శ్రీలంక పేలుళ్లు: ఆత్మాహుతి దాడుల వెనుక ‘ఫ్యామిలీ నెట్‌వర్క్’లు.. ‘ఇదో కొత్త తరహా తీవ్రవాదం’

ఫొటో సోర్స్, Anadolu Agency/Getty Images
- రచయిత, అన్బరసన్ ఎతిరాజన్
- హోదా, బీబీసీ న్యూస్, శ్రీలంక
శ్రీలంకలో గత నెలలో జరిగిన ఆత్మాహుతి దాడుల వెనుక స్థానిక ముస్లింలు ఉన్నారని తెలియడంతో చాలా మంది శ్రీలంక వాసులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఒక చిన్న వర్గం ఎవరూ గుర్తించకుండా ఇంత పెద్ద విధ్వంసానికి ఎలా పాల్పడింది?
ఈ పేలుళ్లకు సంబంధించిన ఆధారాలు జనవరి మధ్యలోనే దొరికాయి. విల్పట్టు జాతీయ పార్కులోని ఓ కొబ్బరి తోటలో శ్రీలంక పోలీసులు 100 కేజీల పేలుడు పదార్థాలు, 100 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు.
దేశంలోని బుద్ధుడి విగ్రహాలు లక్ష్యంగా ఇస్లామిక్ అతివాదులు దాడి చేయోచ్చని పోలీసులు భావించారు. ముందస్తు చర్యల్లో భాగంగా, కొత్తగా ఆవిర్భవించిన రాడికల్ ఇస్లామిక్ గ్రూప్‌కు చెందిన నలుగురిని అరెస్టు చేశారు.
కానీ, మూడు నెలల తర్వాత అనుమానిత ఇస్లామిస్టులు కొలొంబో, నెగోంబో, కోచ్చికడే, బట్టికలోవాలలోని చర్చ్‌లు, హోటళ్లు లక్ష్యంగా ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు.
ఈ ఘటనలో 250 మంది చనిపోయారు. మృతుల్లో 40 మంది విదేశీయులు కూడా ఉన్నారు.

కొబ్బరితోటలో పేలుడు పదార్థాలు దొరకడం ఈ ఘటనకు సంబంధం లేని అంశంగా చూడొద్దు. బాంబు పేలుళ్ల కంటే ముందు అనుమానించాల్సిన ఘటనల్లో ఇదీ ఒకటి. మరీ ముఖ్యంగా సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌లో చేరిన చాలా మంది సంహళీయులు తిరిగి స్వదేశం చేరుకున్నారని రిపోర్టులు రావడం జరుగుతున్న పరిణామాలపై ప్రమాద ఘంటిక మోగించే సూచికగా చెప్పాలి.
దాడులు జరగొచ్చని అమెరికా, ఇండియా నుంచి అనేకసార్లు ముందస్తు హెచ్చరికలు వచ్చినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదు. దీంతో ఈస్టర్ రోజున మారణహోమం జరిగిపోయింది.
జనవరిలో పుట్టాలంలో తాము అరెస్టు చేసిన ఇద్దరికి బాంబు పేలుళ్ల ఘటనతో సంబంధాలున్నాయని మారణహోమం జరిగాకే పోలీసులకు తెలిసింది.
కుటుంబ చరిత్ర
శ్రీలంక ప్రభుత్వంలో పైస్థాయిలో అసమ్మతి రాగాలు, కుతంత్రాలు కొనసాగుతున్నాయి. దీంతో పేలుడు హెచ్చరికలను ఎవరూ పట్టించుకోలేదు.
2009లో శ్రీలంకలో అంతర్యుద్ధం ముగిసిన తర్వాత శాంతియుత పరిస్థితి కల్పించడంలో నిర్లక్ష్యం వహించడం కూడా కీలక పాత్ర పోషించింది.
తమిళ వేర్పాటువాదులు, శ్రీలంక ప్రభుత్వానికి మధ్య అంతర్యుద్ధం ముగిసిన తర్వాత చెదురుమదురుగా జరిగే ముస్లిం వ్యతిరేక అల్లర్లు పెరిగిపోయాయి.
''ఘోరమైన బాంబుదాడులతో ఇస్లామిస్టులు ఆశ్చర్యపరిచారు. అదేసమయంలో ఈ మొత్తం ఆపరేషన్‌ను రహస్యంగా ఉంచారు'' అని శ్రీలంక ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ మాజీ అధికారి ఒకరు తెలిపారు.
