శ్రీలంక పేలుళ్లు: ముఖంపై ముసుగు వేసుకుని తిరగడం నిషేధం

ఫొటో సోర్స్, Getty Images
శ్రీలంకలో 250 మందికిపైగా బలి తీసుకున్న వరుస బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడుల తరువాత అక్కడి ప్రభుత్వం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది.
ప్రజలెవరూ బహిరంగ ప్రదేశాల్లో ముఖాన్ని కప్పుకొని తిరగరాదంటూ ముఖంపై వేసుకునే ముసుగులను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సోమవారం నుంచే ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రకటించారు.
తాము ఎవరన్నది తెలియకుండా ఉండేలా ముఖం కనిపించకుండా ఎలాంటి వస్త్రాలు ధరించరాదని, దేంతోనూ ముఖాలను కప్పుకోరాదని సూచించారు.
భద్రతా కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడి కార్యాలయం వెల్లడించగా.. అక్కడి ముస్లిం నేతలు ఈ చర్యను తప్పుపడుతున్నారు.
అయితే, అధ్యక్ష కార్యాలయం జారీచేసిన ఈ ఆదేశాలలో ఎక్కడా ప్రత్యేకంగా నికాబ్, బురఖాలపై నిషేధం విధిస్తున్నట్లు లేదు.. ఏ రకంగానూ ముఖాన్ని కప్పుకొని తిరగారదని మాత్రమే ఆదేశాలు జారీచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
వ్యతిరేకిస్తున్న ముస్లిం సంస్థలు
శ్రీలంకలోని దాదాపు 2.1 కోట్ల జనాభా ఉండగా అందులో 10 శాతం ముస్లింలు ఉన్నారు.
శ్రీలంక ముస్లిం మహిళల్లో నికాబ్, బురఖాలు వాడేది కొద్దిమంది మాత్రమే.
గతవారం శ్రీలంకకు చెందిన ఓ ఎంపీ కూడా భద్రతా కారణాలతో నికాబ్, బురఖాలను నిషేధించాలని ప్రతిపాదించారు.
మరోవైపు అధ్యక్షుడి నిర్ణయంపై అక్కడి ఆల్ సిలోన్ జమయితుల్లా ఉలామా అనే సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది.
దేశంలో మరిన్ని దాడులు జరగొచ్చన్న సమాచారంతో భద్రతా బలగాలు పెద్దఎత్తున సోదాలు జరుపుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








