ఎంపీలకు ప్రభుత్వ కార్లు ఉండవు.. అద్దె చెల్లిస్తేనే గవర్నమెంట్ క్వార్టర్

ఫొటో సోర్స్, Ingemar Edfalk/Sveriges Riksdag
- రచయిత, క్లాడియా వాలిన్
- హోదా, బీబీసీ న్యూస్ బ్రెజిల్, స్టాక్‌హోమ్
మన దేశాల్లో రాజకీయాలనేవి ఆర్థికంగానూ మంచి లాభదాయకమైన కెరీర్‌గా పరిగణిస్తుంటారు. మిగతా విషయాలు పక్కనపెడితే.. ప్రజాధనంతో లభించే రాయితీలు, వేతనాలు, వసతి సౌకర్యాల ప్రయోజనాలే చాలా అధికంగా ఉంటాయి.
కానీ స్వీడన్‌లో అలా కాదు. ప్రజాధనాన్ని ప్రజాప్రతినిధులు ఎలా ఉపయోగించాలనే దానిపై కచ్చితమైన పరిమితులు ఉంటాయి. అక్కడి పార్లమెంటు సభ్యులకు అందించే రాయితీలు, సదుపాయాలు ఇక్కడిలా ఉదారంగా ఉండవు.
‘‘మేమూ సాధారణ పౌరులమే. ప్రజలకు, వారు జీవిస్తున్న వాస్తవ పరిస్థితులకు ప్రాతినిధ్యం వహించటం మా విధి. అందుకని.. ఎంపీలకు విశిష్ట సదుపాయాలు, ప్రత్యేక ప్రయోజనాలు కట్టబెట్టటానికి అర్థంలేదు’’ అని బీబీసీతో చెప్పారు సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఎంపీ పెర్-ఆర్న్ హకాన్సన్.
‘‘మాకు ఏదైనా విశిష్టత ఉందంటే.. అది ఈ పని చేయటమే. దేశ గమనాన్ని ప్రభావితం చేయటానికి అవకాశం లభించటమే’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
స్వీడన్‌లో ఎంపీలు ప్రభుత్వ రవాణా సంస్థల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. కానీ.. భారత్ సహా చాలా దేశాల్లో ఉన్నట్లుగా ఈ ఎంపీలకు సొంతంగా వాడుకోవటానికి కార్లు, డ్రైవర్లను మాత్రం ప్రభుత్వం ఇవ్వదు.
ఉదాహరణకు.. పార్లమెంటు వద్ద మూడు వాల్వో ఎస్80 వాహనాలు ఉన్నాయి. అవి కూడా.. పార్లమెంటు అధ్యక్షుడు, ముగ్గురు ఉపాధ్యక్షులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనటం కోసం ఉపయోగించటానికి మాత్రమే వీలుంటుంది.
‘‘మేం ట్యాక్సీ సర్వీస్ నడపం. జనాన్ని ఆఫీసుకి, ఇంటికి తీసుకెళ్లటానికి వాహనాలు లేవు’’ అని పార్లమెంటు అధికారి రీన్ పోడ్క్ పేర్కొన్నారు.
నిజానికి స్వీడన్‌లో సొంతంగా వినియోగానికి శాశ్వతంగా కారు కేటాయింపు అర్హత ఉన్న రాజకీయ నేత దేశ ప్రధానమంత్రి ఒక్కరే.

ఫొటో సోర్స్, Camilla Svensk/Sveriges Riksdag
స్వీడన్ ఎంపీలకు నెల వేతనం సుమారు 6,900 డాలర్లు (సుమారు రూ. 4.75 లక్షలు) ఉంటుంది. అమెరికా కాంగ్రెస్ సభ్యుడు అందుకునే 14,000 డాలర్ల వేతనంలో ఇది సగమే.
అయితే.. స్వీడన్‌లో సగటు నెల జీతం 2,800 డాలర్లు.
స్టాక్‌హోమ్ వెలుపలి నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే ఎంపీలు.. తమ విధిలో భాగంగా రాజధానిలో ఉన్నన్ని రోజులకు గాను దినభత్యం పొందవచ్చు.
అది ఎంత అంటే.. రోజుకు 12 డాలర్లు. ఆ మొత్తంతో స్టాక్‌హోమ్‌లో ఒక పూట భోజనం లభిస్తుంది.

