ఈ అరుదైన ఖనిజాల ఎగుమతి ఆపేస్తే అమెరికా పని అంతే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రియాలిటీ చెక్ టీమ్
- హోదా, బీబీసీ మానిటరింగ్
అమెరికాతో వాణిజ్య వివాదాలు తీవ్ర కావడంతో చైనా ఆ దేశానికి ఎగుమతి చేసే అత్యంత అరుదైన ఖనిజాలపై నిషేధం విధించొచ్చనే సంకేతాలు వస్తున్నాయి.
చైనా అత్యధికంగా ఉత్పత్తి చేసే ఈ అరుదైన ఖనిజాలు అమెరికా పారిశ్రామిక రంగానికి ఆయువుపట్టు.
ఆయిల్, ఎలక్ట్రిక్ కార్లు, గాలి మరల పరిశ్రమల్లో వీటిని ఉపయోగిస్తారు.
"దేశ ఆర్థిక వ్యవస్థకు, జాతీయ భద్రతకు ఈ ఖనిజాలు చాలా కీలకం" అని గత ఏడాది అమెరికా భూగర్భ సర్వే చెప్పింది.
దీనిపై ఈ వారం ట్వీట్ చేసిన చైనా ప్రభుత్వ వార్తా పత్రిక గ్లోబల్ టైమ్స్ "చైనా అమెరికాకు ఎగుమతి చేసే అరుదైన ఖనిజాలపై నిషేధం విధించడంపై తీవ్రంగా ఆలోచిస్తోంది" అని తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకంత కీలకం
ఈ అరుదైన ఖనిజాలు('రేర్ ఎర్త్ మినరల్స్) 17 మూలకాల సమూహం. వీటిని ఎర్త్ ఆక్సైడ్స్ అని కూడా అంటారు.
వీటిని చాలా రంగాల్లో ఉపయోగిస్తారు. దీనిని ప్రత్యామ్నాయ శక్తి వనరులు, చమురు రిఫైనరీ, ఎలక్ట్రానిక్స్, గాజు పరిశ్రమల్లో వాడుతున్నారు.
ఇవి వెలికితీయడం చాలా కష్టం అని చెబుతారు. కానీ అమెరికా జియాలజికల్ సర్వే ప్రకారం భూమి లోపలి పొరల్లో ఇవి తగినంత ఉన్నాయని తెలుస్తోంది.
అయితే ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వీటి తవ్వకాలు, ఉత్పత్తి జరుగుతోంది.
రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి చాలా కష్టం. అది పర్యావరణానికి చాలా హానికరం కూడా.

ఫొటో సోర్స్, Getty Images
చైనా, మయన్మార్, ఆస్ట్రేలియా, అమెరికా మినహా దీనిని ఉత్పత్తి చేసే దేశాలు చాలా తక్కువ. వీటిలో అత్యధికంగా ఉత్పత్తి చేసేది చైనాయే.
మిగతా అరుదైన ఖనిజాల ఉత్పత్తిలోనూ చైనాకు తిరుగులేదు.
గత ఏడాది.. ఉపయోగించదగ్గ ఎర్త్ ఆక్సైడ్స్‌లో 90 శాతం ఉత్పత్తి ఒక్క చైనా నుంచే జరిగింది.
మిగతా ఉత్పత్తి మలేసియాలోని ఒక ఆస్ట్రేలియా కంపెనీ చేసింది.
చైనా గణాంకాల విభాగం లెక్కల ప్రకారం గత ఐదేళ్లలో చైనా నుంచి ఈ అరుదైన ఎర్త్ ఆక్సైడ్స్ ఎగుమతులు దాదాపు రెట్టింపయ్యాయి.

చైనాపై అమెరికా ఎంతగా ఆధారపడుతుందంటే.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం అమెరికా తన అవసరాల్లో 80 శాతం రేర్ ఎర్త్ మినరల్స్‌ను చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది.
ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్ కూడా ఈ ఆరుదైన ఖనిజాన్ని అమెరికాకు ఎగుమతి చేస్తాయి. కానీ ఆ దేశాలు కూడా ముడి ఖనిజాన్ని చైనా నుంచే తెప్పించుకుంటున్నాయి.
అమెరికాలో కూడా రేర్ ఎర్త్ ఖనిజాల తవ్వకాలు సాగుతున్నాయి. కానీ అది ముడి ఖనిజం ప్రాసెసింగ్ కోసం మళ్లీ చైనాకే పంపించాల్సి ఉంటుంది. అందుకే దీనిపై చైనా మొదట్నుంచీ 25 శాతం టాక్స్ విధిస్తోంది.
చైనాకు ప్రత్యామ్నాయంగా అమెరికాకు మలేసియా ఉంది. కానీ అక్కడ జరిగే ఉత్పత్తి వల్ల దాని అవసరాలు తీరవు.
దీనితోపాటు పర్యావరణానికి జరుగుతున్న నష్టం దృష్ట్యా మలేసియా దీని ఉత్పత్తిపై కూడా ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తోంది.
కానీ మలేసియా నుంచి ఎగుమతులు సాధ్యమే, కానీ దానికి చాలా సమయం పడుతుంది. ఎంత ఎగుమతి చేసినా ముడి ఖనిజం కొరత మాత్రం అలాగే ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఒకప్పుడు అమెరికాదే పైచేయి
నిజానికి 1980వ దశకం వరకూ 'రేర్ ఎర్త్' అత్యధికంగా ఉత్పత్తి చేసిన దేశం అమెరికానే.
అంతకు ముందు చైనా ఈ అరుదైన ఖనిజాన్ని చాలా తక్కువగా ఎగుమతి చేసేది.
2010లో జపాన్‌తో జరిగిన ప్రాంతీయ వివాదం తర్వాత అది ఎగుమతులు పెంచింది.
అమెరికాకు ఎగుమతి అవుతున్న ఈ అరుదైన ఖనిజాలపై నిషేధం విధిస్తే దానివల్ల, అమెరికాలో పూర్తిగా ఈ వీటిపైనే ఆధారపడ్డ కొన్ని పెద్ద పరిశ్రమలపై దెబ్బ పడుతుంది.
ఇది ఆ దేశ పారిశ్రామిక రంగానికి లక్ష కోట్ట(ట్రిలియన్) డాలర్ల నష్టం కలగొచ్చు.
ఇవి కూడా చదవండి:
- మామిడిపండు కోస్తే మనిషిని చంపేస్తారా.. అసలేం జరిగింది
- ఈ తెలంగాణ పోలీస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు ఎందుకు
- కార్గిల్ యుద్ధంలో పోరాడిన మాజీ సైనికుడిపై 'విదేశీయుడు' అనే ముద్ర
- అరచేతిలో పట్టే చిన్నారి, బరువు పావు కిలో కన్నా తక్కువే
- కొరియా యుద్ధం: చనిపోయిన 65 ఏళ్ల తర్వాత అస్థికల అప్పగింత
- పాకిస్తాన్: ఈ అమ్మాయి 24 ఏళ్లకే ఎంపీ అయ్యారు
- కరణ్ థాపర్‌పై నరేంద్ర మోదీ పాత ‘పగ’ తీర్చుకుంటున్నారా?
- ‘బంగ్లాగా పశ్చిమ్ బెంగాల్‘: ఒక రాష్ట్రం పేరును ఎలా మార్చుతారంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








