ట్రంప్ గాజా శాంతి ఒప్పందం: స్వాగతిస్తున్న వివిధ దేశాల నాయకులు

డోనల్డ్ ట్రంప్, నెతన్యాహు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రష్ది అబుఅలౌఫ్, జార్జ్ రైట్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

గాజా కోసం అమెరికా రూపొందించిన కొత్త శాంతి ప్రణాళికను యూరోపియన్, మిడిల్ ఈస్ట్ నాయకులు స్వాగతించారు. దీనికి అంగీకరించాలని హమాస్‌ను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

గాజా-ఇజ్రాయెల్ యుద్ధాన్ని తక్షణమే ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ నాయకుడు బెంజమిన్ నెతన్యాహు ఒక ప్రణాళిక రూపొందించారు.

అదేంటంటే, హమాస్ 72 గంటల్లో సజీవంగా ఉన్న 20 మంది ఇజ్రాయెలీ బందీలను విడుదల చేయాలి.

మరణించిన 24 మందికి పైగా బందీల శవాలను అప్పగించాలి.

ప్రతిగా, ఇజ్రాయెల్ వందలాది మంది పాలస్తీనియన్లను జైళ్ల నుంచి విడుదల చేస్తుంది.

హమాస్ అధికారులకు వైట్ హౌస్ 20-పాయింట్ల ప్రణాళిక ఇచ్చిందని.. కాల్పుల విరమణ చర్చల గురించి తెలిసిన పాలస్తీనా వర్గాలు బీబీసీకి తెలిపాయి.

దీనిలో హమాస్ గాజాను పాలించకూడదని పేర్కొనగా, భవిష్యత్తులో పాలస్తీనా దేశం ఏర్పడేందుకు మాత్రం వీలుకల్పించారని తెలుస్తోంది.

వైట్ హౌస్‌లో చర్చల తర్వాత ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ఈ ప్రణాళిక "శాంతి దిశగా చారిత్రాత్మక రోజు" అని అన్నారు.

అయితే.. హమాస్ ఈ ఒప్పందానికి అంగీకరించకపోతే "హమాస్ ముప్పును నాశనం చేసే పనిని పూర్తి చేయడానికి" నెతన్యాహుకు అమెరికా మద్దతు ఉంటుందని ఆయన అన్నారు.

ఈ ప్రణాళికకు అంగీకరించనిపక్షంలో, హమాస్‌ను నిర్మూలించడంలో నెతన్యాహుకు అమెరికా మద్దతు ఇస్తుందన్నారు.

హమాస్ ఆ ప్రణాళికను తిరస్కరించినా లేదా అమలు చేయకపోయినా, "హమాస్‌ పని ముగిస్తాం" అని ఆయన తెలిపారు.

అమెరికా అధ్యక్షుడి ప్రయత్నాలు "దృఢమైనవి" అని ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌‌లోని కొన్ని ప్రాంతాలను పాలించే పాలస్తీనా అథారిటీ పేర్కొంది.

గాజాలో యుద్ధం ఆపడం, మానవతా సహాయం అందించడం, బందీలు, జైలులో ఉన్న వారిని విడుదల చేయడం కోసం అమెరికా, ప్రాంతీయ దేశాలు, ఇతర భాగస్వాములతో కలిసి పని చేస్తామని పాలస్తీనా అథారిటీ వాఫా వార్తా ఎజెన్సీకి తెలిపింది.

ట్రంప్ నాయకత్వాన్ని, గాజాలో యుద్ధాన్ని ముగించడానికి నిజాయితీగా ఆయన చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్ట్, జోర్డాన్, టర్కీ, ఇండోనేషియా పాకిస్తాన్ విదేశాంగ మంత్రులు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ ఒప్పందాన్ని ఖరారు చేసి అమలు చేయడానికి అమెరికాతో చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఇది ద్విదేశ పరిష్కారానికి దారి తీస్తుందని, అందులో గాజా, వెస్ట్ బ్యాంక్ ఒకే పాలస్తీనా దేశంగా విలీనమవుతాయని వారు పేర్కొన్నారు.

ఈ ప్రతిపాదనకు ప్రధానమంత్రి నెతన్యాహు సానుకూల స్పందనపై సంతృప్తి వ్యక్తం చేశారు.

"శాంతికి నిజమైన అవకాశం ఇవ్వడానికి అన్ని పార్టీలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి" అని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గాజా,ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, అక్టోబర్ 2023 నుంచి గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 66,055 మంది వరకు మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఈ ప్రణాళిక వెంటనే అన్ని సైనిక యుద్ధాలను ఆపడంతో మొదలవుతుంది. ప్రస్తుత యుద్ధరేఖలు దశలవారీగా వెనక్కి తగ్గే పరిస్థితులు వచ్చే వరకు యథావిధిగా ఉంటాయి. హమాస్ తన ఆయుధాలను వదిలివేస్తుంది. దాని సొరంగాలు, ఆయుధ ఉత్పత్తి కేంద్రాలను నాశనం చేస్తారు.

ప్రతి ఇజ్రాయెల్ బందీ శవానికి, 15 మంది గాజా నివాసుల శవాలను ఇజ్రాయెల్ అప్పగిస్తుందని పేర్కొంది.

