విశ్వామిత్ర సినిమా రివ్యూ: కమెడియన్ సత్యం రాజేష్ హీరోగా మెప్పించాడా?

ఫొటో సోర్స్, fb/ActorNandithaRaj
- రచయిత, కె.సరిత
- హోదా, బీబీసీ కోసం
జనాలను పబ్బుల నుంచి, ఓడ్కా మత్తు నుంచి, పిజ్జా బర్గర్ల నుంచి, కంప్యూటర్ మానిటర్ల నుంచి, కెరియర్ ఆలోచనల నుంచి, ఫేస్‌బుక్ స్టేటస్‌ల నుంచి, వాట్సాప్ చాటింగుల నుంచి, ఊరగాయ జాడీల నుంచి... ఉన్నపళంగా మెడలుపట్టి లాగి, ఈడ్చుకొచ్చి... డిజిటల్ గ్రాఫిక్స్ జిమ్మిక్కులతో మంత్రాలు, చింతకాయలు, ఆత్మలు వాటి అమ్మమ్మలతో సస్పెన్సుగా భయపెట్టి.. థ్రిల్ చేయడమే దర్శకుడు రాజకిరణ్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
దానికి విలువలు, బంధాలు, ప్రేమలు... అనే మాల్ మసాలా జోడించి, కామెడీతో కొడితే 'సినిమా కిచిడీ' తయారవుతుందిలే అన్నట్లుగా ఆయన ఆలోచన ఉందనిపిస్తోంది. ఇది నేనేదో ఊసుపోక చెప్పే దండగ ముచ్చట కాదు. కావాలంటే రాజకిరణ్ దర్శకత్వం వహించిన గీతాంజలి, త్రిపుర సినిమాలను గమనించవచ్చు.
ప్రస్తుతం 'విశ్వామిత్ర' కూడా 'వూ'చేసి 'వుహ్హూ.. 'ఇమిటేట్ చేస్తూ.. మక్కీకి మక్కి అదే ఓల్డ్ ఫార్ములాతో దించేశారు. సస్పెన్స్ థ్రిల్లర్లను ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకున్న విశ్వామిత్ర సినిమా ట్రైలర్... థియేటర్లలోకి అడుగుపెట్టిన తరువాత ఎలాంటి ఫలితాలు వచ్చాయో తెలుసుకోవాలంటే ముందు కథ ఏమిటో తెలుసుకోవాలి.
పదహారణాల తెలుగు సంప్రదాయానికి చీర కట్టి, మంచితనమనే ముసుగేస్తే బయటికొచ్చే ప్రొడక్ట్ 'మిత్ర' (నందితారాజ్). ఆ మంచితనానికి ఎలాంటి చెడు జరగబోయినా హఠాత్తుగా అక్కడ ప్రత్యక్షమై రక్షిస్తుంటాడు 'విశ్వా' (సత్యం రాజేష్). అన్నిసార్లు రక్షించాక ప్రేమలో పడకపోతే ఆవిడ తెలుగు సినిమా హీరోయినే కాదనే సూత్రం ప్రకారం విశ్వా ప్రేమలో పడిపోతుంది మిత్ర.
ఇక హీరోయిన్‌ను కాపాడేందుకు మాత్రమే పోలీసు ఉద్యోగం చేస్తున్నట్లు ఎంతో ప్రాధాన్యత ఉన్నట్లుగా కనిపించి, ఏ మాత్రం ప్రాముఖ్యత లేని క్యారెక్టర్ ప్రసన్నది. హీరోయిన్ మనసు దోచుకోవడమే ఏకైక ఆశయంగా అక్కడక్కడే గిలగిల తన్నుకు చచ్చే మిత్ర ఉద్యోగం చేసే కంపెనీ బాస్ రానా (అశుతోష్).

