పుతిన్ సైన్యంలో క్రిమినల్స్: 'ఆ సైనికుడు తనను తాను పేల్చుకుని తనతో ఉన్న ముగ్గురు యుక్రెయిన్ సైనికులను హతమార్చాడు'

వాగ్నర్ గ్రూపు

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, ఎలిజాబెటా ఫోజ్, వోల్గా ఇవషినా, సోనియా సుర్మానోవ్
    • హోదా, బీబీసీ రష్యన్

వ్యాపారవేత్త యెవగినీ ఫ్రిగోజిన్ ప్రైవేటు సైన్యం ‘వాగ్నర్ గ్రూప్’ కొన్నేళ్ళుగా వార్తలకు దూరంగా ఉంటూ వచ్చింది. అసలు ఇలాంటి గ్రూప్ ఏదీ లేదని రష్యా సైన్యంలోని ప్రధాన అధికారులు కూడా చెబుతూ వచ్చారు.

కానీ, యుక్రెయిన్‌పై రష్యా దాడిలో ‘‘వాగ్నర్ గ్రూపు’’ కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది. దీనిపై పెద్దయెత్తున చర్చ జరుగుతోంది.

రష్యా జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న కొందరు ఈ గ్రూపు తరఫున పోరాడటంతో వారికి రష్యా ప్రభుత్వం తాజాగా పతకాలు కూడా ప్రదానం చేసింది.

2022 డిసెంబరు నెల చివరి రోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. యుక్రెయిన్‌లో పోరాడుతున్న తమ దేశ సైన్యాధికారులకు ఈ పతకాలు ఇచ్చారు. దీని కోసం ఆయన యుక్రెయిన్ సరిహద్దుల్లోని ప్రాంతాల్లో పర్యటించారు.

పుతిన్ నుంచి పతకాలు తీసుకున్న వారిలో ఒక యువకుడు పొడవైన గెడ్డంతో కాస్త భిన్నంగా కనిపించారు. ఆయన వాగ్నర్ గ్రూపు ఫైటర్.

పుతిన్‌తో గైస్పరయాన్

ఫొటో సోర్స్, KREMLIN.RU

ఫొటో క్యాప్షన్, పుతిన్‌తో గైస్పరయాన్

ఆ ఫైటర్ పేరు గైస్పరయాన్. మార్షల్ ఆర్ట్స్‌లో ఆయన నిపుణుడు. అయితే, మాస్కోలో ఒక కేఫ్‌ను లూటీ చేసిన కేసులో అక్టోబరు 2019లో ఆయన్ను అరెస్టు చేశారు. కొన్ని నెలల తర్వాత ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష కూడా విధించారు.

గత డిసెంబరులో వాగ్నర్ గ్రూపు టెలిగ్రామ్ చానెల్‌లో ఒక వీడియోలో గైస్పరయాన్ కనిపించారు. రియాజన్ సిటీ జైలు నుంచి విడుదల తర్వాత, రష్యా తరఫున పోరాడేందుకు తాను యుద్ధ క్షేత్రానికి వచ్చినట్లు ఆయన వివరించారు.

యుక్రెయిన్‌లో పోరాడుతున్న 40,000 మంది రష్యా మాజీ ఖైదీల్లో గైస్పరయాన్ కూడా ఒకరని అమెరికా దళాలు భావిస్తున్నాయి. మొత్తంగా వాగ్నర్ గ్రూపు నుంచి అక్కడ పది వేల మంది పోరాడుతున్నట్లు అంచనా వేస్తున్నాయి.

మరోవైపు మానవ హక్కుల సంస్థ ‘‘రష్యా బిహైండ్ బార్స్’’ విడుదల చేసిన డేటా కూడా దీనితో సరిపోతోందని తాజాగా వాషింగ్టన్ పోస్టు కూడా ఒక కథనం ప్రచురించింది. యుక్రెయిన్ యుద్ధంలో రష్యా ఖైదీల పాత్రపై రష్యా బిహైండ్ బార్స్ పరిశోధన చేపడుతోంది.

వాగ్నర్ గ్రూపు

ఫొటో సోర్స్, T.ME/PRIGOZHIN_HAT

దండిగా డబ్బు...

వాగ్నర్ గ్రూపు వ్యవస్థాపకుడు యెవగినీ ఫ్రిగోజిన్ గత ఏడాది రష్యాలోని కొన్ని జైళ్లను సందర్శించారు. అప్పుడే జైళ్లలోని ఖైదీలను వాగ్నర్ గ్రూపు కోసం నియమించుకొనే ప్రయత్నాలు జరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

తమ కోసం పనిచేస్తే కోర్టు రికార్డుల్లోని నేరచరిత్రను మొత్తం చెరిపేస్తామని ఖైదీలకు యెవగినీ హామీలు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.

