సూప్‌‌లో మూత్రం పోసిన ఇద్దరు కుర్రాళ్లకు ‘రూ. 2.64 కోట్ల’ జరిమానా

మద్యం మత్తులో ఉన్న టీనేజర్లు ఓ వీడియోను ఆన్‌లైన్‌లో పోస్టు చేశారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మద్యం మత్తులో ఉన్న టీనేజర్లు ఓ వీడియోను ఆన్‌లైన్‌లో పోస్టు చేశారు

చైనాలోని హాట్‌పాట్ రెస్టారెంట్‌లోని ఒక సూప్ పాత్రలో ఇద్దరు టీనేజర్లు మూత్ర విసర్జన చేసినందుకు జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 2.2 మిలియన్ యువాన్లను (సుమారు 2.64 కోట్ల రూపాయలు) రెండు కేటరింగ్ కంపెనీలకు చెల్లించాలని ఆదేశించింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో షాంఘైలోని హైడిలావ్ బ్రాంచ్‌ రెస్టారెంట్‌లో ఈ ఘటన జరిగింది. హైడిలావ్ చైనాలో అతి పెద్ద హాట్‌పాట్ రెస్టారెంట్ల చైన్.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మద్యం మత్తులో ఉన్న ఇద్దరు 17 ఏళ్ల కుర్రాళ్లు షాంఘైలోని హైడిలావ్ బ్రాంచ్‌లో ఒక సూప్ పాత్రలో మూత్ర విసర్జన చేసి, ఆ వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు.

దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

అయితే కలుషితమైన ఈ సూప్‌ను ఎవరూ తినలేదనే సమాచారం ఉన్నప్పటికీ, తమ హోటల్‌కు వచ్చిన వేలాది ఖాతాదారులకు కొన్ని రోజులపాటు పరిహారం చెల్లించామని హైడిలావ్ ప్రకటించింది.

ఈ కారణంగా తాము 23 మిలియన్ యువాన్‌ల (సుమారు 2.84 కోట్ల రూపాయలు) కంటే ఎక్కువగా నష్టపోయామని, తమకు పరిహారం ఇప్పించాలని హైడిలావ్ కోర్టును కోరింది.

సూప్

ఫొటో సోర్స్, Getty Images

గత శుక్రవారం షాంఘై కోర్టు ఈ కేసులో తీర్పు వెలువరించింది. హైడిలావ్ రెస్టారెంట్‌లో సూప్‌లో మూత్రం పోసిన టీనేజర్లు కంపెనీల ఆస్తి హక్కులు, ప్రతిష్ఠను దెబ్బతీశారని పేర్కొంది.

ఈ ఘటనలో వాడిన టేబుల్‌వేర్ కలుషితమైందని, ప్రజల్లో తీవ్ర అసహ్యాన్ని కలిగించిందని కోర్టు గుర్తించింది.

అదే సమయంలో, టీనేజర్ల తల్లిదండ్రులు తమ పెంపక బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమయ్యారని కోర్టు వ్యాఖ్యానించింది.

అందువల్ల పరిహారం మొత్తాన్ని తల్లిదండ్రులే చెల్లించాల్సి ఉంటుందని ఆదేశించింది.

కార్యనిర్వాహక ఖర్చులు, రెస్టారెంట్ ప్రతిష్ఠ దెబ్బతిన్నందుకు గానూ 2 మిలియన్ యువాన్లు (దాదాపు 2.4 కోట్ల రూపాయలు)... టేబుల్‌వేర్ నష్టం, శుభ్రపరిచే ఖర్చులకు ఒక కేటరింగ్ కంపెనీకి 1.3 లక్షల యువాన్లు (సుమారు 16 లక్షల రూపాయలు).. కోర్టు ఖర్చులకు 70,000 యువాన్లు చెల్లించాలి (సుమారు 8.50 లక్షల రూపాయలు) చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

అయితే, హైడిలావ్ తమ కస్టమర్లకు అదనంగా చెల్లించిన పరిహారం "స్వచ్ఛంద వ్యాపార నిర్ణయం" కింద పరిగణిస్తున్నామని, దాన్ని టీనేజర్లపై మోపలేమని కోర్టు స్పష్టం చేసింది.

ఫిబ్రవరి 24 నుంచి మార్చి 8 వరకు ఆ బ్రాంచ్‌కు వచ్చిన నాలుగువేల మందికి పైగా కస్టమర్లకు హైడిలావ్ పూర్తి రీఫండ్‌తో పాటు, బిల్లుఅయిన మొత్తానికి 10 రెట్లు ఎక్కువగా నగదును పరిహారం ఇచ్చింది.

దీంతోపాటు, మొత్తం హాట్‌పాట్ పరికరాలను మార్చి, డిస్‌ఇన్ఫెక్షన్ చర్యలు చేపట్టింది.

హైడిలావ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా బ్రాంచ్‌లను నిర్వహిస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)