టీఎస్‌ఆర్టీసీ బస్: ‘‘పక్కా ప్లాన్‌తో ప్రొఫెషనల్స్ చేసిన దొంగతనం ఇది’’.. ఎలా జరిగిందంటే..

హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు మాయమైంది. రాత్రి పూట సీబీఎస్ దగ్గర నిలిపిఉంచిన బస్సును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు.
కూలిపోయిన సీబీఎస్ బస్టాండ్ దగ్గర ఖాళీ స్థలంలో మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో డ్రైవర్ బస్సును పార్క్ చేశారు. అక్కడ నైట్ హాల్ట్ ఉంది. కానీ తెల్లారేసరికి అక్కడ బస్సు లేకుండా పోయింది. ఇది.. కుషాయిగూడకు చెందిన మెట్రో ఎక్స్‌ప్రెస్ కేటగిరీ బస్సు. ఏపీ 11 జెడ్ 6254 నంబరు కలిగిన 3డి రూట్ బస్సు అంబేద్కర్ నగర్ - అఫ్జల్ గంజ్‌ల మధ్య నడుస్తుంది.
ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు బుధవారం అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంగళవారం రాత్రి ఆ బస్సు తూప్రాన్ హైవేపై వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అటు పోలీసులతో పాటు, ఆర్టీసీ సిబ్బంది కూడా తెలంగాణలోని అన్ని టోల్ ప్లాజాల దగ్గరా కాపలా కాసి, బస్సు కోసం వెతికారు. ఈ ఘటనపై రవాణ శాఖ మంత్రి ప్రశాంత రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ డిపోల వద్ద భద్రత పెంచాలని ఆదేశించారు.
ఎట్టకేలకు బస్సు ఆచూకీని గురువారం పోలీసులు కనుగొన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ దగ్గర ఒక ఫౌండ్రీలో ఆ బస్సు భాగాలను వేరుచేసి, ముక్కలుగా స్క్రాప్ చేస్తుండగా గుర్తించారు. కానీ ఆచూకీ కనుక్కునే సరికే బస్సు ముక్కలైపోయింది. ఏ పార్టుకు ఆ పార్టు విడదీసేశారు.
అయితే బస్సు దొరికిన విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు.
ఆర్టీసీ బస్సులు మాయం అవడం, దొంగలు ఎత్తుకెళ్లి స్క్రాప్ చేసి అమ్మేయడం లేదా వేరే చోట పార్క్ చేసి వదిలేయడం వంటివి జరగడం ఇది మొదటిసారి కాదు. హైదరాబాద్‌లో గతంలో కూడా రెండుమూడుసార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి.

ఫొటో సోర్స్, UGC
సాధారణంగా ఆర్టీసీ బస్సులకు, ముఖ్యంగా సిటీ సర్వీసులు, పల్లె వెలుగు సర్వీసులు అంటే హై ఎండ్ ఏసీ కాని సర్వీసులకు సరైన తాళం ఉండదు. వాటిని డిపోల్లోనే భద్రంగా చూడాలి. డ్రైవింగ్ లేదా మెకానికింగ్ మీద కాస్త అవగాహన ఉన్న వారు బస్సును స్టార్ట్ చేయవచ్చు. దానికితోడు సిటీ బస్సులకు తలుపులు ఉండవు.

