చేనేత చీరల ధరలు పెరగబోతున్నాయా, ఏ రకం శారీలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది?

జీఎస్టీ, చీరలు, చేనేత ఉత్పత్తుల ధరలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బళ్ళ సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రాబోయే పెళ్లిళ్ల సీజన్ కోసం పట్టు చీరలు, పట్టు పంచెలు, ఇతర చేనేత ఉత్పత్తులు కొనాలంటే సెప్టెంబరు 22లోపు కొనేయండి.

ఎందుకంటే త్వరలో కొన్ని ముఖ్యమైన చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ మూడింతలకు పైగా పెరగనుంది.

గద్వాల పట్టు చీర, జీఎస్టీ , ధరలు

ఫొటో సోర్స్, tgsco

ఫొటో క్యాప్షన్, గద్వాల పట్టు చీర

ఉదాహరణకు మీరు పై ఫోటోలోని గద్వాల పట్టు చీర కొనాలనుకుంటే, ఇప్పుడు రూ.7,805కు వస్తుంది.

అందులో 5 శాతం అంటే సుమారు రూ.371 జీఎస్టీ ఉంది.

కానీ, సెప్టెంబరు 22 తరువాత అదే చీర 18 శాతం జీఎస్టీతో రూ.8,772కు చేరుతుంది.

అంటే సుమారు రూ.900 పైన ఖరీదు పెరుగుతోంది.

చీరలు, జీఎస్టీ

ఫొటో సోర్స్, apcohandlooms

ఫొటో క్యాప్షన్, వెంకటగిరి సీకో చీర

పై ఫోటోలోని వెంకటగిరి సీకో చీర కొనాలనుకుంటే, ఇప్పుడు 4,403 రూపాయలకు వస్తుంది. అందులో 210 రూపాయల జీఎస్టీ ఉంది. కానీ, సెప్టెంబరు 22 తరువాత అదే చీర 18 శాతం జీఎస్టీతో 4,950 రూపాయలు అవుతుంది. అంటే సుమారు 550 రూపాయల వరకూ ధర పెరుగుతోంది.

ఇప్పటి వరకూ వెయ్యి రూపాయల కంటే తక్కువ విలువైన చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ లేదు. వెయ్యి రూపాయలు దాటితే 5 శాతం వర్తిస్తుంది. అయితే ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ పరిమితిని వెయ్యి రూపాయల నుంచి రెండున్నర వేలకు పెంచారు. కానీ, రెండున్నర వేల తరువాత జీఎస్టీ 5 శాతం కాకుండా 18 శాతం వేశారు.

చేనేత ఉత్పత్తుల్లో తక్కువ ధరకు అమ్మే తువాళ్లు, దుప్పట్లు, ఇతరత్రా నేత పంచెలు, చీరలు ఉన్నప్పటికీ, రెండున్నర వేల కంటే ఖరీదైన చీరలు, పట్టు పంచెలది కూడా చాలా పెద్ద మార్కెట్.

పండుగలు, వేడుకలకు కొనే, కట్టుకునే ఈ వస్త్రాలను యంత్రాలు ఉపయోగించకుండా చేతులతో, కొన్ని రోజుల తరబడి, చాలామంది కలసి తయారు చేస్తారు కాబట్టి వాటి ధర ఎక్కువ ఉంటుంది.

అందువల్ల రెండున్నర వేల పైన ఖరీదు ఉండే చేనేత వస్త్రాలు పెద్ద సంఖ్యలోనే ఉంటాయి. వాటన్నిటిపైనా ఈ ప్రభావం పడనుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
చేనేత, ఉత్పత్తులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని తొలగించాలంటూ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ డిమాండ్ చేస్తోంది.

‘హ్యాండ్లూమ్ రంగానికి పెద్ద దెబ్బ’

ఈ కొత్త పన్ను విధానం చేనేత రంగాన్ని దెబ్బతీస్తుందని చేనేత కార్మికుల సంఘాలు విమర్శిస్తున్నాయి.

మొత్తం చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని తొలగించాలంటూ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ (ఎన్ఎఫ్‌హెచ్‌హెచ్) సంస్థ భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది.

''ఇప్పటికే చేనేత రంగం చాలా ఇబ్బందుల్లో ఉంది. నాణ్యమైన నూలు, పట్టు యార్న్ (కండి) ధరలు పెరగడంతో 2019 –21 మధ్య చేనేత వస్త్రాలకు డిమాండ్ బాగా తగ్గింది. అదే సమయంలో మిల్లుల్లో తయారయ్యే బట్టలకు మాత్రం జీఎస్టీ 18 నుంచి 5 శాతానికి తగ్గించారు. ఈ మార్పుతో మెషీన్ టెక్స్‌టైల్ రంగానికి లాభమే కానీ, హ్యాండ్లూమ్ రంగానికి పెద్ద దెబ్బ. ఈ నిర్ణయం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తోన్న రంగాన్ని దెబ్బకొడుతున్నామని కేంద్రం గుర్తించాలి'' అని ఎన్ఎఫ్‌హెచ్‌హెచ్ నిర్వాహకులు మాచర్ల మోహన రావు బీబీసీతో అన్నారు.