ఈ ప్రతిపాదనకు రెండు పక్షాలు అంగీకరించిన వెంటనే గాజాకు అన్ని రకాల సాయం అందుతుందని ఆ ప్రణాళిక నిర్దేశిస్తుంది.

భవిష్యత్తులో గాజాను ఎలా పాలించాలో కూడా ప్రణాళికలో పేర్కొన్నారు.

గాజాను తాత్కాలికంగా పాలించే పాలస్తీనా కమిటీ.. సాంకేతిక నైపుణ్యంతో, రాజకీయ రహితంగా ఉంటుంది. దానిని ట్రంప్ నేతృత్వంలోని కొత్త ‘బోర్డ్ ఆఫ్ పీస్’ పర్యవేక్షిస్తుంది.

గాజా శాంతి ఒప్పందం

ఫొటో సోర్స్, Reuters

వివిధ దేశాల నేతలు ఏమంటున్నారు

బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి సర్ టోనీ బ్లేర్, ఇతర నాయకులతో కలిసి పాలనా సమితిలో ఉంటారు. సమితిలోని మిగతా సభ్యులను తరువాత ప్రకటించనున్నారు. ఈ ప్రణాళిక "ధైర్యవంతమైంది, తెలివైంది" అని సర్ టోనీ చెప్పారు.

యూకే ప్రధాన మంత్రి సర్ కీర్ స్టార్మర్ కూడా ఈ ప్రణాళికను స్వాగతించారు. "అందరూ అమెరికాతో కలిసి, ఈ ఒప్పందాన్ని పూర్తి చేసి, అమలు చేయాలని కోరుతున్నాం." అని ఆయన అన్నారు.

"హమాస్ ఈ ప్రణాళికకు అంగీకరించి, ఆయుధాలను వదిలి, మిగిలిన బందీలను విడుదల చేస్తే, కష్టాలు ముగుస్తాయి" అని సర్ కీర్ అన్నారు.

యుద్ధాన్ని ముగించి బందీలను విడుదల చేసే ప్రయత్నాలకు "ఫ్రాన్స్ సహకరించడానికి సిద్ధంగా ఉంది" అని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ అన్నారు.

"ఈ ప్రతిపాదన ఈ ప్రక్రియలో కీలక మలుపు కావచ్చు. అన్ని పక్షాలు ప్రణాళికను అంగీకరించాలి అని ఇటలీ కోరుతోంది" అని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని అన్నారు.

ప్రత్యక్షంగా, పరోక్షంగా లేదా ఏ రూపంలోనైనా పాలనలో హమాస్ పాత్ర ఉండకూడదని ప్రణాళికలో ఉంది.

ఈ ప్రణాళికలో ఎక్కువ భాగం అమెరికా గాజాను పునర్నిర్మించడానికి "ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక" అని పిలిచే దానిపై దృష్టి సారించింది. "ఇజ్రాయెల్ గాజాను ఆక్రమించుకోదు లేదా స్వాధీనం చేసుకోదు" అని, ఇజ్రాయెల్ దళాలు దశలవారీగా ఆ భూభాగం నుంచి వైదొలుగుతాయని కూడా ఉంది.

ట్రంప్ మునుపటి ప్రకటనలకు భిన్నంగా , పాలస్తీనియన్లు గాజాను వదిలి వెళ్ళనవసరంలేదు. బదులుగా, "ప్రజలు అక్కడే ఉండమని మేం ప్రోత్సహిస్తాం, వారికి మెరుగైన గాజాను నిర్మించుకునే అవకాశాన్ని అందిస్తాం" అని ప్రణాళికలో ఉంది.

అలాగే పాలస్తీనా దేశ ఏర్పాటుకు కూడా తలుపులు తెరిచే ఉంటాయని కూడా అందులో ఉంది.

"గాజాలో యుద్ధాన్ని ముగించే వైట్ హౌస్ ప్రణాళికను ఖతార్, ఈజిప్టు అధికారులు దోహాలోని హమాస్ అధికారులకు అప్పగించారు" అని కాల్పుల విరమణ చర్చల గురించి తెలిసిన పాలస్తీనా వర్గం బీబీసీకి తెలిపింది.

అంతకుముందు, హమాస్ సీనియర్ అధికారి ఒకరు బీబీసీతో మాట్లాడుతూ..గాజాలో యుద్ధాన్ని ముగించగల ప్రతిపాదనను పరిశీలించడానికి తమ బృందం సిద్ధంగా ఉందని, అయితే ఏ ఒప్పందం అయినా పాలస్తీనా ప్రయోజనాలను కాపాడాలని, గాజా నుంచి ఇజ్రాయెల్ పూర్తిగా వైదొలగాలని నిర్ధరించాలని, యుద్ధాన్ని ముగించాలని చెప్పారు.

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఒక ప్రసంగం సందర్భంగా నెతన్యాహు మాట్లాడుతూ అనేక పాశ్చాత్య దేశాలు పాలస్తీనాను దేశంగా గుర్తించడాన్నివిమర్శించిన కొద్ది రోజులకే ఈ ప్రణాళికా ప్రకటన వెలువడింది.

ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైనప్పటినుంచి నెతన్యాహుకు గట్టిగా మద్దతు ఇస్తున్నప్పటికీ, ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్ చర్యలతో ఆయన కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)