కోహ్లీ - స్మిత్: ఇద్దరిలో ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ ఎవరు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శివకుమార్ ఉలగనాథన్
- హోదా, బీబీసీ ప్రతినిధి, లండన్ నుంచి
ఓవల్‌లో శనివారం భానుడు ప్రకాశించటంతో భారత అభిమానుల ముఖాలపై సంతోషం విరిసింది. శుక్రవారం కురిసినట్లుగా శనివారం వర్షం లేదు. రోజంతా నీరెండ కాసింది.
లండన్‌లోని ఓవల్ స్టేడియంలో వర్షం వల్ల శుక్రవారం ప్రాక్టీస్ చేయలేకపోయిన భారత క్రికెటర్లు.. శనివారం ప్రాక్టీస్ చేశారు. వారిని చూడటానికి, ఫొటోలు తీసుకోవటానికి, ఆటోగ్రాఫ్‌లు తీసుకోవటానికి భారత అభిమానులు గణనీయంగానే వచ్చారు.
''ధోనీని చూద్దామని.. అదృష్టం వరిస్తే ఓ ఆటోగ్రాఫ్ తీసుకుందామని'' వచ్చినట్లు నారాయణ్ చెప్పారు. స్టేడియం మెయిన్ గేట్ దగ్గర ఆతృతగా ఎదురు చూస్తున్న భారత అభిమానుల్లో ఆయన ఒకరు.

భారత జట్టు ప్రయాణిస్తున్న బస్ స్టేడియం దగ్గరకు వచ్చినపుడు వీరు అరుపులతో హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు.
రోహిత్, ధోనీ, భువనేశ్వర్ కుమార్, ధావన్ తదితర క్రీడాకారులు బస్ దిగి స్టేడియంలోకి వెళుతున్నపుడు వారి కేరింతలు ఇంకా పెరిగాయి.
''కోహ్లీ ఎందుకు రాలేదు?'' అని ఒకరు అడిగారు. ''ఆయన నిన్న వచ్చారు. ఇప్పుడు రాకపోవచ్చు. సౌతాంప్టన్‌లో కూడా ఇలాగే జరిగింది'' అని మరొకరు బదులిచ్చారు.

ప్రతి ప్రశ్నకూ వాళ్ల దగ్గర సమాధానం ఉంది.
ఇదిలావుంటే.. క్రికెట్ మూడు ఫార్మట్లలోనూ ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ స్టీవెన్ స్మిత్ అని ఆరన్ ఫించ్ కితాబునిచ్చారు. శనివారం ఓవల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ స్మిత్, విధ్వంసక వార్నర్ పునరాగమనం.. భారత్‌తో ఆస్ట్రేలియా తలపడినప్పుడు తమకు పెద్ద ప్లస్ అవుతుందని వ్యాఖ్యానించారు.
ఇది భారత అభిమానులు కొందరికి నచ్చలేదు.
''ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ స్మిత్ అని ఫించ్ ఎలా చెప్పగలరు? స్మిత్ కన్నా కోహ్లీ వన్ డే, టీ20 రికార్డులు చాలా బెటర్‌గా ఉన్నాయి. భారత కెప్టెన్‌ను, టీమ్‌ను రెచ్చగొట్టాలని స్మిత్ భావిస్తున్నారు. ఈ పన్నాగం పనిచేయదు'' అన్నారు అజయ్ అనే అభిమాని. ఆయన నాటింగామ్ నివాసి.

''ఫించ్‌కి ఓవల్‌లో విరాట్ కోహ్లీ బ్యాట్ సమాధానం చెప్తుంది. కోహ్లీ భారీ స్కోర్ చేస్తాడు. ఇంతకుముందు చాలాసార్లు చేశాడు. ఆదివారం మళ్లీ చేస్తాడు'' అని సౌరవ్ భట్టాచార్య వ్యాఖ్యానించారు.
ఫించ్ వ్యాఖ్య మీద స్పందించాలని రోహిత్ శర్మను ప్రెస్ మీట్‌లో అడిగినపుడు.. ఆ వ్యాఖ్యను పట్టించుకోకుండా రాబోయే మ్యాచ్ మీద దృష్టి కేంద్రీకరించాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
''బ్రిటన్‌లోని పరిస్థితులను ఉపయోగించుకోవటం.. ఈ టోర్నమెంటులో చాలా మ్యాచ్‌లను గెలిపించింది. ఇండియా ఆ పని చేయటానికి ప్రయత్నిస్తుంది'' అని పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో జరిగిన ముఖాముఖి పోటీ టూర్లలో భారత, ఆస్ట్రేలియా జట్లు రెండూ గెలిచాయని రోహిత్ ఉటంకించారు. మ్యాచ్ రోజు మీద కూడా జయాపజయాలు ఆధారపడి ఉంటాయన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
గత వరల్డ్ కప్ టోర్నమెంట్లలో భారత్ - ఆస్ట్రేలియా మధ్య పోటీలు
2019 వరల్డ్ కప్ పోటీలో భాగంగా భారత జట్టు ఆదివారం నాడు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ నేపథ్యంలో గత టోర్నమెంట్లలో ఇరు జట్ల మధ్య పోటీ జ్ఞాప్తికి వస్తుంది.
2015 టోర్నీ సెమీ ఫైనల్ భారత జట్టుకు ఓ చేదు జ్ఞాపకం. అయితే వరుసగా మూడు సార్లు ప్రపంచ కప్‌ను గెలుచుకున్న తర్వాత.. 2011 క్వార్టర్ ఫైనల్‌లోనే భారత జట్టు చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించడం ఆస్ట్రేలియాకు మింగుడుపడని విషయం.
2003 ఫైనల్ కూడా దాదాపు 2015 సెమీ ఫైనల్ లాంటిదే. ఈ రెండు మ్యాచుల్లోనూ ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి భారీ లక్ష్యం విధించింది. భారత జట్టు భారీ తేడాలతో ఓడిపోయింది.
1999 ప్రపంచ కప్ టోర్నీలో ఇరు దేశాల మధ్య జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి 282 పరుగులు సాధించింది.

