జోసెఫ్ స్టాలిన్‌ను ఎదిరించిన ముగ్గురు టీనేజర్ల కథ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆండ్రీ జఖారోవ్, కటరీనా ఖిన్‌కులోవా
- హోదా, బీబీసీ న్యూస్
1953 మార్చి 5న జోసెఫ్ స్టాలిన్ మరణించినప్పుడు, సోవియట్ యూనియన్ మొత్తం సంతాపం ప్రకటించినట్లుగా కనిపించింది. అయితే, పైకి విచారం ప్రకటించినప్పటికీ ఆయనపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలున్నాయి.
ఎందుకంటే స్టాలిన్ నేతృత్వంలో లక్షల మంది ప్రజలు కరవు బారిన పడ్డారు. మరోవైపు పేదరికంలో కూరిపోయిన వారి సంఖ్య కూడా అంతే ఉంటుంది. అందుకే కొందరిలో ఆయనపై ఆగ్రహావేశాలు కూడా గూడుకట్టుకున్నాయి. అలాంటి వారిలో ముగ్గురు టీనేజీ యువకులు కూడా ఉన్నారు. వీరు స్టాలిన్ ఆధిపత్యానికి సవాల్ విసిరేందుకు ప్రయత్నించారు.
తన మూడు దశాబ్దాల ప్రస్థానంలో తిరుగులేని ఆధిపత్యాన్ని స్టాలిన్ ప్రదర్శించారు. తనకు వ్యతిరేకంగా ఎలుగెత్తిన స్వరాలపై ఉక్కుపాదం మోపారు.
అయినప్పటికీ, సోవియట్ యూనియన్‌లో నిరసనలు జరిగాయి. అయితే, ఇవి అంత భారీగా లేదా అంత తరచుగా చోటుచేసుకోలేదు. కానీ, ఆ నిరంకుశ ప్రభుత్వంపై ప్రజల్లో అసమ్మతి గూడు కట్టుకుందని చెప్పడానికి ఇవి సంకేతాలు.

ఫొటో సోర్స్, Corbis via Getty Images
ఇలాంటి నిరసన ఒకటి చెల్యాబిన్సెక్‌లో చోటుచేసుకుంది. యూరల్స్ పర్వత శ్రేణుల్లోని ఒక పారిశ్రామిక నగరం ఇది. ఈ పర్వతాలు రష్యాలోని యూరోపియన్ ప్రాంతాలను ఆసియా భాగాల నుంచి వేరుచేస్తుంటాయి. ట్రాక్టర్లు తయారుచేసే ఒక పెద్ద కర్మాగారం చెల్యాబిన్సెక్‌లో ఉంది.
1946లో ఒక రోజు ముగ్గురు టీనేజ్ యువకులు నగరం మధ్యలో కొన్ని పోస్టర్లను ఏర్పాటుచేశారు. వీటిని గోడలపై అతికించేందుకు గమ్ము లేదా జిగురు వారి దగ్గర లేవు. దీంతో రొట్టెలను నీటిలో ముంచి, ఆ మిశ్రమాన్ని పేపర్లను వెనుక రాసి వీరు గోడలపై అతికించారు. ఆ పేపర్లు కూడా వారి నోట్‌బుక్స్ లోనుంచి తీసుకున్నారు.
‘‘ఆకలితో అలమటిస్తున్న ప్రజలరా.. కదలి రండి, పోరాడదాం’’ అని ఆ పేపర్లపై రాశారు. వీటిని రొట్టెలు పంచే చోట కూడా అతికించారు.
అక్కడ వరుసలో నిలబడిన ఒక మహిళ అది చదివి ‘‘దీన్ని రాసిన వ్యక్తి తెలివైనవాడు’’అని కింద రాశారు.
ఆ ముగ్గురు యువకులు అలెగ్జాండర్ పోల్యాకోవ్ (షురాగా సుపరిచితుడు), మిఖాయిల్ ఉల్మాన్(మిశా), యెవ్‌జెనీ జెర్సోవిచ్ (జెన్యా). వీరి ముగ్గురు వయసు అప్పుడు 13 ఏళ్లే. వీరికి షురా నేతృత్వం వహించేవారు.

ఫొటో సోర్స్, Polyakov family archive
యుక్రెయిన్‌లోని ఖార్కియెవ్.. షువా సొంత ఊరు. అయితే, తల్లి, అమ్మమ్మ, అక్క, పిన్నిలతో కలిసి యూరల్స్‌కు వీరు వచ్చేశారు. వీరంతా ఒకే గదిలో ఉండేవారు. ఎందుకంటే యుద్ధ భయంతో వచ్చిన వారు ఇక్కడ ఆశ్రయం పొందడం అప్పట్లో చాలా కష్టంగా ఉండేది.