మరోవైపు ఇలా తీసుకొస్తున్న ఖైదీలను యుక్రెయిన్‌లోనే అత్యంత ప్రమాదకర, భీకర పోరాటాలు జరిగే ప్రాంతాలకు పంపిస్తున్నారు. ఫలితంగా వీరిలో చాలా మంది మరణిస్తున్నారు కూడా.

వాగ్నర్ గ్రూపు ఈ ఖైదీలను ‘‘బలి పశువులు’’గా ఉపయోగించుకుంటోందని, వీరిలో చాలా మంది యుద్ధ క్షేత్రంలో చనిపోతున్నారని యుక్రెయిన్ సైన్యం చెబుతోంది.

అయితే, సైనికులను నియమించుకునేందుకు వాగ్నర్ గ్రూపు కేవలం ఖైదీలపై మాత్రమే ఆధారపడటం లేదు.

2014లో ఈ గ్రూపును మొదలుపెట్టారు. 2015-16 మధ్య ఈ గ్రూపు చురుగ్గా కార్యకలాపాలు సాగించడం మొదలుపెట్టింది. మొదట్లో తూర్పు యుక్రెయిన్‌లోని రష్యా అనుకూల వేర్పాటువాదులకు సాయం అందించేందుకు ఈ గ్రూపు సైనికులను పంపించేవారు.

వాగ్నర్ గ్రూపు

ఫొటో సోర్స్, TASS

అయితే, కొంత కాలానికి ఈ గ్రూపు కార్యకలాపాలు తూర్పు యూరప్ పరిధి దాటి విస్తరించాయి. సూడాన్, సిరియా, లిబియాతోపాటు ఆఫ్రికాలోని చాలా ప్రాంతాల్లో ఈ గ్రూపు చురుగ్గా ఉండేది.

తమ సైన్యంలో చేరేవారికి వాగ్నర్ గ్రూపు భారీగా వేతనాలు ఇస్తోంది. మరోవైపు నేరుగా యుద్ధ క్షేత్రాల్లో పోరాడాలని ఆసక్తి ఉండేవారిని ఎక్కువగా వీరు నియమించుకుంటారు.

‘‘సరిహద్దులకు అవతల రష్యా కోసం పోరాడేందుకు ఎక్కువగా సైనికులను ఈ గ్రూపు నియమించుకుంటుంది’’అని ఈ గ్రూపు కోసం పనిచేసిన ఒక మాజీ ఫైటర్ బీబీసీతో చెప్పారు.

యుక్రెయిన్ యుద్ధానికి ముందుగా, రష్యాలో ఉద్యోగాలు దొరకని చిన్నచిన్న పట్టణాలు, గ్రామాల యువత ఎక్కువగా వాగ్నర్ గ్రూపులో చేరేవారు.

ఈ గ్రూపు కోసం పనిచేస్తే నెలకు 1500 డాలర్లు (రూ.1.22 లక్షలు) ఇస్తారు. అదే నేరుగా యుద్ధంలో పాల్గొనడానికి వెళ్లే ఈ మొత్తం 2,000 డాలర్లు (రూ.1.6 లక్షలకు) పెరుగుతుంది.

సిరియా అధ్యక్షుడు అసద్‌ సేనలతో కలిసి వాగ్నర్ గ్రూపు సైనికులు పోరాడారు. మరోవైపు లిబియాలో ఐక్యరాజ్యసమితి మద్దతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనరల్ హఫ్తార్‌తో కలిసి కూడా వాగ్నర్ సైనికులు పోరాటం చేశారు.

2014 నుంచి 2021 మధ్య మొత్తంగా 15,000 మంది వాగ్నర్ గ్రూపులో చేరినట్లు కొన్ని అంచనాలు చెబుతున్నాయి.

అయితే, రష్యాలో ఈ గ్రూపు కార్యకలాపాలపై పెద్దగా సమాచారం అందుబాటులో లేదు. అయితే, యుక్రెయిన్‌పై రష్యా దాడి మొదలైన తర్వాత, దీనిపై చర్చ ఎక్కువైంది.

యెవగినీ
ఫొటో క్యాప్షన్, యెవగినీ

యెవగినీ ఎవరు?

యుక్రెయిన్ యుద్ధానికి ముందు, ఇలాంటి గ్రూప్ పనిచేస్తుందనే వాదనను రష్యా అధికారులు తిరస్కరిస్తూ వచ్చారు.

