క్రికెట్ వరల్డ్ కప్ 2019: ‘ఈ వరల్డ్ కప్ మాదే..ఎవరికీ ఇచ్చేది లేదు’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శివకుమార్ ఉలగనాథన్
- హోదా, బీబీసీ ప్రతినిధి, లండన్ నుంచి
దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగే ప్రారంభ మ్యాచ్‌తో భారత్ తన 2019 వరల్డ్ కప్ పోరును ప్రారంభిస్తుంది.
ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్‌ల జరిగిన తీరు చూస్తుంటే, వరల్డ్ కప్ ఉత్సాహం మొదటి వారంలోనే పీక్స్‌కు చేరినట్టు అనిపిస్తోంది. దక్షిణ భారతదేశంలోని ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన నేను వృత్తిలో భాగంగా వరల్డ్ కప్ క్రికెట్ కవర్ చేయడానికి వచ్చిన 500 మందిలో ఒకడినయ్యాను.
లండన్‌లో నాకు ఎదురైన మొదటి క్యాబ్ డ్రైవరే 'క్రికెట్ ఎక్స్‌పర్ట్' అనిపించాడు. తను నాతో "బ్రిటన్‌లో జరిగిన గత ఐసీసీ వరల్డ్ కప్‌తో పోలిస్తే ఇప్పుడు మా జట్టు ఆట మెరుగుపడింది, ఈసారీ కప్ ఎవరికీ ఇచ్చేది లేదు, వరల్డ్ కప్ మాదే" అని అన్నాడు.
ఆదివారం మధ్యాహ్నం లండన్‌లో రోడ్లు బిజీ బిజీగా కనిపించాయి. సాధారణంగా ఆదివారం అంత ట్రాఫిక్ ఉండదు. సోమవారం ఉదయం ఆఫీసులకు వెళ్లేవారికి మాత్రం అది చాలా మామూలు విషయం. స్టేడియం దగ్గర మినహా ఇంకెక్కడా మాకు వరల్డ్ కప్ బ్యానర్లు, ప్రకటనలు కనిపించలేదు.
కానీ క్రికెట్ గురించి, తమ ఫేవరెట్ స్టార్ గురించి మాట్లాడే చాలా మంది ఆసియా ప్రజలు మనకు కనిపిస్తారు. అందుకే యూరప్ వాళ్లు క్రికెట్ గురించి మరింత తెలుసుకోడానికి బ్రిటన్ పర్యటనకు వస్తుంటారు.

ఇంగ్లండ్ జట్టుపై పూర్తి విశ్వాసం ఉంచిన ఒక బ్రిటన్ యువకుడు "అవును, ఈ ఐసీసీ వరల్డ్ కప్ మాదైతే బాగుంటుంది. మా టీమ్ నిజంగా బాగా ఆడుతోంది. మా బ్యాటింగ్ ఏ జట్టుకైనా సవాలు విసిరేలా ఉంది" అన్నాడు.
ప్రస్తుత టోర్నీ తమ జట్టుకు కలిసొస్తుందని బ్రిటన్‌లో చాలా మంది భావిస్తున్నారు. 1992 తర్వాత ఇంగ్లండ్ వరల్డ్ కప్ సెమీ-ఫైనల్ కూడా చేరలేకపోయింది.
ఈ టోర్నమెంటును మీరు ఎలా చూస్తున్నారు, అని నేను వాళ్లను అడిగినప్పుడు "మేం ఏషియన్స్ ప్రదర్శనను సెలబ్రేట్ చేసుకోలేం. ఫుట్‌బాల్ విషయం వేరే. కానీ క్రికెట్‌ను మేం ఆస్వాదిస్తాం. మా టీమ్ గెలవాలని కోరుకుంటాం" అన్నారు.

