శ్రీలంక దాడుల మృతులు: వంద మరణాలు ఎందుకు తగ్గాయి? తప్పుగా లెక్కించడానికి కారణాలేంటి?

ఫొటో సోర్స్, Getty Images
శ్రీలంక దాడుల మృతుల సంఖ్య 253 అని, ఇంతకుముందు ప్రకటించినట్లు 359 కాదని ఆరోగ్యశాఖ గురువారం స్పష్టం చేసింది.
మృతదేహాల లెక్కింపులో పొరపాటు జరగడం వల్లే ఈ వ్యత్యాసం వచ్చిందని ప్రబుత్వం తెలిపింది.
మార్చురీలు ఇంతకుముందు కచ్చితమైన గణాంకాలు ఇవ్వలేదని రక్షణశాఖ ఉప మంత్రి రువాన్ విజేవర్దనే వెల్లడించారు.
మృతదేహాలు చాలా భాగాలుగా తెగిపోయి ఉన్నాయని, అందువల్లే కచ్చితమైన లెక్క వేయడం కష్టమైందని ఆరోగ్య సేవల విభాగం అధిపతి అయిన ఒక ఉన్నతాధికారి రాయిటర్స్ వార్తాసంస్థకు చెప్పారు.
గురువారం రాత్రికి అన్ని మృతదేహాల పరీక్ష పూర్తయ్యిందని, కొన్ని మృతదేహాలను ఒకటి కన్నా ఎక్కువసార్లు లెక్కించినట్లు వెల్లడైందని ఆరోగ్యశాఖ వివరించింది.
దాడుల ముప్పుపై నిఘా హెచ్చరికలు అందినప్పటికీ తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందంటూ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయని, విశ్వసనీయతను పునరుద్ధరించుకొనేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సమయంలో మృతుల సంఖ్య ఆకస్మికంగా తగ్గిందని బీబీసీ వరల్డ్ సర్వీస్ దక్షిణాసియా ఎడిటర్ జిల్ మెక్‌గివరింగ్ చెప్పారు.
పేలుళ్లతో ఏర్పడ్డ సంక్షోభంపై వదంతులు, బూటకపు వార్తలు వ్యాప్తి చెందుతున్నాయని, వీటిని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె తెలిపారు. ఈ తరుణంలో మృతుల సంఖ్యలో ఈ సవరణ అంతగా ప్రభావాన్ని చూపే అవకాశం లేదు.
ఈ నెల 21న కొలంబో ప్రాంతంలో, తూర్పు ప్రాంత నగరం బట్టికలోవాలో చర్చిలు, హోటళ్లపై ఆత్మాహుతి బాంబర్లు పెద్దయెత్తున జరిపిన దాడులకు పాల్పడ్డారు. తర్వాత కొన్ని చోట్ల బాంబు పేలుళ్లు కూడా సంభవించాయి.

ఫొటో సోర్స్, EPA
భయాందోళనలో ముస్లిం మైనారిటీలు
తమపై హింస జరుగుతుందేమోననే ఆందోళన శ్రీలంక ముస్లింలలో నెలకొందనే వార్తలు వస్తున్నాయి.
నెగోంబోలో చాలా మంది మైనారిటీ తెగ అయిన అహ్మదీకి చెందినవారు. వీరిలో కొందరు ప్రస్తుతం పోలీసు రక్షణలో ఒక మసీదులో ఉంటున్నారు.
అహ్మదీ తెగవారు తమను ముస్లింలుగానే చెప్పుకొంటారు. వారు ఖురాన్‌ను పాటిస్తారు. చాలా మంది సంప్రదాయ ముస్లింలు మాత్రం వీరు ఇస్లాం సంప్రదాయాలకు విరుద్ధంగా ఉంటారని భావిస్తారు. శ్రీలంకలో ఉంటున్న అహ్మదీ ముస్లింలలో చాలా మంది పాకిస్తాన్, ఇతర దేశాల్లో మతపర హింస నుంచి బయటపడేందుకు అక్కడి నుంచి పారిపోయి వచ్చినవారే.
కొందరు అహ్మదీ ముస్లింలపై దాడులు జరిగాయని ప్రధాని రణిల్ విక్రమసింఘే అంగీకరించారు.
శ్రీలంక జనాభా 2.1 కోట్లు కాగా అందులో ముస్లింలు పది శాతంలోపే ఉంటారు.

