‘‘నా ఫ్రెండ్ ఆ గ్రనేడ్‌ను బయటకు విసరకపోయి ఉంటే, హమాస్ దాడిలో నేను చచ్చిపోయేవాడిని’’ అంటున్న నేపాలీ విద్యార్థి కథ..

ఫొటో సోర్స్, Dhan Bahadur Chaudhary
- రచయిత, ఫణీంద్ర దహాల్
- హోదా, బీబీసీ నేపాలీ, కాఠ్‌మాండూ
ఇటీవల హమాస్ విడుదల చేసిన బందీల మృతదేహాల్లో నేపాలీ విద్యార్థి బిపిన్ జోషీ మృతదేహం కూడా ఉంది. ఆయన రెండేళ్ల కిందట ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి సమయంలో.. తన స్నేహితులను రక్షించాక బందీగా పట్టుబడ్డాడు.
హమాస్ దళ సభ్యులు విసిరిన గ్రనేడ్‌ను బిపిన్ జోషీ దూరంగా విసిరారని ఆయన నేపాలీ సహ విద్యార్థి ధన్ బహదూర్ చౌధరి చెప్పారు.
‘‘వాళ్లు విసిరిన రెండు గ్రనేడ్లు గనుక పేలి ఉంటే నేను ప్రాణాలతో ఉండేవాడిని కాదు. బిపిన్ తెగించి, గ్రనేడ్‌ను బయటకు విసిరాడు’’ అని బీబీసీ నేపాలీకి వివరించారు ధన్ బహదూర్ .
గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం కింద హమాస్ విడుదల చేసిన నలుగురు బందీల మృతదేహాల్లో.. బహదూర్ స్నేహితుడు కూడా ఉన్నట్లు ఇజ్రాయెలీ మిలిటరీ గుర్తించిన తర్వాత ఆయన మాట్లాడారు.
2023 అక్టోబర్ 7న 23 ఏళ్ల బిపిన్‌తోపాటు మరో 250 మందిని బందీలుగా తీసుకువెళ్లింది హమాస్. అయితే.. బిపిన్ ఎప్పుడు మరణించారు, ఎలా మరణించారనే విషయాలు అస్పష్టంగా ఉన్నాయి.


ఫొటో సోర్స్, Courtesy Dhan Bahadur Chaudhary
'బంకర్లో ఉంటే సేఫ్‌గా ఉండొచ్చనుకున్నాం'
అక్టోబర్ 13న విడుదలైన బతికున్న బందీల్లో బిపిన్ ఉంటారని ఆయన కుటుంబీకులు, స్నేహితులు ఆశించారు. కానీ, అలా జరగలేదు.
కిబ్బుట్స్ అలుమిమ్‌పై దాడి జరిగేనాటికి.. బిపిన్, ధన్ బహదూర్‌తోపాటు మరో 15 మంది నేపాలీ వ్యవసాయ విద్యార్థులు మూడు వారాలకు పైగా ఇజ్రాయెల్ లో ఉన్నారు.
"ఇజ్రాయెల్‌లో ఏదో యుద్ధం జరుగుతోందని తెలుసు. కానీ, ఆ స్థాయిలో గ్రౌండ్ అటాక్ జరుగుతుందని మేం ఊహించలేదు" అని ధన్ బహదూర్ అన్నారు.
"క్షిపణి దాడులు జరిగినప్పుడు.. మేం బంకర్లలో లేదా అండర్ గ్రౌండ్‌లో ఉన్నట్లయితే సురక్షితంగా ఉండొచ్చని అనుకున్నాం" అని ఆయన చెప్పారు.
ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రారంభించిన "ఎర్న్ అండ్ లెర్న్ ప్రోగ్రామ్" కింద ఆ నేపాల్ విద్యార్థులు అక్కడికి చేరుకున్నారు. ఇది నేపాల్‌లో తమకు, తమ కుటుంబాలకు మంచి జీవితాన్ని అందించే అవకాశంగా వారు భావించారు.
తాను బతికి ఉన్నానంటే కారణం తన స్నేహితుడు బిపిన్ చూపిన తెగువేనని ధన్ బహదూర్ అన్నారు.
"మా బంకర్ల మీద రెండు గ్రనేడ్లు విసిరారు. తను (బిపిన్) వాటిల్లో ఒకదాన్ని తీసి, బయటకు విసిరాడు. ఇంకొకటి లోపలనే పేలింది. నేను, మరో నలుగురం గాయపడ్డాం" అని బహదూర్ వివరించారు.
"ఆ సమయంలో అతనికి ఏమీ కాలేదు. ఆ రెండు గ్రనేడ్లు గనుక అక్కడే పేలి ఉంటే.. నేను ఇలా మాట్లాడుతూ ఉండకపోయేవాడిని" అని అన్నారు.
"చెప్పడానికి మాటలు రావడం లేదు"
ఆ దాడిలో పదిమంది నేపాలి విద్యార్థులు చనిపోగా.. బిపిన్ ఒక్కడినే బందీగా పట్టుకుని వెళ్లారు.
