రాహుల్ గాంధీకి ఈ ఎన్నికలే అంతిమ పోరాటమా? అసలు లక్ష్యం 2024 ఎన్నికలేనా? : వ్యక్తిత్వ విశ్లేషణ

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

భారత రాజకీయాలను తరతరాలుగా శాసిస్తున్న నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ కథకు 2014 లోక్‌సభ ఎన్నికలతో దాదాపుగా తెర పడిందని చాలా మంది అనుకున్నారు.

కానీ, ఆ తర్వాత కాంగ్రెస్‌కు ఆయన కొత్త ఉత్తేజాన్ని ఇచ్చారు. బీజేపీతో 'ఢీ అంటే ఢీ' అనేలా ప్రచారాన్ని నడిపిస్తూ పార్టీ కార్యాచరణను నిర్దేశించారు.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తే రాహుల్ కష్టం ఫలించేలా కనిపించడం లేదు. లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ మళ్లీ ఘన విజయం సాధిస్తారని అవి చెబుతున్నాయి. అదే జరిగితే, మరో అయిదేళ్లు రాహుల్ ప్రతిపక్షంలో కూర్చోవాలి.

2017, డిసెంబర్‌లో కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి పార్టీని రాహుల్ ముందుండి నడిపిస్తున్నారు. ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షోలు, కార్యకర్తలతో సమావేశాల కోసం దేశవ్యాప్తంగా తిరిగారు.

రాహుల్ ముత్తాత నెహ్రూ భారతదేశానికి తొలి ప్రధాని. ఆయన నానమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ కూడా ఆ పదవి చేపట్టినవారే. తల్లి సోనియా గాంధీ దాదాపు రెండు దశాబ్దాలు కాంగ్రెస్‌కు అధ్యక్షురాలిగా పనిచేశారు. రాహుల్‌ను కూడా ప్రధాని పదవి కోసం కాంగ్రెస్ తీర్చిదిద్దుతూ వచ్చిందనడంలో సందేహం లేదు.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, EPA

నాయకత్వం, అర్హతలపై ప్రశ్నలు

2013లో రాహుల్ పార్టీ ఉపాధ్యక్ష పదవిని చేపట్టారు. కాంగ్రెస్‌లో రెండో అత్యున్నత పదవి అది. మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో రాహుల్ విపరీతంగా ప్రచారం చేశారు.

కానీ, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నేలకరిచింది. 545 సీట్లున్న లోక్‌సభలో కేవలం 44 స్థానాలకు పరిమితమైపోయింది. రాజకీయ జీవితంలో రాహుల్‌కు అది అధః పాతాళం. ఓటమిని ఆయన అంగీకరించారు.

ఆ తర్వాత వివిధ రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బలు తగిలాయి. రాహుల్ నాయకత్వ పటిమపై ప్రశ్నలు వచ్చాయి.

విమర్శకులు ఆయన్ను బాధ్యత తలకెత్తుకునేందుకు 'భయపడుతున్న రాకుమారుడి'గా వర్ణించారు. రాహుల్ ఎవరికీ అందుబాటులో ఉండరని అన్నారు.

అయోమయం, తడబాటుకు గురయ్యే నాయకుడంటూ సోషల్ మీడియాలో ప్రత్యర్థులు ఎగతాళి చేశారు.

ప్రతిభ, అర్హతలు లేకున్నా, నెహ్రూ-గాంధీ కుటుంబంలో పుట్టిన ఒకే ఒక్క కారణంతో రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి స్థాయిని అందుకున్నారంటూ అతిసాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్

ఫొటో సోర్స్, Getty Images

వాణిని వినిపించగలిగారు

కానీ, గత రెండేళ్లలో రాహుల్ నిలదొక్కుకున్నారు.

ఆయన సోషల్ మీడియా ప్రచారం మెరుగైంది. మోదీ ప్రభుత్వం చేపట్టిన నోట్లరద్దు, నిరుద్యోగం, సమాజంలో అసహనం, ఆర్థికవ్యవస్థ మందగమనం వంటి విషయాలపై ఆయన సమర్థంగా వాణిని వినిపించగలిగారు.

