క్రికెట్ ప్రపంచ కప్: ‘ప్రవాస భారతీయులను భారత్‌తో మమేకం చేసేది క్రికెటే’

అభాంగ్ నాయక్ కుటుంబం
ఫొటో క్యాప్షన్, అమెరికా నుంచి బ్రిటన్‌కు వచ్చిన అభాంగ్ నాయక్ కుటుంబం
    • రచయిత, శివకుమార్ ఉళగనాథన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''క్రికెట్ ప్రపంచ కప్ అంటే పెద్ద పండగ లాంటిది. పండగను దగ్గర నుంచి చూడకుండా ఎలా ఉండగలం? ప్రపంచ కప్ ఎప్పుడు జరిగినా చూసేందుకు మేం డబ్బు దాచుకుంటాం. నాలుగేళ్ల కిందట ప్రపంచ కప్ చూసేందుకు ఆస్ట్రేలియా వెళ్లాం. ఇప్పుడు బ్రిటన్ వచ్చాం. క్రికెట్ కోసం ఏమైనా చేస్తాం" అన్నారు అభాంగ్ నాయక్, ఉత్సాహం, మెరుపు నిండిన కళ్లతో.

ఆయనది ముంబయి. ఇంజినీరింగ్ చదివిన అభాంగ్ యుక్త వయసులోనే అమెరికాకు వెళ్లిపోయారు. ఆయన కుటుంబం కాలిఫోర్నియాలో నివసిస్తోంది. ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.

"పాతికేళ్ల క్రితం నేను భారత్ నుంచి అమెరికా వచ్చేశాను. తర్వాత అక్కడే పెళ్లి చేసుకున్నాను. నా పిల్లలూ అక్కడే పుట్టారు. అమెరికాలో సుదీర్ఘ కాలంగా ఉండటంతో మా జీవన విధానం, అలవాట్లు, అభిరుచుల్లో చాలా మార్పులు వచ్చాయి. క్రికెట్‌పై ఇష్టం మాత్రం తగ్గలేదు. మా కుటుంబాన్ని భారత్‌తో మమేకం చేసేది క్రికెటే" అని ఆయన గుర్తుచేసుకున్నారు.

"అమెరికాలో బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్‌పై ఆసక్తి చాలా ఎక్కువ. నా ఇద్దరు కొడుకులూ ఈ ఆటలు ఆడతారు. కానీ క్రికెట్‌పై మాకు ఇష్టం మాత్రం పోలేదు" అని అభాంగ్ చెప్పారు.

క్రికెట్ అభిమాని సుధీర్‌తో అభాంగ్, ఆయన కొడుకులు
ఫొటో క్యాప్షన్, క్రికెట్ అభిమాని సుధీర్‌తో అభాంగ్, ఆయన కొడుకులు

అభాంగ్ కుటుంబంలో క్రికెట్‌పై ఇష్టం ఆయనతోనే మొదలైంది. తర్వాత ఆయన భార్య పద్మజ కూడా క్రికెట్‌ను ఫాలో అవడం మొదలుపెట్టారు. వీరి పిల్లల గురించైతే చెప్పక్కర్లేదు. క్రికెట్‌ అంటే చెవి కోసుకుంటారు.

నాలుగేళ్ల క్రితం ప్రపంచ కప్ చూసేందుకు ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు పిల్లలు రెండు వారాలపాటు స్కూల్ ఎగ్గొట్టారని పద్మజ వారిని చూసి నవ్వుతూ చెప్పారు. "పిల్లలు మరిన్ని రోజులు అక్కడే ఉంటామన్నారుగానీ, క్లాసులు మిస్ అవుతారని నేనే ఒప్పుకోలేదు" అన్నారు.