ఇలాంటి మారణహోమం తలపెట్టాలంటే పక్కాగా ప్రణాళిక ఉండాలి. సురక్షితమైన స్థలం ఉండాలి. దాడి ప్రణాళిక వేసేవారికి, అమలు చేసేవారికి మధ్య పూర్తిస్థాయి నెట్‌వర్క్ ఉండాలి. బాంబులను తయారు చేసే నిపుణులు, ఆర్థిక సహకారం అందించేవాళ్లు ఉండాలి. రాడార్ కళ్లుగప్పి ఇలా ఎలా చేయగలిగారు?
ఇలాంటి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వచ్చాయి. కానీ, భద్రతా దళాలు, ప్రభుత్వ అధికారులు, స్థానిక ముస్లింలకు మధ్య సంబంధాలు ఎలా స్థాయిలో ఉన్నాయనేది అతివాదులు, ఐఎస్ సానుభూతిపరులు పాల్పడిన ఈ ఘటన తర్వాతే తెలిసింది.

కొన్ని కుటుంబాలకు చెందిన వారు అతివాదులుగా మారి ఒక్కో యూనిట్‌గా విడిపోయి పేలుళ్లకు పాల్పడి ఉంటారని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.
''అందువల్లే వారి లక్ష్యాన్ని, కదిలికలను బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు'' అని కౌంటర్ టెర్రర్ ఏజెంట్ తెలిపారు.
ఒక్కో యూనిట్ ఒక్కో అతివాద కుటుంబంతో సంబంధం పెట్టుకొని ఓ పెద్ద నెట్‌వర్క్‌గా ఏర్పడింది. ఒకే భావజాలంతో ఉన్న విశ్వసనీయమైన నెట్‌వర్క్ కావడం వల్ల సమాచారం బయటకు వెళ్లలేదు.
ఎన్క్రిప్టెడ్ సోషల్ మీడియా నెట్‌వర్క్‌లు, మెసేజింగ్ యాప్‌లు వారి మధ్య కమ్యూనికేషన్‌కు, ప్రణాళికకు చక్కగా ఉపయోగపడ్డాయని భావిస్తున్నారు.
''దాడులకు పాల్పడిన వారు ఒకరినొకరు ఎలా కమ్యూనికేషన్ చేసుకున్నారో తెలుసుకోడానికి దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు'' అని ఆ ఏజెంట్ చెప్పారు.
''తమ లక్ష్యాలను చేరుకునేందుకు వారు కుటుంబాన్ని ఎంచుకోవడం చూస్తేంటే ఇదో కొత్త తరహా తీవ్రవాదంగా కనిపిస్తుంది. ఆత్మాహుతి దాడిలో కొన్ని కుటుంబాలు ఎలా పాల్గొన్నాయో మనం చూశాం.( ఇండోనేసియాలో గతేడాది పోలీసు భవనం, చర్చిలో ఆత్మాహుతి దాడి జరిగింది.)'' అని ఆయన తెలిపారు.
ఈ బాంబు పేలుళ్లకు సంబంధం ఉందని భావిస్తున్న 70 మందికి పైగా వ్యక్తులను ప్రభుత్వం అరెస్టు చేసింది.
''పేలుళ్లకు పాల్పడిన సూత్రధారులు, బాంబులు తయారు చేసినవారు ఇంకా చాలా మంది ఉన్నారు. అందుకే ఇలాంటి ఘటన మళ్లీ జరగొచ్చని సమాచారం వస్తోంది'' అని తన పేరు చెప్పడానికి ఇష్టపడని సీనియర్ ప్రభుత్వాధికారి గత వారం చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
''సాంప్రదాయ తీవ్రవాద సిద్ధాంతం ప్రకారం ప్రతీ ఆత్మాహుతి దళ సభ్యుడికి కనీసం ఐదుగురి సహకారం అవసరం. ఇలా లెక్కిస్తే ఇంకా 45 మంది ( 9 మంది ఆత్మాహుతి దళ సభ్యులకు) ముఖ్య సూత్రధారులు ఉంటారు. అందుకే మేం ఆందోళన చెందుతున్నాం'' అని ఆయన తెలిపారు.
అయితే, ప్రధాన మంత్రి రణిల్ విక్రమ సింఘే మాత్రం బాంబు పేలుళ్లలో ప్రమేయం ఉన్నవారందరినీ పట్టుకోవడమో, చంపడమో జరిగిందని వ్యాఖ్యానించడం కాస్త అసమగ్రంగా అనిపిస్తుంది.