రఫేల్ ఒప్పందంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు.

గత డిసెంబర్‌లో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను రాహుల్ అధికారంలోకి తీసుకురాగలిగారు.

మరో రెండు నెలల తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పునర్జీవం పోసేందుకు ఆయన తన సోదరి ప్రియాంక గాంధీని తెరపైకి తెచ్చారు.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయాలు లేవా..

2004లో రాహుల్ రాజకీయాల్లో అడుగుపెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పటివరకూ నెహ్రూ-గాంధీ కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ప్రియాంక గాంధీ కొనసాగిస్తారని చాలా మంది భావించారు.

అప్పుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ నుంచి రాహుల్ పోటీచేసి గెలిచారు. గతంలో ఆ సీటు నుంచి రాజీవ్ గాంధీ ప్రాతినిధ్యం వహించారు.

సోనియా కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కొనసాగుతుండగా 2007లో పార్టీ ప్రధాన కార్యదర్శి, 2013లో పార్టీ ఉపాధ్యక్ష బాధ్యతలను రాహుల్ చేపట్టారు.

కాంగ్రెస్ అధ్యక్ష పదవిని రాహుల్ చేపట్టడం అందరూ ఊహించిన పరిణామమే. కొందరు దీన్ని స్వాగతించారు.

కాంగ్రెస్‌లో ప్రత్యామ్నాయాలు లేమిని, నాయకత్వం, దిశానిర్దేశం కోసం నెహ్రూ-గాంధీ కుటుంబంపై ఆధారపడుతుండటాన్ని మరికొందరు ఎత్తిచూపారు.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

బిడియస్థుడన్న పేరు

రాహుల్ 1970, జూన్ 19న జన్మించారు. భారత్‌లోని అత్యున్నత పాఠశాలల్లో చదువుకున్నారు. అమెరికా, బ్రిటన్‌ల్లో ఉన్నత విద్యలు అభ్యసించారు. లండన్‌, ముంబయిల్లో పనిచేశారు.

బయటకు రాహుల్‌ బిడియస్థుడిగానే కనిపించేవారు. రాజకీయాల కన్నా క్రికెట్ మ్యాచ్‌లు, పర్యటనల మీద ఆయన ఆసక్తి కనిపించేది.

అయితే, ఆయనకు రాజకీయాలపై లోతైన అవగాహన ఉందని, వెనకుండి పనులను నడిపించడంలో సిద్ధహస్తుడని కొందరు విశ్లేషకులు చెబుతుంటారు.

అమేఠీలో రాహుల్ ఈసారి గెలిస్తే, వరుసగా అక్కడ నాలుగో సారి ఎంపీగా విజయం సాధించినవారవుతారు.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఓటమి భయమా..

కానీ, కేరళలోని వయనాడు నుంచి కూడా రాహుల్ బరిలోకి దిగారు.

అమేఠీలో తమ అభ్యర్థి స్మృతీ ఇరానీ చేతిలో ఓడిపోతానన్న భయంతోనే రాహుల్ వయనాడులో పోటీ చేస్తున్నారని బీజేపీ అంటోంది. క్రితంసారి ఎన్నికల్లో ఆమె రాహుల్‌కు గట్టి పోటీ ఇచ్చారు.

అయితే, దక్షిణాదిలో పార్టీ విస్తరణ కోసమే రాహుల్ వయనాడులో పోటీ చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు.

దేశాన్ని దాదాపు 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఓటర్ల మద్దతు సంపాదించడంలో ఇటీవలి కాలంలో విఫలమవుతోంది.

పార్టీకి పునర్జీవం పోసి, ఎన్నికల్లో ఎలా గెలిపించాలన్నదే రాహుల్ ముందున్న అతిపెద్ద సవాలు.

కానీ, రాహుల్‌ అవకాశాలను ఇప్పుడే కొట్టిపారేయడం సరికాదని కొందరు విశ్లేషకులు అంటున్నారు. 2024లో అధికారం అందుకోవడం కాంగ్రెస్‌కు వాస్తవిక లక్ష్యమని అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)