"మా పిల్లలు సాకర్, టెన్నిస్ లాంటి ఇతర ఆటలు కూడా ఆడతారు. కానీ క్రికెట్ అంటే వారికి ప్రాణం. భారత్ లేదా ఆస్ట్రేలియాల్లో మ్యాచులు జరుగుతుంటే ఫాలో అయ్యేందుకు వీళ్లకు పాఠశాలలో సమయం దొరకదు. అయినా ఎలాగోలా మ్యాచుల గురించి తెలుసుకొంటుంటారు" అని పద్మజ చెప్పారు. క్రికెట్‌పై తన భర్తకు, పిల్లలకున్న ఇష్టం వల్లే తనకూ ఆసక్తి పెరిగిందని ఆమె తెలిపారు.

ఏ జట్టు పక్షమూ వహించకుండా మ్యాచ్‌ను చూడటం ఆమెను చూసే నేర్చుకున్నామని పద్మజ పిల్లలు, అభాంగ్ చెప్పారు.

'కాలిఫోర్నియాలో మేమే క్రికెట్ క్లబ్ ప్రారంభించాం'

"మేం టెక్సాస్‌లో ఉన్నప్పుడు ఒక క్రికెట్ క్లబ్‌లో ఆడేవాళ్లం. కాలిఫోర్నియాకు వచ్చాక ఇక్కడ క్లబ్ ఏదీ లేదని తెలిసింది. అప్పుడు మేమే సొంతంగా ఒక క్లబ్ ప్రారంభించాం. క్రికెట్ ఎలా ఆడాలో నేను, మా అన్నయ్య భారతీయులుకాని స్నేహితులకు నేర్పిస్తుంటాం. ఇప్పుడు వాళ్లకు కూడా క్రికెట్‌పై ఇష్టం పెరుగుతోంది" అని అభాంగ్, పద్మజ దంపతుల పెద్దకొడుకు శుభాంకర్ చెప్పాడు.

తాము నెల రోజులకు పైగా బ్రిటన్‌లో ఉండి ప్రపంచ కప్ మ్యాచులు చూసి వస్తామని స్నేహితులతో చెబితే వారికి చాలా ఆశ్చర్యం కలిగిందని అతడు తెలిపాడు.

క్రికెట్‌కు సంబంధించి శుభాంకర్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం ఒకటుంది. 'మీకు నచ్చిన క్రికెటర్‌కు లేఖ రాయండి' అనే స్కూల్ ప్రాజెక్ట్‌లో భాగంగా అతడు ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ షేన్ వార్న్‌కు లేఖ రాయగా, కొన్ని రోజులకు షేన్ వార్న్ నుంచి ప్రత్యుత్తరం వచ్చింది. అప్పుడు తాను చాలా ఉద్వేగానికి లోనయ్యానని శుభాంకర్ ఉత్సాహంగా చెప్పాడు.

శుభాంకర్ తమ్ముడు గౌతమ్ మాట్లాడుతూ- ఈ ప్రపంచ కప్‌లో భారత జట్టు సెమీఫైనల్స్‌కు లేదా ఫైనల్స్‌కు చేరుకోగలదన్నాడు.

అభాంగ్ నాయక్ కుటుంబం

అభాంగ్ అరుదుగా మాత్రమే భారత్‌కు వస్తుంటారు. ఆయన చివరిసారిగా దేశానికి వచ్చింది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టోర్నీ చూడటానికే.

"ప్రవాస భారతీయ కుటుంబాలను భారత్‌తో బాగా మమేకం చేసేది క్రికెటే. సంగీతం, సినిమాలు కూడా ఈ పాత్ర పోషిస్తాయి. కానీ వాటి విషయంలో భాషాపరమైన ఇబ్బందులు ఉంటాయి. కానీ క్రికెట్ అలా కాదు. అన్ని భాషలు, అన్ని రాష్ట్రాలు, అన్ని సంస్కృతుల ప్రజలకు క్రికెట్ ఒకటే" అంటూ అభాంగ్ బీబీసీతో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