ఈ పేలుళ్ల కారణంగా అందరి దృష్టి ఇప్పుడు ముస్లింలపై పడింది. శ్రీలంకలో మెజారిటీలైన సింహళీయలు, తమిళుల తరువాత వీరే ఎక్కువ. దేశ జనాభాలో వీరు 10 శాతం ఉన్నారు.
అంతర్యుద్ధం సమయంలో తమిళ్ టైగర్ రెబల్స్ చేతిలో ముస్లింలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. 1990లో దేశ ఉత్తర భాగంలో ఉన్న 75 వేల మంది ముస్లింలను రెబల్స్ తరిమివేశారు. అదే ఏడాది మసీదుల్లో దాడులు చేయడంతో 150 మంది ముస్లింలు చనిపోయారు.

ఫొటో సోర్స్, AFP
తర్వాత కాలంలో శ్రీలంక భద్రతా దళంలో వందలాది సంఖ్యల్లో ముస్లింలు చేరారు. సింహళీతో పాటు తమిళం కూడా రావడంతో ఇంటెలిజెన్స్ విభాగంలో వారిని ఎక్కువగా తీసుకున్నారు. శ్రీలంక ప్రభుత్వం తమిళ జాతి తిరుగుబాటుకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడే ముస్లింలు ఎక్కువగా ఉండే తూర్పు ప్రాంతంలో 'అల్ట్రా కన్జర్వేటివ్ ఇస్లామిక్ మూవ్‌మెంట్' నెమ్మదిగా మొదలైంది.
''ఈ ప్రక్రియ 30 ఏళ్ల కిందట మొదలైంది. వహాబీ ఉద్యమం యువతను ఆకర్షించి వారికి ఆర్థికంగా అండగా నిలిచింది'' అని మజూక్ అహ్మద్ లెబ్బె అన్నారు. కట్టన్‌కుడిలోని మసీదుల సమాఖ్య అధికారిగా ఆయన పనిచేస్తున్నారు.
సముద్ర తీరంలో ఉన్న కట్టన్‌కుడిలో 47 వేల జనాభా ఉంటే, ఇందులో అత్యధికులు ముస్లింలే. పట్టణ కూడలిలో కొన్ని షాపులు బుర్ఖాలను అమ్ముతుంటాయి. అందమైన గోపురాలు, మినార్లతో ఈ పట్టణం కనిపిస్తుంది.
ఇక్కడ 60 మసీదులున్నాయి. ఇంకా చాలా మసీదుల నిర్మాణ జరుగుతోంది.
కొత్తగా కడుతున్న మసీదులలో ఆధునిక, ప్రధాన స్రవంతి బోధనలు కనిపిస్తున్నాయని, కొందరు మత బోధకులు కరుడగట్టిన ఇస్లాం భావజాలం కలిగినవారు అని ఇక్కడి ముస్లిం మతపెద్దలు తెలిపారు.
ఇలా మతచాంధసవాదుల బోధనలకు ఆకర్షితులైన వారిలో కట్టన్‌కుడికి చెందిన మతబోధకుడు మహ్మద్ జరాన్ హషీం ఒకరు. ఈస్టర్ రోజున షాంగ్రీ లా హోటల్‌లో ఆత్మాహుతి దాడికి పాల్పడింది ఇతనేనని ప్రభుత్వం భావిస్తోంది.

హషీంను ఆయన తండ్రి ఒక మదర్సాలో చేర్పించారు. కానీ, అక్కడ టీచర్లు నిజమైన ఇస్లాంను అనుసరించడం లేదని వారిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీంతో హషీంను ఆ మదర్సా నుంచి పంపించివేశారు. కానీ, హషీం సొంతంగానే చదువును కొనసాగించాడు. స్థానిక మసీదుల్లోని బోధనలను సవాలు చేస్తూ తనే మత బోధకుడిగా మారాడు.
''హషీం అభిప్రాయాలను మేం అంగీకరించలేదు. అందుకే మా మసీదుల్లో ఆయన బోధించేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో అతను సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు'' అని లెబ్బె చెప్పారు.
హషీం మొదట్లో దారుల్ అతర్ పేరుతో ఒక సాంప్రదాయ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. తర్వాత 2014లో నేషనల్ థావ్హూద్ జమాత్ (ఎన్టీజే) సంస్థను ఏర్పాటు చేశారు. ఆత్మాహుతి దాడులకు ఈ సంస్థే కారణమని శ్రీలంక ప్రభుత్వం చెబుతోంది.
