శ్రీలంక: యుద్ధం ముగిసి పదేళ్లైంది.. మరి అదృశ్యమైన తమిళ టైగర్లు ఎక్కడ?

తమిళ టైగర్స్ ఓటమితో శ్రీలంకలో అంతర్యుద్ధం 2009లో ముగిసింది. కానీ.. పదేళ్ల తర్వాత కూడా గతం నుంచి కోలుకోవటానికి ఈ దేశం కష్టపడుతోంది. ప్రత్యేకించి ఈశాన్య ప్రాంతంలో యుద్ధం చివరి దశలో వేలాది మంది చనిపోయారు. చాలా మంది అదృశ్యమయ్యారు.
అంతర్యుద్ధం సమయంలో పదేళ్ల కిందట అక్కడి నుంచి రిపోర్ట్ చేసిన బీబీసీ ప్రతినిధి అన్బరస్ ఎతిరాజన్.. మైనారిటీ తమిళుల జీవితాల్లో వచ్చిన మార్పేమిటో చూడటానికి ఉత్తర ప్రాంతంలోని నాటి వార్ జోన్‌కు ఇటీవల మళ్లీ వెళ్లారు.
కిలినోచ్చి... ఉత్తర శ్రీలంకలో ఒకప్పుడు తమిళ రెబెల్స్ పట్టులో ఉన్న ప్రాంతం.
పదేళ్ల కిందట అంతర్యుద్ధం పతాక స్థాయిలో ఉన్నపుడు నేను ఇక్కడికొచ్చాను. అప్పుడీ ప్రాంతం శిథిలమైవుంది.
ఇప్పుడీ పట్టణం కళకళలాడుతోంది. అయితే, కొందరికి మాత్రం ఆ యుద్ధం చేసిన గాయాలు ఇంకా మానలేదు.
యుద్ధ కాలంలో అదృశ్యమైన తమ వారి గురించి సమాధానాలు కావాలని ఇక్కడి జనం కోరుతున్నారు.

''యుద్ధం చివరి దశలో ఉన్నపుడు మేం తిరుగుబాటుదారుల ప్రాంతం నుంచి బయటకు వచ్చాం. మమ్మల్ని ముళ్ల తీగల కంచె వెనుక ఉంచారు. తమిళ రెబెల్స్‌తో సంబంధం ఉన్న వారందరూ ముందుకు రావాలని ఆర్మీ చెప్పింది. వారందరికీ క్షమాభిక్ష లభిస్తుందని హామీ ఇచ్చింది. నా కొడుకు, కోడలు.. తమ ఇద్దరు పిల్లలతో సహా లొంగిపోయారు. వారిని సైన్యం ఒక బస్సులో తీసుకుని వెళ్లిపోయింది. వారిని తీసుకెళుతుంటే మేమంతా ఏడుస్తూ ఉండిపోయాం. వారిని చూడటం అదే ఆఖరు’’ అన్నారు అదృశ్యమైన ఓ తమిళ కుటుంబానికి తల్లి కండసామి పొన్నమ్మ.
ఇలాంటి మహిళలు చాలా మంది ఉన్నారు. దాదాపు 20 వేల మంది ఆ అంతర్యుద్ధంలో అదృశ్యమయ్యారు. వారిలో అత్యధికులు తమిళులు.
తమిళ టైగర్స్ ఓటమితో ఆ కిరాతక యుద్ధం ముగిసింది.
''హక్కుల ఉల్లంఘనలు జరిగాయని అంగీకరించినప్పుడు మాత్రమే సామరస్యం సాధ్యమవుతుందని, ఒక దేశంగా అభివృద్ధి చెందుతామని నా అభిప్రాయం. వందలు, వేల మంది అదృశ్యమైన ఉదంతాలు ఉన్నాయి. దానిని మనం అంగీకరించి తీరాలి. అలా మళ్లీ జరగకూడదు'' అని ఆఫీస్ ఆఫ్ ద మిస్సింగ్ పర్సన్స్ చైర్మన్ సాలియా పేరిస్ అన్నారు.

మైనారిటీలైన తమిళుల సాంస్కృతిక రాజధానిగా ఉత్తర శ్రీలంకలోని జాఫ్నా నగరాన్ని పరిగణిస్తారు. కానీ ఈ తమిళ ప్రజల్లో అంతర్లీనంగా చాలా ఆందోళనలున్నాయి. మూడు దశాబ్దాల కిందట సంఘర్షణ తలెత్తటానికి కారణమైన కీలక అంశాల్లో చాలా వాటిని శ్రీలంక ప్రభుత్వాలేవీ పరిష్కరించలేదని వారు భావిస్తున్నారు.
తమిళుల ఆందోళనలను.. ప్రత్యేకించి బలవంతపు అదృశ్యాల అంశాన్ని పరిశీలిస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది.
''అధికారిక వ్యవస్థ జనం నుంచి సమాచారం సేకరిస్తోంది. ఆ పని జరుగుతోంది. ఎవరూ కాదనలేరు. వినికిడి మాటలపై మేం ఆధారపడలేం. ఎవరైనా 40 వేల మంది, 10 వేలు, 30 వేలు అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థ అధికారికంగా ఈ విషయంపై దర్యాప్తు చేస్తోంది’’ అని అధ్యక్షుడి అధికార ప్రతినిధి శిరిల్ లక్తిలకే చెప్పారు.
అయితే.. కిలినోచ్చిలో.. అదృశ్యమైన తమ వారు తిరిగి వచ్చినపుడే యుద్ధం ముగుస్తుందని.. శాంతి తిరిగి నెలకొంటుందని.. వారి బంధువులు అంటున్నారు.
ఎంత కాలం మీ నిరసన కొనసాగిస్తారని అడిగినపుడు.. ఒక మహిళ చెప్పిన సమాధానం 'నేను బతికున్నంత వరకూ...'
ఇవి కూడా చదవండి:
- ముగిసిన యుద్ధం.. మానని గాయం
- అక్కడ మహిళలకు మద్యం అమ్మరు! ఎందుకంటే..
- శ్రీలంక: మహిళలు 'డ్రమ్ము'లా ఉండరాదన్న జిమ్.. వెల్లువెత్తిన నిరసనలు
- ఎనిమిదేళ్ల తర్వాత చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఢమాల్!
- భారత్‌తో యుద్ధానికి ముందే ప్లాన్ వేసిన మావో?
- బంగ్లాదేశ్ యుద్ధంలో 'రా' చీఫ్ రామేశ్వర్నాథ్దే కీలక పాత్ర!
- రూ.42 కోట్ల వజ్రం దొరికినా కనీస సౌకర్యాలకు నోచుకోని గ్రామం
- శారీరక వ్యాయామం చేయని ప్రతి నలుగురిలో ఒకరికి ముప్పు
- ‘జీవితాన్ని ధారపోయడమే నక్సలిజం అయితే, నక్సలైట్లు చాలా మంచి వాళ్లు’
- ‘ఇండియాలోని భారతీయులకంటే బ్రిటన్‌లోని భారతీయులే సంప్రదాయబద్ధంగా జీవిస్తున్నారు’
- స్వదేశంలో కంటే విదేశాలకు అప్పులు ఇవ్వడానికే చైనా బ్యాంకుల మొగ్గు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









