వరల్డ్ కప్ 2019: ఆస్ట్రేలియాపై భారత్ విజయానికి 5 కారణాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆదేశ్ కుమార్ గుప్తా
- హోదా, బీబీసీ ప్రతినిధి
రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన భారత్ ఐసీసీ ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడింది. బహుశా టీమ్ ఇండియా దానిని ఓడిస్తుందని చాలా మంది అనుకుని ఉండరు.
మ్యాచ్ ప్రారంభానికి ముందు క్రికెట్ పండితులు, క్రికెట్ అభిమానులు చాలా మంది "తమ మనసు ఈ మ్యాచ్ భారత్ గెలుస్తుందని చెబుతుంటే, మెదడు మాత్రం ఆస్ట్రేలియా గెలుస్తుందేమో అంటోందని" అన్నారు.
దీనికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ప్రపంచకప్‌లో భారత్‌తో తలపడడానికి ముందు ఆస్ట్రేలియా వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచింది.
ఐపీఎల్‌కు ముందు ఆస్ట్రేలియా ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ను సొంత గడ్డమీదే ఓడించింది.
అంతే కాదు, ప్రపంచకప్ సమీకరణాలు చూస్తే అవి ఆస్ట్రేలియానే ఫేవరెట్ అంటాయి. రెండు జట్లు ప్రపంచకప్‌లో ఇంతకు ముందు 11 సార్లు తలపడితే వీటిలో 8 సార్లు ఆస్ట్రేలియా, 3 సార్లు భారత్ గెలిచింది.
కానీ ఈ లెక్కలన్నీ బ్రేక్ చేస్తూ భారత్ ఆదివారం ఆస్ట్రేలియాను 36 పరుగుల తేడాతో ఓడించింది.
-ఈ విజయానికి ఐదు కారణాలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Reuters
మొదటి కారణం
ఏదైనా ఒక జట్టు ఓపెనింగ్ జోడీ, మొత్తం టీమ్ దిశ-దశ ఎలా ఉంటుందో నిర్దేశిస్తుంది.
భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మొదటి వికెట్‌కు 127 పరుగులు చేసి ఆస్ట్రేలియా బౌలర్లపై ఒత్తిడి పెంచారు.
రోహిత్ శర్మ ఆచితూచి ఆడి 57 రన్స్ చేస్తే, శిఖర్ ధవన్ 117 పరుగుల సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు.
అటు ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, కెప్టెన్ ఆరోన్ ఫించ్ మొదటి వికెట్‌కు 61 పరుగులే చేశారు.
వార్నర్ 56, ఫించ్ 36 రన్స్ చేశారు.

ఫొటో సోర్స్, Reuters
రెండో కారణం
భారత్ విజయానికి రెండో కారణం టాప్, మిడిలార్డర్ ఆటతీరు. వారు వేగంగా చేసిన పరుగులు.
ఈ మ్యాచ్‌తో తిరిగి ఫాంలోకి వచ్చిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 77 బంతుల్లో 82 పరుగులు చేయడంతోపాటు, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య 27 బంతుల్లో 48 రన్స్ చేసి భారత్ స్కోరును నిర్ధారిత 50 ఓవర్లలో 5 వికెట్లకు 352 పరుగులకు చేర్చారు.
ఇద్దరూ జోరుగా బ్యాటింగ్ చేయడం వల్ల ఆస్ట్రేలియా విజయం కోసం చేయాల్సిన పరుగుల సగటు పెరుగుతూ పోయింది. చివరికి జట్టు ఓటమికి కారణమైంది.
లేదంటే, ఆస్ట్రేలియా కూడా నిర్ధారిత 50 ఓవర్లలో 316 రన్స్ చేసింది. చేజింగ్ చేస్తున్నప్పుడు ఇంత స్కోరు చేయడాన్ని ఏమాత్రం తీసిపారేయలేం.
నిజానికి భారత బ్యాట్స్‌మెన్లు అంత పెద్ద స్కోరు నిలపడం వల్లే, బౌలర్లు పూర్తి ఆత్మవిశ్వాసంతో బంతులు వేయగలిగారు. తమ అమ్ములపొదిలోని ప్రతి అస్త్రాన్నీ ప్రయోగించగలిగారు.