భారత్‌ను మ్యాచ్ ఆడనివ్వండి
కాఫీ పబ్‌లో హఠాత్తుగా అరిచిన దీపాలీ మా అందర్నీ కంగారు పెట్టేశారు. "భారత్ ఇంకా మొదటి మ్యాచ్ ఆడలేదు. భారత జట్టు మ్యాచ్ తర్వాత టోర్నీలో ఎంత మార్పు వస్తుందో మీరే చూస్తారు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ మాంచెస్టర్‌లో ఉంది. అందులో ఎవరు గెలుస్తారనేది పక్కనపెడితే, టోర్నమెంటులో ఇది ఎలాంటి మ్యాచ్ అనేది మీరు చూస్తారు" అన్నారు.
తర్వాత ఆమె స్నేహితుడు నాతో "లండన్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారతీయులు చాలామంది ఉన్నారు. మీరు సౌతాంప్టన్ వచ్చి చూస్తే, అది నిజానికి ఒక చిన్న పంజాబ్‌లా ఉంటుంది. టుటింగ్‌లో చాలా మంది తమిళులు ఉన్నారు. వెంబ్లీ, మిగతా చాలా ప్రాంతాల్లో సగం గుజరాతీలే ఉంటారు. కానీ క్రికెట్ అందరినీ ఏకం చేస్తుంది. క్రికెట్ మ్యాచ్ రోజు అది మీరు కళ్లారా చూస్తారు" అన్నాడు.
"నేను భారతీయులు ఉండే ప్రాంతంలో చాలా కీచైన్లు, టీషర్టులు, భారత ఆటగాళ్ల పేర్లుండే కాఫీ మగ్‌లు అమ్ముడు కావడం చూస్తుంటాను" అన్నాడు.

కానీ భారత అభిమానులు మాత్రమే అక్కడ ఉత్సాహంగా లేరు. పాకిస్తాన్, ఆఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ ఫ్యాన్స్ కూడా తమ దేశం గెలవాలని బలంగా కోరుకుంటున్నారు.
"మీకు రషీద్ ఖాన్ అంటే ఇష్టమేనా" అని ఆక్స్‌ఫర్డ్ వీధిలో షాపు నిర్వహిస్తున్న ఒక అఫ్గానిస్తాన్ వ్యక్తి నన్ను అడిగాడు. దానికి నేను "ఆ ఇష్టమే, తను చాలా మంచి బౌలర్. అఫ్గానిస్తాన్ కోసం, ఐపీఎల్ కోసం చాలా బాగా ఆడాడు" అన్నాను. దాంతో ఆయన ముఖం వెలిగిపోయింది.
తర్వాత ఆయన నాతో "చూడండి, యూరోపియన్స్ క్రికెట్ ఆడరు. ఇక్కడ ఎక్కడ చూసినా ఫుట్‌బాల్, టెన్నిస్ ఆడుతుంటారు. క్రికెట్ గేమ్, రషీద్ ఖాన్ లాంటి ఆటగాళ్లు అఫ్గానిస్తాన్‌కు మంచిపేరు తీసుకొచ్చారు. గతంలో మా దేశం ఎన్నో ప్రతికూల కారణాలతో హెడ్‌లైన్స్‌లో నిలిచేది. నేను కూడా చిన్నప్పుడే లండన్ వచ్చేశాను" అని చెప్పాడు.

ఆయన చివరగా "భారత్, పాకిస్తాన్ ఖబడ్దార్, మేం వస్తున్నాం. మేం ఈ టోర్నమెంటులో మీకు చుక్కలు చూపించబోతున్నాం" అన్నాడు.
అయితే బ్రిటన్‌లో క్రికెట్ కార్నివాల్ చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. ఆసియా ప్రజల సంబరాలు బ్రిటన్ ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి.
కానీ వారు మాత్రం ఈ టోర్నీలో ఇంగ్లండ్ జట్టు మిగతా అందరికీ షాకిస్తుందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఎంపీలకు ప్రభుత్వ కార్లు ఉండవు.. అద్దె చెల్లిస్తేనే గవర్నమెంట్ క్వార్టర్
- ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఓటుకు రూ. 2,000 పంచారు.. దేశంలో ఒక్కో లోక్‌సభ స్థానంలో రూ. 100 కోట్ల వ్యయం’’
- ఏఎన్ 32: చైనా సరిహద్దుకు సమీపంలో మాయమైన భారత్ వాయుసేన విమానం
- ప్రతాప్ చంద్ర సారంగి: సాధారణంగా కనిపించే ఈయన గతం వివాదాస్పదమే
- ఈ స్కూల్లో ప్లాస్టిక్ వ్యర్థాలే ఫీజు
- రెండు బిందెల నీళ్ల కోసం ప్రాణాలు పణంగా పెడుతున్నారు
- తెలుగు నేలపై మరో యంగ్ సీఎం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








