శ్రీలంక పేలుళ్లు: 'కత్తులు, ఇతర ఆయుధాలను వెనక్కి ఇవ్వాలని ప్రజలను కోరిన ప్రభుత్వం

శ్రీలంకలో పేలుళ్లు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఏప్రిల్ 21న శ్రీలంకలో బాంబు పేలుళ్ల తరువాత వందల సంఖ్యలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

శ్రీలంకలో బాంబు పేలుళ్ల అనంతరం అక్కడి ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. మరిన్ని చర్యల్లో భాగంగా ప్రజలు తమ వద్ద ఉన్న కత్తులు, ఇతర మారణాయుధాలను వెంటనే సైన్యానికి అప్పగించాలని ప్రజలను కోరింది.

అయితే, రోజువారి పనుల్లో ఉపయోగించే కత్తులను అప్పగించాల్సిన అవసరం లేదని పోలీసులు తెలిపారు.

ఏప్రిల్ 21న శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్లలో 250 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత పోలీసులు వందల కొద్దీ ఆయుధాలను స్వాధీనం చేసుుకున్నారు.

అలాగే, ఎవరివద్దనైనా పోలీసు, మిలటరీ దుస్తులు ఉంటే వెంటనే సమీప పోలీసు స్టేషన్‌లో అప్పగించాలని పోలీసు అధికార ప్రతినిధి రువాన్ గుణశేఖర కోరారు.

అయితే, రెండు రోజుల నుంచి ఆయుధాలను అప్పగిస్తున్నవారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టారా లేదా అనే అంశంపై ఆయన వివరణ ఇవ్వలేదు.

బాంబు పేలుళ్లలో 25 నుంచి 30 మంది ప్రమేయం ఉండొచ్చని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పారు.

శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన

‘‘పేలుడుతో ప్రమేయం ఉన్న గ్రూపులోని క్రీయాశీలంగా ఉన్న అందరిని మేం గుర్తించాం. ఇప్పుడు వారిని అరెస్టు చేస్తాం’’ అని ఆయన తెలిపారు.

అయితే, తాము అనుమానితులుగా గుర్తించినవారు ఆత్మాహుతి దళాలా కాదా అనేదానిపై ఇంకా సమాచారం లేదని అన్నారు.

పేలుళ్ల వెనుక ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రమేయం ఉండొచ్చని తాను నమ్ముతున్నట్లు చెప్పారు.

‘‘పేలుళ్ల వెనక ఎవరు ఉన్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. శ్రీలంక బాంబు పేలుళ్లకు బాధ్యులం మేమే అని ఐఎస్ సంస్థ ప్రకటించింది.’’ అని ఆయన గుర్తు చేశారు.

8 దేశాలకు చెందిన ఇంటలిజెన్స్ సంస్థలు దర్యాప్తులో తమకు సహకరిస్తున్నాయని చెప్పారు.

శ్రీలంకలో పేలుళ్లు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, బాంబు పేలుళ్ళ బాధితులకు నివాళిగా నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శన

అధ్యక్ష ఎన్నికలకు ముందే దేశంలో తీవ్రవాదాన్ని తమ భద్రతా దళాలు అణచివేస్తాయని తాను నమ్ముతున్నట్లు సిరిసేన తెలిపారు.

‘‘ఎన్నికలను వాయిదా వేయలేం. అందుకే దీనికంటే ముందే స్థిరతాన్ని తీసుకొచ్చి ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తాం’’ అని ఆయన చెప్పారు.

ఆదివారం నాటి దాడుల తరువాత చాలా మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దశాబ్దం కిందట అంతర్యుద్ధం ముగిసిన తరువాత సంభవించిన ఈ బాంబు పేలుళ్ళు శ్రీలంకలో శాంతి భద్రతలు కుదుటపడ్డాయనే భావనను చెదిరిపోయేలా చేశాయి.

ఈ దాడుల్లో చనిపోయిన వారిలో అధిక శాతం శ్రీలంక పౌరులే. వారితో పాటు భారత్, బ్రిటన్ వంటి దేశాలకు చెందిన విదేశీయులు కూడా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)