ఫొటో సోర్స్, Getty Images
సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, అజహరుద్దీన్‌లతో కూడిన భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో గ్లెన్ మెక్‌గ్రాత్ ఫాస్ట్ బౌలింగ్ కలవరం రేపింది.
ఈ మ్యాచ్‌లలో ఎక్కువగా ఎవరో ఒక ఆస్ట్రేలియా ఉత్తమ బ్యాట్స్‌మన్ లేదా బౌలర్ అద్భుత ప్రదర్శనతో తమ జట్టును గెలిపించారు.
2003 ఫైనల్‌లో రికీ పాంటింగ్, డామియెన్ మార్టిన్, 1999లో మార్క్ వా, మెక్‌గ్రాత్‌లు ఇలాంటి పాత్రే పోషించారు.
ఆస్ట్రేలియా టీమ్‌లో పెద్ద ఆటగాళ్లు అసలు రోజున ఫామ్‌లోకి వస్తారు. 2019లో తమ టీమ్‌ను గెలిపించే ఆస్ట్రేలియా ప్లేయర్ ఎవరు కావచ్చు?

డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్‌లు టీమ్‌లోకి తిరిగి రావటమే కాకుండా.. గత మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లు పడగొట్టటం భారత్‌ను కొంత ఆందోళనకు గురిచేసే అంశం కావచ్చు.
అదే సమయంలో భారత ఫాస్ట్ బౌలర్లు కూడా తమ పేస్‌తో ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తారని భావిస్తున్నారు.
ఆదివారం వాతావరణం మెరుగుగా ఉంటుందన్న అంచనాలతో.. ఓవల్‌లో మరోసారి భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగబోతోంది. ఇరు జట్ల క్రీడాకారులూ.. బ్యాటింగ్, బౌలింగ్ సహా అన్ని రకాలుగా సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నారు.
అయితే అభిమానుల మద్దతు విషయానికి వస్తే.. ఇప్పుడు కూడా ఆస్ట్రేలియన్ల కన్నా భారత అభిమానులదే పైచేయి అవుతుందని అంచనా.
మ్యాచ్ ప్రాక్టీస్ కోసం వస్తున్న తాము ఇష్టపడే ప్లేయర్లకు అభినందనలు చెప్తూ, త్రివర్ణ పతాకం గాలిలో ఊపుతూ.. 'ఇండియా.. ఇండియా.. ఇండియా...' అని నినాదాలు చేస్తున్న అభిమానులు.. ఆదివారం ఎలా ఉండబోతోందనే దానికి సంకేతం.
ఇవి కూడా చదవండి
- రంగుల జెర్సీలు ఎలా వచ్చాయి... వాటి నంబర్ల వెనుక కథేంటి... శ్రీలంక జెర్సీ ఎందుకంత ప్రత్యేకం
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రీడా సంస్థా?
- సచిన్ టెండూల్కర్ ‘లిటిల్ మాస్టర్’ ఎలా అయ్యారు?
- లైఫ్‌స్టైలే వినోద్ కాంబ్లీ ఫెయిల్యూర్‌కు కారణమా?
- సచిన్‌ను అందరికన్నా ఎక్కువ భయపెట్టిన క్రికెటర్ ఆయనే
- క్రికెట్ వరల్డ్ కప్ 2019: పోటీ ఈ మూడు జట్ల మధ్యే ఉంటుందా?
- సెక్స్ అడిక్షన్: కోరికలు ఎక్కువగా ఉంటే వ్యాధిగా భావించాలా
- ఫ్యాక్ట్ చెక్: బీరు దొరకట్లేదని కేసీఆర్‌కు బ్యాలెట్ బాక్సు ద్వారా లేఖ నిజమేనా?
- ప్రతాప్ చంద్ర సారంగి: సాధారణంగా కనిపించే ఈయన గతం వివాదాస్పదమే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