ప్రపంచంలోని భిన్న ప్రాంతాల్లో వాగ్నర్ గ్రూపు సైనికులు పోరాడుతున్నారనే వార్తలను రష్యా ఖండించేది. ‘‘రష్యాలో ప్రైవేటు సైన్యాలు ఏర్పాటుచేయకూడదు. ఒకవేళ ఏర్పాటుచేస్తే అది నేరం అవుతుంది, దానిలో ఎవరూ చేరకూడదు’’అని వారు చెప్పారు.

వాగ్నర్ గ్రూపుతో తనను ముడిపెడుతూ వార్తలు రాశారని కొందరు జర్నలిస్టుపై యెవగినీ కోర్టులో కేసులు కూడా వేశారు.

అయితే, 2019లో సిరియాలో రష్యా ఫైటర్ల పాత్రపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. అక్కడ కొన్ని ప్రైవేటు కంపెనీల సైన్యాలు పనిచేస్తున్నాయని, వీటితో ప్రభుత్వానికి సంబంధంలేదని ఆయన చెప్పారు.

2020లో లిబియాలో రష్యా ఫైటర్ల పాత్రపైనా పుతిన్ అలానే స్పందించారు.

అయితే, యుక్రెయిన్‌పై దాడి తర్వాత ఇది పూర్తిగా మారింది. వాగ్నర్ గ్రూపుతో తన సంబంధాలపై యెవగినీ ఫ్రిగోజిన్ బహిరంగంగానే మాట్లాడటం మొదలుపెట్టారు. యుక్రెయిన్‌లో తన లక్ష్యాలను చేరుకోలేకపోతోందని రష్యా సైన్యంపై కూడా మొదట్లో ఆయన విమర్శలు చేశారు.

మొత్తంగా గత ఏడాది సెప్టెంబరులో తానే వాగ్నర్ గ్రూపు మొదలుపెట్టినట్లు ఆయన అంగీకరించారు.

యుక్రెయిన్ పట్టణం సోలేడార్‌ను నియంత్రణలోకి తీసుకోవడంలో వాగ్నర్ ఫైటర్లు ప్రధాన పాత్ర పోషంచారని కూడా ఆయన ఇటీవల వెల్లడించారు.

ఇటీవల ఇక్కడ యుద్ధానికి సంబంధించి వాగ్నర్ ఫైటర్లు రికార్డు చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో యుక్రెయిన్‌లో రష్యా సైనిక ఆపరేషన్ కమాండర్ వైలరీ గెరాసిమోవ్ వారిని హెచ్చరించారు.

వాగ్నర్ గ్రూపు సైనికులు నేరుగా వ్లాదిమిర్ పుతిన్‌తో కరచాలనం చేస్తున్న చిత్రాలను విడుదల చేయడంతో వీరిలో ఉత్సాహం రెట్టింపు అవుతుందని, పోరాట స్ఫూర్తి కూడా పెరుగుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అయితే, వాగ్నర్ గ్రూపుపై యుద్ధ నేరాలకు పాల్పడిన ఆరోపణలు కూడా వచ్చాయి. తాజాగా యుక్రెయిన్‌తోపాటు లిబియా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లోనూ ఇలాంటి నేరాలను పాల్పడినట్లు మానవ హక్కుల సంస్థలు ఆరోపణలు చేశాయి.

తులినోవ్ (ఎడమ వ్యక్తి)

ఫొటో సోర్స్, GULAGU.NET

ఫొటో క్యాప్షన్, తులినోవ్ (ఎడమ వ్యక్తి)

ఆయనా ఖైదీనేనా?

గత ఆగస్టులో యుక్రెయిన్‌లో మరణించిన ఒక సైనికుడిపై కథనాన్ని రష్యా ప్రభుత్వ టీవీ చానెల్‌లో ప్రసారం చేశారు.

‘‘ఆ సైనికుడు తనను తాను యుద్ధ క్షేత్రంలో పేల్చేసుకుని, తనతోపాటు ఉన్న ముగ్గురు యుక్రెయిన్ సైనికులను హతమార్చాడు’’అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఆ సైనికుడి పేరు కాన్‌స్టాంటైన్ తులినోవ్. ఇదివరకు అతడు ఒక కారు దొంగతనం కేసులో అరెస్టు అయ్యాడు. అతడిపై మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులు కూడా ఉన్నాయి.

సైన్యంలో పోరాడిన అనుభవం లేనప్పటికీ, యుక్రెయిన్‌లో యుద్ధంలో పోరాడతానని అతడు చెప్పినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు.