"నేను సచిన్ తెందుల్కర్ ఆట చూస్తూ పెరిగాను. నాకు సచిన్ ఆడిన తొలి మ్యాచ్, చివరి మ్యాచ్, ఆయన అన్ని రికార్డులు ఇప్పటికీ గుర్తున్నాయి. నేను సచిన్‌ను ఎంత ఇష్టపడతానో, నా పిల్లలు విరాట్ కోహ్లీని అంతే ఇష్టపడతారు. దీనిపై పిల్లలు, నేనూ వాదించుకొంటుంటాం కూడా. ఏది ఎలా ఉన్నా, క్రికెట్‌పై మా ఇష్టం పెరిగేదేగాని తగ్గేది కాదు" అని అభాంగ్ వ్యాఖ్యానించారు.

వీళ్లు పశ్చిమం నుంచి.. వాళ్లు తూర్పు నుంచి

ప్రపంచ కప్ టోర్నీ చూసేందుకు అభాంగ్ కుటుంబం పశ్చిమ ప్రాంత దేశం అమెరికా నుంచి వస్తే, మూడు తరాలతో కూడిన ఒక కుటుంబం తూర్పు దేశమైన సింగపూర్ నుంచి వచ్చింది.

తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన వివేక్ కుటుంబం రెండు దశాబ్దాల క్రితమే సింగపూర్‌లో స్థిరపడింది. ఆయన తండ్రి సుదర్శన్ పాతికేళ్ల క్రితం భారత్ నుంచి సింగపూర్‌కు వెళ్లారు. కొన్నేళ్ల తర్వాత ఆయన కుటుంబం కూడా సింగపూర్‌ చేరింది.

వివేక్ తల్లిదండ్రులు, ఆయన అంకుల్, భార్య, ఇద్దరు పిల్లలు సహా ఏడుగురితో కూడిన వివేక్ కుటుంబం ఈ ప్రపంచ కప్ టోర్నీ చూసేందుకు బ్రిటన్‌కు వచ్చింది.

తమకు టోర్నీ మొత్తం చూడాలనుందని, కానీ తమకు సింగపూర్‌లో ఉన్న వ్యాపారం చూసుకునేందుకుగాను 10 లేదా 15 రోజులకే తిరిగి వెళ్లక తప్పదని వివేక్ విచారంగా చెప్పారు.

భారత్ మంచి ఫామ్‌లో ఉందని, తాము టోర్నీ మధ్యలోనే వెనక్కు వెళ్లిపోతే భారత విజయాన్ని ప్రత్యక్షంగా చూడలేమేమో అనే ఆలోచన వెంటాడుతోందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.

"భారత్ నుంచి క్రికెట్‌ను కూడా వెంట తెచ్చుకున్నాం"

వివేక్ తండ్రి సుదర్శన్ 1970లు, 1980ల్లో క్లబ్ క్రికెట్, కార్పొరేట్ క్రికెట్ ఆడారు. క్రికెట్ వర్గాల్లో ఆయన్ను 'గిరి' అని కూడా పిలుస్తారు. ఆయనకు ఇప్పుడు 72 ఏళ్లు.

సౌతాంప్టన్ మైదానం వెలుపల వివేక్ కుటుంబం
ఫొటో క్యాప్షన్, సౌతాంప్టన్ మైదానం వెలుపల వివేక్ కుటుంబం

సుదర్శన్ బీబీసీతో మాట్లాడుతూ- "మేం భారత్ నుంచి మొదట మలేషియాకు తర్వాత సింగపూర్‌కు వచ్చేసినప్పుడు క్రికెట్‌ను కూడా వెంట తెచ్చుకున్నాం. సునీల్ గావస్కర్, రాహుల్ ద్రవిడ్‌లకు ఒకప్పుడు నేను వీరాభిమానిని. స్థిమితమైన వారి ఆట తీరు నాకు బాగా నచ్చేది. ఇప్పుడు నాకు మహేంద్ర సింగ్ ధోనీ బాగా నచ్చుతాడు. అతడెంతో వివేకంతో, స్థిమితంతో వ్యవహరిస్తాడు. ధోనీ లాంటి ఆటగాడు మరొకడు ఉండడు" అని చెప్పారు.

