సాలీడు విషంతో మలేరియాకు చెక్

ఫొటో సోర్స్, Getty Images
మలేరియాను అదుపు చేయడంలో శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. ఆస్ట్రేలియాలో కనిపించే ఓ రకం సాలీడులో ఉండే విషంలోని జన్యువులతో అభివృద్ధి చేసిన ఫంగస్‌ను మలేరియా వ్యాప్తికి కారణమయ్యే ఎనాఫలిస్ దోమల సంహారంలో వినియోగించి మంచి ఫలితాలు సాధించారు.
బుర్కినాఫాసోలోని ఓ ప్రాంతంలో ఈ ఫంగస్‌ను ఉపయోగించి అధ్యయనకర్తలు చేసిన ప్రయోగ ఫలితంగా 45 రోజుల్లోనే అక్కడి 99 శాతం దోమలను నిర్మూలించగలిగారు.
అయితే, ఈ దోమల జాతిని అంతమొందించడం తమ ఉద్దేశం కాదని, మలేరియా వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రయత్నిస్తున్నామని అధ్యయనకర్తలు చెబుతున్నారు.
ఆడ ఎనాఫలిస్ దోమలు కుట్టినప్పుడు మలేరియా వ్యాపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 4లక్షల మందికిపైగా మలేరియా కారణంగా మరణిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఏటా 21.9 కోట్లమంది మలేరియా బారిన పడుతున్నారు.
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, బర్కిన్‌ఫాసోలోని ఐ.ఆర్.ఎస్.ఎస్. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చేసిన ఉమ్మడి పరిశోధనలో భాగంగా, మలేరియాను వ్యాప్తిచేసే ఆడ ఎనాఫలిస్ దోమలకు హాని కలిగించే 'మెటరీజియమ్ పింగ్షీన్స్' అనే ఫంగస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ తర్వాతి దశలో, మెటరీజియమ్ ఫంగస్‌ను జన్యుమార్పిడి చేసి వృద్ధి చేశారు.
''ఈ ఫంగస్ అత్యంత అనువైనది. సులభంగానే వీటి జన్యువుల్లో మార్పులు చేయొచ్చు'' అని, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ ప్రొఫెసర్ రేమండ్ సెయింట్ లిగర్ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Science Photo Library
ఆస్ట్రేలియాలోని 'ఫన్నెల్-వెబ్' జాతి సాలీడు విషంలోని జన్యువులను ఈ ప్రక్రియిలో ఉపయోగించారు.
ఫన్నెల్-వెబ్ జాతి సాలీడులో విషం తయారీకి కారణమయ్యే జన్యువులను ఫంగస్ 'జెనెటిక్ కోడ్'కు జతచేశారు. దీంతో, ఈ ఫంగస్ ఒక్కసారి దోమలోనికి ప్రవేశించాక దానికదే విషం ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది.
''సాలీడులు ఇతర జీవులను కుట్టి విషాన్ని వాటి శరీరంలోకి ప్రసరింపచేస్తాయి. కానీ మేం వాటి కోరలకు బదులుగా మెటరీజియంను ఏర్పాటుచేసి పరీక్షించాం'' అని ప్రొ.సెయింట్ లిగర్ వివరించారు.

ఫొటో సోర్స్, ETIENNE BILGO
జన్యుపరంగా మార్పులు చేసిన ఈ ఫంగస్ చాలావేగంగా ప్రాణాలను హరించింది. ఆ తర్వాత, వాస్తవ పరిస్థితుల్లో ఈ ఫంగస్ ఎలా పనిచేస్తుందో పరీక్షించారు.
6,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో చెట్లు, గుడిసెలు, నీటి వనరులు, దోమలకు ఆహారం ఏర్పాటు చేసి, బర్కీన ఫాసోలో కృత్రిమంగా ఒక గ్రామాన్ని సృష్టించారు. దోమలు తప్పించుకోకుండా, ఈ ప్రాంతం చుట్టూ రెండు పొరలతో దోమతెరను కూడా ఏర్పాటుచేశారు.

ఫొటో సోర్స్, OLIVER ZIDA
ఈ ఫంగస్ బీజాంశాలను నువ్వుల నూనెతో కలిపి, వాటిని తుడిచి, నల్లటి కాటన్ షీట్‌లపై ఉంచారు. దోమలు నల్లటి షీట్‌లపై వాలినపుడు, ప్రమాదకారి అయిన ఈ ఫంగస్ బారినపడుతాయి. ఈ ప్రయోగాన్ని 1,500 దోమలతో ప్రారంభించారు.
దోమలపై ఎలాంటి ఫంగస్‌ను ప్రయోగించనపుడు వాటి సంఖ్య అమాంతం పెరిగిందని, వాటిపై స్పైడర్-టాక్సిన్‌ను ప్రయోగించిన 45రోజుల తర్వాత కేవలం 13 దోమలు మాత్రమే మిగిలాయని 'సైన్స్' అనే జర్నల్‌లో అచ్చయిన అధ్యయన ఫలితాలు వెల్లడించాయి.
''జన్యుమార్పిడి జరిగిన ఈ ఫంగస్, అత్యంత వేగంగా దోమల సంఖ్యను గణనీయంగా తగ్గించింది'' అని, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్‌కు చెందిన డా.బ్రియన్ లోవెట్ అన్నారు.
స్పైడర్-టాక్సిన్ ఫంగస్, ఈ దోమలకు మాత్రమే ప్రత్యేకించినదని, తేనెటీగలు లాంటి ఇతర జీవులకు ఈ ఫంగస్ వల్ల ప్రమాదం ఉండదని కూడా ప్రయోగంలో తేలింది.

ఫొటో సోర్స్, BRIAN LOVETT
''దోమల జాతిని అంతమొందించడం మా లక్ష్యం కాదు. మలేరియా వ్యాప్తిని అరికట్టాలన్నదే మా లక్ష్యం'' అని బ్రియన్ లోవెట్ అన్నారు.
ఒకవైపు దోమలు.. క్రిమిసంహారక మందులను సైతం తట్టుకుని మనగలుగుతున్నాయి. ఇలాంటి సమయంలో సరికొత్త సాధనాలు అవసరం. మరోవైపున ఆఫ్రికాలో మలేరియా ప్రబలంగా ఉన్న 10దేశాల్లో మలేరియా కేసులు మరింత పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.
ఈ అధ్యయన ఫలితాలను పులువురు ప్రశంసిస్తున్నారు. క్రిమిసంహార మందులకు తట్టుకునేలా దోమల సామర్థ్యం పెరుగుతున్న సందర్భంలో, ఇలాంటి విధానాల అవసరం చాలావుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి
- శ్లాబుపై తెల్ల రంగు వేస్తే ఇల్లు చల్లగా మారుతుందా
- ఒకప్పుడు ఆరోగ్యం కోసం చేసుకున్న అలవాటే ఇప్పుడు ప్రాణాలు తీస్తోంది
- ఆ గ్రహంపై వజ్రాల వర్షం
- ఎవరీ నెసమణి.. ఆయన కోలుకోవాలని ట్విటర్‌లో జనాలు ఎందుకు ప్రార్థిస్తున్నారు
- పాకిస్తాన్‌కు నిద్రలేకుండా చేస్తున్న పాతికేళ్ల కుర్రాడు
- ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ఇరాన్‌పై ఎందుకు దాడి చేశారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