ఫొటో సోర్స్, Jonas Esbjörnsson
అసలు 1957 కన్నా ముందు స్వీడన్ ఎంపీలకు జీతాలే లేవు. పార్లమెంటు సభ్యులకు ఆయా పార్టీల సభ్యులే ఆర్థిక సహాయం అందించేవారు.
అయితే.. రాజకీయాల్లోకి ప్రవేశించటానికి ఏ పౌరుడికీ అవరోధాలు ఉండరాదన్న లక్ష్యంతో ఎంపీలకు జీతాలు ఇవ్వటం ప్రారంభించినట్లు పార్లమెంటు ఫైళ్లు చెప్తున్నాయి. అలాగని.. ఈ జీతాలు ఆర్థికంగా చాలా ఆకర్షణీయంగా ఉండాలని కూడా స్వీడన్లు కోరుకోలేదు.
ఇక వసతి సదుపాయాల విషయానికి వస్తే ప్రపంచంలోని చాలా దేశాల ఎంపీల తరహాలోనే వీరికి కూడా ప్రభుత్వ రాయితీతో వసతి లభిస్తుంది.
కానీ.. స్టాక్‌హోమ్ నివాసులకు మాత్రం ఈ సౌకర్యం లేదు. ఎంపీ క్వార్టర్లు సైతం చాలా చిన్నవిగా ఉంటాయి.
ఉదాహరణకు పెర్-ఆర్న్ హకాన్సన్ 46 చదరపు మీటర్ల అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు.

ఫొటో సోర్స్, Claudia Wallin
కొన్ని క్వార్టర్లు నిజానికి 16 చదరపు మీటర్ల వైశాల్యం గల స్టూడియో అపార్ట్‌మెంట్లు.
ఈ ఫ్లాట్లలో వాషింగ్ మెషీన్లు, డిష్‌వాషర్లు వంటి గృహోపకరణ వస్తువులేవీ ఉండవు. అన్నిట్లోనూ సింగిల్ బెడ్లు మాత్రమే ఉంటాయి.
కేవలం ఎంపీల ఖర్చులకు మాత్రమే ప్రజాధనం వెచ్చిస్తారు. ఎంపీల జీవిత భాగస్వాములు, కుటుంబ సభ్యులు ఒక్క రాత్రికి ఈ క్వార్టర్లలో ఉండాలన్నా అందుకు అద్దె కట్టాల్సిందే.
ఎవరైనా ఒక ఎంపీ తన జీవిత భాగస్వామితో కలిసి ప్రభుత్వ క్వార్టర్‌లో నివసించాలంటే.. ఆ క్వార్టర్ అద్దెలో సగం మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు తిరిగి చెల్లించాలి.

ఫొటో సోర్స్, Claudia Wallin
ఎంపీలు వేరే ప్రాంతాల్లో కూడా నివసించే స్వేచ్ఛ ఉంది. పార్లమెంటు అలవెన్సుతో ఏదైనా ఇంటిని అద్దెకు తీసుకోవచ్చు. కానీ ఆ అలవెన్స్ నెలకు గరిష్టంగా 820 డాలర్లు మాత్రమే లభిస్తుంది. స్టాక్‌హోమ్ సెంట్రల్ ప్రాంతంలో అద్దెలతో పోలిస్తే ఇది చాలా తక్కువ.
నిజానికి 1990ల వరకూ స్వీడన్ ఎంపీలకు ప్రభుత్వ క్వార్టర్లనేవే లేవు. వాళ్లు తమ ఆఫీసుల్లోనే పడుకునేవాళ్లు.

ఫొటో సోర్స్, Claudia Wallin
స్వీడన్ ఎంపీలు తమ వ్యక్తిగత సహాయకులు, సలహాదారులను నియమించుకోవటం నిషిద్ధం. అయితే.. ప్రతి పార్టీకి చెందిన ఎంపీలు అందరి కోసం పనిచేసే కార్మికుల బృందాన్ని నియమించుకోవటానికి ఆయా పార్టీలకు ప్రభుత్వం నుంచి అలవెన్సులు అందుతాయి.
స్వీడన్ ప్రాంతీయ రాజకీయాల్లో పొదుపు ఇంకా అధికంగా ఉంటుంది.
రాజకీయ ప్రాతినిధ్యం అనేది.. ప్రధాన వృత్తి కెరీర్‌కు అదనపు కార్యకలాపాలుగా భావిస్తారు. ప్రాంతీయ శాసనసభల్లో దాదాపు 94 శాతం మంది జీతాలు తీసుకోకుండా పనిచేస్తారు.
అయితే.. ఎగ్జిక్యూటివ్ కమిటీల్లో పనిచేసే రాజకీయనాయకులు దీనికి మినహాయింపు. వారికి పార్ట్-టైమ్ లేదా ఫుల్-టైమ్ పనిచేయటానికి వేతనాలు చెల్లిస్తారు.
స్టాక్‌హోమ్ సిటీ కౌన్సిలర్ క్రిస్టినా ఎల్ఫోర్స్-జోడిన్ ఇలా వివరిస్తారు: ‘‘ఇది స్వచ్ఛందంగా చేసే పని. మాకున్న ఖాళీ సమయంలో చక్కగా చేయొచ్చు.’’
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