తన జీవితంలో క్రికెట్ భాగమైపోయిందని ఆయన తెలిపారు. తన చిన్న కొడుకు వివేక్‌తోపాటు పెద్ద కొడుకు సింగపూర్‌లో క్రికెట్ ఆడతారని చెప్పారు. "నా మనవళ్లు విద్యుత్, విశ్రుత్‌లకు కూడా క్రికెట్‌పై ఆసక్తి ఉంది. క్రికెట్ మా కుటుంబ చిహ్నం అనుకోండి" అని నవ్వుతూ, ఒకింత గర్వంగా చెప్పారు.

బ్రిటన్‌లో ప్రపంచ కప్ టోర్నీ చూసేందుకు అసరమైన డబ్బును వివేక్ కుటుంబం దాదాపు రెండేళ్లుగా పొదుపు చేసుకుంటూ వచ్చింది.

బ్రిటన్ పర్యటనలో తమకు చాలా డబ్బు ఖర్చవుతోందని, డబ్బు ముఖ్యమే అయినప్పటికీ, ఇష్టమైనది చేయడం అంతకంటే ముఖ్యమని వివేక్ వ్యాఖ్యానించారు.

సింగపూర్ నుంచి వచ్చిన వివేక్ కుటుంబం
ఫొటో క్యాప్షన్, సింగపూర్ నుంచి వచ్చిన వివేక్ కుటుంబం

గత ప్రపంచ కప్ ఫైనల్ చూసేందుకు వివేక్ మెల్‌బోర్న్ వెళ్లారు. అప్పుడు భారత్ ఫైనల్ చేరుకొంటుందనే నమ్మకంతో ఫైనల్ టికెట్లు చాలా ముందే కొన్నానని, కానీ తనకు నిరాశే ఎదురైందని తెలిపారు. ఈ సారి మాత్రం భారత్ కచ్చితంగా ఫైనల్ చేరుతుందని ఆయన ధీమాగా చెప్పారు.

ప్రపంచ కప్ టీవీలో చూస్తే మజా ఏముంది?

టెస్ట్ మ్యాచ్ అయితే తాను టీవీలోనే చూసేవాడినని వివేక్ చెప్పారు. "కానీ ఇది ప్రపంచ కప్. ప్రపంచ కప్ టీవీలో చూస్తే మజా ఏముంది? స్టేడియంలో ఉండి మన జట్టును ఉత్సాహపరచాలి. మేం పొదుపు చేసుకున్న సొమ్ములో అత్యధిక భాగం వెచ్చించాలనుకునేది క్రికెట్‌కే. ఇది మా కుటుంబం ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం" అని ఆయన సంతోషంగా చెప్పారు.

"మా కుటుంబంలో క్రికెట్ మా నాన్నతో మొదలైంది. నేను, మా అన్నయ్య దీనిని కొనసాగించాం. ఇప్పుడు నా కొడుకు విద్యుత్ సింగపూర్‌లో క్లబ్ స్థాయి క్రికెట్ ఆడుతున్నాడు. పెద్దకొడుకు విశ్రుత్‌కు క్రికెట్ గణాంకాలు, రికార్డులపై ఆసక్తి ఎక్కువ. క్రికెట్ మా రక్తంలోనే ఉంది" అని వివేక్ వ్యాఖ్యానించారు.

అమెరికా నుంచి అభాంగ్ కుటుంబం, సింగపూర్ నుంచి వివేక్ కుటుంబం మాదిరే ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి చాలా భారతీయ కుటుంబాలు ప్రపంచ కప్ టోర్నీ చూసేందుకు బ్రిటన్‌కు వచ్చాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)