మహిళలకు ఈ కప్ప గర్భనిర్ధారణ పరీక్షలు చేస్తుంది

ఫొటో సోర్స్, Getty Images
సబ్- సహరన్ ఆఫ్రికా ప్రాంతంలో ఎక్కువగా కనిపించే ఈ కప్ప (జెనపస్)కు ఓ విశిష్టత ఉంది. గర్భ నిర్ధారణ పరీక్షల కోసం ఈ కప్పను కొందరు వినియోగిస్తారు.
కప్ప గర్భ నిర్ధారణ పరీక్షలు చేయడమేంటి? అని చాలామందికి ఆశ్చర్యం కలగొచ్చు. కానీ, అది నిజం.
1930ల్లో బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్త లాన్సెలోట్ హాగ్బెన్ రకరకాల జంతువులపై పరిశోధనలు చేస్తుండేవారు. వివిధ రకాల రసాయనాలను (ఎక్కువగా హార్మోన్లు) జంతువుల శరీరాల్లోకి ఎక్కించి అవి ఎలా స్పందిస్తున్నాయో పరిశీలించేవారు.
అలా ఒకసారి కప్ప మీద ప్రయోగం చేశారు. గర్భధారణ హార్మోన్‌ను కప్పకు ఎక్కించినప్పుడు అది గుడ్లు పెడుతుందని గుర్తించారు.

ఫొటో సోర్స్, Novartis AG
మహిళల మూత్రాన్ని ఆడ కప్ప చర్మంలోకి ఎక్కిస్తారు. ఆ తర్వాత కప్ప గుడ్లు పెడితే ఆ మహిళ గర్భం దాల్చినట్లుగా భావిస్తున్నారు.
మహిళ నుంచి సేకరించిన తాజా మూత్రాన్ని ఆడ కప్ప చర్మంలోకి ఎక్కించి కొద్దిసేపు వేచిచూసేవారు. ఆ మహిళ గర్భం దాలిస్తే, కొన్ని గంటల్లోనే కప్ప 5 నుంచి 12 గుడ్లు పెడుతుంది.
1930 నుంచి 1970ల మధ్య గర్భ నిర్ధారణ కోసం ఈ పరీక్షలపైనే ఎక్కువగా ఆధారపడేవారు. ఈ పరీక్షలు చేయించుకున్న మహిళల్లో మౌరీస్ సైమన్స్ ఒకరు. ఆమె 1960ల్లో రెండుసార్లు ఈ కప్ప సాయంతోనే గర్భ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు.
"ఆ సందర్భం నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. రెండుసార్లు తెల్ల కోటు ధరించిన డాక్టర్ వచ్చి 'మీకు శుభవార్త... మీరు తల్లికాబోతున్నారు. మీ నుంచి సేకరించిన హార్మోన్‌తో ఆ కప్పలు గుడ్లు పెట్టాయి' అని చెప్పారు. అప్పుడు కలిగిన సంతోషాన్ని నేను ఇప్పటికీ మరచిపోలేదు" అని మౌరీన్ బీబీసీతో గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Novartis AG
ఈ పరీక్షలతో కచ్చితమైన ఫలితాలు వస్తుండేవని మౌరీన్ చెప్పారు. కప్ప గుడ్లు పెట్టిందంటే ఆ మహిళ గర్భం దాల్చినట్లు పక్కాగా తెలిసిపోయేదని అన్నారు.
అయితే, సాధారణ ప్రజలకు ఈ పరీక్షలు ఎక్కువగా అందుబాటులో ఉండేవి కాదు. దీనిని ప్రయోగశాలలో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఆ కప్పకు ఎలాంటి హానీ కలగకుండా జాగ్రత్తపడాలి.
అందుకే, వైద్య పరిశోధనల కోసం ఈ పరీక్షలను ఎక్కువగా చేసేవారు.

ప్రస్తుత తరాలకు కప్ప పరీక్షలు చాలా వింతగా అనిపిస్తాయి. కానీ, ఆ పరీక్షలు వచ్చిన తర్వాత సమాజంలో చాలా మార్పులొచ్చాయని స్ట్రాత్‌క్లైడ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త జెస్సీ ఓల్స్‌జింకో చెప్పారు.
"అంతకుముందు 'ప్రెగ్నెన్సీ' గురించి బహిరంగంగా మాట్లాడటమే నిషిద్ధం అన్నట్లుగా ఉండేది. కనీసం పత్రికల్లోనూ రాసేవారు కాదు. ఈ పరీక్షలు వచ్చిన తర్వాత క్రమంగా ప్రజల ఆలోచనా విధానం కాస్త మారింది" అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, BBC Ideas
సమాజంలో ఎన్నో మార్పులకు గర్భ నిర్ధారణ పరీక్షలు నాందిపలికాయి. గర్భ నిర్ధారణ కోసం 1990ల్లో ఆధునిక పరీక్షా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత ఆ కప్పలపై పరీక్షలు తగ్గిపోయాయి.
ప్రస్తుతం గర్భ నిర్ధారణ కోసం అనేక రకాల పరికరాలు, పరీక్షా విధానాలు అందుబాటులోకి వచ్చాయి.
ఇవి కూడా చదవండి:
- రాహుల్ గాంధీకి ఈ ఎన్నికలే అంతిమ పోరాటమా...
- మొట్టమొదటి ఎన్నికల ప్రచారం ఎలా జరిగింది?
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన యువత వీళ్లే
- చిరంజీవి ప్రజారాజ్యం నుంచి పవన్ కల్యాణ్ జనసేన వరకు...
- కేఏ పాల్‌కు వచ్చిన ఓట్లు ఎన్ని?
- వైఎస్ జగన్మోహన్ రెడ్డి: కొత్త తరం నాయకుల ప్రతినిధి
- తెలుగు నేలపై మరో యంగ్ సీఎం
- దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీ ఎవరో తెలుసా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