షురా తండ్రి ఆ యుద్ధంలోనే మరణించారు. ఇప్పుడు షురా తల్లి న్యాయవాదిగా పనిచేస్తూ ఈ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
మరోవైపు జెన్యా కూడా తండ్రి లేకుండానే పెరిగాడు. లెనిన్‌గ్రాడ్‌లో అతడు జన్మించాడు. అయితే, 1934లో అతడి తండ్రిని అధికారులు అరెస్టు చేశారు. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఆయన కుట్ర పన్నారని ఆయనపై ఆరోపణలు మోపారు.
అయితే, అసలు ఆయన ఏమైపోయారో వారికి తెలిసేదికాదు.
తన ఇద్దరు పిల్లలనైనా కాపాడుకునేందుకు జెన్యా తల్లి కుటుంబంతోపాటు చెల్యాబిన్సెక్‌కు వచ్చేశారు. తన భర్తపై ‘‘శత్రువు’’గా ముద్ర వేసినప్పటికీ ఆమె టీచరుగా ఒక పాఠశాలలో ఉద్యోగం సంపాదించగలిగారు.
జెన్యా తండ్రిని యుద్ధానికి ముందే ఉరితీశారు. కానీ, ఆ విషయం ఈ కుటుంబానికి చాలా కాలం తర్వాత తెలిసింది.
జెన్యాలానే మిశది కూడా లెనిన్‌గ్రాడే. కానీ, అతడు కుటుంబంతోనే కలిసి జీవించేవాడు. యుద్ధం మొదలైనప్పుడే వీరు కూడా చెల్యాబిన్సెక్‌కు వచ్చారు. స్థానిక ట్రాక్టరు ప్లాంటులో ఉద్యోగం కోసం మిశ తండ్రి తన కుటుంబాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. అయితే, అప్పట్లో ట్రాక్టర్లకు బదులుగా ఈ ప్లాంటులో యుద్ధ ట్యాంకులు చేయడం మొదలుపెట్టారు.
ప్రజలు ఎక్కువగా జీవించే ఇరుకైన ప్రాంతంలో మిశా కుటుంబం జీవించేది. వీరు తమకు తెలియని వ్యక్తులతో కలిసి ఒకే గదిలో ఉండాల్సి వచ్చింది. ఆ గదిని ఒక గీత గీసి రెండుగా విభజించారు. మధ్యలో ఒక ప్లాస్టిక్ షీట్ వేలాడేది.

ఫొటో సోర్స్, Gershovich family archive
ఈ ముగ్గురూ ఒకే స్కూలుకు వెళ్లారు. తరగతి గదిలో మిశ, జెన్యా ఒకే బల్లపై కూర్చొనేవారు.
వీరి వయసు 13 ఏళ్లు అయినప్పటికీ, వీరు మార్క్స్, లెనిన్, స్టాలిన్‌ల గురించి స్కూలులో చదువుకున్నారు. అన్యాయానికి సరేనని తలూపడం కూడా తప్పేనని వీరికి స్కూలులో నేర్పించారు.
1870లనాటి ఫ్రెంచ్ విప్లవంలోని కార్మికుల ఉద్యమంనాటి ‘‘ది ఇంటన్నేషనల్’’ లాంటి పాటల్లోని వాక్యాల గురించి కూడా వీరు చదువుకున్నారు. సామాజిక అన్యాయంపై పోరాడే వారందరిలోనూ ఇవి కొత్త ఊపిరులు ఊదాయి.
ఈ ముగ్గురి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. యుద్ధం నడుమ ఆకలి జీవితాలను వీరు గడపాల్సి వచ్చింది.
1945 ఫిబ్రవరిలో యాల్టా కాన్ఫెరెన్స్‌లో భాగంగా అమెరికా, బ్రిటన్, సోవియట్ యూనియన్ నాయకులు సమావేశమై హిట్లర్‌ను ఎలా హతమార్చాలని చర్చించడంపై సోవియట్ యూనియన్‌లో ఒక జోక్ ప్రచారంలో ఉండేది. అప్పటికి దాదాపు యుద్ధం ముగిసే దశకు వచ్చింది.
అప్పట్లో బ్రిటన్ ప్రధాన మంత్రిగా కొనసాగిన చర్చిల్.. హిట్లర్‌ను ఉరితీయాలని చెప్పగా, అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్ మాత్రం విద్యుత్ షాక్‌లు ఇవ్వాలని సూచించారని.. కానీ, సోవియట్ యూనియన్ నాయకుడు స్టాలిన్ మాత్రం హిట్లర్‌కు సోవియట్ రేషన్‌తో భోజనం పెట్టాలని, అప్పుడు అతడు కృశించిపోయి చచ్చిపోతాడని చెప్పారని ప్రజలు అనుకుని నవ్వుకునేవారు. స్టాలిన్ చెప్పిన దానికి మిగతా ఇద్దరూ అంగీకరించారని, ఎందుకంటే ఇదే అత్యంత దారుణమైన శిక్ష అని ప్రజలు చెప్పుకుని నవ్వుకునేవారు.