ఫొటో సోర్స్, Reuters
"ఇప్పుడు మేం ఎక్కడికి వెళ్లాలి"
ఈ నెల 25 నాటికి నెగోంబోలోని ఫైజుల్ మసీదులో 600 మందికి పైగా అహ్మదీలు ఆశ్రయం పొందుతున్నారని బీబీసీ ప్రతినిధి మురళీధరన్ కాశీవిశ్వనాథన్ చెప్పారు.
శ్రీలంకలోని ఐదు అహ్మదీ మసీదుల్లో ఇది ఒకటి.
అహ్మదీల్లో అత్యధికులు కేథలిక్ క్రైస్తవుల ఇళ్లల్లో అద్దెకు ఉంటున్నారు. దాడులు ఈ నెల 21న జరగ్గా, 24 నుంచి అహ్మదీ ముస్లింలలో ఆందోళన పెరుగుతూ వస్తోంది.
"దాడి జరిగిన చర్చికి కొంత దూరంలోనే మా ఇల్లు ఉంది. దాడి తర్వాత మా ఇంటి యజమానికి చాలా ఆందోళన చెందారు. మరెక్కడైనా సురక్షితంగా ఉండాలని నాకు చెప్పారు. నేను, నాలాగే చాలా మంది ఒకేసారి సంవత్సరం అద్దె చెల్లించి ఉంటున్నారు. మేం ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి" అని 27 ఏళ్ల హబీస్ రబ్బా సోయబ్ విచారం వ్యక్తంచేశారు.
ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్(యూఎన్‌హెచ్‌సీఆర్) తోడ్పాటుతో దాదాపు 800 మంది పాకిస్తానీ అహ్మదీలు నెగోంబోలో ఉంటున్నారు. మతపర హింసకు భయపడి వీరు పాకిస్తాన్ నుంచి పారిపోయి నెగోంబో వచ్చారు.
ఐరోపా దేశాల్లో లేదా అమెరికాలో ఆశ్రయం కోసం వారు ప్రయత్నాలు చేస్తున్నారు.
నెగోంబోలో స్థానికులైన అహ్మదీలు ఐదు వేల మందికి పైగా ఉన్నారు. వీరిలో చాలా మంది సంవత్సరాలుగా నెగోంబోలో ఉంటున్నారు. వారికి సొంత ఇళ్లు, వ్యాపారాలు కూడా ఉన్నాయి.
"మేం ఇక్కడ చాలా కాలంగా ఉంటున్నందున మమ్మల్ని ఎవరూ బెదిరించడం లేదు" అని పాకిస్తానీ అహ్మదీలకు సహాయం అందిస్తున్న స్థానిక ముస్లిం యువతలో ఒకరు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- జీసస్ గురించి ఖురాన్ ఏం చెబుతోంది?
- శ్రీలంక పేలుళ్లు: ఈ ఫొటోలు నిజమేనా?
- కిమ్ జోంగ్ ఉన్: ప్రపంచ రాజకీయాల్లో ఆ పేరంటే ఎందుకంత సంచలనం
- శ్రీలంక పేలుళ్లు: ఆసుపత్రుల్లో మృతదేహాలు కుళ్లిపోతున్నాయంటూ భారతీయుల ఆగ్రహం
- మనుషుల్లాగా సెల్ఫీకి ఫోజిచ్చిన గొరిల్లాలు... ఈ ఫొటో వెనకున్న పూర్తి కథ
- శ్రీలంకలో దాడులను భారత్ ముందే ఎలా పసిగట్టింది?
- ఈ దొంగలు మామూలోళ్లు కారు.. ఆర్టీసీ బస్ ఎత్తుకెళ్లి ఒక్క రోజులో ఏ పార్టుకు ఆ పార్టు విప్పేశారు
- శ్రీలంక పేలుళ్లు: ఆస్ట్రేలియా, బ్రిటన్లలో సూసైడ్ బాంబర్ విద్యాభ్యాసం
- నేషనల్ తౌహీద్ జమాత్: శ్రీలంక పేలుళ్లు ఈ గ్రూపు పనేనా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









