గాజా ‘బోర్డ్ ఆఫ్ పీస్‌’లో చేరాలని మోదీకి ట్రంప్ ప్రభుత్వ ఆహ్వానం, సభ్యత్వానికి ఎన్నివేల కోట్లు కట్టాలంటే..

మోదీ, ట్రంప్, ఇజ్రాయెల్, గాజా, ఐక్యరాజ్యసమితి

ఫొటో సోర్స్, PRAKASH SINGH/AFP via Getty Images

గాజా కోసం ట్రంప్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త ' బోర్డ్ ఆఫ్ పీస్'లో చేరాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా అమెరికా ఆహ్వానించింది.

భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ అధికారిక 'ఎక్స్' ఖాతాలో ఈ విషయాన్ని ప్రకటించారు.

"గాజా పీస్‌ బోర్డులో భాగస్వామి కావాలని అధ్యక్షుడు ట్రంప్ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించడం నాకు చాలా గౌరవంగా ఉంది. శాశ్వత శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం గాజాలో సమర్థవంతమైన పరిపాలనకు బోర్డు మద్దతు ఇస్తుంది" అని ఆయన పోస్ట్ చేశారు.

గాజాలో శాంతినెలకొల్పడంపై 2025 అక్టోబరులో ఈజిప్టులోని షర్మ్ ఎల్-షేక్‌లో అంతర్జాతీయ సమావేశం జరిగింది. దాదాపు 20 దేశాల నుంచి నాయకులు, ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సమావేశానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించారు. కానీ ఆయన హాజరు కాలేదు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ భారతదేశం తరఫున పాల్గొన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మోదీ, ట్రంప్, ఇజ్రాయెల్, గాజా, ఐక్యరాజ్యసమితి

ఫొటో సోర్స్, Reuters / Getty Images / EPA

ఫొటో క్యాప్షన్, ‘బోర్డ్ ఆఫ్ పీస్' ఒక కొత్త అంతర్జాతీయ శాంతి సంస్థగా పనిచేస్తుందని అమెరికా చెబుతోంది.

'బోర్డ్ ఆఫ్ పీస్' లక్ష్యమేంటి?

ఈ బోర్డుకు అమెరికా అధ్యక్షుడు అధ్యక్షత వహిస్తారు. ఇది గాజా తాత్కాలిక పాలన, పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించే సాంకేతిక నిపుణుల కమిటీ పనితీరును పర్యవేక్షిస్తుంది.

ఏ దేశమైనా ఈ బోర్డులో శాశ్వత సభ్యత్వం పొందాలంటే భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుందని న్యూయార్క్ టైమ్స్ నివేదిక తెలిపింది.

బోర్డు ఏర్పడిన తొలి మూడు సంవత్సరాల తర్వాత కూడా ఏదైనా దేశం దానిలో కొనసాగాలనుకుంటే అది ఒక బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 9 వేలకోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఈ బోర్డు డోనల్డ్ ట్రంప్ గాజా శాంతి ప్రణాళికలో భాగం. కానీ బోర్డు చార్టర్‌లో గాజా గురించి ప్రస్తావించలేదని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.

దీంతో ట్రంప్ ''బోర్డ్ ఆఫ్ పీస్' గాజా సంక్షోభాలను, ప్రపంచంలోని ఇతర సంక్షోభాలను పరిష్కరించే పాత్ర పోషించాలని భావిస్తోందని, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ప్రత్యామ్నాయంగా తనను తాను చూపించుకోవడం దీని లక్ష్యమని చాలామంది నిపుణులు ఊహాగానాలు చేశారు.

"గాజాను స్థిరీకరించడంలో కీలకమైన" విభాగానికి కార్యనిర్వాహక బోర్డులోని ప్రతి సభ్యుడు బాధ్యత వహిస్తారని వైట్‌హౌస్ తెలిపింది. అయితే ఎవరు దేనికి బాధ్యత వహిస్తారనేదానిపై ఇంకా స్పష్టత లేదు.

శాంతి బోర్డు అధికారవర్గంలో మహిళలు, పాలస్తీనియన్లు ఎవరూ లేరు. అయితే రాబోయే వారాల్లో మరింతమంది సభ్యులను ప్రకటిస్తామని వైట్ హౌస్ చెబుతోంది.

ఈ వ్యవస్థాపక కార్యనిర్వాహక బోర్డులో ఎవరెవరున్నారంటే?