దీని తర్వాత 2019లో రష్యా మానవ హక్కుల సంస్థ గులాగు డాట్ నెట్ ఒక ఫుటేజీని విడుదల చేసింది. దీనిలో మరో ఖైదీతో తులినోవ్ అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తోంది.

అప్పుడు ఏం జరిగిందో కనుక్కునేందుకు ఆ జైలును బీబీసీ సంప్రదించింది. కానీ, వార్త రాసే సమయానికి ఎలాంటి స్పందనా రాలేదు.

అయితే, మేం తులినోవ్ తల్లితో మాట్లాడాం. అతడు యుద్ధంలో పాల్గొనడానికి వెళ్లిన సంగతి తనకు తెలుసని ఆమె చెప్పారు.

‘‘అవును తను వెళ్లాడు. మాతృభూమి కోసం పోరాడేందుకు ఆ ప్రత్యేక ఆపరేషన్‌లో పాల్గొనేందుకు వెళ్తానని నాతో చెప్పాడు’’అని ఆమె ధ్రువీకరించారు.

వీడియో క్యాప్షన్, రష్యా ఆక్రమణ నుంచి విముక్తి పొందిన యుక్రేనియన్ గ్రామాల నుంచి బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్..

‘‘విశేష అనుభవమున్న సైన్యం’’

రష్యా ప్రజలకు రక్షణ కల్పించేందుకే ఈ సైన్యాన్ని తాను మొదలుపెట్టినట్లు గత సెప్టెంబరులో యెవగినీ అంగీకరించారు. దీన్ని రష్యా మూల స్తంభాల్లో ఒకటిగా ఆయన వివరించారు.

మరోవైపు యెవగినీని నిజమైన రష్యా పౌరుడని, ఆయన గుండె రష్యా కోసమే కొట్టుకుంటోందని గత అక్టోబరులో రష్యా ప్రభుత్వం వ్యాఖ్యానించింది.

నెల రోజుల తర్వాత యెవగినీ సొంత నగరం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోనూ కొత్త వాగ్నర్ సెంటర్ మొదలుపెట్టారు. ఇది చాలా విలాసవంతమైన కార్యాలయం. ఇక్కడ పిల్లలకు, యువతకు కూడా ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఐటీ, మీడియా, మిలిటరీ శిక్షణ కూడా ఇస్తున్నారు.

ఇదివరకు వాగ్నర్ గ్రూపు గురించి రష్యా మీడియా ఎక్కువ స్పందించేది కాదు. కానీ, నేడు వాగ్నర్ గ్రూపు నియామక ప్రకటనలు కూడా మీడియాలో రోజూ కనిపిస్తున్నాయి.

మరోవైపు రష్యా అధికారిక మీడియా చానెల్ ఎన్‌టీవీ వాగ్నర్ గ్రూపుపై ఒక కథనాన్ని ప్రచురించింది. ప్రపంచంలో విశేష అనుభవమున్న సైన్యంగా దీన్ని అభివర్ణించింది.

గత వారం రష్యా పార్లమెంటు స్పీకర్‌ వ్యాచెస్లావ్ వోలోడిన్‌కు యెవగినీ ఒక లేఖ రాశారు. ‘‘తమ సైన్యంలో చేరిన ఖైదీల గురించి అనవసర సమాచారాన్ని జర్నలిస్టులు అడుగుతున్నారు. మా సైనికులను వారు నేరస్థులుగా చెబుతున్నారు’’అని ఆయన ఆ లేఖలో ఫిర్యాదు చేశారు.

వాగ్నర్ గ్రూపులో పనిచేస్తున్న వారి గత నేర చరిత్ర మీడియాలో ప్రచురించకుండా చట్టాలను కఠినతరం చేయాల్సిన అవసరముందని కూడా యెవగినీ కోరారు.

మరోవైపు యెవగినీ అభ్యర్థనను స్పీకర్ ఆమోదించారు. దీనిపై చట్టాలకు సవరణ చేసే అంశాన్ని పరిశీలించాలని ఒక పార్లమెంటరీ కమిటీని కూడా ఆయన ఏర్పాటుచేశారు.

‘‘దేశం కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరూ హీరోనే. ఇక్కడ ఎవరినీ తక్కువగా చూడకూడదు’’అని స్పీకర్ చెప్పినట్లు రష్యా మీడియా వార్తలు కూడా ప్రచురించింది.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ మీద పోరాడేందుకు పుతిన్ చేపట్టిన సైనిక సమీకరణపై రష్యాలో పెరుగుతున్న వ్యతిరేకత

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)