"మరికొందరు కలిసి మరో బంకరులోకి వెళ్తుండగా నేను అతనిని చివరిసారి చూశా" అని ధన్ బహుదూర్ అన్నారు.
‘‘గాయం తర్వాత నేను నడవలేకపోయా. మొదటి బంకర్‌లోనే ఉండిపోయా. అతను ఉన్న బంకరుపై రెండు దాడులు జరిగాయని, అతడు హమాస్‌కు బందీగా చిక్కాడని తర్వాత తెలిసింది’’ అతని బహదూర్ చెప్పారు.
తన స్నేహితుడి మరణం గురించి విన్నాక తాను తీవ్ర విచారానికి లోనైనట్లు ఆయన చెప్పారు. తాను, బిపిన్ కలిసి చదువుకున్నామని చెప్పారు.
"అతను క్షేమంగా విడుదల కావాలని మేం మా తరఫున ఎంత చేయాలో అంత చేశాం. కానీ, నిన్న…మేం ఆ షాకింగ్ వార్త వినాల్సి వచ్చింది. నేపాల్ అంతా అతని మృతితో బాధ పడుతోంది. నా బాధ గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు" అని బహదూర్ అన్నారు.
‘‘యుద్ధం మొదలైన కొద్ది నెలల్లో బిపిన్ జోషీని చంపేశారు’’ అని తాము భావిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం అక్టోబర్ 14న తెలిపింది.
అయితే దాన్ని స్వతంత్రంగా ధ్రువీకరించే అవకాశం లేదు.
వాళ్లు చెప్పిందే నిజమైతే.. దీని గురించి హమాస్‌ను అంతర్జాతీయ సమాజం నిలదీయాలని ధన్ బహదూర్ అన్నారు.
ఇప్పటివరకు బిపిన్ కుటుంబ సభ్యులు.. అతని మరణం గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఫొటో సోర్స్, Dhan Bahadur Chaudhary
ఆ ఫుటేజీనే సాక్ష్యంగా..
అక్టోబర్ 7 నాటి ఫుటేజ్‌లో గాజాలోని అల్- షిఫా ఆస్పత్రిలోకి బిపిన్ నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.
కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంకంటే ముందు వరకు ఆ ఫుటేజ్‌నే బిపిన్ "బతికి ఉన్నారనే దానికి సాక్ష్యం"గా పరిగణిస్తూ వచ్చారు. ఏదైనా అద్భుతం జరుగుతుందేమోనని కుటుంబ సభ్యులు అనుకున్నారు.
ఇప్పుడు బిపిన్ స్వస్థలమైన భీమ్‌దత్త మునిసిపాలిటీలో ఆయన మరణ వార్త విని కుటుంబీకులు, బంధువులు దు:ఖంలో మునిగిపోయారు.
బందీల విడుదల కోసం ప్రయత్నాలు జరిపేందుకు బిపిన్ తల్లి, సోదరి అమెరికాకు వెళ్లారని బీబీసీ నేపాలీతో బిపిన్ కజిన్ కిషోర్ జోషీ చెప్పారు.
"ఆయన తల్లి, సోదరి గురువారం అమెరికా నుంచి తిరిగి వస్తున్నారు. వాళ్ల నాన్న తన బాధను వ్యక్తం చేయలేని పరిస్థితిలో ఉన్నారు" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Hostages and Missing Families Forum
నేపాల్ విదేశీ వ్యవహారల మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
మరోవైపు, బిపిన్ మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగిస్తారా లేదా అనే విషయంలో స్పష్టత లేదు.
మరణించిన ఇతర విద్యార్థుల్లానే బిపిన్ మృతదేహాన్ని కూడా ఆయన దేశమైన నేపాల్‌కు పంపించేందుకు ఇజ్రాయెల్ ఏర్పాటు చేసిందని నేపాలీ విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.
"బిపిన్ జోషీ మరణించారనే వార్త విని షాక్ అయ్యాం. ఈ బాధాకర సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నాం’’ అని సంతాప ప్రకటనలో తెలిపింది.
"బిపిన్ జోషీ మృతదేహాన్ని నేపాల్ తీసుకువచ్చిన తర్వాత కూడ ఆయన మృతి విషయంలో వాస్తవాలను తెలుసుకునేందుకు సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతూనే ఉంటాం" అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
"బిపిన్‌ను మా జ్ఞాపకాల్లో సజీవంగా ఉంచుకుంటాం. ఆయన కుటుంబానికి కావాల్సిన మద్దతు, పరిహారాన్ని మేం అందిస్తాం" అని ఆయన అన్నారు.
ధన్ బహదూర్ ఇంకా విచారంలోనే ఉన్నారు.
"నేపాల్‌కు తిరిగొచ్చాం. చదువుకుంటున్నాను. బిపిన్ కలలు మాత్రం నెరవేరలేదు" అని బాధగా అన్నారు బహదూర్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