మోదీ, ట్రంప్, ఇజ్రాయెల్, గాజా, ఐక్యరాజ్యసమితి

ఫొటో సోర్స్, BBC/Monika Ghosh

ఫొటో క్యాప్షన్, టోనీ బ్లెయిర్

సర్ టోనీ బ్లెయిర్

ట్రంప్ ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’’లో సభ్యుడిగా బ్రిటిష్ మాజీ ప్రధాని సర్ టోనీ బ్లెయిర్ చాలాకాలంగా ప్రచారంలో ఉన్నారు. ఈ సంస్థలో చేరడానికి బ్లెయిర్ ఆసక్తి వ్యక్తం చేసినట్టు అమెరికా అధ్యక్షుడు సెప్టెంబరులో ధ్రువీకరించారు.

లేబర్ పార్టీ మాజీ నాయకుడైన బ్లెయిర్ 1997 నుంచి 2007 వరకు బ్రిటిష్ ప్రధానమంత్రిగా పనిచేశారు. 2003లో ఆయన తన దేశాన్ని ఇరాక్ యుద్ధంలోకి నడిపించారు. ఇది బోర్డులో ఆయన ఉనికిని వివాదాస్పదం చేయవచ్చు.

పదవి నుంచి దిగిపోయిన తర్వాత 2007 నుంచి 2015 వరకు ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్, రష్యాతో కూడిన అంతర్జాతీయ శక్తుల క్వార్టెట్‌కు పశ్చిమాసియా రాయబారిగా పనిచేశారు.

వ్యవస్థాపక కార్యనిర్వాహక బోర్డులో అమెరికా పౌరుడు కాని ఏకైక సభ్యుడు సర్ టోనీ.

గాజా కోసం ట్రంప్ ప్రణాళికలను "రెండు సంవత్సరాల యుద్ధం, బాధ, దుఃఖాన్ని అంతం చేయడానికి ఉత్తమ అవకాశం" అని టోనీ బ్లెయిర్ అభివర్ణించారు.

మోదీ, ట్రంప్, ఇజ్రాయెల్, గాజా, ఐక్యరాజ్యసమితి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మార్కో రూబియో

మార్కో రూబియో

అమెరికా విదేశాంగ మంత్రిగా మార్కో రూబియో ట్రంప్ టీమ్‌లో విదేశాంగ విధానాల ఆలోచన, రూపకల్పనల్లో కేంద్రబిందువు.

ట్రంప్ తిరిగి అధికారంలోకి రాకముందు, గాజాలో కాల్పుల విరమణను రూబియో వ్యతిరేకించారు. "హమాస్ చేరుకోగల ప్రతి ప్రాంతాన్ని ఇజ్రాయెల్ నాశనం చేయాలని కోరుకుంటున్నా" అని ఆయన అన్నారు.

అయితే, అక్టోబరులో కుదిరిన ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం మొదటి దశను తర్వాత ఆయన ప్రశంసించారు. దీనిని ఉత్తమ, ఏకైక ప్రణాళిక అంటూ దాన్ని అభివర్ణించారు.

ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌ను విలీనం చేసుకునేందుకు అక్టోబరులో ఇజ్రాయెల్ పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా రూబియో విమర్శించారు.

మోదీ, ట్రంప్, ఇజ్రాయెల్, గాజా, ఐక్యరాజ్యసమితి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అమెరికా అధ్యక్షుని ప్రతినిధిగా విట్కాఫ్ అనేక అంశాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

స్టీవ్ విట్‌కాఫ్

పశ్చిమాసియాకు అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ కూడా బోర్డులో చేరనున్నారు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి. గోల్ఫ్‌లో ట్రంప్‌కు మాజీ భాగస్వామి.

గాజాలో యుద్ధాన్ని ఆపాలనే ట్రంప్ ప్రణాళిక రెండో దశను ఈ నెల ప్రారంభంలో విట్‌కాఫ్ ప్రకటించారు. ఈ దశలో హమాస్ నిరాయుధీకరణతో సహా గాజాలో పూర్తి స్థాయిలో సైన్యం తొలగింపు, గాజా పునర్నిర్మాణం ఉంటాయని ఆయన చెప్పారు.

ఒప్పందం ప్రకారం హమాస్ చేయాల్సినవన్నీ చేస్తుందని ఆశిస్తున్నానని, లేకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటుందని విట్‌కాఫ్ వ్యాఖ్యానించారు.