ఫొటో సోర్స్, ActorNandithaRaj
మిత్రకు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే విశ్వాకు ఎలా తెలుస్తుంది? మిత్ర ప్రేమ సఫలమవుతుందా? మిత్రను లోబరుచుకోవడానికి రానా ఏం చేసాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే...
నందితారాజ్ తన క్యూట్ ఎక్సెప్రెషన్స్, చక్కని నటనతో తనకున్న పరిధిలో బాగానే ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కథ, కథనం విషయాలు మినహాయిస్తే సత్యం రాజేష్ పర్ఫార్మెన్స్ సినిమాకు అసలు బలం.
దర్శకుడు అవకాశం ఇచ్చి ఉంటే ఇంతకన్నా మెరుగైన పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడేమో అనిపించేలా ఉంది ప్రసన్న క్యారెక్టర్. రాజేష్ మొదటి పిల్లరయితే విలక్షణమై విలనిజం ప్రదర్శించిన అశుతోష్ మరో పిల్లర్ అని చెప్పవచ్చు. మధ్యమధ్యలో విద్యుల్లేఖ, చమ్మక్ చంద్ర నవ్వులు పూయించడంలో సఫలమయ్యారనే చెప్పవచ్చు.
సినిమా చూస్తున్నంతసేపు సంప్రదాయాలకు సంబంధించి, సనాతనిస్టులు, ఓల్డ్ రివైవలిస్టులు సర్టిఫై చేసిన అన్నీ లక్షణాలు పాటింపజేసే బాధ్యత రాజకిరణ్ తన భుజాల మీదికి ఎత్తుకున్నాడా అన్న అనుమానం కలుగుతుంది. ఆటిట్యూడ్‌లో అల్ట్రా మోడ్రన్ షేడ్స్ కొట్టొచ్చినట్లు కనపడే నందితను సినిమా మొత్తం చీరల్లోనే చూపించి మొహం మొత్తేలా చేశారు.
ఇక కథ విషయానికొస్తే ఈగ సినిమాలో విలన్ పాత్రను గుర్తుకుతెచ్చేలా ఉండే అశుతోష్ క్యారెక్టర్‌లో ఆ సీరియస్‌నెస్ ఎక్కడా కనపడదు.

ఫొటో సోర్స్, fb/ActorNandithaRaj
ఇక 'ఎందుకంటే ప్రేమంటా' సినిమాలో తమన్నా శరీరం కోమాలో ఉండి ఆత్మ బయటికి రావడమనే కాన్సెప్ట్‌ను యధాతథంగా కాపీ చేశారు. అయితే, అది ఎలా సాధ్యం అన్నది అప్పుడు, ఇప్పుడు సగటు ప్రేక్షకునికి భేతాళ పశ్నే.
ఇక గ్రౌండ్ ఫ్లోర్‌లో నిలబడి కేకేస్తే సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నవాళ్ళకు కూడా వినపడదు కదా! విశ్వామిత్ర సినిమాలో మాత్రం మన హీరోయిన్ మిత్ర హాస్పిటల్లో ఉండి కేకేస్తే మేఘాలలో నడిచి ఇంకాసేపైతే పైకి పోతాడనుకునే మన హీరో గారికి వినపడి తిరిగిరావడం ఒక 'అద్భుతమైన' ఘట్టం. ఇలాంటి అద్భుతాలు జరగడం ఒక్క ప్రేమకే సాధ్యమనే లాజిక్ మరీ 'అత్యాద్భుతం'.
ఓవరాల్‌గా సస్పెన్స్ లో సస్పెన్స్ లేదు. థ్రిల్లర్‌లో థ్రిల్ లేదు.
(గమనిక: ఈ సమీక్షలో వ్యక్తపరచిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి
- ఈఫిల్ టవర్ వద్ద మానవాళి ఐక్యతను చాటుతూ భారీ పెయింటింగ్
- తెలంగాణ: వైద్యుడిపై ఆరోపణలు, దాడి... సంచలనం రేపిన సీసీటీవీ ఫుటేజ్
- ఏపీలో మద్య నిషేధం సాధ్యమేనా?.. అమెరికా నేర్పిన పాఠాలేంటి?
- "ప్రవాస భారతీయులను భారత్‌తో మమేకం చేసేది క్రికెటే"
- ఆంధ్రా సరిహద్దులో ‘ప్రపంచంలోనే అరుదైన’ ఆదివాసీ తెగ 'బోండాలు’
- కల్నల్ గడాఫీ: ఒకప్పటి అమెరికా పవర్ఫుల్ మహిళ వెంటపడిన నియంత
- ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నియామకం ఎందుకంత వైరల్ అయింది
- ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ చెప్పిన మర్యాద కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








