క్రికెట్ ప్రపంచ కప్ 2019: భారత జట్టు భవిష్యత్ ఏంటి.. ఈ టోర్నీ మిగిల్చిన జ్ఞాపకాలేంటి..

భారత అభిమానులు

ఫొటో సోర్స్, Getty Images

క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో ఇప్పుడు కళ తగ్గిపోయింది.

ఫేవరేట్‌గా బరిలో దిగి గ్రూప్ దశలో అగ్రస్థానంలో ఉన్న భారత జట్టు.. సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఖంగుతిని నిష్క్రమించింది.

కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పినట్లు.. సంయమనం ప్రదర్శిస్తూ కీలక సమయంలో సత్తా చాటిన న్యూజిలాండ్‌ను కాదని ఫైనల్‌కు వెళ్లే అర్హత భారత జట్టుకు లేదు.

అయితే.. రెండు సార్లు ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు ఈ టోర్నీలోనూ అనేక జ్ఞాపకాలను మిగిల్చింది.

భారత అభిమానులు

ఫొటో సోర్స్, Getty Images

ఔత్సాహిక అభిమానులు

న్యూజిలాండ్ నిర్దేశించిన 240 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టు ఐదు పరుగులకే మూడు వికెట్లు, 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయినపుడు.. ప్రేక్షకుల కేరింతలను మాత్రమే చూస్తే మ్యాచ్‌లో న్యూజిలాండ్ పైచేయి సాధించిందని తెలియదు.

చివరికి భారత జట్టు చేసే ఒక్కొక్క పరుగును కూడా ప్రేక్షకులు అరుపులు, కేకలతో స్వాగతించారు. నిజానికి.. ఈ మ్యాచ్ రిజర్వ్ రోజున జరుగుతుండటంతో స్టేడియంలో మూడో వంతు కుర్చీలు ఖాళీగానే ఉన్నాయి. కానీ భారత జట్టు క్రీజులో ఉన్నంత వరకూ అభిమానుల కేరింతల హోరు ఆగలేదు.

భారత్ ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ అభిమానుల సందడి భారీగా ఉంది. సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు హీరో ఎం ఎస్ ధోనీ నిష్క్రమించిన తర్వాత మాత్రమే స్టేడియంలో నిశబ్దం నెలకొంది.

బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లకు కూడా ఇదే తరహాలో వీరాభిమానులు ఉన్నారు. కానీ.. పోటెత్తిన భారత అభిమానులు వారిని ఓ మూలకు నెట్టేశారు.

మైదానంలో భారత జట్టు ఆడుతుంటే.. జెండాలు, డ్రమ్ములు, ఒంటి మీద రంగులు - వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది.

కోహ్లీ వరల్డ్ కప్ తీసుకొస్తాడా

ఫొటో సోర్స్, Getty Images

కోహ్లీ కరిష్మా

ఈ ప్రపంచ కప్‌లో ముప్పై ఏళ్ల కోహ్లీ బ్యాట్‌తో పెద్దగా రాణించలేదు. ఐదు అర్ధ సెంచరీలు చేసినా కీలకమైన సెంచరీలేవీ లేవు. తొమ్మిది ఇన్నింగ్స్‌లో 55.37 సగటుతో మొత్తం 443 పరుగులు చేశాడు.

వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లలో అతడి పేలవ ప్రదర్శన కొనసాగింది. తాజాగా న్యూజిలాండ్ జట్టుతో మ్యాచ్‌లో కేవలం ఒకే ఒక్క రన్‌ చేసి ఔటయ్యాడు. అంతకుముందు 2015 ప్రపంచ కప్ సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా జట్టుతో మ్యాచ్‌లోనూ, 2011 ప్రపంచ కప్ సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్ జట్టుతో మ్యాచ్‌లోనూ ఇలాగే ఔటయ్యాడు.

కానీ.. అత్యంత కరిష్మా గల క్రికెటర్‌గా, పోటీతత్వం గల ఆటగాడిగా కోహ్లీ ఈ టోర్నమెంటు మీద తనదైన ముద్ర వేశాడు.

బంగ్లదేశ్‌తో మ్యాచ్ అనంతరం సెమీ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నాక.. స్టేడియంలో క్రికెట్ అభిమాని అయిన 87 ఏళ్ల బామ్మ చారులత పటేల్‌ను పలకరించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. ప్రత్యర్థి జట్టు పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడి బ్యాట్‌కు బంతి తగల లేదని రీప్లేలు సూచిస్తున్నా కూడా.. మైదానం వదిలి పెవిలియన్‌కు వెళ్లిపోవటం అతడి క్రీడా స్ఫూర్తిని చాటింది.

అంతేకాదు.. స్టీవ్ వాను గేలి చేస్తున్న తన మద్దతుదారులను అలా చేయవద్దని కూడా వారించాడు.