రష్యా, యుక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చే అమెరికా ప్రయత్నాలలో విట్‌కాఫ్ కీలక పాత్ర పోషించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో డిసెంబరులో ఐదు గంటల పాటు జరిగిన సమావేశం కూడా ఇందులో ఉంది.

మోదీ, ట్రంప్, ఇజ్రాయెల్, గాజా, ఐక్యరాజ్యసమితి

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్

జేర్డ్ కుష్నర్

అమెరికా అధ్యక్షుని అల్లుడు జేర్డ్ కుష్నర్ కూడా ట్రంప్ యంత్రాంగంలో విదేశాంగ విధాన చర్చలలో ముఖ్యమైన పాత్ర పోషించారు.

రష్యా-యుక్రెయిన్, ఇజ్రాయెల్-గాజా సంక్షోభాల్లో విట్‌కాఫ్‌తో పాటు కుష్నర్ అమెరికా తరఫున మధ్యవర్తిత్వం వ్యవహరించారు.

నవంబరులో ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును కలిసి శాంతి ఒప్పందానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న కీలకమైన అంశాలపై చర్చించారు.

"ప్రజలకు జీవనోపాధిని పెంపొందించడంపై దృష్టి పెడితే గాజా తీరం వర్ధిల్లుతుంది" అని 2024లో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ప్రసంగంలో కుష్నర్ వ్యాఖ్యానించారు.

మోదీ, ట్రంప్, ఇజ్రాయెల్, గాజా, ఐక్యరాజ్యసమితి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మార్క్ రోవాన్

మార్క్ రోవాన్

బిలియనీర్ మార్క్ రోవాన్ న్యూయార్క్‌కు చెందిన ఒక ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అపోలో గ్లోబల్ మేనేజ్‌మెంట్‌కు సీఈవో.

ట్రంప్ రెండో పదవీకాలంలో అమెరికా ఆర్థిక మంత్రి పదవికి పోటీపడిన వారిలో రోవాన్ ఉన్నారు.

మోదీ, ట్రంప్, ఇజ్రాయెల్, గాజా, ఐక్యరాజ్యసమితి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్‌లో పుట్టిన అజయ్ బంగా 2007లో అమెరికా పౌరసత్వం పొందారు.

అజయ్ బంగా

ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా తన సుదీర్ఘ కెరీర్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సహా అనేకమంది సీనియర్ అమెరికా నేతలకు సలహాలను అందించారు.

1959లో భారత్‌లో జన్మించిన బంగా 2007లో అమెరికా పౌరసత్వం పొందారు. ఆ తర్వాత దశాబ్దకాలానికి పైగా మాస్టర్ కార్డ్ సీఈఓగా పనిచేశారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ 2023లో ఆయనను ప్రపంచ బ్యాంకు అధిపతిగా నామినేట్ చేశారు.

రాబర్ట్ గాబ్రియేల్

ఈ బోర్డులో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ గాబ్రియేల్ చివరి సభ్యుడు.

గాబ్రియేల్ 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచి ట్రంప్‌తో కలిసి పనిచేస్తున్నారు. ఆ తర్వాత కొంతకాలం ఆయన మరో కీలక ట్రంప్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్‌కు ప్రత్యేక సహాయకుడిగా ఉన్నారని అమెరికా పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ పీబీఎస్ తెలిపింది.

మోదీ, ట్రంప్, ఇజ్రాయెల్, గాజా, ఐక్యరాజ్యసమితి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నికోలాయ్ మ్లాడెనోవ్

నికోలాయ్ మ్లాడెనోవ్

బల్గేరియా రాజకీయ నాయకుడు, ఐక్యరాజ్యసమితి పశ్చిమాసియా రాయబారి నికోలాయ్ మ్లాడెనోవ్ బోర్డ్ ఆఫ్ పీస్ తరఫు ప్రతినిధిగా గాజాలో ఉంటారని వైట్ హౌస్ ప్రకటించింది.

15 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక పాలస్తీనియన్ టెక్నికల్ కమిటీ, నేషనల్ కమిటీ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గాజా(ఎన్‌సీఏజీ)ని ఆయన పర్యవేక్షిస్తారు.

యుద్ధం తర్వాత గాజా రోజువారీ పరిపాలన బాధ్యత ఈ కమిటీకి అప్పగించారు.

ఈ కొత్త కమిటీకి పాలస్తీనా అథారిటీలో మాజీ డిప్యూటీ మంత్రి అలీ షాత్ నేతృత్వం వహిస్తారు. ఈ అథారిటీ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ నియంత్రణలోలేని ప్రాంతాలను పరిపాలిస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)