ఆంధ్రప్రదేశ్: ‘ఒకే ఒక్క వర్షం – అమరావతి జలమయం’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టిన ప్రభుత్వాధికారి సస్పెన్షన్, అసలేమిటీ వివాదం, ఎవరి వాదన ఏంటి?

ఫొటో సోర్స్, Siddharthi Subhas Chandrabose/FB
- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
- హోదా, బీబీసీ కోసం
తిరుపతి జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ఎస్. సుభాష్ చంద్రబోస్‌ను సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతిపై తన వ్యక్తిగత ఫేస్‌బుక్ ఖాతాలో చేసిన పోస్టులు వివాదాస్పదం కావడమే దీనికి కారణం.
ఇంతకీ ఆ పోస్టులు ఏంటి?
అమరావతి రాజధాని ప్రాంతంలో శాఖమూరు, నీరుకొండ, కృష్ణాయపాలెం వద్ద సీఆర్‌డీఏ రిజర్వాయర్లు నిర్మించనున్నారంటూ వచ్చిన ఒక వార్తను ట్యాగ్ చేస్తూ సుభాష్ చంద్రబోస్ ఫేస్‌బుక్‌లో స్పందించారు.
"అమరావతి కోసం మూడు రిజర్వాయర్లేంటి? అమరావతినే ఒక రిజర్వాయర్‌గా కడితే పోతుంది కదా. ఏడాదికి మూడు పంటలు పండే నేల, రిజర్వాయర్ నీళ్లతో పుష్కలంగా ఉండదా?" అంటూ ఆయన రాశారు.
అంతేకాకుండా, "ఒకే ఒక్క వర్షం – అమరావతి జలమయం" అని క్యాప్షన్ పెట్టి వర్షపు నీటితో నిండిన ప్రాంతం ఫోటోను షేర్ చేశారు.
దానికి "మన డ్రోన్ క్యాపిటల్, మన క్వాంటం వాలీ, వెనుకబడిన ప్రాంతాల నిధులతో నిర్మించిన నగరం, అతిపెద్ద రైల్వే స్టేషన్, అతిపెద్ద విమానాశ్రయం కట్టబోయే రాజధాని" అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఈ పోస్ట్‌లను ఆధారంగా చేసుకుని ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలు రాశాయి.
దీంతో వాణిజ్య పన్నుల శాఖ సుభాష్ చంద్రబోస్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఆయన వివరణతో సంతృప్తి చెందని ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


ఫొటో సోర్స్, Siddharthi Subhas Chandrabose/FB
మెమోలో ప్రభుత్వం ఏం చెప్పింది
సుభాష్ వ్యాఖ్యలపై రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ ఎ.బాబు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.
తిరుపతిలోని రీజనల్ జీఎస్టీ ఆడిట్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయంలో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎస్.సుభాష్ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన కొన్ని వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వ విధానాలను అవమానించేలా, వ్యంగ్యంగా, కించపరిచేలా ఉన్నాయని కమిషనర్ బాబు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 19-08-2025 తేదీన ఈనాడులో 'అమరావతిపై పదే పదే అదే విషం', ఆంధ్రజ్యోతి దిన పత్రికలో 'శాడిస్ట్ సైకోలు' శీర్షికలతో కమర్షియల్ టాక్స్ డిపార్టుమెంట్ మీద వచ్చిన వార్తలు దీనిని సూచిస్తున్నాయని తెలిపారు.
అయితే, సుభాష్ వ్యాఖ్యలు ఏపీసీఎస్(కాండక్ట్) రూల్స్ 1964 నియమాలను ఉల్లంఘించేలా ఉండడంతో వాటిపై ఆయనను వివరణ కోరగా, సమర్పించారని చెప్పారు.
కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి అలా ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం సమర్థనీయం కాదు కాబట్టి సుభాష్‍పై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని, కొనసాగించడం వల్ల ఆయనపై ప్రతిపాదించిన విచారణకు ఆటంకం అవుతుందని, అందుకే తక్షణం సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశామంటూ స్టేట్ టాక్స్ చీఫ్ కమిషనర్ బాబు 23-09-2025న జారీ చేసిన ఆదేశాలలో పేర్కొన్నారు.