ఫొటో సోర్స్, Ulman family archive
అయితే, సోవియట్ యూనియన్‌లో అందరి పరిస్థితి ఇలా లేదు. ఈ ముగ్గురు పిల్లలతోపాటు స్థానిక ప్లాంటు డైరెక్టర్ కొడుకు కూడా అదే స్కూలులో చదువుకునేవాడు.
ఆ ప్లాంటు యజమాని కొడుకు విలాసవంతమైన జీవితాన్ని అనుభవించేవాడు. అతడు రోజూ కారు మీద స్కూలుకు వచ్చేవాడు. మధ్యాహ్న భోజనం కూడా భారీగా ఉండేది. పుట్టిన రోజు పార్టీలు అయితే, చెప్పాల్సిన పనిలేదు. కలర్ సోడాలు, చార్లీ చాప్లిన్ సినిమాలు ఇలా చాలా విలాసవంతంగా జీవించేవాడు.
డైరెక్టర్ కుటుంబం వేరే ఒకరితో తమ గదిని పంచుకోవాల్సిన అవసరం లేదు. వారికంటూ విశాలమైన ఇల్లు ఉండేది.
కానీ, యుద్ధానికి ముందు కూడా చెల్యాబిన్సెక్ ప్లాంటులోని కార్మికుల పరిస్థితి అంత గొప్పగా ఏమీ ఉండేది కాదు. కానీ, యుద్ధం మొదలైన తర్వాత, పశ్చిమ రష్యా ప్రాంతాల నుంచి శరణార్థులు పోటెత్తారు. దీంతో వీరి పరిస్థితి మరింత దిగజారింది.
1943 డిసెంబరులో ప్లాంటులోని నేలపై దాదాపు 300 మంది కార్మికులు రోజూ పడుకునేవారు. వీరికి ఇల్లు అంటూ ఏమీ లేదు. శీతాకాలంలో చలి నుంచి రక్షణ కల్పించే బట్టలు కూడా వీరి దగ్గర ఉండేవి కాదు. చెప్పులు కూడా లేవు.
అయితే, యుద్ధం తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయని ప్రజలు భావించేవారు. కానీ, యుద్ధం ముగిసినా వీరి జీవితాలు మారలేదు.

ఫొటో సోర్స్, Chelyabinsk Council Archive
పైనుంచి నీరు కారే గదుల్లో చాలీచాలని భోజనం తినలేక ప్రజలు పడే బాధల గురించి ఈ ముగ్గురు యువకులూ చాలా విన్నారు. అంతేకాదు, వీరు కూడా పేదరికం అంటే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూశారు.
సోవియట్ యూనియన్ చెప్పేదానికి, ఇక్కడ కనిపిస్తున్న దానికి మధ్య తేడా విషయంలో వీరు ఆగ్రహంతో ఉండేవారు.
1946 ఏప్రిల్‌లో ఒక రోజు తమ నోట్‌బుక్‌లోకి ఒక పేపర్ చింపి దానిపై ఇలా రొసుకొచ్చారు. ‘‘కామ్రేడ్స్, వర్కర్స్.. ఒకసారి మీ చుట్టుపక్కల పరిస్థితి చూడండి. మీ సమస్యలకు యుద్ధమే కారణమని ప్రభుత్వం చెబుతోంది. కానీ, యుద్ధం ముగిసింది. మీ పరిస్థితి ఏమైనా మెరుగుపడిందా? లేదు. ప్రభుత్వం మీ కోసం ఏం చేస్తోంది? ఏమీలేదు. మీ పిల్లలు ఆకలితో ఉన్నారు. మీ కుటుంబాలు బాధపడుతున్నాయి. అసలు ఏం జరుగుతోందో మీ చుట్టుపక్కల చూసి అర్థం చేసుకోండి’’అని రాశారు.
ముందు వీరు రాత్రిపూట మాత్రమే ఈ పేపర్లను అతికించేవారు. అయితే, కొన్ని రోజుల్లో వీరి ధైర్యం పెరిగింది. పర్యవసానాల గురించి పక్కనపెట్టేసి పగలు కూడా వీటిని గోడలపై అతికించడం మొదలుపెట్టారు. వీరికి తోటి పిల్లలు కూడా సాయం చేసేవారు.
