెలుసుకున్నాను" అని నీషామ్ చెప్పాడు. ఈ పనిలో ఆనందం ఉందన్నాడు.

"క్రికెట్‌లో ఒక వారంలో 10,000 బంతులు ఆడి, శనివారం విశ్రాంతి కోసం బయటికెళ్లి, మరుసటి వారం మొదటి బంతికి ఔటైతే, మన ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయని అనిపిస్తుంటుంది" అని వ్యాఖ్యానించాడు.

ఒక దశలో క్రికెట్ పట్ల తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసిన నీషామ్, తర్వాత ఈ ఆటను వదిలేయకూడదన్న నిర్ణయానికి వచ్చాడు.

దేశీయ ఒటాగో జట్టు, తర్వాత వెల్లింగ్టన్, ఆ తర్వాత అంతర్జాతీయ జట్టులో తిరిగి అవకాశం రావడంతో మరింత ఉత్సాహంతో ముందుకెళ్తున్నాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ప్రపంచకప్‌లో ఆడటం నీషామ్ చదువుకు ఆటంకం కలిగించలేదు. ప్రపంచకప్ కోసం ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా జట్టు మేనేజర్‌ను ఒప్పించి అక్కడి నుంచే ఆన్‌లైన్ పరీక్షలు రాశాడు.

నీషామ్ ఎంత సరదాగా ఉంటారో, అతని ట్విటర్ పేజీ చూస్తే అర్థమైపోతుంది. తన గురించి, తన జట్టు గురించి, రోజువారీ జీవితం గురించి రకరకాల జోకులు పేల్చుతుంటాడు.

ఉదాహరణకు చూస్తే... "బాదం పాలు అని ఎందుకు పిలవాలి? అది అర్థవంతంగా లేదు. నిజంగా అది ఏమిటో దానిని అలాగే పిలవాలి. బాదం జ్యూస్ అనాలి" అని ఓ ట్వీట్ చేశాడు.

అమెరికా అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ గెలిచిన సందర్భంగా, నీషామ్ మాట్లాడుతూ... "రోల్ మోడల్స్ (క్రీడాకారులు) అందరూ ప్రపంచంలో ఏం జరుగుతుందన్న విషయాలను కూడా తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం" అని అన్నాడు.

"క్రీడాకారులు తప్పకుండా రోల్ మోడల్స్ అవ్వాలా? అన్న వాదన కూడా ఉంది. అయితే, నిజంగానే మనం రోల్ మోడల్స్‌మే. కాబట్టి, మనం ప్రపంచంలో ఏ జరుగుతోందో తెలుసుకోవాలి. రాజకీయాలు, పర్యావరణ మార్పుల వంటి అంతర్జాతీయ అంశాలపై కనీస అవగాహన ఉండాలి" అని సూచించాడు నీషామ్.

క్రికెట్‌తో పాటు, బాహ్య ప్రపంచం గురించి అవగాహన కలిగి ఉండటం, భవిష్యత్తు లక్ష్యాల కోసం చదువును కొనసాగించడం వంటి విషయాలను చూస్తే.. చాలామంది క్రీడాకారుల కంటే జిమ్మీ నీషామ్ ప్రత్యేకంగా కనిపిస్తాడు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)