లోక్‌సభ ఎన్నికలు 2019: మహిళల మొగ్గు ఏ పార్టీవైపు

మహిళలు, రాజకీయాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రొఫెసర్ సంజయ్ కుమార్
    • హోదా, సీఎస్‌డీఎస్ డైరెక్టర్

2019 లోక్‌సభ ఎన్నికల తీర్పులో వివిధ కోణాలున్నాయి. అందులో ఒకటి, ఎన్నికల్లో మహిళల పాత్ర. ఈ ఎన్నికల్లో మహిళలు కీలక పాత్ర పోషించడమే కాదు.. ఎక్కువ శాతం మహిళలు బీజేపీకి ఓటు వేశారన్నది ఒక విశ్లేషణ. ముఖ్యంగా, కేంద్ర ప్రభుత్వ పథకం 'ఉజ్వల' ద్వారా గ్యాస్ సిలిండర్ల పంపిణీతో గ్రామీణ మహిళలకు పెద్దఎత్తున లబ్ది చేకూరిందని, వారంతా బీజేపీకే ఓటు వేశారని విశ్లేషకుల అంచనా.

ఉజ్వల పథకం ద్వారా 34% కుటుంబాలకు లబ్ది చేకూరిందని, వీరిలో చాలామందికి ఈ పథకం వెనుక మోదీ ప్రభుత్వం ఉందన్న విషయం తెలుసని పోస్ట్‌పోల్ సర్వే అంచనా వేసింది.

2019 ఎన్నికల్లో మహిళలు, గతంలోకంటే పెద్దఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈ పథకం ప్రేరణ కలిగించి ఉండొచ్చు కానీ, ఒక ఓటరు.. తనకున్న ఒకే ఒక్క ఓటును వినియోగించే సమయంలో పరిగణనలోకి తీసుకునే అంశాలు మాత్రం చాలా ఉంటాయి.

అందుకే ఉజ్వల పథకం లబ్దిదారులు అందరూ గంపగుత్తగా అధికార పార్టీకే ఓటు వేశారని కూడా కచ్చితంగా చెప్పలేం.

బీజేపీ ఖాతాలో చేరిన ఓట్లలో మహిళల ఓట్లకు, పురుషుల ఓట్లకు మధ్య వ్యత్యాసం చాలా తక్కువని, సీఎస్‌డీఎస్ నిర్వహించిన పోస్ట్‌పోల్ సర్వే స్పష్టంగా చెబుతోంది కానీ, మహిళల కంటే పురుషుల్లోనే బీజేపీకి ఎక్కువ ప్రాధాన్యం ఉంది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మొత్తం ఓటు శాతం 37%. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ఓటర్లలో 36% మంది, పురుషుల్లో 39% ఉంది బీజేపీకి ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో ఇదేమీ కొత్త విషయం కాదు. మహిళా ఓటర్ల కంటే, ఎప్పుడూ పురుష ఓటర్లలోనే బీజేపీకి మద్దతు అధికంగా ఉంది.

2004 లోక్‌సభ ఎన్నికల నుంచి 2019 ఎన్నికల వరకున్న గణాంకాలను పరిశీలిస్తే, పురుషుల్లో బీజేపీ ట్రెండ్ అర్థమవుతుంది. చాలా రాష్ట్రాల్లో ఈ ట్రెండ్ కనిపించింది కానీ గుజరాత్, కర్నాటక, అసోం, ఉత్తర్‌ ప్రదేశ్ రాష్ట్రాలు ఇందుకు మినహాయింపు. ఈ రాష్ట్రాల్లో పురుషులతో పోలిస్తే, మహిళలే ఎక్కువగా బీజేపీవైపు మొగ్గు చూపారు.

బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఆ పార్టీకి పురుష ఓటర్ల వల్ల ప్రయోజనం చేకూరింది. మహిళల ఓట్లు మాత్రం ఏ పార్టీకి.. అటు వ్యతిరేకంగా కాక, ఇటు పూర్తి మద్దతు ఇవ్వక మధ్యస్థంగా పోల్‌ అయ్యాయి. కానీ ఒక్క పశ్చిమ బెంగాల్‌లో మాత్రం మహిళా ఓటర్లు, మమతా బెనర్జీ వైపు మొగ్గు చూపారు.

ముస్లిం యువతి, ముస్లిం మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

2004 నుంచి 2019 వరకు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు మహిళల ఓటింగ్ శాతం

సోర్స్: సీఎస్‌డీఎస్ డేటా యూనిట్

2019 ఎన్నికల్లో మహిళలు ఏ పార్టీకి ఓటు వేశారు?

సోర్స్: సీఎస్‌డీఎస్ డేటా యూనిట్

'దేశ చరిత్రలోనే తొలిసారి'

2019, 2014 లోక్‌సభ ఎన్నికల్లో మహిళల ఓటింగ్ ట్రెండ్ కాస్త అటుఇటుగా ఒకేలా ఉంది. కానీ తాజా ఎన్నికల్లో మహిళలు ఎలా పాల్గొన్నారనే అంశంలో గణనీయంగా మార్పు కనిపిస్తోంది. ఈ మార్పు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

భారత దేశ చరిత్రలోనే, పురుషులతో సమానంగా మహిళలు ఓటు వేయడం ఇదే తొలిసారి అన్న విషయం గమనించాలి.

దేశవ్యాప్తంగా 2019 లోక్‌సభ ఎన్నికల మొత్తం ఓటింగ్ 66.8%. పురుషుల్లో 66.8 శాతం ఓట్లు పోల్ అవ్వగా, మహిళల ఓటింగ్ శాతం కూడా 66.8%గా నమోదయ్యింది. మహిళలు, పురుషులు ఓటుహక్కు వినియోగించుకునే సందర్భం ఒక్కటే అయినా, ఎన్నికలు వచ్చేనాటికి పురుషుల కంటే మహిళలు ఎప్పుడూ వెనకబడే ఉండేవారు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన కొన్ని ఎన్నికల్లో మహిళలు, పురుషుల మధ్య పోలైన ఓట్ల వ్యత్యాసం 12-14%గా ఉండేది. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఈ వ్యత్యాసం 9-10%కు తగ్గింది. ఈ మార్పు రావడానికి చాలా కాలం పట్టింది.

ఈ వ్యత్యాసం 2009 లోక్‌సభ ఎన్నికలనాటికి 4%, 2014 ఎన్నికలనాటికి ఈ వ్యత్యాసం మరీ పలుచబడి 1.6 శాతానికి చేరింది. కానీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో స్త్రీ పురుషుల ఓటింగ్ శాతం సమానంగా ఉంది!

తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, బిహార్, గోవా, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, ఒడిశా, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్, మేఘాలయ, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళల ఓట్లు ఎక్కువగా నమోదయ్యాయి.

ఇతర రాష్ట్రాల్లో పురుష ఓట్లను మించకపోయినా, మహిళల ఓట్లు కాస్త అటుఇటుగా సమానంగా ఉన్నాయని చెప్పొచ్చు.

గతంతో పోలిస్తే ప్రస్తుత లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంది. ఈ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీల నుంచి 78 మంది మహిళలు పార్లమెంటుకు ఎన్నికయ్యారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో మహిళల ప్రాధాన్యం ఒక సానుకూల పరిణామం అని చెప్పొచ్చు. ఈ పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం పెరిగినా, ఈ దిశగా సాధించాల్సింది ఇంకా చాలా ఉంది.

ఓటర్లు

ఫొటో సోర్స్, Hindustan Times

2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రాలవారీగా పోలైన మహిళలు, పురుషుల ఓట్ల శాతం

సోర్స్: సీఎస్‌డీఎస్ డేటా యూనిట్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)