బుద్ధుడి విగ్రహాలను ధ్వంసం చేస్తూ, ఇతర ముస్లిం వర్గాలతో కలబడుతూ ఎన్టీజే సభ్యులు చాలా సార్లు పోలీసుల కళ్లలో పడ్డారు. కానీ, ఈ చిన్న దళానికి ఇంత పెద్ద మారణహోమం సృష్టించే సామర్థ్యం ఉందని తెలియడంతో అనేక మంది కలవరపడ్డారు.
మొదట్లో ఎన్టీజేకు విదేశాల నుంచి విరాళాలు అందేవి. మరీ ముఖ్యంగా మధ్య ప్రాచ్యం, ఇండియా, మలేషియాల నుంచి డబ్బులు వచ్చేవి. కట్టన్ కుడిలోని బీచ్‌కు సమీపంలో మసీదు నిర్మించుకునేందుకు ఈ డబ్బు వారికి సహాయపడింది. అయితే, బాంబు పేలుళ్ల అనంతరం ప్రభుత్వం ఈ మసీదును సీల్ చేసింది.

ఫొటో సోర్స్, Reuters
వహాబీ సిద్ధాంతాల నుంచి స్ఫూర్తి పొందిన హషీం, అతని అనుచరులు ఇస్లాంలోని కఠినమైన నియామాలను అనుసరించారు.
''హషీం తీవ్రవాద భావజాలంతో ముందుకు వెళ్లాడు. పట్టణంలోని సూఫీ ముస్లింలకు వ్యతిరేకంగా ఎన్టీజే ప్రచారం చేసింది'' అని కట్టన్‌కుడిలోని ముస్లిం వర్గాలు తెలిపాయి.
హషీం, ఎన్టీజే సభ్యులు 2017లో ఒక కార్యక్రమంలో స్థానిక సూఫీ ముస్లింలపై కత్తులు దూసి గొడవపడ్డారు.
ఈ ఘటనలో ఎన్టీజేకు చెందిన 10 మంది సభ్యులను (ఇందులో హషీం రెండో సోదరుడు కూడా ఉన్నారు) పోలీసులు అరెస్టు చేశారు. అయితే, హషీం అతని మరో సోదరుడు రిల్వాన్ తప్పించుకున్నారు. దీని తర్వాత తీవ్రస్థాయి విమర్శలు రావడంతో ఎన్టీజే నుంచి హషీంను బహిష్కరించారు. అయితే, హషీం ఇప్పటికీ ఎన్టీజేను ప్రభావితం చేస్తున్న ముఖ్య నేత అని స్థానిక ముస్లింలు చెప్పారు.
తప్పించుకొని తిరుగుతున్న హషీం సోషల్ మీడియాలో విద్వేశపూరిత వీడియోలను విడుదల చేశారు.

''వాళ్లది చాలా సాధారణ ముస్లిం కుటుంబం. హషీం తండ్రి చాలా పేదరికం నుంచి వచ్చారు. వారి మతంలో అందరికీ ఆయన తెలుసు. హషీం మంచి మత బోధకుడు.. ఖురాన్ గురించి చక్కగా వివరిస్తారు. హషీం కుటుంబం ఇలాంటి ఘటనకు పాల్పడుతుందని ఎవరూ ఊహించరు'' అని లెబ్బె అన్నారు.
''బాంబు పేలుళ్ల ఘటనకు వారం ముందు నేను హషీం తండ్రిని కలిశాను. వాళ్లు సాధరాణంగానే కనిపించారు. ఈ దారుణానికి వారు ఎలా పాల్పడ్డారో ఇప్పటికీ అంతుచిక్కకుండా ఉంది'' అని హషీం బంధువు, ఎన్టీజే మాజీ సభ్యుడు ఒకరు చెప్పారు.
పేలుడు తర్వాత ఏప్రిల్ 26న సాయినాథమారుథు పట్టణంలో జహరన్ హషీం బంధువులను భద్రతా దళాలు కాల్చిచంపాయని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP
హషీం సోదరి మహ్మద్ హషీం మదానియా బీబీసీతో మాట్లాడుతూ తన సోదరుడి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. అతనితో సంబంధాలు తెగిపోయి రెండేళ్లు దాటిందని తెలిపారు. పేలుళ్లు జరిగిన వెంటనే తమ కుటుంబం సభ్యుల వివరాల గురించి ఏలాంటి వార్తా వినలేదని చెప్పారు. పేలుళ్లకు సంబంధించిన నెట్‌వర్క్‌లో తాను లేనని వెల్లడించారు.