ఫొటో సోర్స్, Reuters
మూడోది
ఈ విజయానికి మూడో కారణం భారత బ్యాట్స్‌మెన్లు క్రీజులో కుదురుకుని ఆడడం.
అద్భుతమైన ప్రారంభం లభించగానే శిఖర్ ధవన్ తన ఇన్నింగ్స్‌ను సెంచరీగా మలుచుకున్నాడు.
అటు ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్‌కు కూడా మంచి ప్రారంభం లభించింది. కానీ అతడు దాన్ని సెంచరీగా మార్చలేకపోయాడు.
దీనితోపాటు భారత్ ఫీల్డింగ్ కూడా అద్భుతంగా ఉంది. జట్టు వచ్చిన ఏ క్యాచ్ అవకాశాన్నీ వదులుకోలేదు. అటు రోహిత్ శర్మ క్యాచ్ మిస్ చేయడం వల్ల ఆస్ట్రేలియా మూల్యం చెల్లించాల్సి వచ్చింది.
ఆస్ట్రేలియా రెండో ఓవర్లో రోహిత్ శర్మకు లైఫ్ లభించింది. అతడిచ్చిన ఈజీ క్యాచ్‌ను మిచెల్ స్టార్క్ మిస్ చేశాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసేవరకూ ఆగలేదు.
దీనితోపాటు మైదానంలో భారత్ ఫీల్డింగ్ కూడా ఆస్ట్రేలియా కంటే మెరుగ్గానే ఉంది. ఇద్దరు ఆటగాళ్లు రనౌట్ కావడమే దానికి సాక్ష్యం.
వేగంగా కదిలిన ఆటగాళ్లు ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్, మిచెల్ స్టార్క్‌ను రనౌట్ చేసి పెవిలియన్ పంపించారు.

ఫొటో సోర్స్, Getty Images
నాలుగో కారణం
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించడం
ఈ మధ్య వన్డే క్రికెట్‌లో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకునే ట్రెండ్ నడుస్తోంది.
అయినా, టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలనుకున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, తన నిర్ణయం సరైనదే అని నిరూపించాడు.
మొదట బ్యాటింగ్ చేసి స్కోరుబోర్డుపై 300 లేదా అంతకు మించి ఉంచితే, ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ ఎంత బలంగా ఉన్నా ఆ అంకె వారిని ఒత్తిడిలో పడేస్తుంది.
2015 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా విజయం కోసం భారత్ ముందు 328 పరుగుల లక్ష్యం ఉంచింది. ఆ ఒత్తిడిలో చిత్తైన టీమిండియా 46.5 ఓవర్లలో 233 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

ఫొటో సోర్స్, Getty Images
ఐదో కారణం
భారత్ ఈ మ్యాచ్ గెలవడానికి ఐదో కారణం బౌలర్ల అద్భుత ప్రదర్శన.
మొత్తం మ్యాచ్ అంతా వాళ్లు ఎప్పుడూ ఒత్తిడికి గురికాలేదు.
భువనేశ్వర్ కుమార్, జస్పీత్ బుమ్రా అవసరమైనప్పుడు వికెట్లు పడగొడుతూ వచ్చారు.
ఆస్ట్రేలియా కీలకమైన భాగస్వామ్యాలూ అందించలేకపోవడానికి ఇది ఒక కారణం.
భువనేశ్వర్ కుమార్, జస్పీత్ బుమ్రా 3-3 వికెట్లు పడగొడితే, స్పిన్నర్ యజువేంద్ర చహల్ కూడా రెండు వికెట్లు తీశాడు.
ఒక టీమ్ బ్యాట్స్‌మెన్ ఫాంలో ఉండి, బౌలర్లకు పది వికెట్లు పడగొట్టే సత్తా ఉన్నప్పుడు దాని గురించి ఎలాంటి ఆందోళన అక్కర్లేదు.
ఇప్పుడు భారత్ తన తర్వాత మ్యాచ్‌లో 13న న్యూజీలాండ్‌ను ఢీకొంటుంది.
న్యూజీలాండ్ ఈ టోర్నీలో ఇప్పటివరకూ ఆడిన 3 మ్యాచ్‌లూ గెలిచింది. దీంతో భారత్ మరో బిగ్ మ్యాచ్ కోసం అస్త్రాలన్నిటికీ పదును పెట్టాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- యోగి ఆదిత్యనాథ్‌పై ‘అభ్యంతరకరమైన’ ట్వీట్.. జర్నలిస్ట్, ఎడిటర్ అరెస్ట్
- నాసా: అంతరిక్ష కేంద్రం సందర్శించేందుకు పర్యాటకులను అనుమతి
- డోనల్డ్ ట్రంప్ సుంకాలతో భారతదేశంలో ఉద్యోగాలు పోవడం ఖాయమేనా
- సనావుల్లా భారత సైనికుడా, విదేశీయుడా
- నా కార్టూన్లే నా ప్రాణాలు కాపాడాయి.. కొత్త జీవితాన్ని ఇచ్చాయి.. ఇదీ నా కథ
- మోదీ చెప్పిన కెమిస్ట్రీ మేధావులకు ఎందుకు అర్థం కాలేదు..
- ‘పీరియడ్ పేదరికం’: బహిష్టు సమయంలో పాత గుడ్డలకు ఈ కప్పులే సమాధానమా?
- ప్రభుత్వ వ్యతిరేకత దరిచేరనివ్వని నేత.. ఐదోసారి సీఎంగా ప్రమాణం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