ఫొటో సోర్స్, UGC
ప్రొఫెషనల్సే ఇది చేశారు - టీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
‘‘ఆర్టీసీ బస్సు నంబరు ప్లేట్, ఇంజిన్ ఛాసిస్ నంబరు అన్నీ స్పష్టంగా ఉన్నాయి. షీట్స్ ద్వారా కూడా గుర్తించొచ్చు. ప్రస్తుతం మిగిలిన బస్‌ను బోధన్ డిపోకు తరలించాం. అలాగే మిగిలిన సీట్లు, షీట్స్ అన్నిటినీ మరో రెండు బస్సుల్లో బోధన్ డిపోకు తీసుకువచ్చాం. టైర్ల దగ్గర ఛాజ్ కట్ చేశారు.
దొంగలు పక్కా ప్లాన్ తో ఇది చేశారు. సీబీఎస్ హ్యాంగర్ కూలిపోయిన తరువాత.. అక్కడ ఖాళీ స్థలంలోనే బస్సులు పార్క్ చేసి డ్రైవర్లు పక్కనే ఉన్న రెస్టు రూముల్లో పడుకుంటారు. కానీ అక్కడ నుంచి రోజుకు 1000 బస్సులు వెళుతుంటాయి. ఒక 40 బస్సుల వరకూ రాత్రి పూట నైట్ హాల్ట్ కోసం ఆగుతాయి. మా అంచనా ప్రకారం ఈ బస్ పార్క్ చేసిన కొద్ది సేపటికే దొంగ ఎత్తుకెళ్లాడు.
పోలీసులతో పాటు ఆర్టీసీ కూడా తన డీఎంలు, ఇతర టికెట్ చెకింగ్ స్క్వాడ్లతో వెతికింది. చాలా మంది మాకు బస్ చూశాం అని చెప్పారు. భైంసా దగ్గర సరిహద్దు దాటిందని గుర్తించిన తరువాత నాందేడ్ మొత్తం జల్లెడ పట్టాం. దాదాపు పోలీసులూ, మేమూ ఒకేసారి స్పాట్‌కి చేరుకున్నాం.గతంలో ఇలాంటివి చాలాసార్లు జరిగాయి. నాకు గుర్తుండే ఒక ఆరుసార్లు జరుగుంటాయి. కానీ అవన్నీ ఆకతాయి పనులు. బస్ నడపాలన్న సరదా కోసమో, మరో ఉద్దేశంతోనో బస్ తీసుకెళ్లి, ఎక్కడైనా యాక్సిడెంట్ అయితేనో లేకపోతే డీజెల్ అయిపోతే వదిలేస్తారు. కానీ ఈసారి మాత్రం ఎవరో ప్రొఫెషనల్సే ఇది చేశారు. కొన్ని అల్యూమినియం షీట్లు అమ్మినట్టు తెలిసింది. బ్యాటరీలు దొరకలేదు’’ అని టీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం రవీందర్ బీబీసీతో అన్నారు.తమ విచారణ కొనసాగుతోందని, కాబట్టి ఇంకా ఏం చెప్పలేమని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
- శ్రీలంకలో దాడులను భారత్ ముందే ఎలా పసిగట్టింది?
- బోన్సాయ్: 400 ఏళ్ల వయసున్న చెట్టు దొంగతనం
- ‘క్యాష్ లెస్’ దొంగతనాలు: పర్సులు కొట్టేవారంతా ఇప్పుడు పక్షుల వెంటపడ్డారు
- ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాన్ని మీరు చాలా రోజులు తింటారా?
- 'కీలెస్ కార్లు'... ఈజీగా కొట్టేస్తున్న దొంగలు... ఈ కార్లను కాపాడుకోవటం ఎలా?
- నిజాం మ్యూజియంలో బంగారు టిఫిన్ బాక్సును ఎలా దొంగిలించారంటే..
- ఎల్ చాపో గజ్మన్: ప్రపంచంలోనే అత్యంత పేరుమోసిన నేరస్తుడిపై ముగిసిన విచారణ
- గుండెల్ని పిండేసే వ్యథ: జైలుకు వెళ్లేందుకు పదేపదే నేరాలు చేస్తున్న జపాన్ వృద్ధులు.. ఎందుకంటే...
- మనుషుల్లాగా సెల్ఫీకి ఫోజిచ్చిన గొరిల్లాలు... ఈ ఫొటో వెనకున్న పూర్తి కథ
- ట్విటర్ సీఈఓ: మంచునీటి స్నానం, ఒంటి పూట భోజనం.. ఎంత కష్టాన్నైనా తట్టుకోగలనంటున్న జాక్ డోర్సీ
- తెలంగాణ ఇంటర్మీడియట్లో ఫెయిలైన విద్యార్థులందరికీ ఉచితంగా రీవెరిఫికేషన్.. స్పందించిన కేసీఆర్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