కోహ్లీమీటర్‌కు మరో కోణం కూడా ఈ టోర్నీలో కనిపించింది. ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో ఇంగ్లండ్ జట్టుతో మ్యాచ్‌లో ఓటమి తర్వాత.. బౌండరీలు 'ఇంత పొట్టిగా' ఉండటం ఏమిటని అతడు ప్రశ్నించాడు.

అలాగే.. టోర్నమెంటు నుంచి భారత జట్టును ఓడించి ఇంటికి పంపించిన న్యూజిలాండ్ జట్టు నైపుణ్యాన్ని ప్రశంసించటం అతడి పరిపక్వతను చాటింది.

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, AFP/Getty Images

బ్యాట్‌తోనూ.. బంతితోనూ అద్భుత ఓపెనర్లు

న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కేవలం ఒకే ఒక్క రన్ చేసి ఔటయ్యాడు. కానీ అప్పటివరకూ అతడు ఈ టోర్నమెంట్‌లో అద్భుతంగా ఆడాడు. ప్రపంచంలో అత్యుత్తమ ఓడీఐ ఓపెనర్‌గా కీర్తి సంపాదించే దిశగా ముందుకు సాగాడు.

దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంకల మీద సెంచరీలు చేసి.. ఒక వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో ఐదు శతకాలు సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు.

ఒకవేళ ఈ టోర్నమెంట్‌లోని మిగతా పోటీల్లో డేవిడ్ వార్నర్ మరో 10 పరుగులు చేయలేకపోతే.. రోహిత్ శర్మ టాప్ రన్-స్కోరర్‌గా నిలుస్తాడు. అతడు తొమ్మిది ఇన్నింగ్స్‌లో 81 పరుగుల సగటు, 98.33 స్ట్రైక్ రేటుతో మొత్తం 648 పరుగులు చేశాడు.

ఇక వికెట్లు కూల్చటంలో మిచెల్ స్టార్క్ చాలా ముందు ఉండి ఉండొచ్చు. కానీ భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. నంబర్ వన్ ఓడీఐ బౌలర్‌గా అవతరించగల తన శక్తిసామర్థ్యాలను ఈ టోర్నీలో ప్రదర్శించాడు.

తొమ్మిది మ్యాచ్‌లలో 20.61 సగటుతో అద్భుతమైన (4.41) పొదుపుతో 18 వికెట్లు తీశాడు.

ధోనీ

ఫొటో సోర్స్, Getty Images

భవిష్యత్ ఏమిటి?

వరుసగా రెండు సార్లు సెమీ ఫైనల్స్ నుంచే వెనుదిరిగిన భారత జట్టు.. ఇక తర్వాతి ప్రపంచ కప్ పోటీలైన 2023 టోర్నమెంటులో గెలవటం మీద దృష్టి కేంద్రీకరిస్తుంది.

ప్రస్తుత జట్టులో కొంతమంది వైదొలగే అవకాశముంది. ముఖ్యంగా వికెట్ కీపర్, మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీకి ఇదే చివరి ప్రపంచ కప్ టోర్నీ కావచ్చు. ప్రస్తుతం 38 ఏళ్ల వయసున్న ధోనీ పోరాట పటిమ ఇటీవలి కాలంలో సన్నగిల్లుతూ వస్తోంది.

''ధోనీ మీద అభిమానులకు గల విశ్వాసం అద్భుతమైనది. కానీ.. ప్రపంచ కప్‌లో మనం అతడి చివరి ప్రదర్శన చూశాం. తర్వాతి ప్రపంచ కప్‌లో అతడు ఆడతాడని నేను భావించటం లేదు'' అని టెస్ట్ మ్యాచ్ స్పెషల్ వ్యాఖ్యాత ప్రకాష్ వాకాంకర్ పేర్కొన్నారు.

రోహిత్ శర్మ వయసు 32 సంవత్సరాలు. అతడు కూడా మరో నాలుగేళ్ల కొనసాగటం అనుమానమే. అయితే భారత జట్టులో కేంద్ర బిందువుగా ఉన్న యువరక్తం.. దీనిని బలమైన ఓడీఐ జట్టుగా చేస్తుంది.

బుమ్రా వయసు 25 ఏళ్లు. జట్టులోకి ఆలస్యంగా పిలుపు అందిన 21 సంవత్సరాల రిషబ్ పంత్ తన టాలెంట్‌ను కొంత పరిచయం చేశాడు. ఆల్-రౌండర్ హార్దిక్ పాండ్యా వయసు కూడా పాతికేళ్లే. ఇక గత ఏడాది బలంగా సత్తా చాటినప్పటికీ.. ఈ టోర్నీలో రాణించలేకపోయిన లెఫ్ట్-ఆర్మ్ రిస్ట్-స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వయసు 24 సంవత్సరాలు.

సొంత గడ్డపై జరిగే ప్రపంచ కప్‌ టోర్నమెంటులో తన జట్టును కోహ్లీ విజయపథంలో నడిపించటానికి శ్రమిస్తాడనటంలో సందేహంలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)