అరచేతిలో పట్టే చిన్నారి, బరువు పావు కిలో కన్నా తక్కువే

ఫొటో సోర్స్, AFP
అమెరికాలోని ఓ ఆసుపత్రిలో కేవలం 245 గ్రాముల బరువుతో ఓ పసిపాప జన్మించింది. ఇప్పటివరకూ ఉన్న రికార్డుల ప్రకారం.. ప్రపంచంలోనే అతితక్కువ బరువుతో పుట్టి, బతికి బట్టకట్టిన శిశువు ఈమే.
శాన్‌డియాగోలోని షార్ప్ మేరీ బీచ్‌లో నెలలు నిండకుండానే గత డిసెంబర్‌లో ఈ పాప జన్మించింది. ఆమెకు తల్లిదండ్రులు సెబీ అని పేరు పెట్టారు.
సెబీ తల్లి గర్భంలో కేవలం 23 వారాల మూడు రోజుల పాటే ఉంది.
పెద్ద యాపిల్ పండంత పరిమాణంలో పుట్టిన ఆమెను పరిశీలించిన వైద్యులు కొన్ని గంటలకు మించి బతకదని చెప్పేశారు. కానీ, వారి అంచనాలు తప్పని సెబీ రుజువు చేసింది.
ఐదు నెలల తర్వాత, ఇప్పుడు ఆమె రెండున్నర కేజీల బరువుకు చేరుకుంది. వైద్యులు ఆమెను ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించారు.
సెబీ కోలుకున్న తీరు అద్భుతమని ఆమెకు సపర్యలు చేసిన ఓ నర్సు అన్నారు.

ఫొటో సోర్స్, AFP
'టైనీయెస్ట్ బేబీస్ రిజిస్ట్రీ'లో సెబీ పేరుతో రికార్డు నమోదైంది.
ఆమె కన్నా ముందు 2015లో జర్మనీలో 252 గ్రాములతో జన్మించిన ఓ పాప పేరిట 'అతితక్కువ బరువున్న శిశువు' రికార్డు ఉండేది.
గర్భధారణకు సంబంధించి కొన్ని సమస్యలు తలెత్తడంతో మూడు నెలలు ముందుగానే సిజేరియన్ ద్వారా సెబీ తల్లి ఆమెకు జన్మనివ్వాల్సి వచ్చింది.
"నేను జీవితంలో ఎక్కువగా భయపడిన రోజేదైనా ఉంది అంటే అది సెబీకి జన్మనిచ్చిన రోజే" అని ఆమె తల్లి వ్యాఖ్యానించారు. ఆమె బతుకుతుందని మొదట్లో అసలు తనకే నమ్మకం లేదన్నారు.

ఫొటో సోర్స్, AFP
పుట్టిన సమయంలో సెబీ అరచేతిలో ఒదిగేంత చిన్నదిగా ఉండేదని ఆమెకు చికిత్స చేసిన వైద్య బృందం తెలిపింది.
అతితక్కువ బరువుతో జన్మించినా, సెబీకి తీవ్రమైన సమస్యలు ఏవీ రాలేదని, అందుకే ఆమె జీవించగలిగిందని వైద్యులు అభిప్రాయపడ్డారు.
''నెలలు నిండక ముందు పుట్టే శిశువుల్లో మెదడులో రక్తస్రావం, ఊపిరితిత్తులు, గుండె కణజాలాలకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. కానీ, సెబీకి ఇవేవీ రాలేదు'' అని వారు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- క్రికెట్ ప్రపంచకప్ 2019 షెడ్యూలు.. ఎవరు ఎవరితో పోటీ పడుతున్నారు?
- భారత 15వ ప్రధానిగా మోదీ ప్రమాణం.. క్యాబినెట్ మంత్రులు 25, స్వతంత్ర హోదా 9, సహాయ మంత్రులు 24 మంది
- పాకిస్తాన్కు నిద్రలేకుండా చేస్తున్న పాతికేళ్ల కుర్రాడు
- మోదీ చెప్పిన కెమిస్ట్రీ మేధావులకు ఎందుకు అర్థం కాలేదు..
- చంద్రాణి ముర్ము: పోటీ పరీక్షలకు చదువుకుంటున్న యువతికి ఎంపీ పదవి
- హెరాక్లియాన్: సముద్రగర్భంలో కలిసిన ఈజిఫ్టు ప్రాచీన నగరం కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