ప్రజల్లో భయం పుట్టించే ‘‘ఎన్‌కేవీడీ’’ సెక్యూరిటీ సర్వీస్‌కు దీని గురించి తెలిసింది. ఆ తర్వాత దీన్ని స్కూలు పిల్లలే రాసినట్లు అధికారులు కనిపెట్టేశారు.
దీంతో ఆ స్కూలుకు వచ్చి పిల్లల చేతిరాతను పరిశీలించడం మొదలుపెట్టారు. చెల్యాబిన్సెక్‌లోని పిల్లలందరితోనూ ‘కామ్రేడ్, హ్యాప్పీ చైల్డ్‌హుడ్’ లాంటి పదాలను రాయించారు. అలా వీరిని గుర్తించారు.
మొదటగా జెన్నీ అరెస్టు అయ్యారు. ఆ తర్వాత, షురా.. మే 1946లో మిశ అరెస్టు అయ్యారు. వీరి కుటుంబాలు చాలా భయపడ్డాయి.
ఈ ముగ్గురు పిల్లలను సెక్యూరిటీ సంస్థలు చాలాసేపు ప్రశ్నించాయి. కొందరైతే వీరిని నాజీ మద్దతుదారులని ముద్ర కూడా వేసేందుకు ప్రయత్నించారు. కానీ, మార్క్స్‌ను విపరీతంగా అభిమానించే వీరు నాజీలు ఎలా అవుతారు?
మొత్తనికి ఆగస్టు 1946లో జెన్నీ, షురాలు.. సోవియట్ వ్యతిరేక ప్రచారం చేసినట్లుగా నిర్ధారించారు. వీరికి మూడేళ్ల జైలు శిక్ష విధించారు.
వీరిని జైలులో తరచూ కొట్టేవారు. వేధింపులకు కూడా గురించేసేవారు. అయితే, మిశ కాస్త అదృష్టవంతుడు. ఎందుకంటే అరెస్టయ్యేనాటికి ఇంకా అతడికి 14వ పుట్టిన రోజు జరగలేదు. దీంతో శిక్ష నుంచి అతడికి మినహాయింపు వచ్చింది. వెంటనే అతడిని తీసుకొని అతడి కుటుంబం లెనిన్‌గ్రాడ్‌కు వెళ్లిపోయింది. జెన్నీ, షురాలను 1946లో శిక్షను రద్దుచేసి విడిచిపెట్టారు.
ఈ ముగ్గురూ పిల్లలు కావడంతో అత్యంత కఠినమైన శిక్షలను అనుభవించకుండా మినహాయింపు ఇచ్చారు.
అయితే, ఎంత నిరంకుశ ప్రభుత్వం ఉన్నప్పటికీ, తమ జీవితాలు మెరుగుపరచాలనే డిమాండ్‌తో, సామాజిక న్యాయ నినాదాలతో నిరసన తెలియజేయొచ్చని ఈ ముగ్గురూ నిరూపించారు.
ఆ తర్వాత కాలంలో మిశ, షురాలు ఇజ్రాయెల్‌కు వెళ్లిపోయారు. అక్కడి నుంచి మిశ మళ్లీ ఆస్ట్రేలియా వెళ్లారు. 2021లో ఆయన అక్కడే మరణించారు.
కానీ, జెన్నీని మళ్లీ 1940ల చివర్లో అరెస్టు చేశారు. సోవియట్ వ్యతిరేక ప్రచారం పేరుతో యూనివర్సిటీ నుంచి ఆయనను బహిష్కరించారు.
జెన్నీకి పదేళ్ల జైలు శిక్ష విధించారు. స్టాలిన్ మరణం తర్వాత, లక్షల మందితోపాటు ఆయనను జైలు నుంచి బయటకు పంపించారు. 2010లో ఆయన మరణించారు.
ఇవి కూడా చదవండి:
- ఇండియా జీ20: విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశం మీద యుక్రెయిన్ యుద్ధ ప్రభావం..
- కైలాస: ఇండియా నుంచి పారిపోయిన నిత్యానంద ‘దేశం’ మీద ఐక్యరాజ్య సమితి ఏమని చెప్పింది
- త్రిపురలో మరొకసారి గెలిచిన బీజేపీ... నాగాలాండ్‌లోనూ కూటమిదే అధికారం
- తవాంగ్: ‘‘భారత సైనికుల శవాలను వీధుల్లో పడేసి వెళ్లేవారు...’’ 1962 నాటి ఇండో చైనా యుద్ధం చూసిన వారు ఏమంటున్నారు?
- కరోనావైరస్ పుట్టింది చైనాలోని వూహాన్ ల్యాబ్‌లోనే -ఎఫ్‌బీఐ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