అయితే, కొన్ని రోజుల కిందట మదానియాను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ఇంట్లో సోదాలు చేసి దాదాపు రూ.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పేలుళ్లకు కొద్ది రోజుల ముందు సోదరుడే ఆమెకు డబ్బులు పంపించారని పోలీసులు చెబుతున్నారు. కస్టడీలో ఉన్న మదానియా దీనిపై స్పందించలేదు.

ఫొటో సోర్స్, Reuters
తప్పుదోవ పట్టిస్తున్నారు
క్యాండీలో 2018 ఫిబ్రవరిలో ముస్లింలపై జరిగిన దాడుల వల్ల ఆ వర్గంలోని కొంతమంది తీవ్రవాదం వైపు మళ్లారని భావిస్తున్నారు.
నాడు మసీదుపై జరిగిన దాడిలో ఇద్దరు చనిపోయారు. వందలాది ఇళ్లు, దుకాణాలు కాలిపోయాయి. దీంతో అక్కడ ఎమర్జెన్సీ విధించారు. ప్రభుత్వం తమను రక్షించేందుకు సరైన చర్యలు చేపట్టలేదని ఈ సందర్భంగా స్థానిక ముస్లిం ఒకరు చెప్పారు.
ఈ ఘటనకు ముందు చాలా తక్కువ సంఖ్యలో ముస్లింలు అతివాద భావజాలం వైపు మళ్లారు. సిరియాలోని ఐఎస్ సంస్థ వద్ద శిక్షణ తీసుకున్న పదుల సంఖ్యల్లోని యువత తిరిగి శ్రీలంకకు వచ్చారని అధికారులు తెలిపారు.
శ్రీలంకకు చెందిన స్కూల్ ప్రిన్సిపాల్ మహ్మద్ ముసిన్ నీలం ఆ దేశం నుంచి సిరియాలోని ఐఎస్‌లో చేరిన తొలి వ్యక్తి. 2015లో రక్కాలో అతను చనిపోయారు.
''ఆత్మాహుతి దాడులు చేసిన వారు ఇతడి నుంచే స్ఫూర్తి పొంది ఉండొచ్చు'' అని కౌంటర్ టెర్రరిజం ఏజెంట్ ఒకరు తెలిపారు.
అయితే, ఆత్మాహుతి దాడికి పాల్పడినవారు సిరియాకు వెళ్లారా అనేది స్పష్టం కాలేదు. దాడిలో పాల్గొన్న అబ్దుల్ లతీఫ్ మహ్మద్ జమీల్ 2014లో టర్కీకి వెళ్లి తిరిగి వచ్చేశాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఆయనకు ఐఎస్‌తో పాటు ఇతర ఇస్లామిస్ట్ గ్రూప్‌లతో సంబంధం ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ఫొటో సోర్స్, Facebook
మసాలా దినుసుల వ్యాపారి కుమారుల ప్రమేయం
మతబోధకుడైన హషీంకు కొలంబోలోని ధనికుడైన మసాలా దినుసుల వ్యాపారి ఇద్దరి కుమారులు ఇషాఫ్ అహ్మద్ ఇబ్రహీం, ఇల్హాం ఇబ్రహీంలతో ఎలా సంబంధం ఏర్పడిందో స్పష్టం కావడం లేదు. ఈ ఇద్దరు సోదరులు కూడా బాంబు పేలుళ్లలో పాల్గొన్నారు.
పేలుళ్లు జరిగిన కొద్ది గంటల తర్వాత ఇల్హాం ఇబ్రహీం ఇంటిలో సోదాలు చేయగా అతని భార్య ఫాతిమా ఇబ్రహీం తనను తాను పేల్చుకుందని, ఈ ఘటనలో వారి ముగ్గురు పిల్లలు, ముగ్గురు అధికారులు చనిపోయారని పోలీసులు తెలిపారు.
తొమ్మిది ఆత్మాహుతి దాడులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, దీనికి ఇబ్రహ్రీం సోదరులు ఆర్థికసాయం అందించిఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఇబ్రహీం సోదరుల తండ్రి మహ్మద్ ఇబ్రహీం ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు. కొలంబో వ్యాపార వర్గాల్లో పేరున్న వ్యక్తుల్లో ఆయన ఒకరు. రాజకీయాలతోనూ ఆయనకు సంబంధాలున్నాయి. గతంలో పార్లమెంట్‌కు పోటీ చేసి ఓడిపోయారు.