సుభాష్ వివరణలో ఏముంది
ప్రభుత్వ మెమోకు వివరణ ఇచ్చిన సుభాష్ మొదట తను ఒక అనాథనని, పేదవాడినైనా కష్టపడి చదువుకుని ఈ స్థాయికి వచ్చానని, తాను రచనలు చేస్తానని, సమస్యల గురించి పోస్టులు పెడుతుంటానని తన నేపథ్యాన్ని వివరించారు.
ఫేస్‌బుక్‌లో తన వ్యాఖ్యల గురించి వివరన చెబుతూ, భారీ వర్షాలు వస్తే మునిగిపోయిన, ఇతర నగరాల మాదిరిగానే అమరావతి ప్రాంతం వర్షం నీటిలో మునిగిపోవడం గురించి దానిని ఒక వార్తగా రాశానే తప్ప దానికి ఎలాంటి అర్థాలూ లేవని చెప్పారు.
అయితే రెండు దినపత్రికలు తన పోస్టును తమ రాజకీయ గొడవలకు ఉపయోగించుకున్నాయని సుభాష్ అన్నారు. సోషల్ మీడియాలో తనకు గౌరవం, ఆదరణ ఉండడంతో తన పోస్టును అవి తమ ప్రయోజనం కోసం వాడుకున్నాయని చెప్పారు.
తనకు పంపిన మెమోలో ఉన్న ఆరోపణలను పరిశీలించానని, వార్తా పత్రికలు తనకు ఆపాదించిన సోషల్ మీడియా పోస్టులను తప్పుగా చూపించడం లేదంటే అసందర్భంగా చెప్పాయని తెలిపారు.
"సర్, నేను ప్రభుత్వ విధానంపై ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదు. అది అవమానకరమైంది కాదు, అసభ్యకరమైన భాష లేదు, ప్రభుత్వ విధానాలను అవమానించేలా లేదు. అమరావతి మునిగిపోవడం హైదరాబాద్, చెన్నై, ముంబయిలాంటి ఇతర నగరాల మాదిరిగానే ఉంటుంది. అక్కడ అదే విషయాన్ని చెప్పడానికీ, విధానాలకూ ఎలాంటి సంబంధం లేదు. అమరావతి ప్రాంతం మునిగిపోవడాన్ని అన్ని వార్తాపత్రికలు, మీడియా చానళ్లు రిపోర్ట్ చేశాయి. నా సోషల్ మీడియా పోస్టును తప్పుగా చూపిన రెండు దినపత్రికలు కూడా అదే చెప్పాయి" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
"12 సంవత్సరాల క్రితమే అమరావతి రాజధాని అన్నారు. దానికి నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు. మూడు రిజర్వాయర్లు కడతామని చెప్పారు. మూడు ఎందుకు, ఒకటే సరిపోతుంది కదా అని వ్యాఖ్యానించాను. దాన్ని తప్పు ఎలా అంటారు?" అని తన వివరణలో ఆయన పేర్కొన్నారు.
''రాజకీయాలు గురించి నేను మాట్లాడలేదు. పాలసీలు మాట్లాడాను. అభిప్రాయాల గురించి మాట్లాడాను. అప్పటి గవర్నమెంటు గురించి మాట్లాడాను, ఇప్పటి గవర్నమెంట్ గురించి కూడా మాట్లాడాను. నేను ఎప్పుడూ కూడా ఉద్యోగులకు జీతాలు పెంచాలివంటి అంశాలపై ఇంతవరకు మాట్లాడలేదు. నేను ఎప్పుడు కూడా సామాన్యుల గురించి, సమాజంలో అట్టడుగు వర్గాల గురించి నా ఆలోచనలు పంచుకున్నానే తప్ప, రాజకీయాలు కూడా మాట్లాడలేదు'' అని ఆయన వివరణలో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
"ప్రజాస్వామ్యంలో గొంతు నొక్కడం" – అనలిస్టులు
ఈ ఘటన ప్రజాస్వామ్యంలో భావప్రకటనాస్వేచ్ఛను అణచివేయడమేనని సీనియర్ జర్నలిస్ట్ గాలి నాగరాజు బీబీసీతో అన్నారు.
"ఫేస్‌బుక్ వ్యక్తిగత అభిప్రాయం చెప్పే వేదిక. అది ప్రభుత్వ వెబ్‌సైట్ కాదు. ఆయన ఎవరినీ తిట్టలేదు. కేవలం అభిప్రాయం చెప్పారు. ప్రభుత్వం సహనం వహించాలి. సహనం లేకపోతే అది నియంతృత్వం అవుతుంది. గతంలో జగన్ ప్రభుత్వం చేసినట్లే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే మార్గంలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది"అని అన్నారు.
''ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల పనితీరు గురించి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి. మీడియా అడుగుతుంది. సామాన్య పౌరుడికి కూడా తన అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉంటుంది. ఇదేమీ సర్వీస్ బోర్డ్ ఆఫ్ కండక్ట్‌కి సంబంధించింది కాదు. తన వ్యక్తి గత అభిప్రాయాన్ని చెప్పారు. అధికారిగా తన పోస్టు పెట్టుకునే అధికారం ఆయనకుంటుంది. ఆయన ఎవర్నీ తిట్టలేదు. రాజకీయంగా మాట్లాడలేదు. ప్రభుత్వ ఉద్యోగి రాజకీయంగా కూడా మాట్లాడే హక్కు ఉంది. కానీ అలా కూడా ఏమీ మాట్లాడలేదు. ఒక సమస్యపైన తన అభిప్రాయాన్ని చెప్పారు'' అని ఆయన అన్నారు.
"వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులుకూడా వారి హక్కులకోసం నిరసనలు తెలియజేస్తుంటారు. ప్రధానంగా టీచర్స్ వారి హక్కుల కోసం పోరాడుతుంటారు. వారందరినీ సస్పెండ్ చేయగలరా? అది వారి హక్కు.. అదే విధంగా సుభాష్ కూడా తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పారు. దానికి ఆయనపై చర్యలు తీసుకోవడం అనేది భావప్రకటనా స్వేచ్ఛ హక్కులను కాలరాయడమే అవుతుంది. ఇది కేవలం సుభాష్ సమస్యే కాదు యావత్ పౌర సమాజానికి సంబంధించిన అంశం. ఇలాంటి అంశాలపై ప్రభుత్వం సహనం కోల్పోతే ప్రజాస్వామ్య స్వేచ్ఛను హరించినట్టే అవుతుంది" అని నాగరాజు అన్నారు.
"40 ఏళ్ల నాటి రూల్స్ – సోషల్ మీడియాపై స్పష్టత లేదు"
అధికారులు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టాలనే దానిపై నిబంధనలేమీ లేవని ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయిస్ గవర్నమెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ బీబీసీతో అన్నారు.
"ప్రస్తుతం అమలులో ఉన్న సర్వీస్ రూల్స్ 40 ఏళ్లనాటివి. ఆ కాలంలో మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా అనే పదమే లేదు. అందువల్ల అధికారులకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే హక్కు ఉందా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని కొత్త రూల్స్ తీసుకురావాలి" అని ఆయన చెప్పారు.
"సుప్రీంకోర్టు తీర్పులు కూడా 'రీజనబుల్ రిస్ట్రిక్షన్స్' మాత్రమే ఉండాలని చెబుతున్నాయి. కానీ అవేంటి అన్నది రూల్స్‌లో స్పష్టంగా లేదు. ఇప్పటికైనా రూల్స్ ప్రక్షాళన జరగాలి" అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
''ఇది ప్రభుత్వం దృష్టికి వచ్చింది కాబట్టి ఆయన పేరుతో అకౌంటు ఉంది కాబట్టి చర్య తీసుకున్నారు. వేరే పేరుతో ఆర్టికల్ రాస్తే మరో పేరుతో ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేసి పోస్ట్ చేస్తే నియంత్రించగలమా ఉద్యోగస్తులని. ఈ సిస్టంలోనే లూప్‌హాల్స్ ఉన్నాయి. వ్యవస్థను మార్చాలి అనుకున్నప్పుడు కొన్ని మార్పులు చేయాలి దానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఆల్ సర్వీస్ రూల్స్ అనేదానికి రిటైర్డ్ జడ్జితో, రిటైర్డ్ ఐఏఎస్‌తో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి'' అని ఆయన అన్నారు.
దీనిపై జీఎస్టీ కమిషనర్, కార్యదర్శి రవిశంకర్‌ను బీబీసీ సంప్రదించింది. కానీ ఆయన స్పందించేందుకు ఇష్టపడలేదు. తాను ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్నానని, అది తనకంటే పెద్దలు తీసుకున్న నిర్ణయం అని చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