చేనేత, ఉత్పత్తులు, మహిళలు
ఫొటో క్యాప్షన్, దేశంలో 25 లక్షల మంది మహిళలకు చేనేత ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉంది.

మహిళలకు ఉపాధి కల్పించే రంగం

భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది మందికి, ముఖ్యంగా మహిళలకు భారీగా ఉపాధి కల్పించే రంగాల్లో చేనేత ఒకటి.

కేంద్ర టెక్స్‌టైల్ శాఖ 2024-25 వార్షిక నివేదిక ప్రకారం, దేశంలో ఈ రంగంపై 35 లక్షల మంది ఆధారపడి ఉన్నారు. 25 లక్షల మంది మహిళలకు ఇది ముఖ్యమైన ఆదాయ వనరు.

2024 డిసెంబరు నాటికి భారత ప్రభుత్వం 32 లక్షల 90 వేల మంది నేత కార్మికుల వివరాలు సేకరించగా, వారిలో 68 శాతం మహిళలు ఉన్నారు.

అదే సమయంలో 2019-20 నాటి జాతీయ హ్యాండ్లూమ్ సెన్సస్ ప్రకారం, 67 శాతం మందికి నెలకి 5 వేల కంటే తక్కువ ఆదాయం ఉండగా, 26 శాతం మందికి 5-10 వేల ఆదాయం ఉంది. నాలుగున్నర శాతం మందికి 10-15 వేల ఆదాయం ఉంది.

'దేశీయ అమ్మకాలే ఆధారం'

ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే ఆదాయమంత కూడా చేనేత కార్మికులకు రావడం లేదని మోహన్ రావు అభిప్రాయపడ్డారు.

''ఇందులో చాలా శ్రమ ఉంటుంది. మగ్గం పనికి ముందు, తరువాత కుటుంబంలోని వారు, కొన్ని సందర్భాల్లో ఇతర కార్మికులు ఎన్నో రోజులు శ్రమించాలి. చాలా సందర్భాల్లో కుటుంబం అంతా పది రోజులు పనిచేస్తే తప్ప ఒక వస్త్రం తయారుకాదు. అటువంటి కార్మికులకు, ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఉపాధి హామీ పథకం కంటే తక్కువ ఆదాయం వస్తోంది. ఒకవైపు ఎగుమతులు పడిపోతున్నాయి. దేశీయ అమ్మకాలే చేనేతకు ఆధారం. అటువంటి సందర్భంలో దేశీయ అమ్మకాలపై ఈ స్థాయిలో జీఎస్టీ పెంచితే ఈ రంగం బాగా దెబ్బతింటుంది. లక్షలాది మందిపై ఆ ప్రభావం పడుతుంది'' అన్నారు మోహన రావు.

రాజ్యసభలో 2023లో కేంద్ర టెక్స్‌టైల్ శాఖ సహాయ మంత్రి దర్శన జర్దోశ్ ఇచ్చిన సమాచారం ప్రకారం వరుసగా విదేశాలకు చేనేత ఎగుమతులు తగ్గుతూ వస్తున్నాయి.

డేటా, రాజ్యసభ, కేంద్ర టెక్స్‌టైల్ శాఖ

ఫొటో సోర్స్, Central Textile ministry

ఫొటో క్యాప్షన్, ఏ సంవత్సరంలో ఎన్ని ఎగుమతులు జరిగాయి (కేంద్ర టెక్స్‌టైల్ శాఖ గణాంకాలు)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించారు.

''కేంద్ర టెక్స్‌టైల్ శాఖ లెక్కల ప్రకారం 2019-20లో 0.889 శాతం ఉన్న విదేశీ ఎగుమతులు, 2023-24 వచ్చే సరికి 0.48 శాతం అంటే దాదాపు సగానికి పడిపోయాయి. తాజాగా ట్రంప్ సుంకాల వల్ల టెక్స్‌టైల్ రంగం దెబ్బతినకుండా వారికి సదుపాయాలు ఇవ్వడం మంచిదే. కానీ అదే చేత్తో చేనేతపై అదనపు భారం వేయడం సరికాదు'' అంటున్నారు మోహన రావు.

"చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ తీసి వేయడంతో పాటు, నూలు, ఉన్ని, పట్టు, యుటే, లినైన్ వంటి సహజ ముడి పదార్థాలపై ప్రస్తుతం 5 శాతం జీఎస్టీని సున్నా చేయాలి. ఇతర రాష్ట్రాల్లో అమ్మకాలపై జీఎస్టీ తీసేయాలి. హ్యాండ్లూమ్ రిజర్వేషన్ చట్టం, కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధనలు అమలు చేయాలి" అని ఈ సంస్థ డిమాండ్ చేస్తోంది.

ఈ జీఎస్టీ పెంపుదల, చేనేత కార్మికుల అభ్యంతరాలపై భారత ప్రభుత్వ టెక్స్‌టైల్ శాఖను బీబీసీ సంప్రదించింది. వారి నుంచి స్పందన రావాల్సి ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)