ఇబ్రహీం సోదరులను జమీల్ హషీం ప్రభావితం చేసి ఉంటాడని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అసమ్మతి రాగాలు
శ్రీలంక ప్రజలు ఈ ఘటన నుంచి ఇంకా తేరుకోలేదు. పేలుళ్ల తర్వాత నెలకొన్న రాజకీయ కలహాలు, పాలనా వైఫల్యాలపై కూడా వారు అదే స్థాయిలో ఆందోళన చెందుతున్నారు.
అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధాన మంత్రి రణిల్ విక్రమ సింఘే వేర్వేరు పార్టీలకు చెందినవారు. దీంతో ఇద్దరి మధ్య సరైన సమన్వయం లేదు. ఈ ప్రభావం పాలనపైనా పడుతోంది.
పేలుళ్ల అనంతరం పరిస్థితిని, భద్రతా దళాల పర్యవేక్షణను అధ్యక్షుడు చూస్తున్నారు. మరోవైపు దాడులు జరగొచ్చని భారత ఇంటెలిజెన్స్ హెచ్చరించిన విషయాన్ని శ్రీలంక ఇంటెలిజెన్స్ బృందం తమతో పంచుకోలేదని ప్రధాని రణిల్ విక్రమ సింఘే అన్నారు.
ఇద్దరు అగ్రనేతల మధ్య ఉన్న పొరపొచ్చాలు దేశాన్ని దెబ్బతీస్తున్నాయని మానవ హక్కుల కార్యకర్త భవాని ఫొనెస్కా అన్నారు.
బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్యను ఇద్దరు మంత్రులు వేర్వేరుగా చెప్పిన విషయం గమనిస్తే ప్రభుత్వంలోని వివిధ విభాగాల మధ్య కూడా సరైన సమన్వయం లేన్నట్లుగా కనిపిస్తుంది.
ఒక దశలో దాడుల్లో ప్రమేయం ఉందని అమెరికా మహిళను అనుమానించిన శ్రీలంక పోలీసులు తర్వాత ఆమెకు క్షమాపణలు చెప్పారు.
స్లీపర్ సెల్స్ ఇంకా ఉన్నాయని చాలా మంది అధికారులు బీబీసీకి చెప్పారు.
ముస్లింలు మైనారిటీలుగా ఉన్న శ్రీలంకలో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ దాడులకు పాల్పడటానికి కారణం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
''ఇస్లామిక్ రాజ్య స్థాపనకు ప్రయత్నించిన సిరియా, ఇరాక్ ఇప్పుడు భౌతికంగా ధ్వంసం అయ్యాయి. ఆ స్థానంలో శ్రీలంక దీవిని ఉపయోగించుకోవాలని ఐఎస్ భావిస్తుండవచ్చు'' అని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
శ్రీలంక అనేక దశాబ్దాలుగా యుద్ధాలు, హింసతో తీవ్రంగా ఇబ్బందిపడుతోంది. ఇంకా అదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తోంది. రాజకీయ సమైక్యత లేనంతకాలం దేశం దుర్భర స్థితిలోనే ఉంటుందుని చాలా మంది ప్రజలు భయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి
- ఐఎస్ తీవ్రవాదులు ఇప్పుడేం చేస్తున్నారు?
- మొట్టమొదటి ఎన్నికల ప్రచారం ఎలా జరిగింది?
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో ఏ పార్టీది పైచేయి?
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2019: కీలకమైన ఈ 10 నియోజకవర్గాల్లో గెలిచేదెవరో...
- మామిడి పళ్లు నోరూరిస్తున్నాయా.. కార్బైడ్‌తో జాగ్రత్త
- వాట్సాప్‌లో సమస్య: మొబైల్ ఫోన్లపై హ్యాకర్ల దాడి.. రహస్యంగా నిఘా
- డేటింగ్ యాప్ నుంచి అధునాతన కార్ల వరకు అన్నీ కెనడాలోనే ఎందుకు పరీక్షిస్తారు?
- వీర్ సావర్కర్: కొందరికి హీరో, మరికొందరికి విలన్...
- ‘ఆమెతో సెక్స్ అంటే ఓ కొట్లాట... ఆమె ఒంటి మీది దుస్తులన్నీ చింపేసేవాడ్ని’
- 'పదో తరగతిలో 60 శాతం మార్కులు... మా బాబు బంగారం'
- శ్రీలంక: హిందూ ఆలయాల వద్ద జంతుబలిని నిషేధించనున్న ప్రభుత్వం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










