శ్రీలంకలో ముస్లిం వ్యతిరేక అల్లర్లు... ఉక్కుపాదంతో అణచివేస్తామన్న ప్రభుత్వం

కినియమాలో దాడికి గురైన మసీదు, శ్రీలంక హింస

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కినియమాలో దాడికి గురైన మసీదు

శ్రీలంకలో ముస్లిం వ్యతిరేక అల్లర్లను అరికట్టేందుకు విధించిన రాత్రి పూట కర్ఫ్యూను ఆ దేశ ప్రభుత్వం పాక్షికంగా ఎత్తివేసింది.

వాయువ్య ప్రావిన్సులో మాత్రం కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రకటించింది.

మసీదులు, ముస్లింలకు చెందిన దుకాణాలను లక్ష్యంగా చేసుకుని ఈ అల్లర్లు జరుగుతున్నాయి. వీటిలో ఓ ముస్లిం వ్యక్తి కత్తి పోట్లకు గురై మరణించారు.

అల్లర్లకు పాల్పడుతున్న వందల మందిని చెదరగొట్టేందుకు కొన్ని పట్టణాల్లో పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు.

ఈస్టర్ రోజున శ్రీలంకలో ఇస్లామిస్ట్ మిలిటెంట్లు కొన్ని చర్చిలు, హోటళ్లలో బాంబు పేలుళ్లకు పాల్పడటంతో 250 మందికిపైగా మృతిచెందిన సంగతి తెలిసిందే.

అప్పటి నుంచి దేశంలో ఉద్రిక్తతలు పెరిగాయి.

తాజా పరిస్థితుల నేపథ్యంలో శ్రీలంక పోలీస్ ఛీఫ్ చందన విక్రమరత్నే టీవీ ప్రసంగం చేశారు.

అల్లర్లకు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.

ప్రస్తుత అల్లర్ల వల్ల ఈస్టర్ పేలుళ్ల దర్యాప్తునకు అవరోధాలు కలుగుతున్నాయని, ప్రజలు సంయమనం పాటించాలని ప్రధాని రణిల్ విక్రమసంఘే విజ్ఞప్తి చేశారు.

సుమారు 2.2 కోట్ల జనాభా కలిగిన శ్రీలంకలో ముస్లింలు పది శాతం వరకూ ఉన్నారు. సింహలీస్ బౌద్ధులు ఆ దేశంలో మెజార్టీ వర్గం.

శ్రీలంక హింస

ఫొటో సోర్స్, Reuters

చిలా పట్టణంలో ఒకరి మృతి

శ్రీలంక రాజధాని కొలంబోకు ఉత్తరంగా ఉన్న మూడు జిల్లాల్లో ప్రధానంగా ఈ అల్లర్లు చోటుచేసుకున్నాయి.

వాయువ్య పట్టణం కినియమాలో ఓ మసీదుపై కొంతమంది దాడి చేశారు.

మసీదు కిటికీ అద్దాలు పగులగొట్టారు. ఖురాన్ ప్రతులను కిందపడేశారు.

సమీపంలోని ఓ కొలనులో ఆయుధాల కోసం సైనికులు గాలించారని, అనంతరం మసీదు భవనంలోనూ గాలింపు జరపాలని డిమాండ్ చేస్తూ కొందరు ఆందోళన చేపట్టడం ఈ దాడికి దారితీసిందని రాయిటర్స్ వార్తాసంస్థ పేర్కొంది.

ఫేస్‌బుక్‌లో ఓ తగువు తర్వాత క్యాథలిక్ క్రైస్తవులు ఎక్కువగా ఉండే చిలా పట్టణంలో మసీదులు, ముస్లింల దుకాణాలపై దాడులు జరిగాయని పోలీసులు తెలిపారు.

హింస రేగేందుకు కారణమని భావిస్తున్న ఆ ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టిన 38 ఏళ్ల ముస్లిం వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు.

శ్రీలంక వాయువ్య ప్రాంతంలోనే ఉన్న పుట్టాలం జిల్లాలో ఓ దుకాణంపై ఓ గుంపు దాడి చేసింది. దాని యజమాని కత్తిపోట్లకు గురై మృతిచెందారు.

హెట్టిపోలా పట్టణంలోనూ అలర్లు జరిగాయని, కనీసం మూడు దుకాణాలకు ఇక్కడ నిప్పుపెట్టారని పేర్కొంటూ కొన్ని వార్తలు వచ్చాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

సోషల్ మీడియాపై నిషేధం

హింసను అరికట్టేందుకు ఫేస్‌బుక్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌లను అధికారులు నిషేధించారు.

తప్పడు సమాచారానికి ప్రభావితం కావొద్దని, సంయమనం పాటించాలని శ్రీలంక పౌరులకు ప్రధాని విక్రమసింఘె ట్విటర్ ద్వారా పిలుపునిచ్చారు.

మిలిటెంట్లను పట్టకునేందుకు, దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు భద్రతదళాలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

ట్విటర్‌పై శ్రీలంక నిషేధం విధించలేదు.

ఈస్టర్ పేలుళ్ల వెనుక రెండు ఇస్లామిక్ మిలిటెంట్ సంస్థల హస్తం ఉందని శ్రీలంక ప్రభుత్వం ఆరోపించింది. ఆ ఘటనల తర్వాత దేశంలో అత్యవసర పరిస్థితి విధించింది.

పేలుళ్లలో తమ పాత్ర ఉన్నట్లు ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ సంస్థ ప్రకటించింది. అయితే, ఇతర వివరాలేవీ వెల్లడించలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)